జట్కావచ్చి పిక్చెరుప్యాలెస్ ముందు ఆగింది. వరూధిని భర్తకేసి దిగమన్నట్టు చూసింది. బండిదిగబోతూ "ఇక్కడా డాక్టరమ్మ వుండేది?" అన్నాడు వెంకటపతి ఆశ్చర్యపోతూ. భర్త అమాయకత్వానికీ వరూధినికి కోపం వచ్చిందో, జాలివేసిందో చెప్పడం కష్టం. ముఖంలోవచ్చిన మార్పును వెంటనే అణచివేసుకొని అన్నది:
"అబ్బ! ముందు దిగండీ!"
వెంకటపతి ఎగిరి రోడ్డుమీదకు దూకాడు. ఎడంకాలి హాఫ్ షూ జారి జట్కాకింద పడింది. వంగి జట్కాకిందదూరి షూ అందుకుంటున్న భర్తను చూసిన వరూధిని ముఖం మాడిపోయింది. జట్కావాడికి డబ్బులిచ్చి వయ్యారంగా బుకింగ్ ఆఫీసు పక్కకొచ్చి నిలబడింది. సినిమాహాలుమీద కట్టివున్న పెద్దబేనరు చూస్తూ భార్యపక్కన నిలబడ్డాడు భర్త. వెంకటపతి పోస్టర్ మీదవున్న రంగురంగుల, స్త్రీల ఆకారాలను చూసి విస్తుబోయాడు. అక్షరాలు కలబలుక్కుని చదివాడు.
"జగదేకసుందరి."
"ఇదేం సినీమా! తెలుగేనా?" అడిగాడు వెంకటపతి, ఇంకా వరూధిని తన పక్కనే వుందనుకొంటూ.
ఆకుపచ్చ టిక్కెట్లు రెండు చేత్తోపట్టుకొని అంతదూరంనుంచే భర్తకు సైగచేసింది వరూథిని.
స్పెషల్ క్లాసులో వరూధిని పక్కన కూర్చొని వెంకటపతి తల తిప్పుతూ హాలంతా కలియచూడసాగాడు;.
"అట్లా వెనక్కి తిరిగీ, పక్కలకు తిరిగీ చూడకూడదు." వరూధిని సన్నగా నొక్కి నొక్కి అంది.
"నాకూ తెలుసులే! ముందేగా బొమ్మపడేది!" అన్నాడు వెంకటపతి.
"సరేలెండి! ముందు సరిగా కూర్చోండి." చిరాకుగా కప్పిపుచ్చుకుంటూ అంది వరూధిని.
ఇంటర్ వెల్ లో వెంకటపతి లేచి బయటకు వెళ్ళాడు. కాసేపు బయటతిరిగి, లైట్స్ ఆఫ్ అవబోతుండగా వచ్చి భార్యపక్కన కూర్చున్నాడు.
తెరమీద సబ్బులూ-ఇంకా-ఇది చూడండి-అది తినండి-ఇదే వాడండీ' అనే ప్రకటనలు కన్పిస్తుండగానే, ఓ కుర్రాడు రెండు కూల్ డ్రింక్స్ తెచ్చి, అతివినయంగా వంగి వరూథినికీ, వెంకటపతికీ ఇచ్చాడు. వరూధిని భర్తకేసి ఆనందంగా చూసింది. పరవాలేదే! కూల్ డ్రింక్స్ ఆర్డరిచ్చి వచ్చాడు. మనిషి త్రోవలో పడుతున్నాడు. చల్లటి ద్రాక్షరసం గొంతులోపడి హాయినిస్తుంటే, వరూధిని బుర్రకు హాయిగొలిపే ఆలోచనలు వస్తున్నాయి.
"నాకెందుకూ ఇది? ఇది కూడా నువ్వే తాగు!" గ్లాసు వరూధిని చేతికి అందించబోయాడు వెంకటపతి. గ్లాసు తొణికి రంగునీళ్ళు అతని బట్టలమీదా, వరూధిని చీరమీదా పడ్డాయి.
"ఛీ! ఛీ! ఏమిటా పట్టుకోవటం? తాగండి!"
"దీని ఖరీదెంత? ఇంత చల్లగా వుంటే ఎట్టా తాగడం!"
"మరయితే ఎందుకు తెప్పించారు?"
"నాకేం తెలుసు? నువ్వె తెప్పించావనుకొన్నానే?"
అంతలో కుర్రాడు వచ్చి గ్లాసులకోసం వంగి నిలబడ్డాడు. వెంకటపతి మంచి నీళ్ళు తాగినట్లు గ్లాసెడురసమూ ఒక్కసారి గుటకేశాడు. వరూధిని భర్త చేతిలో గ్లాసు తీసుకొని కుర్రాడి కిచ్చి వ్యానిటీబ్యాగ్ తెరిచి ఐదురూపాయల నోటు తీసింది.
"వద్దండీ అమ్మగారూ?" డబ్బు తీసుకోకుండా అన్నాడు కుర్రాడు.
"అదేమిటీ?" కలవరపడింది వరూధిని.
"అయ్యగారు పంపించారమ్మా!"
"ఎవరూ?"
"బాబుగారు."
"ఏ బాబూ?"
"ఆడ నిలబడ్డారు చూడండీ, అరే! రామనాధబాబుగారు! ఓనరుగారు!"
కుర్రాడు గ్లాసులు తీసుకొని వెళ్ళిపోయాడు.
వరూధిని తలపక్కకు తిప్పిచూసింది. రిజర్వుడు క్లాసుగేటులో థియేటరు ఓనర్ రామనాథ్ బాబు నిలబడివున్నాడు. వరూథిన్ని చూడనట్టే చూశాడు. లైట్లు ఆఫ్ అయినై. ఇంటర్వెల్ తర్వాత కథ మొదలైంది.
"డబ్బులు తీసుకోలేదేం?" అడిగాడు వెంకటపతి.
వరూధిని వినిపించుకోనట్లు సినిమా చూడసాగింది.
వెంకటపతి మళ్ళీ అన్నాడు - "ఊరికే ఎందుకిస్తారూ?"
"అందరికీ ఇస్తారేం?" అన్నది వరూధిని.
"మన కెందుకిచ్చారూ?"
"మాకు దూరపుచుట్టాల్లే వాళ్ళు!" వరూధిని ఠపీమని సమాధానం చెప్పింది. వెంకటపతి సందేహంతీరి సినిమా చూడసాగాడు.
సినిమాహాల్లోంచి వరూధిని భర్తతో బయటికి వచ్చేసరికి కూల్ డ్రింక్స్ ఇచ్చిన కుర్రాడు ఎదురొచ్చాడు.
"అమ్మగారూ, అదిగో, ఆ బండెక్కండి!" ఆగివున్న కొత్త జట్కాబండి చూపించాడు.
వరూధిని బండిఎక్కి కూర్చుంది. వెంకటపతి తలవంచుకొని బండి ఎక్కుతుంటే, వరూధిని అతని తలమీదగా చూసింది. రామనాథ్ బాబు మెట్లమీద రాజసంగా నిలబడి బండివైపు చూడనట్లే చూస్తున్నాడు. వరూధిని కళ్ళు మెరిసాయి. చెంపలు కంది ఎర్రబడ్డాయి. రామనాథ్ బాబు తొణకలేదు. గంభీరంగా ముఖంపెట్టి కదిలివెళ్తున్న జట్కాకేసి చూస్తూ నిలబడ్డాడు.
13
కొడుకూ, కోడలూ బస్తీకి వెళ్ళి వారంరోజులు పైగా అయింది. సాంబయ్యకు వాళ్ళు లేకపోవడం ఒకరకంగా హాయిగానే వుంది. ఇంట్లో తిరుగుతున్న బుచ్చమ్మను చూస్తుంటే కంపరం ఎత్తిపోతూంది. దీన్నికూడా వదిలించుకుంటేగాని తనకు మనశ్శాంతి ఉండదు. ఓరోజు సాయంత్రం వంటగదికి తాళంవేసి తాళం చెవులగుత్తిని తలకింద పెట్టుకొని పడుకున్నాడు. పొద్దున్నే లేచిన బుచ్చమ్మ వంటగదిముందే కూర్చుంది. అది చూసి సాంబయ్య పొలం వెళ్ళాడు. సాయంకాలం తిరిగొచ్చేసరికి సాంబయ్య ఆశించినట్లే బుచ్చమ్మ ఇంట్లో లేదు. వంటగది తలుపుతీసి, జీతగాడ్ని కేకవేసి అన్నం వండమన్నాడు.
"అదేంటి దొరగారూ! బుచ్చమ్మేమయింది?" అన్నాడు జీతగాడు.
"అది మళ్ళీ ఇంట్లోకొస్తే కాళ్ళు విరగ్గొట్టు. తెలిసిందా?" అన్నాడు సాంబయ్య. పొద్దుటినుంచి ఉపవాసం వున్న సాంబయ్యకు ఆకలి దహించుకుపోతూంది. జీతగాడు ఉడకేసిన అన్నంలో ఉప్పుగోంగూర తొక్కు వేసుకొని, గిన్నెడు నెయ్యి బోర్లించుకొని తిన్నాడు. బ్రహ్మానందంగా వుంది.
"బుచ్చిముండా! దానిబొంద వంటకాలూ! ఈ రుచికంటే మించిందేమీలేదు!" పుల్ల పెరుగు వేసుకొని, అందులో పండుకారపు పచ్చడి నంజుకొంటూ, జుర్రుకుంటూ తిన్నాడు. భోంచేసి మెల్లాలో మంచం వేసుకొని పడుకొన్నాడు. పుల్లటి తేపులు వస్తున్నా అందులోనే ఆనందం పొందగలిగాడు సాంబయ్య. అరవైఏళ్ళుగా, పచ్చి పులుసూ, పచ్చడి మెతుకులూ, పుల్ల పెరుగూ తినడానికి అలవాటుపడ్డ, పచ్చి పులుసూ, పచ్చడి మెతుకులూ, పుల్ల పెరుగూ తినడానికి అలవాటు పడ్డ సాంబయ్యకు అదే ఆనందంగా వుంది. అసలు తన ఆరోగ్యం దెబ్బతినటానిక్కూడా ఆ బుచ్చమ్మ వంటలూ, కోడలు పోకిల్లే కారణం అనుకున్నాడు.
వారంరోజుల్లో తిరిగొస్తాడనుకొన్న కొడుకు ఇరవైరోజులయినా రాకపోయేసరికి బాధపడసాగాడు. కుప్పలు నూర్చే తరుణం కూడా వెళ్ళబోతూంది. పక్క చేలల్లో అప్పుడే నూర్పిళ్ళు పూర్తి అవుతున్నాయి. ఏటా అందరికంటే ముందే మాసూళ్ళు చేయించే సాంబయ్య పొలాన కుప్పలు అలాగే వుండటం మంచిది కాదని ఆదుర్దాపడసాగాడు. వెంకటపతికి కబురు పెడ్దామనుకకొంటున్న సాంబయ్యకు బస్ దిగి వస్తున్న కొడుకు కన్పించాడు.
"ఏంరా? కొంపా గోడూ పట్టించుకోకుండా తిరుగుతున్నావ్?" అన్నాడు సాంబయ్య.
"వేరే ఇల్లదీ చూసేసరికి ఆలస్యం అయింది" అన్నాడు కొడుకు.
"బస్తీలో ఇల్లెందుకురా? నీ పెళ్ళాం పల్లెటూళ్ళో వుండనందా?"
"డాక్టరమ్మ కాన్పయేదాకా అక్కడే వుండమందట!" అన్నాడు వెంకటపతి తలగోక్కుంటూ.
"అయితే మీ మామ ఉన్నచోటే వుండొచ్చుగా?"
"అది చాలా చిన్న ఇల్లు. రైలుపేటలోనే ఇల్లు తీసుకున్నాం."

