"ఆ రహస్యమేదో గట్టిగా తెలుసుకోవాలనే వుంది దామోదరానికి. చెప్పమని మరీ పట్టుబడితే తామిద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొడుతుందేమో అని ప్రస్తుతానికి సరేనన్నాడు దామోదరం.
కిరణ్ రహస్యమేదో కామినీ చేతిలో వుంది. ఆ రహస్యమేదో తనకి తెలియకపోయినా కామిని తన చేతిలో వుంది. సమయం వచ్చినపుడు ఆయుధంగా కామినీ నే వాడుకోవచ్చు, అనుకున్నాడు దామోదరం "నాకు ఎట్లాగో అట్లా పదివేలు కావాలమ్మాయ్జ్! ఎట్లా ఇస్తావో నీ యిష్టం."
"ఒక్కసారిగా పదివేలు అంటే కష్టం బాబాయ్!" అంది కామిని.
"ఆ మాట అనకపోతే నాకివ్వటం ఇష్టంలేదని చెప్పరాదు." నిష్టూరంగా అన్నాడు దామోదరం.
"నేను అలా అనుకునేదాన్ని అయితే సొమ్ము తీసుకువచ్చి నీ దగ్గర దాయమని చెబుతానా బాబాయ్! అన్నట్టు ఆ నగలు భద్రంగా ఎక్కడ దాచావ్!" ఇదే సందు అని అడిగివేసింది. కామిని.
దామోదరం కాస్త తత్తరపడ్డాడు. ఎందుకంటే వాటిని ఎప్పుడో తగలేయటం జరిగింది. అప్పనంగా చేతిలో డబ్బు ఆడుతుండేసరికి , ఖరీదైన విలాసాలకి డబ్బు తగలేయటం ఎక్కువ అయింది. "ఇంకెక్కడి నగలు. అవి ఎప్పుడో గంగలో కలిశాయి" అని కామినీతో చెబితే డబ్బు ఇవ్వటం మానేసినా మానేస్తుంది. ఇన్నాళ్ళూ తనంతట తానుగా డబ్బిచ్చే మనిషి ఈ రోజు డబ్బడిగితే కుంటిసాకులు చెబుతోంది. తను చాలా తెలివిగా మెలగాలి అనుకున్న దామోదరం "నా మీద అనుమానమా!" అడిగాడు.
"ఛ, ఛ అలాంటిదేమీ లేదు బాబాయ్!" అంది కామిని. కాని ఆమెకి అర్ధమయిపోయింది. ఆ నగలు అన్నీ గోవిందార్పణం అయినట్టు. వ్యవహారం బెడిసికొట్టకూడదని తనూ జాగ్రత్తగానే వ్యవహరించింది.
"పదివేలు కాకపోతే అయిదువేలన్నా......" నాన్చుతూ ఆగాడు దామోదరం.
"తప్పకుండా ప్రయత్నిస్తాను. నాలుగు రోజులు టైమ్ ఇవ్వు" అంది కామిని.
కొద్దిసేపు మాట్లాడి ఇద్దరూ విడిపోయారు.
కామినీ బంగారు బాతు. ఆ బంగారు బాతు రోజూ పెట్టే గుడ్లతో సహా, తనింట్లో కట్టి పడేయాలనుకున్నాడు దామోదరం.
కిరణ్ తో తను చాలా జాగ్రత్తగా మెలగాలి అనుకుంటూనే ఇపుడు తను తన బాబాయ్ తో కూడా జాగ్రత్తగా మెలగాల్సిన పని ఏర్పడింది. రెండు కత్తులమీద తను రెండు కాళ్ళుపెట్టి గాల్లోకి ఎగురుతూ నాట్యం చేయాలి. కత్తులు ఏ కాలినీ గాయపరచ కూడదు. తను బాలన్స్ చేసుకుంటూ నాట్యం చేస్తూ వుండాలి. తను తెలివి తేటలతో ఎంత వరకూ లాక్కురాగలుగుతుందో అంతవరకూ లాక్కురావాలి. కొన్ని కఠినమైన విషయాలు కూడా ఛాలెంజ్ గా తీసుకోకపోతే ముందుకు సాగమనుకున్నాది కామినీదేవి.
అతని మరణించిన రోజే గేమ్ మొదలయింది.
ఇంతవరకూ ఈ చదరంగంలో ఏ పావూ చావలేదు. కొంతపావులు రంగ ప్రవేశం చేస్తున్నాయి తప్ప.
ఈ పావులు ఇలాగే పెరిగిపోతే...
ఈ ఆట రంజుగా వుంటుందా! తికమకగా తయారు అవుతుందా! అస్తావిస్తగా ముగుస్తుందా!.
ఏమో!"
24
ఆ రోజు పోస్టులో కిరణ్ కి ఒక లెటర్ అందింది. కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. తన ఇంట్లో ఫోన్ ఉన్నట్లు తన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫోన్ చేస్తారు. లేకపోతే వాళ్ళు వచ్చి కలుస్తారు. దూర తీరాలలో మిత్రులున్నారు. కాని, వాళ్ళెంతో అవసరమైతే మాటికో లెటర్ రాస్తారు. లెటర్ గా రావటం మటుకు తక్కువ. విచిత్రం ఏమిటంటే ఈ రోజు పోస్టులో వచ్చిన లెటర్ ఈ వూళ్ళోనే పోస్టు చేయబడింది.
కవరు చింపకముందే ఈ వూరినించి రాసిన లెటర్ లను అందుకున్నట్లు పోస్టల్ ముద్ర చూసి గ్రహించాడు.
కవరు ఓపెన్ చేస్తూ చాలా తమాషాగా వుందే అనుకున్నాడు. కవరులో ఒకే ఒక్క కాగితం మడతపెట్టబడి వుంది. దాదాపు పావు ఠావు కాగితం వుంది అంది. కిరణ్ లెటర్ తీసి చదవడం మొదలుపెట్టాడు.
మిష్టర్ కిరణ్ ఉరఫ్ కిషోరీలాల్.
చాలా హేపీగా వున్నావనుకుంటాను. నీ వేంటి నేనేంటి. ఎవరైనా సరే పెద్ద నేరం చేసి కాం గా ఆ నేరం నుండి తప్పించుకోగలిగితే అంతకుమించి ఆనందం ఈ బ్రతుక్కి ఏముంటుంది. మొత్తానికి చాలా తెలివిగా వ్యవహరించి చల్లగా తప్పుకుపోయావ్. ఇవే నా అభినందనలు అందుకో.....
అంతవరకూ చదివిన కిరణ్ మొహం తెల్లగా పాలిపోయింది. నాలుక ఎండిపోయింది. కనుగ్రుడ్లు భయంతో విపరీతంగా చలించటం మొదలుపెట్టాయి. దరిదాపుల్లో ఎవరూ లేరు. వెంటనే వెళ్ళి తలుపులోపల గడియవేసుకువచ్చాడు.
మళ్ళీ లెటర్ ని మొదటినుండి చదవటం మొదలు పెట్టాడు. అక్షరం అక్షరం జాగ్రత్తగా చదవటం మొదలు పెట్టాడు.
...............నేనెవరిని అని ఆశ్చర్య పోతున్నావా! ఆశ్చర్యపోకు నేనెవరినో నీకు తెలియదు కాబట్టి. ఈ లెటర్ ఎక్కడినుండి వచ్చింది అనుకుంటున్నావా! ఈ వూరినుండే కాకపోతే ఫ్రం అడ్రస్ తప్పుడు అడ్రస్ ఇచ్చాను. ఇక అసలు విషయానికి వస్తాను. జాగ్రత్తగా చదువు.
"హోటల్ మయూరి బ్యాక్ సైడ్ న కొన్ని ఫ్లాట్స్ వున్నాయి తెలుసుకదా. ఆ ఫ్లాట్ లో ఏదో ఒక రూమ్ లో ఏదో ఒక చోట నేను వున్నాను. నాకు తోచనప్పుడల్లా ఏం చేస్తుంటానో తెలుసా! నా గదిలో కిటికీ దగ్గర కూర్చుని కళ్ళార్పకుండా హోటల్ మయూరిని చూస్తుంటాను. చాలా కాలంగా ఈపని చేస్తూనే వున్నాను. అలా చేయటం వలన నాకు లాభం వచ్చిందేమీ లేదు. కానీ రెండు నెలల క్రితం నాకు లభించింది.
ఆరోజు మా ఫ్లాట్ లో కరెంట్ పోయింది. హోటల్ మయూరి లైట్స్ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నేను మా యింట్లో కిటికీదగ్గర కూచుని పత్తికాయల్లా కనుగ్రుడ్లు చేసుకుని ఓ రూమ్ వైపు చూస్తున్నాను. ఈ తఫా విచ్చుకున్న కళ్ళు పత్తికాయల్లా మారాయి. ఆ రూమ్ లోని అందమైన యువతి ముందు కిటికీ తలుపులు తెరిచింది. కర్టెన్ పూర్తిగా ప్రక్కకు నెట్టింది. అప్పుడు ఆ యువతిని నేను స్పష్టంగా చూశాను. ఆమె రూపం నా మనసులో ఎలా నిలిచిపోయింది అంటే, ఆమె రూపం ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయింది. ఆమె రూపురేఖలు.....(అనితను గురించి వర్ణన వుంది.) ఇలా వున్నాయ్ అవునా!
ఆమెను అలా చూస్తూ వుండగా ఆమె దగ్గరికి ఒక అందమయిన యువకుడు వచ్చాడు. అతని రూపు రేఖలు ఇలా వున్నాయి...(కిరణ్ రూపం గురించి వివరంగా వర్ణన) ఆ యువకుడు ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. కొద్దిసేపు వాళ్ళు ఒకరిపై ఒకరు ముద్దులవర్షం కురిపించుకున్నారు. ఆ సీన్ చూడటానికి నా రెండు కళ్ళూ చాలలేదు. అంత అద్భుతంగా వుంది.
