Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 40


    "చీకటి పడుతోంది, ఇప్పుడెక్కడికీ వెళ్ళక్కరలేదు. నువ్వు నీకంటే చిన్నవాళ్ళని ఆంక్షలో పెట్టినట్లే, నువ్వూ పెద్దల అదుపు ఆజ్ఞల్లో వుండవలసిందే" అంది అధికారపూర్వకంగా సుభద్ర.
    
    ఆమె రోషంగా తలెత్తి ఆవేశంగా ఏదో అనబోయేంతలో-
    
    "ధృతీ! నిన్న ఆఫీస్ లో ఎడ్వాన్స్ ఇచ్చారు. ఈ వెయ్యి రూపాయలూ వుంచు. అమ్మకోసం ఆ రోజు చాలా ఖర్చుపెట్టావు" అన్నాడు పర్సులోంచి డబ్బులు తీస్తూ.
    
    "నవీన్! బదులు తీర్చుకుంటున్నావా? అలాగైతే అసలు నేను నీ దగ్గర తీసుకున్నవన్నీ కలిపితే ఎంతవుతుందో నాకు లెక్కతెలీదు. నేనసలు నీ ఋణం...." అని పూర్తిచేయలేక ఏడ్చేసిందామె.
    
    "ఋణం, అప్పని పెద్ద పెద్ద మాటలు వాడకు. మళ్ళీ అవసరమైతే తీసుకుంటాగా" అన్నాడు ఆమెని వూరడిస్తూ.
    
    ఐకమత్యంతో ఎటువంటి కష్టాలనయినా ఎదుర్కోవచ్చు, విభేదాలు జనిస్తే చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేము.
    
    "నన్ను క్షమించు నేను ఒకే ఒకసారి నీకు సాయపడి, అందుకు ప్రతిగా ఘోరమైన అవమానం చేశాను" అంది ధృతి.
    
    "ఏయ్ పిచ్చీ! అవమానాలూ, ఆవేదనలూ లాంటి పదాలు స్నేహితుల మధ్యన రాకూడదు. అందరూ మన పద్దతిలో ఆలోచించాలనీ, మననే అనుసరించాలనీ అనుకోకూడదు. ఎవరి దారి వాళ్ళది అని వదిలేస్తూ వుండాలి" అన్నాడు.
    
    సుభద్ర విసవిసా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది.
    
    నవీన్ "వస్తా" అంటూ లేచి "స్వార్ధం ఒకసారి మనసులోకి వచ్చిందంటే అది ఎవ్వరినీ ప్రశాంతంగా వుండనివ్వదు" అన్నాడు.        
    
    ఆమె కళ్ళు తుడుచుకుని అతనికేసి చూసింది.
    
    "మనమీద మనం నమ్మకం ఎట్టి పరిస్థితులలోనూ పోగొట్టుకోకూడదు. ఎదుటివారు రెచ్చిపోయి మాట్లాడుతుంటే, వారిదే నిజమేమోననుకోకూడదు. బహుశా వారు చెప్పే విషయంమ్నీద వారికే నమ్మకం తక్కువకాబోలు అనుకోవాలి" అన్నాడు నవ్వుతూ.
    
    ఆమెకి కూడా నవ్వొచ్చేసింది. బయటికొచ్చి అతనికి వీడ్కోలు యిచ్చింది. ఆ రాత్రి ధృతి భోజనానికి పిలిస్తే తల్లీ, కృతీ రాలేదు. తండ్రికి, తమ్ముడికి పెట్టి తను పడుకుంది. "లేనప్పుడు ఎన్నోసార్లు పస్తులున్నాం, ఉండీ ఈ దౌర్భాగ్యమేమిటో" అనుకుంది బాధగా.
    
    ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని ఆమె అనుకోలేదు. కానీ మరీ మరుసటిరోజు ఉదయమే మళ్ళీ చర్చలు రేపుతుందని ఆమె ఊహించలేదు.
    
    తల్లి లేవలేకపోయేసరికి ఒంట్లో బాలేదేమోననుకుని వంటపనీ అదీ పూర్తిచేసి గుడికి వెళ్ళొచ్చింది ధృతి,

    ఆమె గుడినుంచి వచ్చేసరికి ప్రేమ్ వచ్చి వున్నాడు.
    
    అతను ధృతిని చూస్తూనే "చిన్నపిల్ల ఏదో అడిగితే అలా కోప్పడ్డావెందుకు? చూడు ఎలా ఏడుస్తోందో" అన్నాడు.
    
    "ఒద్దులే నాయనా! మళ్ళీ ఆ విషయం ఎత్తకు ఎగిరిపడుతుంది" మంది సుభద్ర.
    
    "నువ్వెలాగూ ఏదీ అనుభవించలేవు. పరిపూర్ణంగా ఆనందించలేవు. అనుభవించేవాళ్ళనైనా ఆనందించనీ" అన్నాడు.
    
    ఆమె మనసులో అనుకుంది "నాకూ మైసూర్ సిల్క్ చీరలూ, గద్వాల్ చీరలు కొనుక్కుని కట్టుకు తిరగాలనే వుంటుంది. చేతినిండా డబ్బుంటే ఊటీలు, గోవాలూ చూడాలనే వుంది. ఉందికదాని ఖర్చు చేసేస్తే వీళ్ళ గతి ఏమిటి? ఆ విషయం మీరంతా ఆలోచించరేం?"
    
    ఆమె మౌనాన్ని కోపంగా తలచి "కోపం తెచ్చుకోకు ఏదో స్నేహితురాలివని చనువుగా అన్నాను" అన్నాడు.
    
    "ఫరవాలేదు" అంది ముక్తసరిగా.
    
    "కృతిని ఈసారికి వెళ్ళిరానీ......! మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అసలే సీరియస్ గా చదువుకోవాలి కూడానూ" అన్నాడు నచ్చచెబుతున్నట్లు.
    
    ఆమె ముఖం చిట్లించింది.
    
    "నీకిష్టమైతేనే" అన్నాడు.
    
    "నాకిష్టంలేదు."
    
    అతను కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ప్రేమ్ వెళ్ళిపోయాక అందర్నీ పరిశీలనగా చూస్తూ చెప్పింది - "ఇంకోసారి ఇంటి విషయాలు అతనివరకు వెళితే వూరుకునేది లేదు."
    
    "నువ్వు నిన్న నవీన్ ముందు చులకన చెయ్యలేదూ....! ఉడుకుమోత్తనంగా అడిగింది కృతి.
    
    ఆమె కృతివైపు నమ్మశక్యం కానట్లు చూస్తూ "నీకు నవీన్ ముందు అవమానమయిందా? గౌన్లలో వున్నప్పటినుంచీ దగ్గరికి తీసుకుని ఆడించైనా వాడు నీకు పరాయివాడుగానూ, అతనిముందు నిన్ను ఓమాటంటే గొప్ప అవమానంగానూ అనిపిస్తోందా? మరి నిన్నగాక మొన్న పరిచయమైన ఇతని ముందు కూర్చుని 'ఎక్స్ కర్షన్' కి అక్క పంపలేదని బుడిబుడి రాగాలు తియ్యడానికి సిగ్గు వెయ్యలేదా? అతను డబ్బిచ్చి పంపిస్తానంటే తీసుకోటానికి అవమానం లేదుకదూ?"
    
    అక్క మాటలకు జవాబివ్వలేక చూస్తూండిపోయింది కృతి.
    
    సుభద్ర సణుగుతూ లోపలికి నడిచింది.
    
    ధృతి భోజనం చేయకుండానే బయల్దేరి ధర్మానందరావుగారి ఔట్ హౌస్ కి వెళ్ళిపోయింది.
    
                                                              * * *
    
    "ఏమిటీ? ఏదో చెప్పాలని తీసుకొచ్చావ్?" అడిగింది లీలని ధృతి మాటలలో.
    
    "అదే చెప్పబోతున్నాను. నిన్న కృష్ణమూర్తి ఓ ఉత్తరం రాసి ఫైల్లోపెట్టి యిచ్చాడు."
    
    "ప్రేమలేఖా?" నవ్వుతూ అడిగింది ధృతి.
    
    "నా మొహం! బాధ లేఖ" అంది లీల బ్యాగ్ లోంచి తీసి టేబుల్ మీద పెడుతూ.
    
    "నీ ఉత్తరం నేను చదవడం...."
    
    "ఫరవాలేదులే! అందులో రహస్యాలేం లేవు."
    
    ఆమె చదవడం ప్రారంభించింది. దానిలో సారాంశం - అతను ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి బోలెడు బాధ్యతలున్నాయి. తమ్ముడి చదువు, చెల్లెలి పెళ్ళి అతనిమీదే ఆధారపడి వున్నాయి. తల్లీ తండ్రీ రోగిష్టివాళ్ళు. అక్కలూ, బావలూ ప్రతి పండక్కీ వచ్చి ఇతన్ని పీక్కుతింటూంటారు. ఇవి ఇతనికి తప్పనిసరి కష్టాలు! తల్లి యీమధ్య పెళ్ళి చేసుకుని కోడల్ని తెమ్మని పోరుతోంది. (బహుశా పని చేసుకోలేదేమో) ఎవరో ఒకమ్మాయిని పెళ్ళిచూపుల్లో చూసి తెచ్చుకోవాలంటే ఇతనికి సుతరామూ యిష్టం లేదు. (భయం కావచ్చు) అందుకని లీల ఒప్పుకుంటే పెళ్ళిచేసుకుంటాడు. ఆర్ధికంగా అతనికి లాభసాటిగా వుంటుంది కాబట్టి తల్లి కూడా ఏమీ అనదు. అందుకని లీల అంగీకారంకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS