Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 39

 

    "ఉండండి బాబులూ?" అంటూ వాళ్ళ బారి నుండి సూట్ కేసును రక్షించడానికి ప్రయత్నించాను. లాగుతున్న వాళ్ళు వదిలేసి నిలబడ్డారు. కాని పెట్టె మీద కూర్చున్న వాళ్ళు మాత్రం ససేమిరా దిగలేదు. అంతలో అంతకు ముందు కన్పించిన అమ్మాయి శారద దేవతలా వచ్చి నన్ను ఆదుకొంది. పెట్టె మీద నిలబడ్డ బుడ్డోన్నీ ఒక తీత తీసి, కూర్చున్న బుడ్డదాన్ని లాగి కిందకు గుంజేసింది. ఆ అమ్మాయీ , నేనూ కలిసి సి.ఆర్. పి. వాడి దెబ్బలకు చతికిలబడిన సత్యాగ్రహిలా వున్న నా సూట్ కేసును మళ్ళీ నా గదిలోకి చేరవేశాం. ఆ స్థితిలో వున్న నా కొత్త లెదర్ సూట్ కేసును చూస్తుంటే నా గుండె చెరువయింది. ఎలాగో తమాయించుకొని పెట్టె తెరిచాను. చీరా, బ్లౌజ్ పీస్ తీసి శారదకు ఇచ్చాను. దాని ఆనందానికి అవధుల్లేవ్!
    "అమ్మా! అక్కయ్య నాకు చీర తెచ్చిందే ?" అంటూ కేరింతలు కొడ్తూ పెరుగేత్తింది.
    ముఖం కడుక్కుందామని బాస్కెట్ వెతికాను. బాస్కెట్ గదిలో ఓ మూలకు లాగి వుంది. అందులో వన్నీ చిందర వందరగా పడి వున్నాయి. బ్రష్ కన్పించలేదు. పేస్ట్ ట్యూబ్ చితికిపోయి వుంది. అందులో నుంచి బయట కొచ్చిన పేస్టు దువ్వేనకూ , పౌడర్ డబ్బాకూ అతుక్కు పోయి వుంది. అలాగే నలిగిపోయిన ట్యూబ్ ను పట్టుకొని బయటకు వచ్చాను.
    ఎదురుగా పిన్నీ వచ్చి "ఏమిటమ్మా వెతుకుతున్నావ్? మాయదారి పిల్లలు ఏదీ ఒక్కచోట ఉండనివ్వరు." అంది.  
    "బ్రష్ కనపట్టం లేదు పీన్నీ!" అన్నాను.
    "ఒసేయ్ ! బేబీ ! అక్కయ్య బ్రష్ కనపట్టంలేదట! ఆ గజ్జిగాడు తీశాడేమో చూడవే ?" అని పిన్ని కేకవేసింది.
    అరడజను మంది యోదుల్లా బయలుదేరారు. మంచం కింద దాక్కుని ఉన్న గజ్జిగాడ్ని వెతికి బయటికి లాగారు. వాడి చేతిలో బ్రష్ నలిగి మురిగ్గా అసహ్యంగా వుంది. పిన్ని వాడికి రెండు తగిలించి బ్రష్ లాక్కుని శారదా అని కేకవేసింది. కొద్ది క్షణాల్లో ఓ పెద్ద నాపసానిలా ఉన్న అమ్మాయి వచ్చింది.
    "అక్కయ్య నేను గుర్తున్నానా?" అంటూ నన్ను పలకరించింది. నాకు మతి పోయినంత పనయింది. ఈ పిల్లా శారదా? శారద కేసి పరీక్షగా చూసాను . గర్బిణీతో ఉంది. మనిషిలో నిండుతనం, పెద్ద తనం కన్పించాయి.
    "ఏమిటమ్మా అలా చూస్తావ్? శారదను గుర్తుపట్టలేదా ? మా తమ్ముడి కొచ్చ్జి చేశాం. దానికి ఏడోనెల! కాన్పుకు వచ్చింది !" అన్నది తులశమ్మ పిన్ని.
    "ఆఁ ! ఎందుకు గుర్తుపట్టలా? పట్టాను !" అంటుండగానే నేను "శారద అనుకున్న పిల్ల వచ్చింది కొత్త చీర సింగారించుకొని.
    "అక్కయ్యా ఈ చీర నాకెలా వుంది ?" అంది సిగ్గుపడుతూ. "పెళ్ళి కూతురిలా వున్నావు' అన్నాను.
    "ఫో! అక్కయ్య" అంటూ అక్కడ నుంచి తుర్రున పారిపోతున్న కూతురితో ముసిముసిగా నవ్వుతూ పిన్ని అంది. "అదేమిటే నీరదా! అప్పుడే కొత్త చీర కట్టావ్? అక్కయ్యా నువ్వు ఒక్కసారే కట్టుకొని నాన్నగారికి చూపిస్తే సంతోషపడేవారుగా?"
    నేను గతుక్కుమన్నాను. ఇది నీరదా? నేను తెచ్చింది ఒక్కటే చీర. పెద్దదానికి తప్పకుండా తెచ్చి వుంటానని పిన్ని అభిప్రాయం. అది సహజమే కదా!
    "అక్కా! శారదక్కయ్యకు తెచ్చిన చీర చూపెట్టవూ!" అంటూ నీరద నా చెయ్యి పట్టుకొని గుంజింది.
    "ఉండండర్రా మీరు! అమ్మాయిని మొహం కడుక్కోనివ్వండి . టిఫెన్ కూడా అరిపోతుంటేను!" అని పిన్ని అప్పటి గండాన్ని వాయిదా వేసింది.
    బాత్ రూంలోంచి ముహం కడుక్కొని బయటికి వస్తుంటే అంతకుముందు చూడని ముఖాలు రెండు ప్రత్యక్షమైనాయి.
    కాఫీ తాగుతుంటే నూనూగు మీసాలవాడు ఒకడు వచ్చి "అక్కయ్యా బాగున్నావా?" అని అడిగాడు.
    వాడే వెంకూ - అదే వెంకట్రావు అనుకున్నాను. మళ్ళీ అనుమానం వచ్చింది. వీడి వాడి తమ్ముడు కాదు కదా? ఇంతలోనే ఓణీ వేసుకొన్నది వచ్చి నా చేతిలోని ఖాళీ గ్లాసు అందుకొని చక్కా పోయింది. అయితే ఇంతకూ ఎంతమంది? లోలోపల గుణించుకొన్నాను. ఓసారి ఏడూ మరోసారి తొమ్మిది శాల్తీలు తెలినాయ్!
    "ఏమేయ్ ! నీరదా ? చంటోడికి స్నానం చేయించాలి! ఎండేక్కి పోతుంది. వేడినీళ్ళు పెట్టి నలుగుపిండి పెట్టు!" అని వంట గదిలో నుంచి పిన్ని కేక వినబడింది.
    అంటే తొమ్మిదీ ప్లస్ ఒకటన్నమాట!
    "ముందు రామలక్ష్మగాళ్ళకు చేయించవే! చంటోడికి తర్వాత చూద్దాం!" అన్నది శారద.
    చచ్చాం! మధ్యలో ఈ రామలక్ష్మణుగాళ్ళేవరు?
    సాలెగూడులోని దారాల్లా నాకీ పిల్లల లెక్క తేలటం లేదు.
    పిన్ని చీర కుచ్చిళ్ళు దోపుకొని తయారయింది పిల్లలకు స్నానాలు చేయించటానికి.
    "పిన్నీ! ఇంతకూ ఎంతమంది?" చిన్నగా నా సందేహాన్ని జార విడిచాను.
    పిన్ని పళ్ళన్నీ బయట పడేసి ఆనందంగా నవ్వింది. "కుచేల సంతానమమ్మా! కుచేల సంతానం!" అని మార్షల్లా నిలబడి అందర్నీ --  ఉసేయిల్నీ- ఉరేయిల్నీ -- పేరు పేరున పిలిచి పెరేడ్ చేయించింది . ఐదు నిమిషాల్లో పిల్లలతో హాలంతా నిండిపోయింది.
    "ఇది నీరద, అదిమంగా , ఇదిగో ఇదేమో పాప! వాడు రాఘవ, వీడు చంద్రం, వాడు చలం, అది మంగీ , వీడు గజ్జిగాడు . అదిగో అది బేబి -- సరే అది శారద నీకు తెలుసు . ఒరేయ్ వెంకూ ? అన్నట్లు వాడేడీ?" అంటూ వెంకూ కోసం పిన్ని కళ్ళు హాలంతా వెతకసాగాయి.
    రెండు నిముషాల్లో వెంకట్రావోచ్చాడు. బారుగా సన్నగా వున్నాడు. వాడు వయసుకు మించి పెరిగినట్టున్నాడు. చేతిలో సంచుల్ని దించి పెడుతూ "అక్కయ్యా , నాన్నగారూ కులాసాగా వున్నారా ?" అన్నాడు.
    ఇంతలో పిన్నికి ఏదో సందేహం వచ్చినట్లు "ఒరేయ్! వాడేడిరా వెంకూ ?" అన్నది.
    అందరూ వెతికి బొగ్గుల బస్తా చాటు నుంచి నాలుగేళ్ళ వాడ్ని ఒహడ్ని వెతికి తీసుకొచ్చారు. పిన్ని వాడిముఖాన ఉన్న మసిని పమిట చెంగుతో తుడుస్తూ "వీడి తర్వాత వాళ్ళిద్దరూ కవలలు -- రాముడూ ------- లక్షణుడు!" అన్నది.
    నీరదా, బేబీ కవల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిల్చున్నారు.
    "అదుగో ఆ చంటోడెమో శారద కొడుకు !" పిన్ని చెప్పుకు పోతూ వుంటే చేతి వేళ్ళను మడుస్తూ లేక్కవేశాను. రెండు చేతివేళ్లూ పూర్తయ్యాక ఇహ లెక్క వేయడం మానేశాను.
    ఇంత చిన్న ఇంట్లో ఇంతమంది ఎలా వుంటున్నారు? సంతానం గారి జీతమెంత? ఇంతమందితో ఈ సంసారాన్ని ఎలా ఈదుకొస్తున్నారు? నా ఆలోచన తెగక ముందే సంతానం గారు కూరల సంచులు మోసుకొని వచ్చారు.
    "కాఫీ అయిందమ్మా?" అని పలకరించి "తులసీ త్వరగా బాత్ రూం శుభ్రం చేయించు! అమ్మాయికి స్నానానికి ఆలస్యమయిపోవడంలా?" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS