Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 39


    మా నాన్నగారు నన్నెంత ముద్దుగా పెంచినా నన్ను మంచి క్రమశిక్షణలోనూ, కట్టుదిట్టంలోనూ పెంచారు. ఆయన దగ్గిర ఎంత చనువుండేదో అంత భయమూ వుండేది. ఆ యింటిలో ఆయన చెప్పింది కాదనే సాహసం యెవరికీ లేదు. ఆయన విగ్రహం లాగే ఆయన మనసూ గంభీరమయింది. మాట తొణకని మనిషి ఏదన్నా నిర్ణయంచేస్తే అది యెంత కష్టమయినా జరిపించే రకం మనిషి. ఆయనకి ఏ విషయం లోనూ సలహా యిచ్చే అవకాశం అమ్మకి కూడా యెప్పుడూ లేదు.
    "మా అమ్మ.....మా అమ్మని చూశావుగా....యీ వయసులో కూడా ఇంత అందంగా వుందంటే వయసులో ఎలావుండేదో ఊహించు. అమ్మ చాల బీద కుటుంబం నించి వచ్చింది. తాతయ్య స్కూలు మేష్టరు, ఆరుగురు సంతానం. అమ్మ ఆఖరిపిల్ల, ఉన్నడబ్బు, ఇల్లు, వాకిలి ముందున్న పిల్ల పెళ్ళిళ్ళకి చదువులకి ఆఖరయ్యాయి. అమ్మ వేళకి వచ్చేసరికి ఆ పిల్ల పెళ్ళి చెయ్యడం గగనమై అమ్మ చాలారోజులవరకు పెళ్ళి కాకుండా వుండిపోయింది. ఆ రోజుల్లో పందొమ్మిది యిరవై ఏళ్ళపిల్ల పెళ్ళికాకుండా వుండడం అంటే తల్లితండ్రులకు తల కొట్టేసినట్లుండేదిట. ఊళ్ళో అందరూ వెలేసినట్లుచూసేవారట. ఏరెండోపెళ్ళో మూడోపెళ్ళి వాడికో ఇచ్చి వదుల్చుకుందా మనుకున్నారట. అలాంటి స్థితిలో మా నాన్న అమ్మని చూశారట. ఆయన ఆఖరి సంవత్సరం బి.ఎల్. చదువుతూ, ఆయన ఆప్తమిత్రుడితో కలిసి ఓసారి శెలవలకి వాళ్ళ వూరు వెళ్ళారుట సరదాగా నాలుగురోజులు గడపడానికి. ఆ స్నేహితుని యింటిప్రక్కన వున్న మేష్టారి కూతురుని చూసి ఆమె అందానికి మొదటి చూపులోనే ఆకర్షితులయ్యారుట. స్నేహితునిద్వారా వివరాలు తెలుసుకుని జాలిపడ్డారట. ఆమె అందాన్నిచూసి చేసుకోవచ్చు. వెధవ డబ్బు ఎందుకు అన్న ఆలోచన వచ్చి స్నేహితునికి మనసు విప్పిచెప్పారట. నాన్నలాంటి గొప్పింటివాడు, చదువుకున్నవాడు తన కూతుర్ని పెళ్ళాడుతా ననేసరికి తాతయ్య ఆనందంతో నోట మాటరాక ఏడ్చేశాడట. ఎంతో దురదృష్ట వంతురలనుకున్న కూతురికి అంత అదృష్టం పట్టబోతున్నదంటే వాళ్ళందరూ కృతజ్ఞతతో నాన్న కాళ్ళమీద పడిపోయారుట. నాన్నకి తండ్రి లేరు. తల్లివుంది. సంప్రదాయం, అందవున్న పిల్లని డబ్బులేని కారణంగా కోడలుగా చేసుకోకపోవడానికి ఆవిడేం పెద్ద అభ్యంతరం చెప్పలేదు. మరి రెండు నెలల్లోనే అమ్మని పెండ్లిచేసుకున్నారు నాన్న. నాన్న ఆస్థి, అంతస్థులకి అమ్మ తరపు వాళ్ళందరూ అబ్బురపడిపోయారు. అల్లుడంటే ఎక్కడినించో దిగివచ్చిన దేముడన్నట్టు భయంగా, ఆయన నోట ఏం మాట వస్తుందో నన్నట్టు హడిలిపోతూ మెలిగే వారట.
    "నాన్నకి ముందునించి అమ్మ ఇంటివారంటే చాలా చిన్నచూపు. దానికి కారణం ఆయనకున్న డబ్బే! ఏదో నీ అందం చూసి పెళ్ళాడాను కానీ లేకపోతే మీ యింటివాళ్ళు నా యింటి గుమ్మంలో అడుగు పెట్టడానికికూడా అర్హులుకారు' అంటూ పెళ్ళయిన క్రొత్తలో హాస్యంగా ఏడిపించేవారట! ఆ తర్వాత ఆ మాటలు నిజంగానే అంటూ ఏడిపించేవారట. సమయం, సందర్భం లేకుండా ఏదో వంకతో అమ్మ లేమిని దెప్పుతూండేవారట. అమ్మ ఏమనగలదు! నాన్నలాంటి వాడు తనని పెళ్ళాడడమే తన మహాభాగ్యం అనుకునే అమ్మ, నాన్నని ఏమని ఎదిరించగలదు-కాదనగలదు! తన వాళ్ళని కించ పరుస్తుంటే మనసులో బాధ పడడం మినహా ఏం అనలేని స్థితి అమ్మది.
    "ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే -మాబావ-ఆనంద్.....అంటే మా అమ్మకి అన్నయ్య కొడుకు అన్న మాట! బావమీద ముందునించి మా నాన్నకి సదభిప్రాయం లేదని చెప్పడానికి. బావ తండ్రి ఏదో ఆఫీసులో గుమాస్తా, బావ పుట్టిన రెండేళ్ళకి మామయ్య చచ్చిపోయాడు. పాపం అతని తల్లి నానా అవస్థలు పడి కొడుకుని పెంచింది. ఆదుకోడానికి అటు పుట్టినింట, ఇటు మెట్టినింట అందరూ పూట గడవని వారే! ఎవరూ తల్లీకొడుకుల బాధ్యత, భారం చేపట్టలేని వారే! వాళ్ళందరిలోకి నాన్న ఒక్కరే కలిగినవారు. వదినగారి అవస్థలు చూస్తూ కూడా ఏ విధంగానూ సహాయం చెయ్యలేని నిస్సహాయురాలు అమ్మ పాపం ఆవిడ ఎక్కడో వంటలు చేస్తూ కొడుకుని పదిహేనేళ్ళు పెంచింది. ఆ దిక్కూలేకుండా బావని వంటరి చేసి బావకి పదిహేనేళ్ళప్పుడు చచ్చిపోయింది తల్లి. అక్కడనించి పినతండ్రులు, మేనత్తలు - వాళ్ళింట్లో వీళ్ళింట్లో వుంటూ, వాళ్ళు చాకిరి చేయించుకుని విసుక్కుంటూ కసురుకుంటూ పడేసిన తిండి తింటూ, దిక్కులేని వాడిలా బ్రతకడం అమ్మ సహించలేక పోయింది. పదిమందికి పెట్టగలిగిన స్తోమత వుండీ దిక్కులేని అన్న కొడుక్కి యింత అన్నం పెట్టలేక పోతున్నందుకు అమ్మ బాధ పడిపోతూండేది. కాని నాన్నతో ఆ విషయం మాట్లాడే ధైర్యం, సాహసం చెయ్యలేక పోతోంది. అప్పుడప్పుడు బావని గురించి చెప్తూ నా దగ్గిర కంట తడి పెట్టుకునేది. నేనింకా అప్పుడు చిన్నపిల్లని అంటే పదమూడుపధ్నాలుగేళ్ళుంటాయి. బావకంటే సంవత్సరం, సంవత్సరన్నర మాత్రం చిన్న దాన్ని. పరిస్థితులు పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా అమ్మ బాధ పడ్తూంటే బావని తీసుకొస్తానని నాన్నతో చెప్పకూడదమ్మా, అంత భయం ఎందుకు?' అంటూ అమ్మని ఓదారుస్తూ దబాయింపుగా మాట్లాడే దాన్ని.
    'నీకు తెలియదమ్మా, మీ నాన్నగారికి మా వాళ్ళంటే యెంత చిన్న చూపో......అలాంటి దిక్కు, మొక్కు లేనివాడిని యింట్లో తెచ్చి పెట్టుకోడానికి మీ నాన్నగారికేం అవసరం, వప్పుకోరమ్మా' అనేది దీనంగా.
    'అడిగి చూడమ్మా, బావ వుంటే నాకూ తోడుగా వుంటుంది. ఇంట్లో ఒక్కర్తినే తోచడం లేదమ్మా......బావ వుంటే చక్కగా ఇద్దరం కలిసి చదువుకుంటాం-పోనీ, నాన్నని నే నడగనా? అన్నాను.
    అమ్మ సందేహిస్తూ 'నీచేత అడిగించాననుకొని కోపగిస్తారేమో' అంది.
    ఫరవాలేదు నీ కెందుకు, నాన్నని నేను వప్పిస్తాగా.......
    'వద్దమ్మా, ఏదో సమయం చూసి నెమ్మదిగా నేనే అడుగుతాను. అప్పుడు కావలిస్తే నీవూ చెపుదువు గాని. నీవు చెప్పావనన్నా మీ నాన్న వప్పుకుంటారేమో' అంది ఆశగా అమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS