Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 40

 

    అప్పటికే గోకుల్ పొలం దగ్గరికి వచ్చి దాదాపు గంటైంది. ఈరోజు వస్తుందో రాదోనన్న బెంగ అతన్ని కాల్చుకుతింటోంది.
    
    ఆమె వస్తుందన్న ఆశ ఎక్కడో మిణుకుమిణుకుమంటోంది. రాదేమోనన్న నిరాశ కాగడలాగా మండుతోంది.
    
    ఒక్క క్షణం కాలు నిలవడంలేదు.
    
    మాటిమాటికీ ఏటివైపు చూస్తున్నాడు.
    
    కొన్ని ఏళ్ళపాటు ఘోరమైన తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భక్తుడు ఎలా పొంగిపోతాడో అలా అతను జర్క్ ఇచ్చాడు.
    
    కెరటం తీరం దాటి వస్తున్నట్టు దూరంగా పద్మజ ఏటిగట్టు దిగుతుండడం అతనికి కనిపించింది.
    
    కానీ తను ఇలా వెయిట్ చేస్తున్నట్టు ఆమె కనిపెట్టడం అతనికీ ఇష్టం లేదు.
    
    అందుకే పాకలోకి వెళ్ళి పుస్తకం తెరిచాడు.
    
    పద్మజ పొలం దగ్గరికి వచ్చింది.
    
    పొలంలో ఎవరో ఒకరు వున్నట్టు ఆమె కూడా ఏటిగట్టు దిగుతున్నప్పుడు గమనించింది.
    
    అతను గోకుల్ అని పోల్చుకోగలిగింది.
    
    మరి ఇప్పుడు ఎవరూ లేకపోవడంతో తమ పొరబాటు పడ్డానేమో నన్న అనుమానం వచ్చింది.    
    
    ఎప్పటికైనా వస్తాడులే అని సర్ది చెప్పుకుని గడ్డి కోయడం ప్రారంభించింది.
    
    మామూలుగా అయితే త్వరగా ఇంటికి వెళ్ళాలన్న ఆతృతతో గడ్డి కోసేది. కానీ అంత వేగంగా కొస్తే శరీరం అలిసిపోతుందని, అలా అలసిపోతే ముఖమంతా చెమటలో తడిసిపోయి జిడ్డుగా తయారవుతుందని తెలిసి నిదానంగా కోస్తోంది.
    
    పది నిమిషాలు ఆగాడు గాని ఆ తరువాత వీలు కాలేదు గోకుల్ కి.
    
    పాక నుంచి బయటపడి ఆమె దగ్గరికి వచ్చాడు.
    
    నీరెండలో ఇంద్రధనుస్సుకి చీర చుట్టినట్టుంది పద్మజ. ఆమెను తదేకంగా ఓ క్షణంపాటు చూసి "బావున్నారా?' అని అడిగాడు గోపాల్.
    
    ఆమెను మొదటిసారి చూసి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు. అప్పుడే ఎన్నో రోజులైనట్టు, చాలా రోజుల తరువాత తామిద్దరూ కలుసుకున్నట్టు ఫీలయ్యాడు అతను. అందుకే అలా అడిగాడు.
    
    ఆమె అలాగే వుంది.
    
    అందుకే మెల్లగా తలపైకెత్తి "బావున్నాను మరి మీరు?" అంది.
    
    అతను తల ఆడించి "మీరు రారేమోనని దిగులేసింది" అన్నాడు.
    
    "దిగులెందుకు?"
    
    "మిమ్మల్ని చూడకుండా వుండలేకపోతున్నాను" తల వంచుకుని అన్నాడు. తను ఇంత చొరవ తీసుకుని మాట్లాడడం అతనికే ఆశ్చర్యం వేస్తోంది.
    
    లోపల్నుంచి ఏదో వత్తిడి తనను మాట్లాడిస్తుందని అతనికి తెలుసు.
    
    "నేను రాకపోతే మాత్రం మీరు రాకూడదా! నాలుగడుగులు వేస్తే రాళ్ళ కలవ దాటేస్తారు. ఎరు ఎక్కగానే ఎడమవైపుకి మరో నాలుగడుగులు వేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది"
    
    ఆమె తనని ఆహ్వానించడంతో అతను ఉబ్బితబ్బిబయి పోయాడు.
    
    "మీరు సరేనంటే అలాగే వస్తాను"
    
    "రండి?"    
    
    ఇక అక్కడ వుండలేకపోయాడు అతను. నీటిబుగ్గలాగా గుండెల్లో పొంగుతున్న ఉద్వేగాన్ని, తనొక్కడే అనుభవించాలనిపించి "మీరు గడ్డి కోసుకోండి, తల పైకెత్తేప్పుడు నన్నూ పిలవండి" అని తన పాకకి వచ్చేశాడు.
    
    రాళ్ళలో నిలిచిపోయిన నీటికాలువ పూలతో నిండిపోయిన పన్నీటి కాలువలా అనిపిస్తోంది అతనికి. పచ్చటి వేరుశనగ పైరు తామిద్దరు కల్సుకోవడానికి దేవతలు పరిచిన తివాచీలా వుంది. తామిద్దరి కలయిక చూడడానికే తరతరాలుగా ఆకాశం నిరీక్షిస్తున్నట్టుగా తోచింది. మనిషి అక్కడున్నా అతని మనసు మాత్రం ఒక ఆలోచననుంచి మరో ఆలోచనకు ఎగిరెగిరి దూకుతోంది.
    
    అప్పుడప్పుడు ఆమె కూడా పైకిలేచి చూపుల్ని పాకకేసి విసురుతోంది.
    
    గడ్డి కోయడం పూర్తవగానే లేచి పాకకేసి చూస్తూ చేయి వూపింది.
    
    ఆ క్షణం కోసమే చూస్తున్న అతని పరుగు పరుగున అక్కడికి చేరుకొన్నాడు.
    
    గడ్డినింపిన గంపకేసి చూస్తూ "చదువుతున్న వాళ్ళు దీన్ని ఎత్తగలరా?" అంది అతను రావడంతోనే.
    
    'వూ' అని గంపను పట్టుకొన్నాడు.
    
    గంపను తలమీద పెట్టుకోవడానికి ఆమె ముందుకు రావడం, ఆమె గుండెలు అతని ఛాతీకి వత్తుకుపోవడం జరిగిపోయింది.
    
    అంతకు ముందు రోజుకంటే అతను మరింత ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు.
    
    ఇంటికి తిరిగొచ్చాడు గానీ మనసంతా ఏటిగట్టుమీదే వుంది.
    
    సాయంకాలం అయిదు గంటల ప్రాంతాన శుభ్రంగా తయారయి పొలం దగ్గరికి వెళ్ళాడు.
    
    "ఓ నాలుగడుగులు వేస్తే ఏటిగట్టు దాటేస్తారు. మరో నాలుగడుగులు వేస్తే మా ఇల్లు చేరుకొంటారు" అన్న మాటలు గుర్తొచ్చాయి.
    
    అప్రయత్నంగా అతని అడుగులు ముందుకు పడ్డాయి.
    
    ఆమె ఇంటికి వెళుతున్నానన్న ఆలోచనే అతనికి కిక్కు ఎక్కిస్తోంది. గుండెకి మరిక ఏం పనిలేనట్టు వేగంగా కొట్టుకుంటుంది.
    
    ఏటిగట్టు ఎక్కాడు.
    
    అంత దగ్గర వూరే అయినా ఎప్పుడూ వెళ్ళలేదు అతను.
    
    అందుకే పద్మజ ఎక్కడ కనిపిస్తోందోనని చూస్తూ నడుస్తున్నాడు.
    
    బాట పక్కగా తడికెల్ని గోడలాగా కట్టున్నారు.
    
    అదే అయ్యుంటుందని తల లోపలికి పెట్టి చూశాడు.
    
    కానీ అది కాదు.
    
    మరో అడుగు ముందుకి వేశాడు.
    
    ఎవరో ఓ అమ్మాయి ఎదురుపడి వస్తోంది.
    
    ఆమె దగ్గరికి వచ్చాక "పద్మజ గారిల్లు ఎక్కడండీ" అని అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS