Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 39

 

    కళ్ళలో పేరుకుంటున్న నీటి పొరలు కనిపించకూడదన్నట్టు ఆమె కిటికీ దగ్గరకు నడిచింది.


    తను ఓ అహంకారి తన గతం వారసత్వంగా అందించింది అహంకారమే! నవ్వు, నడకా అన్నీ, తను ప్రభావానికి చిహ్నాలైన అహంకారపు అలంకారాలే! అది సవ్యమో, అపసవ్యమో తనకూ తెలీదు కాని, తను పెరిగింది అలాగే, కాదు, తన తండ్రి అలానే పెంచాడు.


    అమ్మ ప్రేమ తెలిసి ఉంటే తనతో పాటు పెరిగిన అహంకారాన్ని ఆడతనం ఓడించేదేమో కాని, చాలా చిన్నతనంలోనే తల్లికి దూరమై పోయింది.


    కొన్ని తరాల తర్వాత ఆ లోగిలిలో పుట్టిన ఓ ఆడపిల్లగా ఆడింది ఆటలా, పాడింది పాటలా సాగిన తనకు పంతమూ  పౌరషము ఎక్కువే!


    అందుకే......రాజసాల మధ్య, భేషజాల మధ్య బ్రతికే ఓ జమిందారీ వంశంలో పెరిగిన తను రాఘవను మొండిగానే కోరుకుంది.


    రాఘవకు ప్రమాదం వాటిల్లుతున్న క్షణాల్లో తండ్రిని మొండిగా ఎదుర్కొంది.


    అలా తన మాటకు విలువిచ్చిన తండ్రి కోసమేగా ఇప్పుడు భవ్యతో పంతానికి దిగింది!


    తన విషయంలో ఓడిన తండ్రిని ఈ మాత్రం గెలిపిస్తేనేం? వందరోజులు కొంత సుఖాన్ని త్యాగం చేస్తేనేం?


    రాఘవకు నిజం చెప్పేస్తే? ఎలా చెప్పగలుగుతుంది?


    అగ్నిసాక్షిగా అతడ్ని పెళ్ళి చేసుకున్నా నిజం చెప్పనని అమ్మవారి గుడి ఎదుట నిలబడి భవ్యకి ప్రమాణం చేసిందే!


    కాబట్టే.....ప్రమాదాన్ని నివారించుకోడానికి అన్నట్టుగా హనీమూన్ ట్రిప్ ని తిరస్కరించింది.


    అయినా ఓటమి గిట్టని తను ఓ పందేనికి సిద్దపడ్డాక ఎలా ఓడిపోతుంది? ఏ విషయమైన గెలిచి తీరుతుంది

    కొన్ని రోజులపాటు రాఘవను బుజ్జగించలేని తను రావుబహుద్దూర్ రామ్మోహనరావుగారికి మనవరాలు ఎలా అవుతుంది?


    ఆలోచనల్ని అహంకారం డామినేట్ చేస్తుంటే చూసింది రాఘవ వేపు తల తిప్పి.


    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అడిగాడు రాఘవ.


    "దాంపత్యము అంటే శారీరక సంబంధం మాత్రమేనా?"


    "శారీరక సంబంధ మొక్కటే దాంపత్యంకాకపోయినా, అపరితులుగా కలిసిన ఇద్దరూ వ్యక్తులు విడదీయలేని పరిచితులుగా మారటానికి దాంపత్యము ఒక భాగమవుతుంది."


    "అది నిజం కాదనిపిస్తుంది రాఘవా!" తను అంటున్నది కేవలం అతడ్ని ఒప్పించాలని మాత్రమే అని ఆమెకు తెలుసు. "భార్యభర్తల్ని దగ్గర చేసేది మానసికమైన అనుబంధం."


    "ఇద్దరూ పంచుకోవటానికి మనసు తినే వస్తువు కాదు కిన్నెరా! అనుభూతితో మాత్రం అర్ధమయ్యేది. అలాంటి అనుభూతిని అందించేది అర్పణ అయితే, అర్పణకు అర్ధం శారిరకమైన బంధమే."


    ఓడిపోతుంది , ఇతడ్నేలా ఒప్పించాలి?


    "ఇరవై సంవత్సరాల పాటు ఎక్కడో పెరిగిన ఓ అమ్మాయిపెళ్ళయిన కొన్ని గంటల్లో సర్వస్వం ఎలా అర్పించగలదు?"


    "నువ్వోప్పుకుంటే ఎలాగో నేను ప్రాక్టికల్గా చెబుతాను" ఆమెను మంచం పైకి లాక్కున్నాడు. అతడి నవ్వు చూస్తుంటే ఇంతసేపూ సీరియస్ గా మాట్లాడినట్టు లేదు. "పెద్ద కష్టం కాదు, చాలా సింపుల్."


    కంగారు పడిపోయింది. "అది కదండి!"


    "గాడిద గుడ్డేం కాదూ? శుభమా అని శోభనం ఏర్పాటు చేస్తే అక్కడికేదో మహర్షులకు తోచని విషయాన్ని శోదిస్తున్నట్టు ఈ నసంతా ఏమిటి? అసలు నీకేమైంది?"


    ఇబ్బంది పడిపోతూ అంది-- "మరేం లేదు మనకు ఎంత నిగ్రహముందో పరీక్షించుకోవాలనిపిస్తుంది."


    "దానివల్ల ఒరిగే దేమిటటా? దీర్ఘం తీస్తున్నట్టుగా అన్నాడు. సప్తర్షులు ఏమన్నా ప్రత్యక్షమై మనను అభినందిస్తారా? లేకపోతే 'కిన్నెర ఎల్లకాలం కన్నేరా' అని దేవతలు గట్రా పుష్ప వర్షం కురిపిస్తారా? ఎందుకు? ఈ పరిక్ష ఎందుకు అని."


    "మీకు అర్ధం కాదు."


    "చూడు" సీరియస్ గా అన్నాడు. "అర్ధం కాదంటే నేను చస్తే ఒప్పుకోను. నీ కన్నా నేను తెలివైనవాడ్ని అని గ్యారంటీగా చెబుతున్నాను కాబట్టి నాకు అర్ధం కాదని, నేను అర్ధం చేసుకోలేననే స్టేట్ మెంట్స్ ఉపయోగించకు."


    అతడి  జవాబులో ఏ పరిష్కారం దొరికిందో వెంటనే అంది. "అయితే మీరు చాలా తెలివైన మనిషిగా నన్ను అనుకోమంటారు."


    "అనుకోవటమేమిటి? అది నిజం."


    "నేనొప్పుకోను!"


    "చూడు మేడమ్! మన ఐక్యూ సంగతి మీకు తెలీదు. కావాలంటే పరీక్షించుకోవచ్చు."


    ఒక అద్భుతమైన ఆధారం దొరికినట్టయింది.


    "నాకు చిన్నతనం నుంచీ ఓ అలవాటుంది రాఘవా!"


    "ఏమిటో అది?"


    "ఓడిపోవటం నాకు గిట్టదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS