Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 39

   
    "వెళ్ళిన ఒకపూట క్రొత్త. తరువాత అంతా పాత అయిపోతుంది. పాపం తల్లిలేని పిల్లలు. వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోతుంది, ఎవరికైనా, తల్లిలేని పిల్లలకి చేస్తే పుణ్యం!" అంది, ఆ పుణ్యం మూటగట్టుకొనే ఛాన్స్ నేను నీకు ఇచ్చాను అన్నట్టుగా. "ఆ పిల్లల తండ్రి ఎప్పుడూ ఊళ్ళు తిరిగే మనిషి. నెలకి ఏ ఒకటి రెండు రోజులో ఇంటిపట్టునుంటాడు. అతడున్నా లేకున్నా మర్యాదస్తుడు. అతడి గురించి ఎలాంటి భయాలు పెట్టుకోనక్కరలేదు."

    రెండురోజుల తరువాత కమల ఫోన్ చేసింది. "నేను మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మాయిని తీసుకువచ్చావంటే అన్నీ అప్పజెప్పి వెళ్ళిపోతాను" అని.

    జానకమ్మ సంధ్యని వెంటబెట్టుకు వెళ్ళింది.

    చూడగానే మంచి సంస్కారవంతుల ఇంటినుండి వచ్చినట్టుగా కనిపించిన సంధ్యనిచూసి సంతృప్తి పడింది కమల.

    "వంటకి మనిషున్నాడు. ఇవతల పనులకి ఇద్దరు నౌకర్లున్నారు. నువ్వు చూడాల్సిందంతా పిల్లల పనే. వాళ్ళ స్నానం, బట్టలు, తిండి, బడికి పంపడం - ముఖ్యంగా పిల్లలకి తల్లిలేని బెంగ లేకుండా చేయడం. ఇది నువ్వు ఒక ఉద్యోగంలాంటిదనుకోకూడదు. ఆపదలో చిక్కుకొన్న ఒక సంసారానికి ఆసరాగా నిలబడుతున్నాననుకోవాలి. నీ రుణం మేం ఉంచుకోం!" అని చెప్పింది కమల.

    మౌనంగా తలూపిందేగాని ఆమెకంతా అయోమయంగానే వుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళింట్లో వచ్చి వుండడమేమిటి? ఈ పిల్లలకి చేయడమేమిటి? వీళ్ళుచూస్తే గొప్ప ధనవంతులన్నట్టున్నారు వీళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో ఏమిటో? అరుణ్ ఊళ్ళోలేని సమయం చూసి నేర్పుగా తన పీడ వదిలించుకొన్నట్టుంది జానకమ్మత్త.

    ఇక్కడికి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే తను రావడం జానకమ్మత్తకి ఇష్టంలేదని గ్రహించింది సంధ్య. పైకొమ్మలకి ఎగబ్రాకాలన్న ఆశతో వున్న కొమ్మని విరగ్గొట్టుకొన్నట్టుగా అయింది తన పని. అరుణ్ మాట పట్టుకొని వెంటరావడం చాలా పొరపాటైందని పశ్చాత్తాపపడుతున్న సమయంలో జానకమ్మత్త తల్లిలేని పిల్లల్ని చూడాలన్న నెపంతో ఇంటి నుండి పంపించివేసింది. ఇప్పుడేం జరిగినా తనేం చేయలేదు. ప్రవాహం ఎటుకొట్టుకుపోతే అటు కొట్టుకుపోవాల్సిందే. నిండా మునిగినవాళ్ళకి చలేమిటన్నట్టు తను భయపడకూడదు.

                        *        *        *

    రెండు మూడు రోజుల్లోనే చక్రపాణి పిల్లలిద్దరు సంధ్యకి బాగా అలవాటయ్యారు. బాబు అయిదేళ్ళవాడు. పేరు శ్రీకాంత్. పాప మూడేళ్ళది పేరు ప్రేమ. ఇద్దరు పిల్లలూ ఆవిడకి కాస్త వయసు మీరాకే పుట్టారట. శ్రీకాంత్ తల్లినసలు తలిచేవాడు కాదు. ప్రేమ మాత్రం 'మమ్మీ కావాలి' అంటూ ఏడ్చేది. "మమ్మీ ఊరికెళ్ళిందిగా?" అని చెప్పేవాడు శ్రీకాంత్. వాడికి కమలత్త అలాగే చెప్పింది. సంధ్య అదేమాట చెప్పేది. "మమ్మీ ఊరికెళ్ళింది. నువ్వు ఏడవకుండా ఉంటే బోలెడు బిస్ కెట్లు చాక్ లెట్లు తెస్తుంది."

    ప్రేమ ఏడుపు మానేసి తల్లి తనకు బోలెడు చాక్ లెట్లు, బిస్ కెట్లు తెస్తున్నట్టుగా ఊహించుకొని తెగ మురిసిపోయేది.

    సంధ్య వచ్చిన నాలుగు రోజుల తరువాత,

    "అయ్యగారు ఊరు వెడుతున్నారు. మీతో ఒకమాట చెప్పి, వెడతారట, హాల్లోకి రమ్మంటున్నారు" అనిచెప్పాడు నౌకరు.

    ఇంతవరకు చక్రపాణికి ఎదురుపడలేదు సంధ్య. భోజనానికి తప్ప అతడు క్రిందికి వచ్చేవాడుకాదు. అతడు భోజనానికి వచ్చినప్పుడు సంధ్య పిల్లలతో గదిలో ఉండిపోయేది.

    భుజాలనింజా కొంగుకప్పుకొని, అతడికి దూరంగా గోడకి ఒదిగినట్టుగా, నిలబడింది సంధ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS