రెండు చేతులూ జోడించి...
"నిన్ను పొరపాటున కదిలించాను" అన్నాడు.
ఈలోగా వెయిటర్ వెజిటబుల్ కట్లెట్ తీసుకొచ్చాడు.
అది తిన్న తర్వాత కాఫీ తాగారు.
వెయిటర్ బిల్లు తీసుకువచ్చాడు.
బిల్లు చూసి, పర్సులో నుంచి వంద రూపాయల కాగితం తీసి ప్లేటులో పెట్టాడు.
"కేవలం మనమిచ్చే టిప్పే మినిమమ్ 'వంద' వుండే స్టేజ్ కు మనం ఎదగాలి అంది శశికళ.
"అప్పటికిగ్గానీ ఇల్లు గుల్లవ్వదు" మనసులో అనుకున్నాడు శ్రీచరణ్.
"వెళ్దామా బాసూ..." అంటూ శ్రీచరణ్ చేయి అందుకుంది. ఒక్కక్షణం అతని మనసులో చిత్రమైన స్పందన. అది శశికళ. స్పర్శ తాలూకు ప్రభావం.
ఇలా చెట్టాపట్టాలేసుకొని తిరగడం అతనికిష్టం కూడా.
ఇద్దరూ లేచారు బయల్దేరడానికి.
* * *
"మిమ్మల్ని ఒకటడిగితే ఫీలవ్వరుగా..." అడిగాడు ప్రభాత్ ప్రనూషని సాయంత్రం ఆఫీసు క్లోజ్ అయ్యే సమయంలో తన ఛాంబర్ కు ప్రనూషని పిలిచి అడిగాడు ప్రభాత్.
ఒక్కక్షణం ఆలోచనలో పడింది ప్రనూష.
"ఏమడుగుతాడు. అడక్కూడనిది అడగడు కదా..." అనుకుంది.
"ఏంటి భయపడుతున్నారా? నేనేం మీ ప్రాణాలు అడగనులేండి." అన్నాడు నవ్వుతూ ప్రభాత్.
"అడగండి" అంది ప్రనూష సందిగ్దావస్థలో నుంచి తేరుకోకుండానే.
"నాతో ఒకే ఒక కప్పు కాఫీ తాగగలరా? జస్ట్ కాఫీతో కంపెనీ ఇస్తే చాలు..."
"హమ్మయ్యా..." అంటూ నిట్టూర్చింది.
ఏంటి అభ్యంతరమా? ఓ... కే...కొన్నింటికి ఫేట్.... ఫేట్....ఉండాలండీ...ఎందుకో రొటీన్ గా ఏదో ఓ హోటల్ కు వెళ్ళడం...వెయిటర్ వచ్చి "ఏం కావాలని అడగడం.... కాఫీనో.... బ్రూనో...బూస్టో.... ఏదో ఒకటి చెబుతా....వాడు తీసుకువస్తాడు.... ఓ యంత్రంలా నోరు తెరిచి తాగి.... బిల్లు పెచేసి వస్తాను. దేర్ ఎండ్స్ డ మ్యాటర్... ఓ అనుభూతీ లేదు. ఓ సరదా వుండదు.
ఒక్కోసారి ఆ హోటల్ లో జంటలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. భార్యాభర్త, గాళ్ ఫ్రండ్, బోయ్ ఫ్రెండు.... అలా జంటలు జంటలుగా వస్తారు. కబుర్లు చెప్పుకుంటారు. జోక్స్ వేసుకుంటారు.
కలిసి టిఫిన్ చేస్తారు. కలిసి కాఫీ తాగుతారు....నేను...ఒంటరిగా....లీవిట్...." అంటూ తల విదిల్చాడు.
ఒక్క క్షణం బాదేసింది ప్రనూషకు.
'పాపం ఒంటరితనం అతడెంత బాధిస్తుందో అనుకుంది ఎంతనే.
"అలాగే వెళ్దాం సార్" అంది.
' ఇప్పుడు టైం ఎంత? ఆఫీసు టైం అయిపొయింది . పో, ప్రభాత్ అంటే చాలు, నో' సార్ లు. నో గార్లు. ఇంకా మీ కభ్యంతరం లేకపోతే "ప్రభూ .....!' అని అన్నా చాలు......' అన్నాడు ప్రభాత్.
ఎందుకో ఆ మాటలు ఆమెకు మధురంగా అనిపించాయి. పొగడ్త లాంటి మాటలు ఎప్పుడూ మధురంగా మాటలు ఎప్పుడూ మధురంగా వుంటాయని ఆమెకు అర్ధమయ్యే సరికి......ఎంత టైం పడుతుందో...?'
* * *
'ఏయ్ ప్రనూ ....నువ్వు ఇంకా రావడం లేదేంటి?" అడిగింది కామాక్షి ప్రనూషని.
'నాకు చిన్నపని వుంది. కాస్త ఆలస్యమవుతుంది. మీరు వెళ్ళండి" అంది ప్రనూష తడబాటును కప్పి పుచ్చుకుంటూ.
"అదేంటి...ఆఫీసు అవర్స్ అయ్యాక నువ్వు పన్జేయవుగా..." అడిగింది ఆశ్చర్యంగా ప్రసూనాంబ.
"అర్జెంట్ వర్క్ లే." అంది ప్రనూష.
ప్రసూనాంబ, కామాక్షి వెళ్ళిపోయారు.
వాళ్ళ ముందే ప్రభాత్ తో వెళ్తే బావోదని ఆగింది.
అయితే ఒక అబద్దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో, మరో అబద్దం, ఆ అబద్దానికి మరో అబద్దపు ముసుగు. అలా...ఒక్కోసారి అబద్దాలాడ్డం మొదలెట్టాక... అది పరంపరగా కొనసాగుతుందని తెలియదు ప్రనూషకు.
* * *
కారులో బ్యాక్ సీట్లో కూచోబోయింది ప్రనూష.
"దయచేసి నన్ను డ్రైవర్ ని చేయొద్దు. ముందు సీట్లో కూచొని నా "ఓనర్" పోస్ట్ ని గౌరవించండి" నాటకీయంగా అనేసరికి సిగ్గుపడి....వెళ్ళి ముందు సీట్లో అతని పక్కనే కూచుంది.
కారు స్మార్ట్ చేశాడు.
ప్రనూషకు గమ్మత్తుగా వుంది ఆ అనుభవం.
ఆమె ఈ అనుభవాన్ని ఎక్స్ పెక్ట్ చేయలేదు.
ఓ పక్క బెరుగ్గా కూడా వుంది. పరాయి మగవాడితో... పెళ్ళయిన తను...
"ఏంటి...నాతో వస్తూ కూడా ఆలోచిస్తున్నారా? ఇదన్యాయం....సరదాగా వెళ్ళినప్పుడు....ప్లజంట్ గా మనం వుండడమే కాదు, మనక్కావలసిన వాళ్ళను కూడా ప్లజంట్ గా వుంచాలి..." అన్నాడు డ్రైవ్ చేస్తూనే ప్రభాత్.
"అవునవును" అంది ప్రనూష.
"మన పరిచయం వయసురోజులే. కానీ నాకు మాత్రం "యుగాల పరిచయమేమో అనది అనిపిస్తోంది" అన్నాడు ప్రబాత్.
ఏమనాలో తోచలేదు ప్రనూషకు "చెప్పండి ప్రనూష ఏదో ఒకటి మాట్లాడండి. లేకపోతే ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తూ రోజూ వెళ్ళే ప్రభాత్ కు అందమైన మంచి మనసున్న ప్రనూష అనే గుడ్ గళ్ పక్కన, ఆనందంతో ఆశల రెక్కలు తగిలించుకొని కారు డ్రైవ్ చేసే ప్రభాత్ కు పోలిక లేకుండా పోతుంది" అన్నాడు ప్రభాత్.
"మీలా మీ మాటలూ మత్తుగా గమ్మత్తుగా వుంటాయి..." అంది అనాలోచితంగా.
"థాంక్యూ...మీ కాంప్లిమెంట్ కు థాంక్స్...అలాగే ఓసారి నవ్వండి ప్లీజ్..."
పక్కున నవ్వింది ప్రనూష.
"మిమ్మల్ని పెళ్ళి చేసుకొనేవాడికి, పూలుకొనే ఖర్చువుండదు" అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
"జోగ్గా అన్నాన్లేండి. మీరు నవ్వితే మల్లెలు రాలినట్టు వుంటుంది. మరి ఆనవ్వుల మల్లెలలను ఏరి మాలగా కట్టి, మీ జెడలో పెడితే చాలదూ...పూలు కొనడం ఎందుకు?"
ప్రభాత్ వైపు పరిశీలనగా చూసింది.
"ఇలాంటి రొమాంటిక్ థాట్స్. సెన్సాఫ్ హ్యూమర్ వున్న వ్యక్తి తనక్కావాలి..." అనుకుంది.
మరుక్షణం ఆ ఆలోచన తప్పేమో అనిపించింది.
ద్వైదీ భావంలో పడిపోయింది.
కారు సడన్ బ్రేక్తో ఆగింది.
ఉలిక్కిపడి చూసింది.
ఎదురుగా తాజ్ హోటల్.
కారు పార్క్ చేసి ఇద్దరూ హోటల్ లోనికి నడిచారు. సరిగ్గా అప్పుడే....
శ్రీచరణ్, శశికళ ఆ హోటల్లో నుంచి బయటకు వస్తున్నారు. ఒకరినొకరు చూసుకోలేదు.
"ఆలస్యమైందేంటి?" అడిగింది ఏడుదాటుతుండగా వచ్చిన ప్రనూషని ప్రియ.
"ఆఫీసులో పెండింగ్ వర్క్ ఒకటుంటే పూర్తిచేసా, అంది వెంటనే ప్రనూష.
హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగేవరకూ ప్రభాత్ వదల్లేదు. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలని చెబితే....ఇంటిక్కాస్త దూరంలో వదిలేశాడు.
ఇంటి వరకూ వస్తానని అన్నా, పట్టుబట్టి తనే వద్దంది.
"ఆడపిల్లలు ఇంత రాత్రి వరకూ రోడ్డు మీద తిరగవద్దమ్మా...రోజులసలే బాగాలేవు..." అన్నాడు శర్మ.
"అవును మరి బావ చూడు. బుద్దిగా ఆరుగంటలకే వచ్చాడు" అంది ప్రియ.
