Previous Page Next Page 
ఎండమావులు పేజి 39


    ఆలోచనలతో ఆమె కోమలమైన ముఖం ఎర్రబడి పోయి కళావిహీనమై పోయింది. నా పుట్టిన రోజుకు బావ నాకిచ్చిన బహుమానం ఇదా అని ఆమె హృదయం ఆక్రోశించింది. ఆమె స్మృతి పధంలో జయలక్ష్మి సర్వ లక్షణ శోభితమై ముగ్ధ మోహన సౌందర్యాతిశయంతో హొయలు వలక పోస్తున్నట్లుగా కనిపించింది.
    ఆ సోఫాలో అట్లాగే దిగాలు పడి కూర్చుండి పోయింది జ్యోతి. ఆ పరిస్థితిలో ఆమెను చూస్తూనే మళ్ళా బయటికి వెళ్ళి పోయాడు మురహరి-
    
                                                              28

    ఆ రోజున జయలక్ష్మి స్వాతితోబాటుగా వాళ్ళ ఇంటికే వెళ్ళింది. వాళ్ళు వెళ్ళే సరికి జానకిరాం వచ్చి ఉన్నాడు. విందు సందర్భంలో జరిగిన సంఘటనలతో స్వాతి మనస్సు బాగుండలేదు. అందుచేత జానకిరాంను ఎక్కువగా పలకరించలేకపోయింది. మామూలు కుశల ప్రశ్నలు వేయటం మినహా ఇంకేమీ మాట్లాడలేదు. స్వాతిని చూడగానే జానకిరాం తను గత నాలుగయిదు రోజుల్లోను ఎందుకు వూరు విడిచి చెప్పకుండా వెళ్ళిందీ చెపుదామనుకున్నాడు. తన మాటలేవీ స్వాతి వినేటట్లుగా లేకపోయేసరికి "మళ్ళీ వస్తానమ్మా వదినా" అంటూ వెళ్ళిపోయాడు.
    పెరటి తలుపులు తీసుకుని ఇద్దరూ వంటింట్లో కూర్చున్నారు స్వాతీ, జయలక్ష్మి.

 

                               
    "జయా వయస్సులో నీకన్నా పెద్దదాన్ని. జీవితంలో అనేక సంఘటనలకు తలొగ్గి అనుభవాలు పెట్టని కోటలుగా నిర్మించుకుని జీవిస్తున్న మీ పెద్ద వదినను, నా దగ్గర నీకేమీ దాపరికం లేదుకదూ" అన్నది స్వాతి.
    జయలక్ష్మి కళ్ళు జలజల కన్నీళ్ళను కార్చినయ్యి. ఆమె కన్నీళ్ళను తన పైట చెంగుతో తుడుస్తూ "ఏడుస్తున్నావా జయా, కొందరి ఆడవాళ్ళ జీవితాలు ఏడవటానికే ఏర్పడినయ్యి. నిజం చెప్పు జయా! నువ్వు మురహరిని ప్రేమిస్తున్నావా"
    "వదినా" అంటూ స్వాతి వళ్ళో తలపెట్టి రెండు చేతుల్తోనూ ముఖం కప్పేసుకుని బావురు మంది జయలక్ష్మి. ఎంతో అధైర్య పడిందానిలా కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది.
    ఈ ఏడుపు విని కృష్ణమూర్తి వచ్చాడు. కళ్ళతోనే సంజ్ఞచేసి అవతలకి వెళ్ళి పొమ్మంది స్వాతి. ఇలాంటి వారి జీవిత ఘోష వింటూంటే ఏ భావాలు స్ఫురించి ముఖంమీదనే ఏ మాట అంటారో అని స్వాతి భయం. కృష్ణ మూర్తి వెళ్ళిపోయాడు.
    కన్నీళ్ళతో తడిసిన జయలక్ష్మి ముఖాన్ని పైకెత్తి తన హృదయం మీదికి లాక్కుని చేత్తో తలనిమురుతూ ఓదార్చసాగింది స్వాతి.
    జడివాన కురిసి వెలిసినట్లుగా కన్నీటి ధారలు వాటంతట అవే ఆగి పోయినయ్యి. రోజంతా వాన కురిసి వెలిసిన శ్రావణ మాసపు నీలాకాశంలా ఉంది జయలక్ష్మి మనస్సు. ఆ ప్రశాంత వాతావరణంలో స్వాతి దరహాస వదనం తప్ప జయలక్ష్మికి ఇంకేమి కన్పించటం లేదు. ఆమె పరమేశ్వరి. తాను ఆమె భక్తురాలు అనుకుంది జయలక్ష్మి.
    "మురహరిని ప్రేమిస్తున్నాను వదినా. కొన్నాళ్ళుగా నా ప్రేమ పైకి పొంగలేదు. నాలోనే ఇమిడి పోయింది. నా మనస్సు తెల్సుకుని ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటాను జయా అన్నాడు మురహరి. నా జీవితంలో అంతకన్నా నేను ఆశించవలసిందేమీ లేదు. అదే జరిగితే నా జన్మ తరించి ధన్యత చెందినట్లే నీ ముందు ఏ అబద్ధమూ ఆడను వదినా. ఒక్క మాట. హద్దులు దాటి మేమెన్నడు ప్రవర్తించ లేదు" అన్నది జయలక్ష్మి.
    జీవితంలో ఆశించని భయంకర వేదనా, దుఃఖమూ, భయమూ ఒక్కసారి పదకొండేళ్ళ క్రితం స్వాతిలో కలిగినయ్యి. ట్రైనింగు చదువుకునే రోజుల్లో రాజేశ్వరి ఇంట్లో జరిగిన సంఘటన అది. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కలుగ లేదు. మళ్ళా ఈ నాడు అన్ని సంఘటిత శక్తులూ ఏకమైనట్లు అయింది. తుఫానులో చిక్కుకున్న ఓడలా ఉందామె మనస్సు.
    "జీవితంలో తెలీకుండా అనేక పొరబాట్లు చేస్తూంటాం జయా! దాని వల్ల మంచి జరిగినా చెడు జరిగినా మన జీవితానికి సంబంధించినదిగానే ఆ పర్యవసానం ఉండాలి గాని ఇతరుల్ని కష్ట పెట్టే దిగా ఉండకూడదు" అన్నది స్వాతి.
    "కాని ఏ మానవునికీ అట్లా అనిపించదు. స్వార్ధం కళ్ళు కప్పేస్తుంది. మనస్సును వశ పర్చుకుంటుంది. హృదయంలో స్థానం ఏర్పరచుకుంటుంది. నువ్వు అన్నయ్యను పెళ్ళి చేసుకున్నావు. అన్నయ్యకు తల్లిదండ్రులతో తెగ తెంపులయి పోయింది. ఇది మరీ నీ ధర్మ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది. ఇందుకేమంటావు వదినా" అన్నది జయలక్ష్మి.
    "నిప్పులో వేలు పెట్టాను కాలింది. నా చెయ్యి కాలిందని నేను తల్చుకున్నప్పుడు అదే పని ఇంకోళ్ళు చేస్తున్నప్పుడు చూస్తూ వూరుకోవటం భావ్యం కాదేమో జయా."
    ఇంతలో కృష్ణమూర్తి పిలవటంతో స్వాతి ముందు గదిలోకి వెళ్ళింది.
    జయలక్ష్మి మనస్సు విచిత్ర గతిలో జీవిత గ్రంధంలోని పుటలు తిరగవేస్తున్నది. మురహరితో తను ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మాట్లాడింది. ఆ మాటల్లో ఎప్పుడూ అతను జ్యోతి ప్రస్తావనే తీసుకురాలేదు. మేనమామ కూతుర్ని చేసుకునే పక్షంలో తమ ఇద్దరి స్నేహం అంత దూరం తీసుకు రాలేకపోయేవాడేమో? ఈ భావన ఆమె హృదయంలో చెంగున ఎగురుతూ ప్రవేశించే సరికి ఆమె కళ్ళు రెండూ విచిత్రంగా మెరిశాయి. ముఖంలో దేదీప్యమానమైన ఒక ఆశా జ్యోతి వెలిసినట్లుగా ముఖ కవలికలు మారినయ్యి. స్వాతి కృష్ణ మూర్తితో మాట్లాడి వచ్చేసరికి జయలక్ష్మి నవ్వుతూ ఆమె వైపు చూసింది.
    "వదినా. మురహరి జ్యోతిని ప్రేమిస్తున్నాడని ఆమెనే పెళ్ళి చేసుకో గోరుతున్నాడనీ నీకు బాగా తెలుసా"
    ఉక్కిరిబిక్కిరైంది స్వాతి. ఇలాంటి ప్రశ్నకు తను సమాధానం చెప్ప వలసి వస్తుందని ఆమె అనుకోలేదు. నిశ్చల భావంతో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది స్వాతి ఆమె మానసిక పరిధిలో ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకలేదు. ప్రశ్నను అవతలకు నెట్టి ఒక పెద్ద నవ్వు నవ్వింది స్వాతి. అది సంతోషపూర్వకమైన నవ్వుకాదు. నిర్జీవమైన నవ్వుకాదు. పరిహాస పూర్వకమైన నవ్వూకాదు. ఒక జటిల సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఇలాంటి సమస్యల్లో నేను పెద్దరికం వహించటమేమిటని నిర్లిప్తతా భావంతో నవ్విన నవ్వు అది. ఈ నవ్వు జయలక్ష్మి హృదయంలో పెనుగాలి లేపింది. ఈ గాలి దుమారం ఎప్పుడు సమసి పోతుందో ఆమె తేల్చుకోలేక స్వాతి ముఖంలోకి తేరిపార చూసింది.
    పైట చెంగుతో నవ్వు ఆపుకోటానికి ప్రయత్నిస్తూ "జయా, ఇంక ఇవ్వాళకు వెళ్ళిరా, కాలగతే నీ మనస్సును మార్చుతుంది" అన్నది.
    జయలక్ష్మి వెళ్ళింది.
    
                               *    *    *

    కూల్ డ్రింకు షాపులోనుంచి వస్తున్న జయలక్ష్మినీ, మురహరినీ తాసిల్దారు గారు జీపులో వెళుతూ చూశారు. వారిద్దరూ ఆయనను చూడలేదు. సాయంత్రం ఆరు గంటలు దాటినా ఇంకా వడగాల్పులు తగ్గనేలేదు. సినిమాకు వెళదామన్నాడు మురహరి. నది వద్దకు వెళ్ళి ఇసుకలో కూర్చుందామన్నది జయలక్ష్మి.
    ఇద్దరూ కృష్ణ వద్దకు వెళ్ళి కూర్చున్నారు.
    "జ్యోతి మీ మేనమామ కూతురనీ, ఆమె నిన్ను ప్రేమిస్తున్నదనీ నాకెప్పుడూ చెప్పలేదేం మురహరీ"
    ఈ మాటలు వ్యంగ్యంగా, ఎగతాళిగా ధ్వనించినయ్యి మురహరికి. ఆకస్మికంగా ఇక్కడకు వచ్చి సరదాగా ఆహ్లాదకరమైన కబుర్లు చెప్పకుండా జీవిత కోణాల్లోని అనవసరమైన ఒక మార్గాన్ని ఒక విభాగాన్ని వెలికి లాగి దాని నేదో సరిదిద్దే తీరున జయలక్ష్మి ఎందుకు మాట్లాడుతున్నదో అర్ధం కాలేదతనికి.
    "నేను జ్యోతిని ప్రేమించటంలేదు. ఏ సమయంలోనూ ఒక ఈడొచ్చిన పిల్లను గురించి నీతో మాట్లాడవలసిన సందర్భమూ, అవసరమూ నాకు ఇంతకు ముందెప్పుడూ కలగలేదు" అన్నాడు మురహరి ముభావకంగా. అతని కళ్ళు చెమ్మగిలినయ్యి. ఆనంద మాధుర్యంలో నిమగ్నమై ప్రేమతో ఎదురుగా కూర్చొని మాట్లాడవలసిన మురహరి కళ్ళల్లో ఆ కన్నీటిని చూసే సరికి జయలక్ష్మి త్రుళ్ళి పడింది.
    మళ్ళా వ్యధిత హృదయంతో అన్నాడు మురహరి.
    "జ్యోతి నన్ను ప్రేమిస్తున్నదని ఇదమిద్దంగా ఇప్పుడిప్పుడే తెల్సుకుంటున్నాను. ఆ పిల్ల ఎంతగా ప్రేమిస్తున్నదో, దానికి ద్విగుణీకృతమైన కోపంతో ఉన్నది మా అత్తయ్య. తమతో సరి తూగగల స్తోమత నాకు లేదని ఆవిడ దృఢ నమ్మకం. మా మావయ్య కూడా కూతురు పక్షమే. కాని నా మనస్సు మాత్రం జ్యోతియందు వీసమైనా మొగ్గటం లేదు. ఇంత కాలంగా నా మీద నువ్వు చూపుతున్న శ్రద్దా, ప్రేమ ఆదరాభిమానాలతో తలమున్కలుగా ఉన్నా నాకు జ్యోతిని గురించి ఆలోచించే అవుసరమే లేకపోయింది. నిజంగా జ్యోతి పిచ్చిపిల్ల. ఆ రకమైన సానుభూతి తప్ప ఆమె విషయంలో నేను ఆశించేదేమీ లేదు." అన్నాడు మురహరి.
    జయలక్ష్మి సిగ్గుతో నదివైపు చూస్తూ కూర్చుంది. చల్లగాలికి రెపరెపలాడుతూ ముఖాన నాట్యం చేసే ఆమె ముంగురులను విచిత్రాను భూతుల్తో చూస్తున్నాడు మురహరి. విశాఖ పట్నంలో ఉన్న జయలక్ష్మి ముఖంలోనూ, ఇప్పటి జయలక్ష్మి ముఖంలోనూ ఏదో తేడా ఉన్నట్లుగా తోచిందతనికి.
    "జయా"
    ఇటు తిరిగి చూసింది.
    "నీలో ఈ సందేహాలు ఎందుకు కలిగినయ్యి. సందేహరహితమైన నా సమాధానం వినగానే నీలో ఏదో తెలీని ఆనందం దోబూచు లాడుతున్నట్లుగా నాకు కనబడుచున్నది. నేను జ్యోతిని పెళ్ళి చేసుకోవచ్చునని అంచనా వేసుకున్నావు కదూ."
    "మేనరికం చేసుకోటంలో తప్పేముంది. ఆమె కన్య. అభమూ శుభమూ తెలియని అమాయకురాలు. నిన్ను నమ్ముకుంది. బావనే పెళ్ళి చేసుకోవాలనుకుంది. నా సంగతి వేరు, నేను వితంతువును నన్ను చేసుకోటానికి పెద్దలు వప్పుకోక పోవచ్చు. ప్రేమ అనేది పెన్నిధిలాంటిది కాదు. సాంఘిక కట్టుబాట్లు, విలువలూ, మర్యాదలూ ఇవే పెన్నిధి లాంటివి. జ్యోతిని చేసుకుంటే నీకు విలువ, మర్యాద ఎక్కువవుతుంది. తాసిల్దారుగారి అల్లుడవుతావు. జ్యోతిలో ఏం చూసి నువ్వు ఆ పిల్లను ప్రేమించలేక పోతున్నావో నాకు తెలీటం లేదు. నన్ను చేసుకుంటే సంఘసంస్కరణ వివాహం చేసుకున్న వాడివవుతావు. అంత మాత్రం చేత నీ గౌరవ ఇనుమడించదు" అన్నది జయలక్ష్మి. ఆమె ముఖంలోని విషాదరేఖలు నిగ్గు తేలి, మేఘాలుగా మారి వర్షించినయ్యి.
    "జయా" అంటూ ఒక్క అరుపు అరిచి ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆమె బావురుమని ఏడవసాగింది.
    "ఏమిటిది జయా ఎవరేమన్నారు? నీలో అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుక్కలిగింది? స్వాతి ఏమైనా అన్నదా"
    ముభావకంగా అతని ముఖంలోకి చూసింది.
    "అవును ఎందుకు అనదు? తన జీవితాన్ని ఒడుదుడుకులు లేకుండా గడుపుతున్న పతితురాలు. ఎన్ని కబుర్లయినా చెపుతుంది. ఆమె జీవితం కోసం కృష్ణమూర్తిని బలిపెట్టింది. ఆ పుణ్యాత్ముడు తల్లిదండ్రులకు దూరమై గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈవిడ నాకు హితోక్తులు చెప్పబూనిందా, చాలు ఇక స్వాతి విషయం చెప్పకు" అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు మురహరి. ఆమె ముఖం వాడిపోయింది. విశాఖ పట్నంలో ఉన్నంత వరకూ ఆమె హృదయం మురహరి విషయంలో ఒడ్డులు ఒరుసుకుని ప్రవహించే గంభీరమైన మహా నదిలా ఉన్నది. ఇక్కడికి వచ్చింతరువాత ఆ నదీ ప్రవాహపు వేగం కొంత తగ్గింది. ఇప్పుడు వైశాఘ మాసపు కృష్ణా నదిలా బక్క చిక్కింది. ముఖంలో మాత్రం శ్రావణ మాసపు మేఘాలు ద్యోతకమౌతూనే ఉన్నయ్యి. నిన్నటినుంచి ఆమె మనస్సు దారీ తెన్నూ లేని సాంధుని పాదయాత్రలా ఉన్నది. గమ్యం ఎక్కడకో తెలియదు. అసలు గమ్యస్థానం ఎప్పుడు చేరునో కూడా తెలీదు.
    కన్నీటి చారికలతో తడిసిన ఆమె చెక్కిళ్ళను తుడుస్తున్న మురహరికి ఏదో అనిర్వచనీయమైన, బలీయమైన తీవ్ర వాంఛ శరీరంలో సుళ్ళు తిరిగింది. ఉద్రేకం అంచులు తట్టింది. అప్రయత్నంగా ఆమెను హృదయానికి హత్తుకుని తన పెదవులతో ఆమె చెక్కిళ్ళను స్ప్రుశించాడు.
    తోక తొక్కిన త్రాచులా లేచి నిల్చుంది జయలక్ష్మి. నిలువెల్లా కంపించి పోతున్నది ఆమె శరీరం. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు బుస కొడుతున్నట్లుగా ఉన్నయ్యి. వళ్ళు తెలియని కోపంతో కృద్దురాలై పోయింది.
    "మురహరీ ఇదా నీ కోరిక. జాగ్రత్త! హృదయ మిచ్చిన స్త్రీలతో మమతలు తీర్చుకోటంతో సరిపోదు. ఆ మమతను శాశ్వతంగా నిలుపుకో కలిగినవాడే అది గౌరవ ప్రదమైన జీవితమవుతుంది. మానసిక వ్యధతో కుమిలి పోయె స్త్రీ హృదయం అర్ధం చేసుకోటానికి ఇది సరైన మార్గమనుకుంటే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లవుతుంది. శలవు." అంటూనే వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS