భార్గవకు ఆశ్చర్యంగా వుంది.
ఒక మగాడు తన సమ్మతమయిన కోరికతోనయినా బాహ్య ప్రపంచంలో మరో మగాడి ద్వారా బిడ్డను కనాలనుకోవటం....
అతడి గొంతులో తడారిపోయింది.
మనసు నిజాన్ని సమాధాన పరుచుకోలేక లోలకంలా వూగుతోంది. పిల్లలులేని బాధ ఎంత తీవ్రంగా వుంటుందో అర్ధమవుతున్న కొద్దీ భార్గవ గుండె చలించిపోతోంది.
శరత్ పట్ల జాలి, అభిమానం నిండిపోయాయి.
"కాని ఈ విషయం చివరికయినా సుగాత్రిగార్కి తెలీకుండా వుండటం కష్టం.
"భార్గవా....చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను. మరో మగాడి స్పెర్మ్ డ్ బిడ్డను కనాలన్న ఆలోచనని నేనై చెప్పాలని ప్రయత్నించాను. ప్రతిసారీ అవాంతరాలొచ్చాయి. అందులోనూ మొదట ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కూడా. నా ఇష్టాన్ని, అభిప్రాయన్ని చెప్పినా సుగాత్రి ఒప్పుకుంటుందా లేదా అన్న సమస్య నన్ను వెంటాడుతోంది."
"మీరు తప్పుదోవలో పోతున్నారు శరత్ గారు. డోనర్ గా సెమన్ చేయడానికి నేనెప్పుడూ సిద్దమే....కాని సుగాత్రికి తెలీకుండా జరగటం అసంభవం. తెలిసిన రోజు మీరూ, నేను అసహ్యానికి గురవుతాం. ముందు ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేయండి. అయితే మటుకు నాదో కోరిక-"
చివరిమాట విని భార్గవవేపు చిత్రంగా చూశాడు శరత్.
"చెప్పండి!"
"నేను చేసే చిన్న సాయానికి ఇరవై లక్షలు తీసుకోదల్చుకోలేదు."
"రహస్యంగా వుంచాలన్న ఒప్పందం కోసమయినా...."
"మీరు మీ వంశాంకురాన్ని కూడా వ్యాపారదృష్టితో చూస్తున్నారు. రహస్యం కోసమే అయితే మీకు నా మీద నమ్మకం లేదన్న మాట....!" అన్నాడు భార్గవ.
"అదికాదు రైటర్జీ....టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగం సక్సెస్ కాగానే ఆ డబ్బు బాబీపేర బ్యాంకులో జమచేయబడుతుంది....ప్లీజ్...." మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చైర్ లో కూచుంటూ బజర్ నొక్కాడు శరత్.
అటెండర్ పరిగెత్తుకొచ్చాడు.
"రెండు కాఫీలు పట్రా" చెప్పగానే అటెండర్ వెళ్ళిపోయాడు.
"సుగాత్రి ఎంత మాత్రం ఒప్పుకోకుంటే.....బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే బిడ్డ పుట్టాక తెలిస్తే ఆ తల్లి తట్టుకోలేదు. ఆ తల్లే కాదు. సృష్టిలో ఏ ఆడదయినా అంతే....ఈ పనికి భార్యా భర్తలిద్దరూ ఒప్పుకోవాలన్న రూలుకూడా వైద్యరంగంలోవుందేమో కనుక్కున్నారా?" అనుమానంగా అడిగాడు భార్గవ.
బయట వర్షం పడటం మొదలయింది. చిన్న చిన్న తుంపరల్ని గాలి మోసుకొస్తూ వాళ్ళ మొహాల మీద చిలకరిస్తోంది.
అతి చల్లగా మారిన ప్రశాంతత వాళ్ళ మనసుల్లో బరువు తీర్చిసేదని పంచుతోంది.
శరత్ మోహంలో ఎన్నో నెలల్నించి కొట్టుమిట్టాడుతున్న సమస్య తొలగిపోయి 'రిలీఫ్' కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది.
శరత్ ఇక సుగాత్రి గురించి ఆలోచిస్తున్నాడు.
"ఇందులో మీకు ఎలాంటి అపచారము తోచట్లేదా?" తను అడిగిన వెంటనే తనకే జుగుప్సాకరంగా తోచింది భార్గవకు.
శరత్ మాట్లాడకపోయేసరికి 'సారీ' అన్నాడు మళ్ళీ.
"ఇందులో అపచారమేముంది భార్గవా? చదువుకున్న వాళ్ళు మీరు కూడా సైన్సుని సరిగా అర్ధం చేసుకోలేదా?"
ఈ సారి భార్గవ మాట్లాడలేదు. అంతలో కాఫీలు వచ్చాయి.
"సుగాత్రిని నేను శతవిధాలా ఒప్పించే ప్రయత్నంలో గనుక ఓడిపోతే మనం నాటకమాడాల్సివుంటుంది" చెప్పాడు శరత్.
"ఓ.కే. ఏది ఏమయినా మీ కోరికను నేను మన్నిస్తాను. బెస్టాఫ్ లక్..." కాఫీ త్రాగటం పూర్తిచేసి చేయికలిపాడు భార్గవ.
శరత్ కళ్ళు కృతజ్ఞతా పూర్వకంగా మెరుస్తున్నాయి.
9
"డాడీ....! ఒక ప్రశ్న."
ఆంద్రదేశంలో మొట్ట మొదటి తెలుగుబిడ్డ కోసం జరుగనున్న టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగాల్లో మొదటి వ్యక్తి తను కావటం భార్గవకు చిత్రంగా వుంది. ఆ ఆలోచనల్లో వున్నప్పుడు బాబీ భార్గవ భుజం పట్టి కుదిపాడు.
"డాడీ....ఒక ప్రశ్నంటే విన్పించుకోవేం?" అన్నాడు సీరియస్ గా.
విసుగును అణిచిపెట్టుకుంటూ చెప్పమన్నాడు భార్గవ.
"అతడు ఒక ప్రధానికి రక్తం పంచిచ్చాడు. మరో ప్రధానికి శరీరం పంచిచ్చాడు. ఇంకో ప్రధాని నించి ఆస్థిపంచుకున్నాడు. మరో ప్రధానికి స్నేహం పంచాడు. అయినా అతడు ప్రధానికాదు...ఎవరతను?" అన్నాడు బాబీ.
"ఫిరోజ్ గాంధి"
తండ్రినించి అంత ఠక్కున జవాబొచ్చేసరికి బాబీ నొసలు చిట్లించాడు.
"ఇంత తొందరగా జవాబెలా తట్టింది డాడీ....నేనే ఎక్కడో తప్పు చెప్పాను." అన్నాడు బుంగమూతి పెట్టి.
"నువ్వు తప్పు చెప్పలేదురా....ఆ టీవీలో చూడు ఎవరు కన్పిస్తున్నారో."
"రాజీవ్ గాంధి."
"మరింకేం! నువ్వు ప్రశ్న అడుగుతున్నప్పుడే....ప్రధాని, ప్రధాని అన్న పదంవస్తే ఆయన తరపున ఆలోచించగానే జవాబు తట్టింది..." అన్నాడు బాబీని దగ్గరకు తీస్తూ...
