"మనం ఏదో ఒకటి చేసి వాళ్ళ కాపురం దిద్దాలక్కా" అంది పార్వతి.
"ఏం చేస్తాం పార్వతి నువ్వే చెప్పు. నేనూ పొద్దుటినుంచి అదే ఆలోచిస్తున్నాను. జయంతికి మనం ఏమని చెపుతాం? అలాగని ఇలా ఊరుకుంటే జయంతి కూడా రేపో, మాపో వాళ్ళ మాటలు వినే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు మరింతగా బాధపడుతుంది" అంది దాక్షాయణి.
"అవునుకదా....అది ఇంకా ప్రమాదం, జయంతికి దుఃఖం వచ్చినా అనందం వచ్చినా పట్టలేం...." అంది శివపార్వతి.
"ఎంటో పార్వతీ! బంగారంలాంటి కుటుంబం....ఇంత చక్కగా అన్యోన్యంగా వుంటుంటే హటాత్తుగా గిరిజ యీ ఉపద్రవం తెచ్చి పెట్టింది. ఆ పిల్లకైనా బుద్ది వుందా అసలు? చక్కగా కలిసి మెలిసి ఉండాల్సింది పోయి, లేనిపోని అనుమానాలతో కాపురాన్ని నరకప్రాయం చేసుకుంటుంది...." అంది దాక్షాయణి.
"మనిద్దరం కలిసి జయంతికి పరిక్షంగా చెపుదాం అక్కా....ఆ మాటలు కస్తూరక్క చెవినపడితే ఇంకా ప్రమాదం....ఎంతయినా తల్లి మనసు తట్టుకోలేదు. తల్లడిల్లిపోతుంది" అంది శివపార్వతి.
"నేను ఆలోచించేది అదేనే....కానీ జయంతికి ఎలా చెప్పటమనేదే నాకు బోధపడటంలేదు" అంది దాక్షాయణి.
"ఏముంది గిరిజకు నువ్వు సురేంద్రతో చనువుగా ఉండటం ఇష్టం లేదమ్మా....ఎంతయినా పెళ్ళయినవాళ్ళుకదా! కాస్త దూరంగా వుండటానికి ప్రయత్నించమని చెపుదాం" అంది పార్వతి.
"మనమనుకోవటం తెలికేనే...కానీ ఇదే విషయం జయంతికి నేరుగా చెప్పగలమా? ఆ అమ్మాయి ఈ విషయం విని తట్టుకోగలదా? అది నా భయం" అంది దాక్షాయణి.
"మనం చెప్పటం తెలికక్కా....జయంతి వాళ్ళ మాటలు నేరుగా వినిందంటే ఇంకా బాధపడుతుంది. పాపం సురేంద్ర కూడా చిత్రహింసకు గురవుతున్నాడు.
సురెంద్రకు జయంతి పైన అసలు ఆ ఉద్దేశ్యమే ఉంటే ఆ పిల్లనే చేసుకునేవాడుకదా. గిరిజను ఎందుకు చేసుకుంటాడు? పైగా మనం చిన్నప్పటి నుంచి చెపుతూనే వున్నాం. జయంతి నీ పెళ్ళాంరా అని అయినా గిరిజను చేసుకున్నాడంటే ఏంటి అతని ఉద్దేశం? గిరిజంటే ఇష్టమనేకదా?' అంది శివపార్వతి.
"ఆ విషయం నీకు-నాకు తెలుసే. కానీ ఆ బుద్ది లేని పిల్లకు తెలియాలికదా? ఏంటో ఈ ఇంటికి ఎదో శని పట్టుకున్నట్లుంది. ఎప్పుడూ ఉల్లాసంగా, ఆనందంగా ఉండే మీ బావగారు రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడ్డారు. విషయం ఎంటంటే చెప్పలేదు. నా అనుమానం ఇవే మాటలు అయన కూడా విన్నారేమోననే అనుమానం వస్తుంది" అంది దాక్షాయణి .
"నిజమా?" అంది శివపార్వతి ఆశ్చర్యంగా.
"అవునే! ఎంతడిగినా చెప్పలేదు....ఈరోజు కూడా అలానే ఉంటే నేను ఇక వూరుకోను....ఎందుకు బాధపడుతున్నారని నిలదిస్తాను" అంది దాక్షాయణి.
"బావగారికి తెలిస్తే అమ్మో! అయన పెదబావగారికి కస్తూరక్కకు చేపుతారేమో" అంది భయంగా.
"అందుకే ఈరోజు విషయం తెల్చేస్తాను" అంది దాక్షాయణి.
"సరే అయితే ఈరోజు బావగార్ని అడుగు.....రేపు జయంతికి ఎలాగోలా చెపుదాం. పాపం పిచ్చిపిల్ల ఎంత బాధపడుతుందో ఏమో.....అసలు ఈ విషయమేలా చెప్పాలో అర్ధంకావటం లేదు" అంది శివపార్వతి.
"మీరిద్దరూ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు పిన్ని. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. నాకు ఎలా చెప్పాలని మీరు ఆలోచించనవసరంలేదు నేను మీ మాటలు మొత్తం విన్నాను. అది గిరిజక్క అవివేకం, అమాయకత్వం....నేను ఈరోజు నుంచి అసలు సురేంద్ర బావతో మాట్లాడను" అంది జయంతి.
దాక్షాయణి, శివపార్వతి ఆమెను ఆ సమయంలో అక్కడ చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచారు.
* * * *
"నువ్వు గిరిజ విషయంలో బాధపడకు జయంతి! అది ఆ పిల్ల అవివేకం, ఏం చేద్దాం.....తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలుస్తుందట....నువ్వేంతో ఆనందంగా దగ్గరుండి పెళ్ళి జరిపించావు....నీ మనసులో ఏ కల్మషంలేదనే విషయం మాకు తెలుసు. నువ్వసలు ఆ మాటలు పట్టించుకోకు" చెప్పింది దాక్షాయణి.
జయంతి నిశ్శబ్దంగా వుంది. ఆరోజు రాత్రి దాక్షాయణి, శివపార్వతి జయంతిని డాబాపైన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం నుంచి జయంతి చేష్టలుడిగినదానిలా వుండిపోయింది.
కస్తూరి ఎన్నిసార్లు చెప్పినా అసలు భోజనం కూడా చేయలేదు. "ఆకలిగా లేదమ్మా రాత్రికి తింటాలే: అని చెప్పి తప్పించుకుంది.
ఇద్దరూ ఆమె మనోభావాలను పసిగట్టి ఆమె మనసు కాస్త తేలికపర్చాలనే ఉద్దేశంతో డాబాపైకి తెచ్చారు.
"చూడు జయంతి! అవతలి వ్యక్తీ మూర్ఖంగా ఆలోచిస్తున్నపుడు మనం ఆ వ్యక్తిని చూసి జాలిపడాలి....అంతేగానీ ఎంటి నన్ను ఈ విధంగా అంటుందని బాధ పడకూడదు. అది వారి అవివేకమని వదిలేయాలి" అంది పార్వతి.
"మీ ఇద్దరూ నామీద చూపుతున్న ప్రేమకు చాలా థాంక్స్ పిన్ని మీరైనా నన్ను అర్ధం చేసుకున్నారు నాకు అదే చాలు....మీరు కూడా గిరిజక్కలాగానే నన్ను అపార్ధం చేసుకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో తల్చుకుంటేనే భయం వేస్తోంది"అంది జయంతి దాక్షాయణి ఒళ్లో తలపెట్టి ఏడుస్తూ.
"ఛి పిచ్చిపిల్లా! మేమెందుకలా ఆలోచిస్తాం....నీ సంగతి మాకు తెలిదు? ఊరుకొమ్మా, బాధపడకు...ఈ విషయం అమ్మా, నాన్నలకు తెలిస్తే బావుండదు" అంటూ తల నిమురుతూ ఓదార్చింది జయంతిని.
"నువ్వసలు కలలో కూడా అలా ఆలోచించకు జయంతి. మేము ఎప్పుడూ అంత నీచంగా ఆలోచించం నీ విషయం. నువ్వు బాగా చదువుకుంటున్నావని, నీకు గొప్ప సంబంధం వస్తుందని మేము ఎప్పుడూ అనుకుంటుంటాం. ఆ పిచ్చిమాటలు పట్టించుకోకు" అంది శివపార్వతి.
