Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 39

                                                                సంతాప సభ
    సాయంత్రం ఆరు గంటలైంది.
    అక్కడ... ఆ కాలనీ కమ్యూనిటీ హాలు దగ్గర తెగ హడావిడిగా ఉంది.
    కారణం... అప్పుడక్కడ ఒక సంతాపసభ జరగబోతూంది. ప్రముఖ కవి అయోమయంశ్రీ ఆ ముందురోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు. అందుకనే ఆరోజు సాయంత్రం సంతాపసభ ఆ కమ్యూనిటీ హాల్లో పెట్టారు.
    ఆడవాళ్లు పట్టుచీరెలు కట్టుకుని హడావిడిగా తిరుగుతున్నారు. మరి ఇలాంటి సభలూ, సమావేశాలూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలలోనే కదా వారికున్న చీరలూ, నగలూ ప్రదర్శించే అవకాశం దొరికేది! దొరికిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నట్టున్నారు అక్కడికి వచ్చిన ఆడవాళ్లు.
    మగవాళ్లు కమ్యూనిటీ హాలు ముందు నిల్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ సిగరెట్టు పొగల్ని గాల్లో గుప్పుగుప్పుమని వదుల్తున్నారు.
    పిల్లలు కేరింతలు కొడ్తూ పరుగులు పెడ్తూ ఆడుకుంటున్నారు.
    "ప్రేక్షక మహాశయులారా...ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం మొదలు కాబోతోంది... దయచేసి అందరూ సీట్లలో కూర్చో ప్రార్థన..."
    మైక్ లో గరగరమంటూ ఓ గొంతు వినిపించింది.
    బయట నిలబడ్డ అందరూ మెల్లగా లోపలికి నడిచి సీట్లలో సర్దుకుని కూర్చున్నారు.
    అప్పటికే వక్తలు అందరూ వచ్చి ముందు వరసలో కూర్చునివున్నారు. స్టేజిమీద ఆ సభని ఆర్గనైజ్ చేస్తున్న పోన్నారావు హడావిడిగా అటూ ఇటూ తిరిగేస్తున్నాడు.స్టేజికి ఒక మూలగా ప్రముఖకవి, కీర్తిశేషులూ అయిన "అయోమయంశ్రీ'ఫోటో ఉంది.దానికి లావుపాటి దండవేసి ఉంది. ఫోటోకి అటూఇటూ దీపాలూ, అగరువత్తులూ ఉన్నాయ్.
    సభకి ఛీప్ గెస్ట్ గా మినిస్టర్ అబ్బన్నని పిల్చారు. ఆయనింకా రాలేదు.కాబట్టి కార్యక్రమం మొదలుబెట్టలేదు.
    మైక్ టెస్టింగ్...వన్, టూ, థ్రి... ఫోర్... హిహి... ఖళ్... ఖళ్... వినిపిస్తూందాండి..." జనాన్ని అడిగాడు.
    జనంలో సగంమంది వినిపిస్తుందన్నట్టుగా తలలు ఊపారు.
    జనాన్ని ఊర్కే కూర్చోబెడ్తే బాగుండదని మైకులో పాటలు వినిపించడం మొదలుబెట్టారు.
    "ఓసోసి నీ తప్పచెక్కా... నువ్ కాదంటే నీ అక్క నాపక్క...
    అహో ఓహో జిమ్మాడి
    అచ్చా డబ్బా లంబాడీ..."
    తర్వాత మరో సిన్మాపాట...
    "లటుకు చిటుకు చిటుకు లటుకు బంగారు మావా...
    మా యింటికొచ్చి తొంగోరా కంగార్ మావా..."
    "చివకు ఝనకు - ఝనకు చివకు చిన్నదానా...
    తొంగుంటే తొక్కేస్తా తొర్రీజాణ..."
    తర్వాత ఇంకో పాట... ఆ తర్వాత మరో పాట.
    అక్కడ హాల్లో ఉన్న కుర్రకారు పాటకి తగినట్టు హుషారుగా చప్పట్లు కొట్టసాగారు. ఒకరిద్దరు మరీ చలాకీగా ఉండే కుర్రాళ్లు విజిల్సు కూడా వేశారు.
    హఠాత్తుగా అక్కడ కలకలం చెలరేగింది.
    "మినిష్టర్ గారొచ్చేశారు... మినిష్టరు గారొచ్చేశారు" అంటూ కొన్ని గొంతులు హడావిడిగా పలికాయ్.
    మినిష్టర్ అబ్బన్న ఠీవిగా నడుచుకుంటూవచ్చి ముందువర్సలో కూర్చున్నాడు. కార్యక్రమం నిర్వాహకుడు పోన్నారావు చెంగున స్టేజిమీదకు దూకి మైకులో రెండుసార్లు దగ్గి, ఓసారి తుమ్మి మైకుని మూతిమీదికి లాక్కుని ఒకకాలు నిలువుగా పెట్టి మరోకాల్ని దూరంగా చాపి చెవి వెనకాల గోక్కుని "ప్రేక్షక మహాశయులారా... ఈ వేళ మనకి మహా పర్వదినం..." అని ఏదో గుర్తొచ్చి నాలుక్కొరుక్కుని..."అంటే అయోమయంశ్రీగారు పోయినందుకీ మాటలు అనడంలేదు... మహాపర్వదినం అని ఎందుకన్నానంటే ఈ సభకి పిలవంగానే కాదనకుండా మినిష్టర్ అబ్బన్నగారూ వచ్చేశారు..."
    అందరూ ధనాధనా చప్పట్లు కొట్టారు. కాస్త హుషారు ఎక్కువున్న వాళ్లు విజిల్సు వేశారు.
    "ఇంకొద్ది క్షణాల్లో సంతాప కార్యక్రమం మొదలవుతుంది... మొదటగా ఈనాటి ముఖ్యఅతిధి మినిష్టర్ అబ్బన్నగార్ని వేదికమీదికి ఆహ్వానిస్తున్నాము..." అన్నాడు వెనకాల గోక్కుంటూ పొన్నారావు.
    మినిష్టర్ అబ్బన్న ఠీవిగా స్టేజిమీదికి ఎక్కి మూలగావున్న ప్రముఖ కవి అయోమయంశ్రీ ఫోటోముందు నిల్చుని దానివంక దీనాతిదీనంగా చూసి, నాలుగు క్షణాల తర్వాత ముక్కు పొంగించి రెండుబొట్ల కన్నీరు కార్చి కండువాలో ముక్కు బర్రున చీది, ఆ తర్వాత ఫోటోకి ఓ నమస్కారం పారేసి వెనక్కి తిరిగి తనకి ఉద్దేశించిన సీట్లో కూర్చుని చిరునవ్వులు చిందించాడు.
    పొన్నారావు మిగతా వక్తల్ని కూడా ఒక్కొక్కరినే స్టేజిమీదకి ఆహ్వానించాడు. అందరూ మినిష్టర్ అబ్బన్న చేసినట్టుగానే చేశారు... అయోమయంశ్రీ  ఫోటోదగ్గర నిలబడి బాధపడ్డం ఆనక నవ్వుకుంటూ వెళ్లి సీట్లో కూర్చోవడం...
    అందర్నీ స్టేజి మీదికి ఆహ్వానించండం అయ్యాక "ఇప్పుడు ప్రముఖకవి అయోమయంశ్రీ గారి ఆత్మశాంతికై రెండు నిముషాలు మౌనం పాటిద్దాం..."అన్నాడు పొన్నారావు బుర్రకాయ్ గోక్కుని గోళ్లవంక చూస్కుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS