Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 40

   

    లోతుగా వెళుతున్నకొద్ది కొత్త అందాలను దర్శింపచేసే ఉద్ద్రంధంలా అనిపిస్తుంటే బడలికగా వాలిపోతున్న కనురెప్పల్ని తెరుస్తూ అంది మధూళీ "ఎవరో ఫ్రెండు ని ఏ.పి. ఎక్స్ ప్రెస్ కి డ్రాప్ చేయాలనోచ్చాను ......మిరేమిటి.....ఏ వూరేళ్ళారు?"

 

    జవాబు చెప్పకుండా అలా చూస్తూ నిలబడిపోయాడు.

 

    "డ్రాప్ చేయనా?" అంది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.

 

    "లేదు! కాస్త లిప్టివ్వండి" అంతే సీరియస్ గా అన్నాడు.

 

    పకాల్న నవ్వింది మధూళీ. చుట్టూ వున్న ప్రయాణికుల సందడి గానీ , పరుగులు-కేకలు గానీ పట్టించుకోకుండా తనకు తోచినట్టు మాటల్తో చురకలంటీంచే ప్రయత్నం చేస్తున్నాడా!

 

    "లిప్టు ఇవ్వటానికి అభ్యంతరంలేదు . కాకపోతే మీరు నాతో ఏదన్నా రెస్టారెంట్ కొచ్చి పది నిమిషాలు స్పెండ్ చేయాలి."

 

    మౌనంగా ఆమెను అనుసరించాడు.

 

    స్టేషన్ బయట మారుతి ఎస్టిమ్ లో మధూళీ పక్కన కూర్చుని ఆమె డ్రైవ్ చేస్తుంటే ఏకాగ్రతగా పరిసరాల్ని గమనిస్తున్నాడు.

 

    "మీ నాన్నగారు పోయాక మిమ్మల్ని పరామర్శించటానికి రావాలనుకున్నాను, కానీ మీ దగ్గర అంత చనువు లేదనిపించింది."

 

    "ఈ రోజు ఎలా రెస్టారెంట్ కి పిలవగలిగారు? ఈ గేప్ లో మనం కలవలేదే!"

 

    మధూళీ జవాబు చెప్పలేకపోయింది.

 

    "కర్టేసి ప్రదర్శించటానికి చనువు అవసరం లేదనుకుంటాను మధూళీ."

 

    నీలిరంగు షిఫాన్ శారీ చెంగు గాలి కెగిరి ఆమె ముఖకవళికలు కనిపించకుండా కాపాడింది.

 


                                   *    *    *    *

 

    పదినిముషాల వ్యవధిలో గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చిన మధూళీ, ధన్వి ఓ టేబుల్ ముందు కూర్చున్నారు.

 

    "ఆయామ్ సారీ " అంది మధూళీ.

 

    ఎందుకు అనలేదు ధన్వి. ఇందాకటి 'కర్టేసికాల్' గురించి ఆమె ఆలోచిస్తోందని తెలుస్తూనే వుంది.

 

    "కొన్ని సమయాల్లో కొందరి ప్రెజన్స్ ని మనం కోరుకుంటాం ....మధూళీ....." అతడి గొంతులో హిపోక్రసీ లేదు. అనుకున్నదేదో స్పష్టంగా చెప్పాలన్న ఆలోచన తప్ప. "మీతో నాకున్న పరిచయం స్వల్పం కావచ్చు కానీ సామ్రాజ్యంతో బాటు మీరూ వస్తారని ఏక్స్ పెక్ట్ చేశాను."

 

    "డిసప్పాయింట్ అయ్యారా?" టక్కున అడిగింది.

 

    "డిసప్పాయింట్ కావాల్సింది మీరు వస్తారని చెప్పి రానప్పుడు...." మృదువుగా నవ్వాడు. "మీకు తెలుసా.....ఈ మధ్యనే నేనిలాంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నాను."

 

    'మధూళీ, ఈ మార్పు నీ మూలంగానే' అంటూ పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడా!

 

    మస్తిష్కపు వాకిలి తెరిచి చూపుల రంగవల్లుల్ని అద్దుతూ గుండెనంటే అక్షరాలై కలవరపెడుతున్నాడెం?

 

    "ఏం తీసుకుంటారు?" అడిగింది మధూళీ.

 

    "మీ యిష్టం."

 

    "క్షణం పాటు విస్తుపోయినట్టుగా ధన్వి కళ్ళలోకి చూసి తరువాత స్టివార్డ్ ని పిలిచి బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేసింది.

 

    "థాంక్స్ మిస్టర్ ధన్వి! ఈరోజు మీరు మంచి అబ్బాయిలా ప్రతి దానికి కోపరేట్ చేస్తున్నందుకు మెనీ మెనీ థాంక్స్."

 

    "ఎందుకు నన్ను మీరంతా వేరు చేసి ఆలోచిస్తున్నారు మధూళీ?" ధన్వి గొంతు నిశ్చలంగా వినిపిస్తున్నా అందులో రావ్వంతా బాధ కూడా ధ్వనించింది. "నేనూ అందరిలాంటి మనిషినే.....నేనూ గాలి పిలుస్తాను, అన్నం తింటాను. అందరిలాగే నచ్చిన జోక్స్ కి నవ్వుతాను. కాకపోతే ఎక్స్ ప్రెషన్ లో తేడా వుండొచ్చు. ఇది నిజం మధూళీ.....కొందరు కాలి వెలికి చిన్న గాయమైతే దేశంలో జరిగిన అతి గొప్ప అనర్దాల్లో అదొకటి అన్నంత బాధని ప్రకటిస్తారు. మరొకరు కాలు మొత్తాన్ని తీసినా నిశ్చింతగా నవ్వగలుగుతారు. మన ఆలోచనా దృక్పధాలని బట్టి విషయాల్ని విశ్లేసిస్తామే తప్ప అనుభూతులకి అతీతంగా వుండటానికి ఋషులం కాదుగా.....'

 

    
    "కొత్త విషయం తెలుసుకున్నాను" అంది మధూళీ. "అదే ధన్వి, మీరు మాములుగా మనుషులుగా రియాక్ట్ కాగలరని అర్ధమయింది యింత కాలానికి."

 

    "బహుశా మన తొలి పరిచయం ప్రభావం మీ మీద యింకా మిగిలిపోయి వుంటుంది మధూళీ. అసలు జరిగిందేమిటో తెలుసా? నేను నిక్కచ్చిగా మాట్లాడే మనిషినని , మీ నవలని ఇష్టపడని వ్యక్తినని సామ్రాజ్యం మీకు ముందే నా గురించి చెప్పింది దానితో మీరు నన్ను కలవక ముందే నామీద ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ జ్రుపిడిస్ తో నాతో చర్చ ప్రారంభించి నన్ను హార్ట్ చేశారు. దానితో నేను కొంత రియాక్టయి మిమ్మల్ని భాధపెట్టాను. నిజానికి ఇది సామ్రాజ్యం తప్పు కాదు మధూళీ! ఎవరో చెప్పిందేదో విని ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల్తో శత్రువుల్లా మనం చర్చ ప్రారంభించడం."

 

    స్టివార్డ్ తెచ్చిన బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఖచ్చితంగా జరిగిన వాస్తవాన్ని ధన్వి అందంగా విశ్లేషిస్తుంటే కాదనలేకపోయింది మధూళీ. నిజానికి ఆ రోజు జరిగిందదేగా....."

 

    "కొందరి జీవిత లక్ష్యాలు ఏమయినా కానీ నా లక్ష్యం మాత్రం నేను అనుకున్నట్టు బ్రతకడమే మధూళీ.....ఆ ప్రయత్నంలో నేను చాలా మందిని నొప్పించవచ్చు, సంఘంలో యిమడలేని వ్యక్తిగా నన్ను తిరస్కరించవచ్చు. అయినా నేను మారలేను."

 

    సమూహంలో వుంటూ ఏకాకిగా బ్రతకడమంటే ఏమిటో అతడి మాటల్ని బట్టి అర్ధమౌతోంది. అయినా మంత్ర ముగ్దురాలిగా వింటూ వుండిపోయింది తప్ప అతడి ఆలోచనల్ని ఖండించలేకపోయింది.

 

    వెలుతురికి వెలుతురికి నడుమ పెరుకునే తపస్సు గురించి మాత్రమే ఆలోచించే నిరాశావాదులు మధ్య వుంటూ, ఎన్ని తపస్సుల మధ్య నిలబడినా వ్యవస్థని జాగృతం చేసే వెలుగు వైతాళికుడిలా ఆలోచించడం ధన్వి ఆశావాదం అయితే అది తప్పుగా ఎందుకు భావించాలి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS