"అదేంటీ....ఉయ్యాల ఆటంటే తాడుని మెడకి కట్టి ఊగాలికదా?" అడిగాడు రాంబాబు ఆశ్చర్యంగా, డొక్కలు ఎగరేస్తూ.
"స్కూల్లో లంచ్ టైంలో ఉయ్యాల ఇలా ఊగితే ఇంకా బాగుంటుందని దీపని కన్విన్స్ చేశా!" అన్నాడు చిన్నారావ్ గర్వంగా.
ఇందాక చిన్నారావ్ ఎందుకలా నవ్వాడో ఇప్పుడు రాంబాబుకి అర్ధం అయ్యింది.
తను పావుగంటసేపు అనవసరంగా మోకాళ్ళ దేకిచ్చుకున్నాడు.
"హబ్బా!" అన్నాడు జుట్టు పీక్కుంటూ.
చిన్నారావ్ దీపని మరో పావుగంట సేపు ఉయ్యాల ఊపాడు.
ఈలోగా శ్రీలక్ష్మి అక్కడికి వచ్చింది.
"స్కూలు డ్రెస్సు మార్చకుండా ఆ ఆటలేంటే....పద....మొహం కడుక్కుని టిఫిన్ తిందువుగాని" దీపతో అని "మీరు కూడా టిఫిన్ తినడానికి రండి" అంది ఆ ఇద్దరితో. ఫరవాలేదు మేడం....మేం వెళతాం అని ఆమెతో చెప్పి కమీషనర్ లింగారావ్ దగ్గర కూడా శలవు తీస్కుని బయటికొచ్చారు.
"ఇప్పుడు వాళ్ళ రూమ్ కి వెళదామంటావా?" అని అడిగాడు రాంబాబు.
"ఇంక ఈ వేళ కూడా వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ మనల్ని ఆపరేషన్ చేసే కత్తుల్తో పొడుస్తారు" అన్నాడు చిన్నారావ్.
ఇద్దరూ మోపెడ్ మీద కాస్త దూరం వెళ్ళారో లేదో వాళ్ళకి వేరే మోపెడ్ మీద సరోజ, సునీతలు ఎదురయ్యారు. ఆ మోపెడ్ ని సరోజ నడుపుతోంది.
16
రెండు మోపెడ్ లూ ఎదురెదురుగా ఆగాయ్.
"ఏంటి మీరు బతికే వున్నారా?" చాలా కోపంగా చూస్తూ అడిగింది సరోజ.
"దెయ్యాలెక్కడైనా మోపెడ్ తోల్తాయా? కాబట్టి మేం బతికే వున్నాం....హహహ...." నవ్వుతూ అన్నాడు రాంబాబు.
"నీ జోకు మూసీ నదికంటే కుళ్ళు కంపు కొడ్తుంది తెల్సా?" అంది సరోజ.
"మేం కావాలని చెయ్యలేదు....అసలు ఇప్పుడు మీ రూంకే బయలుదేరాం జరిగిందంతా మీకు చెప్పాలని" అన్నాడు చిన్నారావ్.
"హర్రే....మేం మీ రూమ్ కి బయలుదేరాం" అంది సునీత.
"ఎవరూ ఎవరి రూమ్ కి వెళ్ళక్కర్లేదు గాని మనం చక్కగా పార్కుకి వెళదాం" అన్నాడు రాంబాబు హుషారుగా.
"వద్దులే....అక్కడ నువ్వు పల్లీలమ్మేవాడినీ, మిక్సర్ లమ్మేవాడినీ చూస్తూ కూర్చుంటావ్" అంది సరోజ కోరగా చూస్తూ.
"మరేం చేద్దాం?" సిగ్గుపడుతూ అడిగాడు రాంబాబు.
"మేము చెప్తాంగా....మాతో పదండి" అంది సరోజ.
సరోజ రాంబాబుని తన వెనకాల కూర్చోమంది. సునీత రాంబాబు ప్లేస్ లో కూర్చుంది.
రెండు మోపెడ్ లూ బయలుదేరాయి. ఇద్దరి ఆడవాళ్ళు నడుపుతుంటే వెనకాల మరో ఇద్దరు మగాళ్ళు కూర్చుని వుండడంతో దారి పొడుగున జనాలంతా వీళ్ళనే చూడసాగారు.
"అసలు నేను ముందు కూర్చుని నువ్వు వెనకాల కూర్చుని వుండాల్సింది" ఇబ్బందిగా అన్నాడు రాంబాబు, సరోజతో.
"ఏం....మీరు డ్రయివింగ్ చేస్తే ఆడవాళ్ళు వెనకాల సంబరంగా కూర్చోవాలిగానీ మేం డ్రయివింగ్ చేస్తే వెనకాల కూర్చోడానికి మీకు ఇబ్బందా?" అంది సరోజ నవ్వుతూ.
రెండు మోపెడ్ లూ ఓ ధాబా ముందు ఆగాయి.
నలుగురూ ధాబాలో ఓ మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.
"చెప్పు....మీరు ఎందుకు సడెన్ గా మాయమైపోయారు? కనీసం ఫోనైనా చెయ్యలేదేం?" అంటూ రాంబాబుని నిలదీసి అడిగింది సరిజ.
రాంబాబు సడెన్ గా పోలీస్ కమీషనర్ తమకి అప్పగించిన దీప సెక్యూరిటీ డ్యూటీ గురించి చెప్పాడు. రెండు రోజులుగా అదే బిజీలో వున్నట్టు చెప్పాడు.
"అప్పటికీ మధ్యలో మేం నర్సింగ్ హోంకి రెండుసార్లు ఫోన్ చేశాం....ఒకసారి ఇంకా డ్యూటీకి రాలేదని చెప్పారు....ఇంకోసారి రౌండ్స్ లో వున్నారని చెప్పారు....తర్వాత ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్డ్ గా వుంది....దొరకలేదు" అన్నాడు చిన్నారావ్,
"మేం కూడా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాం....వాడెవడో మీ గురించి ఇన్ ఫర్మేషన్ ఇవ్వకుండా "ఏమో....ఎక్కడుంటారో మాకేం తెల్సు" అంటూ రెక్ లెస్ గా సమాధానం చెప్పి పెట్టేశాడు...." అంది సునీత.
"అలా సమాధానం చెప్పాడంటే వాడు తప్పకుండా ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గాడే అయి వుంటాడు....వాడి సంగతి మేం చూస్కుంటాంగా" అన్నాడు రాంబాబు పళ్ళు కొరుకుతూ.
"వాడు ఇన్స్ పెక్టర్....నువ్వేమో కానిస్టేబుల్. వాడి సంగతి నువ్వెలా చూస్తావ్?" అంది సరోజ.
"కమీషనర్ మా ఇద్దర్నీ చాలా లైక్ చేస్తున్నాడు....మేం ఇద్దరం ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి ఆ కుక్క కిడ్నీ నాయాల్ని ఎలా ఏడిపిస్తానో చూడు"
"అదెలా సాధ్యం? నువ్వు దీప సెక్యూరిటీ డ్యూటీలో వుంటావ్ గా వాడినెలా ఏడిపిస్తావ్?"
"దీపకి స్కూలు లేనప్పుడు మేమిద్దరం పోలీస్ స్టేషన్లోనే డ్యూటీ చెయ్యాలి....అప్పుడు వాడిని నంజుకుతింటా."
"సరే....ముందు ఇక్కడేమైనా తిందాం" అంది సరోజ.
ఆ డైలాగ్ కి నలుగురూ నవ్వారు.
ఆ ధాబాలో బటన్ నాన్, దాన్లోకి పనీర్ బటర్ మసాలా తెప్పించుకుని తిన్నారు నలుగురూ.
మరో మూడు రోజులపాటు రాంబాబు, చిన్నారావ్ లు దీపని స్కూల్ కి తీస్కెళ్ళి, తీస్కొచ్చే డ్యూటీ చేశారు.
