"పద్మజగారిల్లా" ఆమె ఆశ్చర్యపోయింది. పద్మజను గారు అని పిలవడం కొత్తగా అనిపించి ఆమె అతనివంక ఎగాదిగా చూసి 'అదే' అని పక్కనున్న ఇంటిని చూపించింది.
"థాంక్స్" అని ముందుకి కదిలాడు.
ఇంట్లోకి వెళుతుంటే కాళ్ళు వణికాయి. ఏదో తెలియని ఉద్వేగం, భయం గుండెను సాగదీస్తున్న భావన.
తడిక దగ్గరయింది. "పద్మజగారు" అని పిలిచాడు.
"ఎవరూ" అంటూ ఆమె తండ్రి వచ్చాడు.
ఆ వృద్దుడెవరో సులభంగానే పోల్చుకున్నాడు.
ఈ రెండురోజుల్లో ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించాడు అతను. అందుకే ఆయనెవరయి వుంటారో ఊహించి 'నమస్కారాలండీ' అన్నాడు.
"నమస్కారాలు నాయనా మీరెవరు?"
"పక్కవూరు సుబ్బరామయ్య కొడుకని"
"ఓ నువ్వా!" పద్మజ తండ్రి అభిమానంతో లోపలికి ఆహ్వానించాడు. సుబ్బరామయ్య అప్పుడప్పుడు కాలవ మరమ్మత్తులు, రోడ్లు వేయడం లాంటి కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. అందుకే సుబ్బరామయ్య చుట్టుపక్కల గ్రామాల వారికి బాగా తెలుసు.
లోపలికి అడుగుపెట్టాడు గోకుల్.
అది చిన్న పెంకుటిల్లు ముందు చాలా ఖాళీ జాగా వుంది. చుట్టూ తడికెలు కట్టారు. అందుకే లోపలున్నవారు వీధిలో నడుస్తున్న వారికి కనిపించరు.
ఖాళీ జాగాలో ఓ నూలు మంచం వుంది. దాన్ని చూపిస్తూ "కూర్చో నాయనా" అన్నాడు.
అతను కూర్చున్నాడు.
ఇక ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పద్మజ ఆచూకీ తెలియడం లేదు. ఇంట్లో వుంటే ఈ పాటికి కనిపించేది కదా.
అతను ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతున్నాడు.
అంతలో ఎవరో వస్తున్నట్టు అలికిడి.
అతను తలతిప్పేలోపు వాళ్ళు లోపలికి వచ్చారు.
అందులో ఒకరు పద్మజ.
"ఇదిగోండి పద్మజగారు" పక్కనున్న అమ్మాయి 'గారు' అన్న పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పింది.
తను పద్మజగారిల్లు ఎక్కడ అని అడిగిన అమ్మాయే ఈ అమ్మాయి అని పోల్చుకున్నాడు.
మామూలుగా 'గారు' అని పల్లెటూర్లో ఎవర్నీ పిలవరు. తన అక్కను ఓ కుర్రాడు అలా పిలవడంతో పద్మజ చెల్లెలికి నవ్వు ఆగడం లేదు.
అందుకే ఆ పదాన్ని వత్తి పలికింది.
బహువచనంలో పిలిస్తే చెల్లెలు తననూ ఆట పట్టిస్తుందని "ఎప్పుడొచ్చావ్" అని అడిగింది పద్మజ.
"ఇప్పుడే"
"ఏమ్మా నీకు ఇతను తెలుసా?" తండ్రి పద్మజను అడిగాడు.
అతను ఏట్లో వున్న భూముల్లో వేరుశనగ వేశాడు తొవ్వాటం తొవ్వాలట. మన ఊర్లో కూలీలు ఎవరయినా దొరుకుతారా అని అడిగితే రండి మాట్లాడదాం" అన్నాను.
ఎవరిమీదా ఏ అనుమానం రాకుండా ఆమె అలా చెప్పిందని అర్ధమైంది అతనికి. అందుకే వెంటనే 'అవునవును' అన్నాడు ఆయన వంక చూస్తూ.
"ఎంతమంది కావాలి?"
"ఇద్దరు చాలు మొత్తం కోపడ రాలేదు. రెండు కయ్యాలు తొవ్వచ్చు"
"అయితే వేరే కూలీలెందుకమ్మా నేను మనస్వామి వెళతాం" అన్నాడు ఆయన.
"నువ్వొద్దులే నాన్నా నేనూ పార్వతమ్మా వెళతాం. అదే వెళ్ళి మాట్లాడి వస్తున్నాను" అంది పద్మజ.
"సరే అమ్మా"
"మరి నేవెళ్ళొస్తాను" అని లేచాడు గోకుల్. ఇక అక్కడ వుండడం బాగుండదనిపించింది.
పద్మజ చెల్లెలు తనవైపు, అక్కవైపు మార్చి మార్చి చూడడం అతను కనిపెట్టాడు.
పద్మజ అతన్ని సాగనంపడానికి పక్కనే నడుస్తోంది.
ఏటిగట్టు వచ్చింది.
"మా నాన్నకు డౌట్ రాకుండా అలా చెప్పాను. రేపు ఉదయం ఏదో ఒకటి చెప్పి సర్దుతాను. మీరు ఇప్పుడు తొవ్వాటం తొవ్వడం లేదు కదా" అంది పద్మజ.
"పనుంది రండి" అన్నాడు. ఏం పని లేకపోయినా ఆమె వస్తే చాలు అన్న పరిస్థితిలో వున్నాడతను.
"థాంక్స్" అంది చిన్నగా నవ్వుతూ.
ఆమె ఓ క్షణం తరువాత "ఇల్లు చూపించినప్పుడు థాంక్స్ అన్నారట కదా, మా చెల్లెలు మొదట అదే చెప్పింది. ఈ ఊర్లో ఇంగ్లీష్ మాట ఎవరి నోటంటా రాదు. అందుకే ఆ పిల్లకు మీరు వింతగా కనిపిస్తున్నారు" అంది.
"కరెక్ట్ ఇలాంటి చోట్ల అలా మాట్లాడుకోవడం బావుండదు. మనం కూడా బహువచనాలు మానేద్దాం. నువ్వు నన్ను గోకుల్ అని పిలిస్తే చాలు"
"అలాగే- మరి పద రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేనూ పార్వతమ్మా పొలంలో వుంటాం. తొవ్వాటం ప్రారంభించాక సద్దికి ఇంటికి వద్దాం"
"సద్దికి మళ్ళి ఇంటికి వద్దు నేనే అరేంజ్ చేస్తానులే"
"సరే అయితే"
"వస్తాను" అని బయల్దేరాడు.
ఆ సాయంకాలపు మసక చీకట్లో ఆమెను ఏం చేయకుండా అలా వదిలిరావడం బాధగా అనిపించింది. కనీసం ఒకక్సారి దగ్గరకు తీసుకుని వుంటే ఎంత బావుండేదో అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు.
అతను ఏరు దిగగానే అలాగే వుండిపోయింది పద్మజ. ఆమెకి ఇంటికి వెళ్ళాలనిపించలేదు.
