ఈ పూటకి మనకి నిద్రపోయే యోగం ఉన్నట్టు లేదనుకొని, స్క్రిప్ట్ పట్టుకుని కిటికీ తలుపులు కూడా వేసుకొని మరీ కూర్చున్నాను. పిక్చర్ లో పాటలు ఎక్కువ వున్నాయి, పెద్దవి కూడా.
చకచకా రాసుకుంటూ పోతున్నాను. మా గుమ్మం దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. కుయ్, కై మానలేదు. నిద్రపోయామనుకొని వెళ్ళిపోయి వుంటారనుకున్నాను. తెల్లవారుఝామున నాలుగు గంటలదాకా కూర్చున్నాను. చాలావరకు రాసేశాను. హాయిగా నిద్రపోయాను.
ఉదయం తొమ్మిది గంటలకి అమ్మ లేపింది.
"రాత్రి ఎన్ని గంటల వరకు రాశావే" అంది.
"నాలుగు గంటల వరకూ రాశాను. కానీ, రాత్రి నేను పనిచేశానన్న విషయం మాత్రం శ్రీశ్రీగారితో చెప్పకని" వెళ్ళి స్నానం చేశాను.
మేము కాలకృత్యాలు తీర్చుకొని, కాఫీలు తాగి మా రూమ్ లోనే కూర్చున్నాం. పది గంటలకి వాళ్ళు లేచిన అలికిడి అయింది. వాళ్ళు తయారయేసరికి గంట పైమాటేలే అనుకోని, మళ్ళీ స్క్రిప్ట్ పనికి దిగాను.
పదకొండున్నరకి కారు వచ్చింది. "మధ్యాహ్నం వస్తార"ని చెప్పి ఆవిడ కారు పంపేశారు. మరీ మంచిదనుకున్నాను.
ఒంటిగంట అయ్యింది. ఆవిడ వరండాలోకి వచ్చింది. అమ్మ వరండాలో వుంది. పది నిముషాలు ఇద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. నా పని మాత్రం వదల్లేదు.
మా అమ్మ లోపలికి వచ్చి "శ్రీశ్రీగారింకా లేవలేదుటే సరోజా!" అంది.
"ఫుల్ గా కొట్టేసి వుంటారు. పోనీలే అమ్మా! ఇక్కడకొచ్చింది కేవలం రెస్ట్ కోసమే. పాపం! డబ్బింగ్ చేసి చాలా అలసిపోయారు. నేను కూడా రెస్ట్ తీసుకుంటానని ఇక్కడికి తీసుకొచ్చారు కానీ, లేకుంటే ఈ సెన్సార్ స్క్రిప్ట్ అక్కడే రాయొచ్చమ్మా" - అన్నాను.
రెండవసారి కూడా కారు వచ్చింది. అప్పుడు నేను డ్రైవర్ని పిలిచి, "శ్రీశ్రీగారు నిద్రపోతున్నారు. రికార్డింగ్, డబ్బింగ్ పనులేవీ లేవుకదా! సాయంకాలం అయిదుగంటలకి వస్తామన్నారని మీ అయ్యగారితో చెప్పుబాబూ!" అని పంపించేశాను.
అమ్మా, నేనూ భోంచేశాక మళ్ళీ తలుపులు బిగించేశాను. అమ్మ మంచం మీద నడుంవాల్చింది.
స్క్రిప్ట్ రాయడానికి నేను కూర్చున్నాను. మరో నాలుగు రీల్స్ మిగిలాయి. ఇప్పుడు కూర్చుంటే లాగేశానన్నమాటే. కార్బన్ పెట్టే రెండు కాపీలు తీస్తున్నాను.
నాలుగు గంటలైంది. శ్రీశ్రీగారు లేచిన అలికిడయింది.
నేను తలుపు తీయలేదు. రాస్తున్న రీలూ, కాగితాలూ మాత్రం వుంచుకొని మిగిలిన కాగితాలు అన్నీ తీసేసి పెట్లో పెట్టేశాను. తలుపు చప్పుడయ్యింది.
రాస్తున్న కాగితాలు కూడా తీసి దాచేశాను.
అమ్మ లేచి తలుపు తీస్తానంది. "నువ్వు పడుకో అమ్మా! నేనే తీస్తాన"ని వెళ్ళాను.
తలుపు తీసేసరికి - ఎడం చేతిలో సిగరెట్, మోకాళ్ళదాకా ఉన్న గళ్ళ లాగుతో ఎదురుగా నిలుచున్నారు శ్రీశ్రీగారు.
"పట్టపగలే తలుపులు బిగించుకుని ఏంచేస్తున్నావు?" అనడిగారు.
"మీరు తాగి నిద్రపోయారు. నేను తాగకుండా నిద్రపోతున్నాను".
"కారు వచ్చి వెళ్ళిందట".
"అవనట".
"అంటే నీకు కూడా తెలీదా?"
"మొదటిసారి వచ్చినప్పుడు మీరే ఏదో సమాధానం చెప్పి పంపారనుకున్నాను.
కానీ రెండోసారి వచ్చినప్పుడు మీరింకా లేవలేదని తెలిసి, అయిదు గంటలకి రమ్మని నేనే పంపేశాను."
"ఎందుకలా చేశావు సరోజా?".
"రాతపనులూ, డబ్బింగులోఒ ఏమీ లేవు కదండీ. పోతే నేను రాయాల్సిన సెన్సార్ స్క్రిప్టే కదా? ఎంతసేపు? రాసేస్తాను" అన్నాను.
"పోనీ, నువ్వయినా వెళ్ళి అక్కడ రాసి వుంటే సరిపోయేది కదా? ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది" అన్నారు.
"మీరు లేకుండా స్టూడియోలో నాకేం పనండి?" అన్నాను.
"ఉన్న పని అంతా నీకే" కదా.
"మీతో చెప్పకుండా ఎలా వెళ్ళను".
"మరి లేపకపోయావా?" అనడిగారు.
"సర్లెండి. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? కారొచ్చేవేళయింది. మీరు త్వరగా స్నానం చేసి రడీ అవండి. టిఫిన్ తెప్పిస్తాను".
"సరేకానీ ఇవాళ ఏవిటి ప్రోగ్రాం?"
"ముందు మీరు రడీ అవండి. స్టూడియోకి వెళ్ళి తర్వాత ఆలోచిద్దాం" అన్నాను.
ఆవిడొచ్చి "ఏమిటి లేస్తూనే ఇక్కడికొచ్చి కూర్చున్నారు? లుంగీ అయినా వేసుకోరాదూ?" అన్నారు.
"అబ్బా! నువ్వెళ్ళు బట్టలు తీసిపెట్టు. బాత్ రూమ్ లో సోపూ, పేస్ట్ అన్నీ సిద్దం చెయ్యి" అని ఆవిడతో చెప్పారు. ఆవిడ చిరాకుగా వెళ్ళారు.
"మీరూ వెళ్ళండి" అన్నాను.
"సరే స్నానం చేసి వచ్చేస్తాను. కారు వస్తే ఉండమని చెప్పు" - అని వెళ్ళిపోయారు.
ఈయన తెమిలేసరికి ఎలా చూసుకున్నా అరగంట పైమాటే అనుకోని, దగ్గరగా తలుపులు చేరవేసి, మళ్ళీ రాత కూర్చున్నాను.
అయిదున్నరకి కారు వచ్చింది. కానీ శ్రీశ్రీగారింకా బైటకి రాలేదు.
నేను రాతపని ఎత్తికట్టి బాయ్ ని పిలిచి, అందరికీ కాఫీలు, టిఫిన్లు ఆర్డర్ చేశాను.
వరండాలో నిల్చున్న శ్రీశ్రీగారి భార్యను చూసి, "మీరు రడీయేనా?" అని అడిగాను.
"ఆఁ కారొచ్చేసింది. ఆయనింకా తెమలలేదన్నారు."
"వెళ్ళి త్వరగా రమ్మని చెప్పండి. ఇది మూడవసారి కారు రావడం బాగుండదు" అన్నాను.
"ఈ రోజు ఎక్కడికి వెళదాం?" అని అడిగారావిడ.
"మీరెక్కడికి అంటే అక్కడికే" అన్నాను.
"నువ్విక్కడికి రావడం ఇది మూడవసారికదా! అన్నీ చూసి వుంటావు నువ్వె చెప్పాలి" అన్నారు.
"ఎన్నిసార్లయినా కవిగారు ఎలా చెప్తే అలా చెయ్యాల్సిందే వారెక్కడికి తీసుకువెళితే అక్కడికే వెళదాం" అన్నాను.
"మీ రూమ్ తాళంవేసి, మా రూమ్ కి రండి. అక్కడే కూర్చుందాం" అని పిలిచారావిడ.
"వారిని బాత్ రూమ్ లో నుండి రానివ్వండ"ని అన్నాను.
ఈలోగా వెళ్ళి లెదర్ బ్యాగ్ లో కాగితాలన్నీ పెట్టేసి పట్టుకున్నాను.
ఆయన తెమిలి దొరలా తయారయి మల్లెపువ్వుల్లాంటి తెల్లని బట్టలతో బైటకి వచ్చారు. అందరం శ్రీశ్రీగారి గదిలోనే కూర్చుని టిఫిన్లు చేశాం. సిగరెట్ వెలిగించి చకచకా కిందికి దిగిపోయారు. "ఏవండీ" అని ఆవిడ పిలుస్తున్నారు. కనీ - ఆయన వెనక్కి చూస్తే ఒట్టు!
ఈ వెనక్కి చూడకపోవడం మరోసారి నోట్ చేసుకున్నాను.
అందరం కిందికి దిగిపోయాం.
* * *
శ్రీమతి గారి యక్ష ప్రశ్నలు
మహాత్మా పిక్చర్స్ ఆఫీసుకు వెళ్ళాం. శంకర్ సింగ్ గారు మమ్మల్ని చిరునవ్వుతో ఆహ్వానించారు. "పిక్చర్ ప్రొజక్షన్ ఎప్పుడు చూస్తారు శ్రీశ్రీగారూ!" అనడిగారు.
"రేపు చూస్తామండి" - అన్నారాయన.
"స్క్రిప్ట్ మాట ఏమిటమ్మా" - అని సింగ్ గారు నన్ను అడిగారు.
"మేం వెళ్ళేలోగా పూర్తిచేసి ఇచ్చేస్తాను సార్!" అన్నాను.
"గుడ్ అయితే ఇప్పుడు మీ ప్రోగ్రాం ఏమిటి?".
"శ్రీశ్రీగారే చెప్పాలి" అన్నాను.
"గార్డెన్స్ కి వెళదామా సరోజా!" అనడిగారు.
"మీ ఆవిడని అడగండి".
"నిన్ను అడుగుతున్నారు. నువ్వు చెప్పు" - అంటూ, శ్రీశ్రీగారి ముఖంలోకి చురచురా చూశారు.
ఆయన చిరునవ్వు నవ్వుతూ "రండ"ని కారెక్కారు.
అందరం బృందావన్ గార్డెన్స్ కి వెళ్ళేసరికి సుమారు ఏడుగంటలయ్యింది.
"మీరు వెళ్ళి అంతా చూసిరండి. నేనిక్కడే కూర్చుంటాన"ని శ్రీశ్రీగారు మెట్లదగ్గరే ఆగిపోయారు. నేనూ, అమ్మా శ్రీశ్రీగారి భార్యతో బయలుదేరాం.
"మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారాని?" - ఆవిడడిగారు.
"ఇది మూడవసారండి" - అన్నాను.
నాకు తెలుసు ఆవిడ ఇలాంటిదే ఏవో ప్రశ్నలు వేస్తారని అందుకే సిద్దంగా వున్నాను. ఇంతకీ - జరిగింది చెప్పడానికి భయం ఏం వుంది?
"మూడుసార్లు ఎందుకు వచ్చారు?".
