Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 39

    వెంటనే సరస్వతి ఓ చరణం అందుకుంది.
    "అందరికీ దీపావళి వెలుగులూ   
    మా గుండెల్లో ఎనలేని మూలుగులూ   
    ఆడదాని బ్రతుకులో చీకటుల
    ప్రతి ఆడదీ చిరిగిన అరిటాకే..."
    వీళ్ళిక్కడ పాడుతున్నారని ఎలా తెలిసిందో ఏమో అక్కడ జైల్లో గోపి నెక్స్టు చరణం అందుకున్నాడు జుట్టు పీక్కుంటూ.
    "ఆనాడు నరకుడు చచ్చెనులే
    అందరికీ దీపావళి వచ్చెనులే
    నేటి నరకాసురులు చచ్చునా?    మా బ్రతుకుల దీపావళి వచ్చునా?"
    పాట కాంగానే ముగ్గురూ మూడు రకాలుగా ఘొల్లుమన్నారు.
                                                                 32
    "బాబూ...." సరస్వతి మెల్లగా పిలిచింది.
    ఫైళ్ళలో దీక్షగా ఏదో రాసుకుంటున్న జైలరు తలపైకెత్తి చూశాడు.
    "ఏంటమ్మా? చూడ్డానికి దేవతలా వున్నావు! నువ్వీ జైలు చాయలకు ఎందుకొచ్చావమ్మా?" అప్యాయంగా అడిగాడు జైలరు.
    "అదంతా నా ఖర్మబాబూ - నా ఖర్మ" నుదుటిమీద కొట్టుకుంటూ అంది సరస్వతి.
    "అంతేనమ్మా... ఈ జీవితమే ఒక వింత నాటకరంగం - మనమంతా పాత్రధారులం. విధి ఏమ డైరెక్టర్ అమ్మా... విధి ఆడించినట్టల్లా మనం ఆడ్తాం. దేవతలాంటి నిన్ను ఇక్కడకు వెళ్ళమని విధి శాసించిందమ్మా..." అన్నాడు జైలరు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ.
    "వద్దుబాబూ! వద్దు ఇంకాఆపు! నేను భరించలేకుపోతున్నా..." కసిగా కొప్పుమీద గుద్దుకుంటూ అంది సరస్వతి.
    బిక్కచచ్చిన జైలర్" అలాగేనమ్మా, అలాగే. ఇంక కొప్పుమీద గుద్దుకోడం ఆపమ్మా.ఇప్పటినే చిన్నగా వుండే నీ కొప్పు పూరీలా అయిపోయింది" అన్నాడు.
    సరస్వతి కొప్పుమీద గుద్దుకోవడం ఆపి చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంది.
    'ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావమ్మా? అప్యాయంగా చూస్తూ అడిగాడు జైలరు.
    "ఇక్కడ మా అబ్బాయ్ గోపి వున్నాడు బాబూ. వాడిని చూసి పోదామని వచ్చాను"
    "ఆ? గోపీయా? గోపీ నీ కొడుకా అమ్మా? ఆహా అటువంటి కొడుకును కన్న నీ జన్మ ధన్యమైపోయిందమ్మా" రెండు ఆనందభాష్పాలు రాలుస్తూ అన్నాడు జైలరు.
    "అసలే బాధలతో నలిగిపోతున్న మాతో పరాచికాలు ఏంటిబాబూ" బాధపడ్తూ అంది సరస్వతి.
    "నేనేం వేళాకోళం ఆడట్లేదమ్మా. నిజంగానే అంటున్నా. గోపీని చూడగానే అనుకున్నానమ్మా అతను నర్దోషని! ఈ న్యాయస్థానానికి చెవులేగాని కళ్ళులేవమ్మా. లేకపోతే గోపీలాంటి వ్యక్తికి శిక్షపడడం ఏంటి? ఈ జైలుకంతటికీ గోపీయే దేవుడమ్మా" ఉద్వేగంతో అన్నాడు జైలరు.
    "బాబూ" వన్నాండాఫ్ ఆనందభాష్పాలు రాలుస్తూ సంతోషంగా అంది సరస్వతి.
    "గోపీ ఇక్కడికి వచ్చి వారంఅయినా అయ్యిందోలేదో ఇక్కడున్న ఖైదీలలో సగంమందిని మంచివాళ్ళుగా మర్చేశాడమ్మా"
    "బాబూ" ఈసారి టూఅండ్ హాఫ్ ఆనందభాష్పాలు రాల్చింది సరస్వతి.
    "ఈ విధి చాలా విచిత్రమైనదమ్మా. నువ్వేమో ఓ దేవతవి"
    "ఎందుకు బాబూ?" అడిగింది సరస్వతి.
    జైలరు ఓ క్షణం ఆలోచించి ఏమీ తట్టక చిరాకుపడిపోయాడు.
    "ఎందుకో ఒకందుకులేమ్మా... నువ్వు దేవతవి! అంతే. ఆ... ఏం చెప్తున్నాను? ఆ!... ఈ విధి చాలా విచిత్రమైనదమ్మా. నువ్వేమో ఓ దేవతవి! నీకు పుట్టిన బిద్దేమూ దేవుడు. కానీ, అతనిమీద ఓ ఘోరమైన హత్యానేరం మోపబడింది. కాబట్టి.... నేను చెప్పేదేంటంటే ఈ విధి ఆడే వింత చదరంగపుటెత్తులలో పావులుగా విధి వంచితులూ... అభాగ్యులూ..."
    జైలరు ఇంకా ఏదో చెప్పాబోతుండగా సరస్వతి గట్టిగా అరిచింది.
    "ఇంకాపు..."
    జైలరు నోర్మూస్కుని సరస్వతివంక తెల్లబోయి చూశాడు.
    నువ్విక విధిఆడే వింతనాటకాల గురించి చెప్పడం ఆపకపోతే నేను కొప్పుమీద మళ్ళీ గట్టిగా గుద్దుకుంటూ. అంతేబాబూ. తర్వాత నీ ఇష్టం" బెదిరిస్తూ అంది సరస్వతి.
    "వద్దమ్మా వద్దు. దేవతలాంటి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నేనిహ మాట్లాడనులే అమ్మా బాధపడ్తూ అన్నాడు జైలరు.
    "మరి మా అబ్బాయిని కలవడానికి నాకు పర్మిషనిస్తావా?-" పిడికిలి బిగించి కొప్పును కాస్తపైకి ఎత్తిపట్టి వుంచి అడిగింది సరస్వతి పళ్ళునూర్తూ.
    "అలాగేనమ్మా. అలాగేవెళ్ళు... గోపీతో నీ యిష్టం వచ్చింనంతసేపు మాట్లాడు" అన్నాడు జైలరు.
    సరస్వతి గోపి వున్న సెల్ దగ్గరకి వెళ్ళింది.
    సెల్ లో లూజ్ గా వున్న ఓ తెల్లనిక్కరూ దానిమీద గళ్ళగళ్ళ చొక్కా వేస్కుని వున్నాడు.
    "బాబూ" సరస్వతి వణికే గొంతుతో పిలిచింది.
    గోపి చటుక్కున వెనక్కితిరిగి తల్లిని చూశాడు. అతని మొహంలో చెప్పలేని ఆనందం.
    "అమ్మా!" గేదెలా భారంగా పలికాడు గోపి.
    "బాబూ" ఆనందంతో అరుస్తూ అంది సరస్వతి.
    ఇద్దరూ కటకటాల్లోంచి ఒకరిచేతుల్ని ఒకరు పట్టుకున్నారు.
    "ఎంత చిక్కిపోయావురా కన్నా" అంది సరస్వతి గోపిని క్రిందనుండి పైదాకా చూస్తూ.
    "చాల్లేవే. వేళాకోళం చేస్తున్నావా? చిక్కడం ఏంటి... నేను లావెక్కుతేనూ. నాకు ఈ జైలుతిండి బాగా పడిందమ్మా."
    "పోనీలే బాబూ. అంతా ఆ దేవుడిదయ"
    "సరేగానీ నువ్వు నన్ను జైలునుండి విడుదల చేయించడానికి ఆ రాయుడిని కలిశావా అమ్మా?" అడిగాడు గోపి.
    సరస్వతి తుళ్లిపడి గోపివంక చూసింది.
    "ఆ విషయం నీకెలా తెలుసు బాబూ?"
    "గూడెం మనిషొకడు వచ్చి చెప్పాడులే. చెప్పమ్మా. ఆ రాయుడిని కలిశావా? రాయుడు ఏమన్నాడూ?" కుతూహలంగా అడిగాడు గోపి.
    "ఆ రాయుడిని కలిశానుగానీ, ఆయనతో నీ విషయం ఏమీ మాట్లాడలేదు బాబూ. ఆయన మనపని చేయడు బాబూ" కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సరస్వతి.
    "నాకు తెలుసమ్మా. ఆ రాయుడు నాకోసం ఏమీ చేయడు - అతనికి నేనంటే పడదమ్మా"
    "అదికాదులే బాబూ... అసలు కారణం వేరేవుంది" కుమిలిపోతూ అంది సరస్వతి.
    "ఏంటమ్మా... ఏంటా అసలు కారణం?"
    "వద్దుబాబూ... వద్దు... భయంకరమైన ఆ నిజాన్ని నా నోటితో చెప్పించొద్దు బాబూ..." బేర్ ర్ మంది సరస్వతి.
    సరస్వతి ఇలా అనడంతో గోపీలోకూడా కుతూహలం పెరిగింది.
    "చెప్పమ్మా... ఏంటమ్మా ఆ కారణం?... చెప్పమ్మా చెప్పు" కటకటాల మధ్య నుండి చేతులను బయటికి దూర్చి సరస్వతి బుగ్గలు పిండేస్తూ అన్నాడు గోపి.
    "వద్దుబాబూ....వద్దు నన్ను ఏ వివరాలూ అడగొద్దు... ఉహు...ఉహు" కొంగు నోటికి అడ్డంపెట్టుకుంది సరస్వతి.
    "అమ్మా నువ్వు చెప్పకపోతే నామీద ఒట్టేనమ్మా" ఆవేశంగా అన్నాడు గోపి.
    "నాయనా" ఆక్రోశిస్తూ అంది సరస్వతి. "ఒట్టుతీసి గట్టుమీద పెట్టు నాయనా"
    నేను పెట్టనమ్మా... ఇంకా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు!" తీవ్రంగా అన్నాడు గోపి.
    అది వింటూనే సరస్వతి గగ్గోలు పెట్టింది.
    "ఎంతపని చేశావ్ బాబూ" అంది కేర్ బేర్ మంటూ.
    "చెప్పమ్మా చెప్పు! ఆ రహస్యమేంటో చెప్పు... నేను నీ కొడుకుని కానా అమ్మా. నాకుచెప్తే నష్టంఏంటమ్మా" సముదాయిస్తూ అన్నాడు గోపి.
    సరస్వతి ఓసారి దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుగాలికి గోపి క్రాఫు రేగిపోయింది.
    సరస్వతి గొంతు సవరించుకుని అంది " ఆ రాయుడు పరమనీచుడు బాబూ... పరమనీచుడు. వాడు శీలాన్ని నిలువునా దోచుకున్నాడు బాబూ..."
    అది వింటూనే గోపి జుట్టుపీక్కుంటూ భయంకరంగా అరిచాడు.
    "రాధా..."
    "రాయుడు నిలువునా శీలం దోచుకున్నది రాధదికాదు బాబూ - రాధది కాదు... ఆ నీచుడు నా శీలాన్ని దోచుకున్నాడు" గుడ్లనీరు కుక్కుకుంటూ అంది సరస్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS