Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 39


    బాబాయ్ కి చేతిలో ఎంత డబ్బువుంటే అంత డబ్బూ దుర్వ్యసనాలకి తగలబెట్టటం అలవాటు. తను చిన్న చిన్న మోడలింగ్ పనులతో పాటు అడ్డమైన పనులూ చేసి, సంపాయించి తెస్తే, అదంతా వ్యసనాలకి తగలేసే వాడు బాబాయ్. ఇంకా సంపాదించుకునిరా, ఇంకా సంపాదించుకునిరా, అని సతాయించి చంపేవాడు. ఒక రూపాయి వుంటే ఇవ్వవే! అని పీడించిన రోజులూ వున్నాయి.
    అది సంగతి.
    కిరణ్ ని పెళ్ళాడాలని తనకి గాఢంగా కోరిక వుండేది. అతనిని తన్ను పెళ్ళి చేసుకోమని ఎన్నిసార్లో వత్తిడి తెచ్చింది చాలాసార్లు నవ్వుతూ తోసేశాడు. కొన్నాళ్ళు మొహం చాటేసాడు. చివరికి నీ చావు నువ్వు చావు ఫో! అన్నాడు. అంతే తన నరనరాన కక్ష కసి ఆవరించుకున్నాయి.
    ఆ రోజు.
    అదృష్ట దేవత తనని వెతుక్కుంటూ వచ్చి, తలుపు తట్టింది.
    కిరణ్ వెనుకనే తను బయలుదేరి హోటల్ రూమ్ లోకి రావటం కిరణ్ నేరం బయట పడటం, తను తెలివిగా మెలగడంతో ఆ క్షణానే కిరణ్ తన గుప్పెట్లోకి రావటం అంతా క్షణాలలో జరిగింది. కిరణ్ కుక్కిన పేనులా పడివుంటాడని తనకి తెలుసు. ఆ సమయంలో అతను చేసిన నేరం తాలూకా సాక్ష్యం ఏదీ తన దగ్గర లేకపోయినా, మసిపూసి మారేడు కాయని చేసిన తన తన మాటలే అతని పాలిట శాపాలు, తనకి బలమైన సాక్ష్యాలూ అయినాయి. పెదవి కదపకుండా తను చెప్పినదంతా చేశాడు కిరణ్. అంత మాత్రం చేత తనకోపం తీరలేదు.
    ఆ కోపం తీరకనే.
    బాబాయ్ ని చాటుగా కలుసుకుని, "బాబాయ్! కిరణ్ తాలూకా ఒక గొప్ప రహస్యాన్ని నేను చేజిక్కించుకున్నాను. అతనిని నేను బెదర గొడుతుంటాను. డబ్బులు లాక్కుంటూ ఉంటాను. నీవు హాయిగా ఎంజాయ్ చేయి అడిగినప్పుడల్లా నీకు డబ్బులు ఇస్తుంటాను. అలా అని మనం మరీ ఆశకు పోకూడదు. మన మాటలతో చర్యలతో బాధపెడుతూ మధ్య మధ్య కొంత డబ్బు లాక్కుంటూ ఉందాం!" అని చెప్పింది.
    కిరణ్ చెప్పిన తరువాతే ఆ ఆలోచన వచ్చింది.
    ఒకేసారిగా ఈ డబ్బునంతా ఇలా తగలేస్తూపోతే తనకని తీరుతుందేమో కాని తను పొందే లాభమేముంది. తను ఇహపై చాలా జాగ్రత్తపడాలి.
    నాలుగు ఐదు వందలు ఒకేసారి తన బాబాయ్ కళ్ళజాడలేదు. ఒక్కసారిగా రెండు వేలు తీసి జల్సాగా ఖర్చుపెట్టుకునేంత అదృష్టం తనకూ పట్టలేదు. ఇప్పుడు ఇద్దరికీ కలసి వచ్చింది. తన డబ్బు తనకంటూ ఖర్చుపెట్టుకోవటంలొ అర్ధముంది. బాబాయ్ చేత ఖర్చు చేయిస్తే ఏమి వస్తుంది?
    బాగా డబ్బులు చేతిలో ఆడుతున్నపుడు ఒకేసారి పాతిక రూపాయలు పెట్టి పేకాడేవాడు. అలాంటిది ఇప్పుడు తను తేరగా ఇస్తుంటే వేలకు వేలు పేకాటకి, గుర్రప్పందా లకీ తగలేస్తున్నాడు. తనకన్నా తన బాబాయి పని బాగుంది.
    ఆశకైనా ఒక హద్దూ హద్దూ ఉండాలి. తను అడిగి నప్పుడల్లా వేలు ఇస్తూ వుంటే ఆ లూజు కనిపెట్టి బాబాయి ఒకేసారి పదివేలు అడిగాడు. పిచ్చి బొందలాగా తను పదివేలూ ఇస్తానని చెప్పింది. ఆ తరువాతనే కిరణ్ కి తనకీ మధ్య వాదులాట జరగటమూ, తనకళ్ళు తెరుచుకోవడమూ జరిగాయి. బాబాయికి తను పదివేలు ఇవ్వదలచుకోలేదు. కిరణ్ ని బెదిరించి డబ్బు తీసుకుంటూ, ఆ డబ్బు రహస్యంగా తనే దాచుకుంటే సరిపోతుంది కదా! కీడెంచి మేలెంచ మన్నారు పెద్దలు కిరణ్ చేయించిన నగలన్నీ దాచిపెట్టమని బాబాయికి ఇచ్చింది. అవి ఉంచాడో తగలబెట్టాడో తనకి తెలియదు. అవి కొన్ని వేలు ఖరీదుచేసే నగలు. దొంగవాడా! సొమ్ము దాయరా! అని ఇచ్చినట్టు కాలేదు కదా! తనపని...
    కామిని దీర్ఘాలోచన చేస్తుంటే దామోదరం నవ్వుతూ పలకరించాడు. "ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్! ఈ ముసలి చచ్చినాడికి అంత డబ్బు ఎందుకు ఇవ్వటం? అనా!"
    "ఛ, ఛ. మరీ అంత పిచ్చిగా మాట్లాడతావేంటి బాబాయ్! మొదటినుంచి నన్ను తండ్రిలాగా పెంచావు. వ్యసనాలు తప్పని నేను ఎప్పుడూ అనలేదు. అన్నీ చూస్తేనే కదా! సుఖాల రుచి తెలిసేది. ఆ రోజుల్లో నువ్వు డబ్బు కావాలని బలవంతం చేసేవాడివి. ఎంత కష్టపడ్డా ఎక్కువ సంపాదించలేక పోయేదాన్ని అందుకే నీ అవసరాలకి ఐదు పది మించి ఇవ్వలేక పోయేదాన్ని. ఇవ్వాలని నాకుండేది. కాని, ఏమీ చేయలేక నాలో నేను మధన పడేదాన్ని. సమయం నా చేతికి వచ్చేసరికి చూశావా! నీవు అడగక ముందే నీకు కావలసినంత ఇస్తున్నాను. ఇంతేనా నన్ను అర్ధం చేసుకున్నది. నొచ్చుకున్నట్టుగా అంది కామిని.
    "నువ్వు నన్ను అలక్ష్యం చేస్తున్నావని అనటం లేదే పిల్లా! అప్పుడు అంటే నువ్వు చిన్న గుంటముండవి. లోకం పోకడ సరీగా తెలిసి చావలేదు. ఇప్పుడు తెలివిగా పెద్దింటి వాడిని పట్టావు. ఇంక నీకేమిటి? అసలు ఉన్నట్టుండి నీకే మయిందో నాకు తెలియడంలేదు. మొన్నటికి మొన్న పదివేలు కావాలే అమ్మాయీ! అన్నాను. నీకెందుకు బాబాయీ చిటికెలో ఇస్తాను అన్నావు. ఈ రోజు ఇచ్చి ఇస్తానంటే నోరు తెరుచుకుని కూర్చున్నాను. నేను నోరు తెరిచి అడిగితే వట్టిచేతులు వూపుకుంటూ వచ్చి "ప్రస్తుతం, డబ్బులేదు బాబాయ్! ఆయన్ని అడిగినా ఇవ్వనన్నారు. తరువాత చూస్తాను అని చావు కబురు చల్లగా చెప్పావు. అవతల స్నేహితుడికి మాట ఇచ్చాను. నా మాటేం కావాలి."
    "ఒక్కసారికి వాళ్ళకి సర్ది చెప్పలేవా బాబాయ్! ఆయన్ని గట్టిగా అడిగాను. ఇవ్వకపోతే ఏం చెయ్యను. పీడించనా!" అంది కామిని.
    "ఆ లుచ్చానాకొడుకు రహస్యమేదో నీ చేతిలో ఉందని అన్నావు కదా! గట్టిగా బెదిరించాల్సింది. పదివేలు ఏమిటి, లక్ష కక్కమన్నా కక్కుతాడు. నీకు మరీ మొహమాటంగా వుంటే ఆ రహస్యమేదో నాకు చెప్పు. నీ మొగుడి చేత ఏమిటి వాడి అబ్బచేత కూడా కక్కిస్తాను. అబ్బా కొడుకులు కలసి రూపాయినోట్లు కక్కుతూవుంటే ఏరుకోవటానికి మనకి చేతులు నొప్పెట్టాల్సిందే!" దామోదరం అన్నాడు ఎకిలిగా నవ్వుతూ.
    "కొన్నాళ్ళు ఆ రహస్యం నా దగ్గరే ఉండనియ్యి." అంది కామిని.
    "ఏం ఆ రహస్యమేదో నేను తెలుసుకోకూడదా!"
    "తెలుసుకోవచ్చు బాబాయ్! నీ దగ్గర నాకు దాపరికాలు ఏమీలేవు. ఒక్కోసారి నీవు మితిమించి తాగుతావు. అలాటప్పుడు నోటికొచ్చినదల్లా వాగుతుంటావ్. ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఆ రహస్యం కక్కేవే అనుకో! అప్పుడు మనతోపాటు నీ స్నేహితులు కూడా చేరతారు. అదీ నా భయం. అందుకే ఈ జాగ్రత్త. నువ్వేమీ అనుకోకు బాబాయి! ఇప్పుడప్పుడే ఆ రహస్యం చెప్పను." కాస్తగట్టిగానే చెప్పింది కామిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS