ఇల్లు ఆధునికంగా అన్ని సౌకర్యాలతో వుంది మనుషులే.
రాక్షస మూకలాగా వున్నారు.
"వీళ్ళు రాక్షస మూకగా వున్నారు!" అని యధాలాపంగా ఎప్పుడైతే శీతల్ అనుకుందో అప్పుడే అనుమానం కూడా వచ్చింది.
వీళ్ళు నిజంగా నౌకర్లు దాశీలు కారు. ఆయాపనులు కూడా చక్కగా నిర్వహించగల రౌడీ వెధవలు. లోకేశ్వరరావు చేతికింద మనుషులు. వాతావరణం పరిసరాలు సంసార పక్షంగా ధనవంతుల ఇల్లులాగా వున్నా ఈ మనుషులు మాత్రం నిజమైన మనుషులు కాదు. పైకి కాన రాకుండా తనకి కాపలా కాసేవాళ్ళు...
శీతల్ వూహించిన వరకు కరక్ట్.
ఈ యింటికి వచ్చిన తరువాత లోకేశ్వరరావు ఇల్లు కదలటంలేదు. పెద్దవాడు అయిపోయినట్లు వ్యవహరిస్తున్నాడు. పెద్దరికం మాటలు, హుందాతనము, చాలా చక్కగా నాటకాలు పోతున్నారు.
శీతల్ గమనించింది కాకపోతే ఏమి గ్రహించన్నట్లు తెలివిగా మెలుగుతున్నది.
"ఈరోజే కుందన్వచ్చేది" పెరుగన్నంలో వాములో ఊరేసిన బుడం కాయ ముక్కలు నంజుకుంటూ యధాలాపంగా అన్నట్లు అన్నాడు లోకేశ్వరరావు.
అప్పటికి శీతల్ భోజనం పూర్తి అయింది.
లోకేశ్వరరావు అన్నది శీతల్ వింది. కాని విననట్టు నటిస్తూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు ముఖం పెట్టింది.
లోకేశ్వరరావుకి ఒక కొడుకు వున్నాడని......అతని పేరు కుందన్ అని....ఆ మహానుభావుడు ఈ సాయంత్రం ఇక్కడికి వస్తున్నాడని.....ఇంతవరకు అతనుంది జర్మనీలో అని...శీతల్ కి ఇక్కడికి వచ్చిన తరువాతే తెలిసింది.
లోకేశ్వరరావు కి కుందన్ ఒక్కడే కొడుకని వాడంటే ఆయనకు పంచప్రాణాలని...వాడి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడనీను...
"ఈయన గారే (లోకేశ్వరరావు) నా ప్రాణానికి పెద్ద పజిల్. ఇంక ఆ వచ్చే కొడుకు (కుందన్) నా ప్రాణానికి చిక్కు ముడో, పీట ముడో" అనుకుంది శీతల్.
శీతల్ తనుఅన్నది వినలేదని గ్రహించి "ఏమిటి అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు లోకేశ్వరరావు.
అప్పుడు వినిపించుకుంది శీతల్ ఆయన మాటలను.
"అవునంకుల్! చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను అంది.
"దేని గురించమ్మా!" ప్రేమగా అడిగాడు లోకేశ్వరరావు.
"నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా అంకుల్?"
"అబద్దం చెప్పమని ఎవరూ అడగరు నిజం చెప్పమనే కోరుతారు నిజం చెపుతావని చెప్పి అబద్దం చెపితే చేసేదేమీ లేదు" తెలివిగా అన్నాడు లోకేశ్వరరావు.
"అబద్దం ఆడటం ఇష్టం లేదు. నిజం చెప్పడం కష్టం కాదు" శీతల్ తెలివిగా అంది.
లోకేశ్వరరావు ఫక్కున నవ్వాడు.
శీతల్ వంతగా తానూ నవ్వింది.
ఈ నవ్వులతో డైనింగ్ టేబుల్ ముందునుంచి లేవడం, అసలు విషయం మరిచిపోవడం జరిగింది.
లోకేశ్వరరావు తన కొడుకు గురించి శీతల్ కి చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాడు.
శీతల్ కి కూడా కుందన్ ని చూడాలనే వుంది. చెప్పింది వేరు కళ్ళతో చూసింది వేరు.
శీతల్ ఆ విషయం కాస్త ఆలోచించింది. ఇప్పుడు ఆలోచించింది వేరు ఇంట్లోవున్న దాశీలు, నౌకర్లు వారి వారి పనులు చక్కగా చేస్తున్నారు గాని వాళ్ళు నిజంగా నౌకర్లు కాదు. పనివాళ్ళ వేషాల్లో వున్న పచ్చి మోసగాళ్ళు....
శీతల్ ఆ విధంగా అనుకోంగానే ఓ విషయం గుర్తు కొచ్చింది. ఆ రోజు నీగ్రో బానిసల వేషాలు, పూతనమ్మ తాటకీదేవి వేషాలు వేసింది వీళ్ళు కాదు కదా!
శీతల్ కి ఆ ఆలోచన రాంగానే వీళ్ళు ఆ వేషాలల్లో వుంటే అలా వుంటారా! ఉండరా! అని ఊహల్లోకి వెళ్ళి ఆ రూపాలని చిత్రీకరించుకుంది.
దగ్గర దగ్గర అవే పోలికలు, అవే రూపాలు.
ఏదో చాలా పెద్ద నాటకం ఆడుతున్నాడు ఈ ఫీల్డ్ ఫాక్స్ గాడు. తను చాలా జాగ్రత్తగా వుండాలి.
ఇది గ్రహించి శీతల్ జాగ్రత్తపడదల్చుకుంది ప్రమాదంతో కూడిన ఏ విషయమైనా సరే ముందే ఊహించి తగు జాగ్రత్త వహించాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. జాగ్రత్త ఎంతో కొంత వహిస్తారు కూడా. కాని...కలం ఖర్మం కలసి రాకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగేది జరక్క మానదు.
ఈ విషయము తెలుసు శీతల్ కి అయినా తన వంతు లోపం లేకుండా వుండాలనుకుంది.
సాయంత్రం అయింది.
కాడీలాక్ కారు వాకిలి ముందు ఆగింది.
కుందన్ రాకకోసం ఎదురు చూస్తూ వరండాలో తిష్ట వేశారు లోకేశ్వరరావు, శీతల్, ఆ యింటి మేనేజరు లక్ష్మణమూర్తి, గుమాస్తా రామలింగం, దాశీలు, నౌకర్లు.
కాడీలాక్ కారు వచ్చి ఆగంగానే లోకేశ్వరరావు కూర్చున్న కుర్చీలోంచి లేచాడు. ఆ వెంటనే మిగతావాళ్ళు లేచారు.
లోకేశ్వరరావు ఏక తనయుడు వంశాంకురుడు అయిన కుందన్ కారులోంచి దిగాడు.
కుందన్ కారు దిగీ దిగగానే తండ్రి దగ్గరకు వెళ్ళి పాదాలకి నమస్కరించాడు. వెంటనే తండ్రీ కొడుకులు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత...
