Previous Page Next Page 
చదువు పేజి 39

   

   తెలుగు మేష్టర్లంటే చులకనగా చూసే అలవాటుకూడా సుందరానికి లేదు. అయితే వాళ్ళు ఇతర మేష్టర్లల్లే పిల్లలను నిగ్రహించక వాళ్ళకెందుకు అలుసిస్తారో సుందరానికి తెలిసేదికాదు. సుందరానికి మూడోఫారంలో తెలుగు చెప్పిన శాస్తుర్లుగారు తెలుగు పుస్తకాలలో సుందరానికి ఆసక్తి కలిగించాడు. కాని ఈ ఆసక్తి ఎందుకూ ఉపకరించలేదు. శాస్తుర్లుగారు గొప్పగా చెప్పిన తెలుగు పుస్తకాలు తనకు సులభంగా దొరికేవి కావు. అయినప్పటకీ సుందరం మూడోఫారం పూర్తీ చేసిన తరువాత వేసవి శలవుల్లో కుచేలో పాఖ్యానం టీకా తాత్పర్య సహితం కొనుక్కొచ్చి అందులో ఉన్న పద్యాలన్నీ బట్టీ పెట్టి వాటి అర్ధం తెలుసుకున్నాడు.
   
                                                                *    *    *    *
   
    ఈ శలవుల్లోనే సుందరం ఒంటరిగా తన మేనమామఊరు వెళ్ళాడు. తాము ఫలానా తారీఖున "హరిశ్చంద్ర" ఆడుతున్నా మనీ సుందరం తప్పక వచ్చి చూడాలనీ సరుసు మరీమరీ రాశాడు.

    తను కోరినప్రకారం సుందరం వచ్చినందుకు సరుసు చాలా సంతోషించాడు. కొంతకాలం కిందట తాను గుంటూరు వెళ్ళి హరిప్రసాదరావు "హరిశ్చంద్ర" చూసివచ్చిన సంగతి అంతులేకుండా చెప్పాడు సరుసు. హరిప్రసాదరావు పొడుం ముక్కుతో "హ చంద్రమతీ" అని ఎట్లా అంటాడో కూడా చూపించాడు.

    "ఒరే ఇవాళ హరిప్రసాదరావు హరి స్చంద్రుడి పద్యాలు ఇమిటేట్ చేస్తే బెల్లంకొండ నరిసింహారావు చెయ్యాలి. లేదా నేను చెయ్యాలి. అంతే!" అన్నాడు సరుసు ప్రతి శీనప్పపాటనూ, దాశరధి పాటనుకూడా తెగ మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తూ సుందరం వాళ్ళనెవర్నీ చూడలేదు. వీళ్ళను గురించి వినలేదు.

    కాని సరుసు ధైర్యం చెప్పాడు.

    "ఎల్లుండి రాత్రికి నేను హరిప్రసాదరావు బాణీ దించేస్తాగా!" అన్నాడు వాడు.

    కాని సుందరం "ఎల్లుండిరాత్రి" దాకా ఆగ నవసరం లేకుండానే ఆ పద్యాలను అరడజను సార్లు వినటం జరిగింది.

    ఆ పల్లెటూళ్ళో సుందరాని కేమీ తోచలేదు. సరుసు ఎంతసేపైనా కబుర్లు చెప్పగలడు. కాని సుందరం చదువుతున్న చదువు ప్రభావం చాయలు అప్పుడప్పుడే తల ఎత్తుతున్నాయి. తిమింగలం అరగంటలో నీటిమీదికి వచ్చి గాలి పీల్చుకుని మళ్ళీ నీటిలోకి వెళ్ళినవిధంగా, సుందరం ఆటేసేపు బాహ్యప్రపంచంలో, యధార్థ వ్యక్తుల మధ్య ఉండి సంతృప్తి పడలేక పోతున్న్నాడు. అదే "తోచకపోవటం" రూపేణా బయట పడుతున్నది. వాడికి కావలసిన "గాలి" పుస్తకాలలోనూ, కధలలోని ప్రాతలలోనూ  లభిస్తుంది__ ఎటువంటి చెత్త పుస్తకమైనా సరే వాడికి "తోచేటట్టు" చేసేది.

    "ఏంరా సరుసూ? మీ లైబ్రరీకి వెళ్ళి చదువు కోవటానికేమన్నా పుస్తకం తెచ్చుకుందాం?"  అన్నాడు సుందరం.

    "లైబ్రరీలో ఏం పుస్తకాలున్నై? ఏమీలేవే?" అన్నాడు సరుసు.

    వెనుక నే వచ్చినప్పుడు చాలాపుస్తకాలుండెనే? పానుగంటి ఆయన సాక్షి. నాటకాలూ, డిటెక్టివు    నావెల్సూ అవీ చాలా వుండాలిగా?" అన్నాడు సుందరం.

    "అన్నీ ఎవరిదారిన వారెత్తుక పోయినారు. మేష్టరే లైబ్రరీ కూడా చూస్తూండేవాడు. బడి మూసేసి ఆయన  వెళ్ళి పోగానే ఎవరికందిన పుస్తకం వాళ్ళు ఎత్తుకు పోయినారు."
 
    "బడి అయిపోయిందా?" అన్నాడు సుందరం.
 
    "అయిపోకేం జేస్తుందిరా? లేనివాళ్ళకు జీతంలేకుండా చదువు చెబుతాంటే వున్నవాళ్ళుకూడా ఊరికేనే చెప్పమన్నారు. జీతం అడిగితే పిల్లల్ని పంపించం అన్నారు. కొందరు బడికి చందాలిచ్చారు, చూడూ; వాళ్ళపిల్లలూ, వాళ్ళ బంధువుల పిల్లలూ జీతాలు కట్టలా. వాళ్ళని అడగాలో అడగరాదో తెలీలా. బీద వాళ్ళ పిల్లలుకూడా బడికి రావటం మానేశారు. ఇళ్లకు వెళ్ళి ఎందుకు రారర్రా అని అడిగితే, మా అబ్బాయికి బట్టలులేవని ఒకరూ, పుస్తకాలు లేవని ఒకరూ. ఒరే నువ్వు నమ్మవు గాని, ఎదురు డబ్బిస్తే తప్ప పిల్లల్ని పంపమన్న వాళ్ళున్నారు... ఈ బడికాదు గాని ఊళ్ళో సహంమంది కిప్పుడు మా నాన్నంటే పడదు. కొందరు, నీమూలంగా పిల్లల్ని పాడుచేశాం, వాళ్ళ చదువుపాడు చేశాం అన్నారు. మరికొందరు మా నాన్న చాలా పెద్దపేరు తెచ్చుకుందామని ఇదంతా చేశాడని కూడా అన్నారు. తిట్లుతినేటం మాటా, కాళ్ళు పడేటట్టు చందాలకోసం తిరగటం మాటా అటుంచు, చేస్తూచేస్తూన్న ఉద్యోగం మానుకుని మా నన్న ఈ చందాలమీద కుటుంబం పోషిస్తున్నాడని వదంతులు పుట్టించిన వాళ్ళున్నారు. మా నాన్న తప్పుకూడా ఉందిలే. ఇంత త్యాగంచేశాను. అంత త్యాగం చేశాను, మీరేం చేశారు అని అందర్నీ దెప్పాడు. వకీలు సీతారామయ్యకూ నాన్నకూ ఇప్పుడు మాటల్లేవు తెలుసా!... అదెట్లా వచ్చిందంటే, మా చలమయ్య మీద దాయాదులు దావావేస్తే అవతలివైపు వకాల్తా సీతారామయ్య  పుచ్చుకున్నాడు. చలమయ్య కూడా మా నాన్నల్లేనే జైలుకు వెళ్ళిన వాడేగా మరీ? ' ఇటువంటివన్నీ  పెట్టుకుంటే అవుతుందా?' అన్నాడు సీతారామయ్య. మా నన్న ఆయన్ని నానా మాటలూ అన్నాడు. అంతే, ఇద్దరూ మళ్ళీ మాట్లాడు కోలేదు.... నాలుగు నెల్లపాటు మా నాన్నే బడిపోషించాడు. ఆ తరువాత వొదిలేసి ఊరుకున్నాడు. ఒక్కడు ఎంతదూరమని దేకుతాడు చెప్పు?"

     సుందరాని కిదంతా వింటున్నకొద్దీ కంపరం ఎత్తింది. ఈ ఉదంతం గురించి ఇన్ని వివరాలు తెలుసుకోవలసిన అవసరంలేదనీ, ఒక్కముక్కలో శేషగిరి మామయ్య తనజీవితమూ, పేరు కూడా భ్రష్టుచేసుకున్నా డనుకుంటే సరిపోతుందనీ సుందరం అనుకున్నాడు.

    ఇందులో నేర్చుకోవలసిన నీతికూడా ఏమీ ఉన్నటు కనపడలేదు సుందరానికి__ దేశంకోసం ఒళ్ళు విరుచుకోవటం  వృధాఅని తప్ప.

    ఆ సాయంకాలం సరుసూ, సుందరం కూడా సత్రంకేసివెళ్ళారు. అక్కడే రోజూ నాటకం రిహార్సల్సు. సత్రంమీద మాసిపోయిన నీలం అక్షరాలతో "జాతీయ విద్యాలయం" అనీ పక్కగది తలుపుమీద తెల్ల అక్షరాలతో  "లైబ్రరీ" అనీ ఇంకా కనిపిస్తున్నది.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS