Previous Page Next Page 
చదువు పేజి 40

   

    సుందరం నాటకం చూశాడు. సరుసు హరిశ్చంద్రుడి  వేషం వేశాడు. పాడాడు, అభినయించాడు. ఆ నాటకమూ, ఆ తెరలూ, నాటకం చూడటానికి వచ్చిన ఆ మూకా చూస్తే ఏమనుకోవాలో సుందరానికి తెలీలేదు. ఈ నాటకం చూస్తుంటే నాటకం చదివితే వచ్చేఆనందంలో నూరోవంతు రాలేదు. సరుసు కూడా ఏదో తెచ్చిపెట్టుకుని నటిస్తున్నట్టూ, చూసేవాళ్ళ తెలివితేటలను అపహాస్యం చేస్తున్నట్టూ ఉన్నదిగాని తాను ఒకఅనుభవాన్ని సృష్టిస్తున్నట్టు లేదు. ఈనాటకాల గొడవ పెట్టుకుని సరుసు ఎందుకూ కొరగాకుండా పోతున్నాడని సుందరంనమ్మాడు.

    నాటకం అయిన తరవాత సరుసు, "ఎట్లావుంది  మా తోలుబొమ్మలాట?" అన్నాడు.

    సుందరం ఈ మాటకు కాస్తధైర్యంవచ్చి నాటకం ఏమీ బాగాలేదనీ, ఇంకా బాగా ఉండవచ్చుననీ,  అన్నాడు.

    సరుసు ఆ మాటతో ఏకీభవించి ఊరుకోక, ఎక్కడ లోపాలు జరిగాయో, ఎక్కడ ఎవరు బాగా చేశారో, ఎక్కడ ఎట్లా పాడుచేశారో, తాను ఎక్కడ బాగాచేశాడో, ఎక్కడ చెయ్యలేక పోయినాడో, ఎందుకట్లా అయిందో సవిస్తరంగా చెప్పనారంభించాడు. సుందరం లోలోపల విసుక్కుంటూ అంతావిన్నాడు.
        
    సహృదయుడు కాని వాడితో మాట్లాడుతున్నానని సరుసు కొంచెం అనుమానించినా ఈ వివరాలు మాట్లాడి వుండడు. సుందరం వినోదంకింద మాత్రమే పరిగణించే కళను సరుసు తన జీవితాశయంగా పెట్టుకున్నాడు. అందుచేత ఇద్దరూ కలసి మాట్లాడేది ఏమీలేదు.
   
                                       *    *    *    *

    ఊళ్ళోవాళ్ళ పోరు పడలేక శేషగిరి మావయ్య కృష్ణవేణికి పెళ్ళిచేశాడు. ఆ సందట్లోనే సరుసుకు ఉపనయనం కూడా   అయిందనిపించాడు.

    "కాకులు పొడిచినట్టు పొడుస్తుంటే ఏం చెయ్యను.? చెబితే విసరాయె. ఈ బాల్య వివాహాలూ, దిక్కుమాలిన ఆచారాలూ, మాన లేకపోతే మనకు స్వరాజ్య మెందుకంట! ఛీ, ఛీ! మన గతి ఇంతే. గాంధీ మహాత్ముడింత ఉద్యమం నడపట మేమిటి. ఈ పేడసుద్దలు ఉన్నచోటే ఉంటామనటమేమిటి?" అని శేషగిరి వాపోయినాడు.

    "అదేమిట్రా? స్వరాజ్యమంటే సమత్తాడేదాకా పెళ్ళిళ్ళు చెయ్యకుండా ఉంచటమా? చాల్లే" అన్నది సీతమ్మగారు, పెళ్ళికి తీసుకుపోవడానికి వచ్చిన అన్నతో.

    ఉపన్యాసం ఇచ్చేందుకు మంచి అవకాశం దొరికింది.

    "ఇల్లు శుభ్రంగావుంటే చీపురు కట్టతీసుకుని ఊడవ్వుగా! బ్రిటిషువాళ్ళు రాజకీయంగా మనకు పీడలు కొన్ని తెచ్చిపెట్టారు. గనకే స్వరాజ్య మంటున్నాం. అవునా? ప్రజలుందే వాళ్ళు రాజ్యాలేలేది ఎన్నడూలేదు. అందుకని ఎవరు పరిపాలిస్తే ఏంలే అనుకోంగా? బ్రిటిషువాళ్ళ పరిపాలనకన్న మనవాళ్ళ పరిపాలన మనకు లాభసాటిగా వుంటుంది. బ్రిటిషువాళ్ళు నాశనం చేసే రాజకీయ జీవితాన్ని మనవాళ్ళయితే పెరిగి రానిస్తారు. ప్రజలకు హక్కులిస్తారు. ఉద్యోగాలిస్తారు. జీవితం తోటకూరమడిలాగా నవనవలాడుతూ పెరిగివస్తుంది. ఇదంతా అర్ధంకాని మూర్ఖులుండి 'ఎబ్బే ఇదంతా ఏమిటి? బ్రిటిషువాళ్ళచేత మొట్టించుకోవటం మనకు ఆనవాయితీగా వస్తున్నదాయే. అదంతా మారితే ఎట్లా?' అని అన్నారనుకో, ఎట్లా వుంటుంది? మన చేతులో వున్న విషయాలనుకూడా మనం సంస్కరించుకోకపోతే ఇంక బ్రిటిషువాళ్ళను తరిమేసి రాజకీయ సంస్కరణలేంచేసుకుంటాం? ఒక్కటడుగుతా చెప్పూ! మన జీవితంలో మనం అసంతృప్తి చెందకపోతే దాన్ని మార్చుకుందామనే  ఆవేదన లేకపోతే, మార్పుకోసం  కృషిచేసేశక్తి ఎట్లా వస్తుంది?"

    "ఆడదాన్ని నాకివన్నీ ఏం తెలుస్తాయిగాని, చక్కగా చిన్నప్పుడే పెళ్ళిచెయ్యాటాని కేమీ? బర్రెలల్లే ఇరవైయ్యేసేళ్ళ పిల్లల్ని పల్లకీలో ఎక్కి ఊరేగిస్తారూ? అచ్చటా ముచ్చటా ఉండొద్దూ?"

   
    "అదే వచ్చింది! పిల్లల జీవితాలతో మనం బొమ్మలాడుతున్నాం. మన ముచ్చట తీరితేసరీ వాళ్ళేమన్నాకానీ!"

    "ఆఁ ఏమవుతారు? ఏమీకారు. మనమంతా మట్టి కొట్టుకుపోయినామా?"
 
    "అదేంమాట? మనకన్నఎవరూ సుఖంగా బతక్కూడదా? యావజ్జీవం వుండవలసిన లంకెగదా, మొగుడు పెళ్ళాలు వ్యక్తులై తమ బంధం తమ చేతుల మీదగా చేసుకునే హక్కు ఎంత అవసరమైనది! ఏ హక్కులూ లేకుండా బానిసల యుగంలో బానిసలూ బతికారు, అదా?"

     సీతమ్మగారు విషయంమార్చి, "సరేగాని, నువ్వు వెధవల పెళ్ళిళ్ళుకూడా చేయిస్తున్నావుటగా?" అన్నది.

     "నాదేమిటి? నా తలతన్నినవాళ్ళు చేయిస్తున్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణగారున్నారు. సాంబశివరావుగారున్నారు. వెంకయ్యగారున్నారు. ఇంకా బోలెడుమంది పెద్దలున్నారు. స్రీ పునర్వివాహాలు చూడు ఎంత అవసరమైన సంస్కరణో!"

    "నా మొహమల్లేనేవుంది!" అన్నది సీతమ్మగారు.

    ఇదంతా వింటున్న సుందరానికి తన మేనమామ చెప్పేమాటల్లో గొప్ప భావాలు కనిపించాయి. వాడు జీవితాన్ని విమర్శించేస్థితిలో ఇంకాలేడు. అయినప్పటికీ జీవితాన్ని ముందుకు తీసుకుపోయేట్టు కనబడే ఏ ప్రయత్నమైనా మంచిదనే విశ్వసించగల స్థితిలో వున్నాడు.

    సుందరానికి తన తల్లి భావాలమీద అనాదరం క్రమంగా హెచ్చుగా వస్తున్నది. పుస్తకాలద్వారా  అయితేనేం, శేషగిరి వంటివాళ్ళు  చేసే ప్రచారంవల్ల నయితేనేం సుందరం జీవితంలో జరగదగిన మార్పులనుగురించి కొన్ని విశ్వాసాలు సంపాదిస్తున్నాడు. ఈ విశ్వాసాలు  వాడి బుద్ధికి హేతురహితంగా లేవు. తానుమారే జీవితానికి ప్రతినిధిననీ, తన తల్లి మారని జీవితానికి ప్రతినిధి అనీ వాడు భావిస్తున్నాడు. శేషగిరి తనతల్లితో ఈచర్చంతా జరపటం వాడికి సబబుగానే కనిపించింది. తన మావయ్యచేత ఇంత తొందరలో కృష్ణవేణి పెళ్ళి చేయిస్తున్నది తన తల్లి వంటి వాళ్ళేనని సుందరం ఊహించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS