ఇది దూరం నుంచి చూసింది ఆయా. కెవ్వున కేక వేసి లోపలికి పరిగెత్తి రవితో చెప్పింది. అతను బాణంలా దూసుకొచ్చేసరికే వాళ్ళు కాంపౌండ్ గేటుదాటేరు. అతను వెంబడించేడు.
వాళ్ళు రోడ్డెక్కి కారెక్కారు. రవి నిరుత్సాహ పడిపోయాడు. వందగజాల్లో ఎవరో దుర్మార్గులు ఆమెని నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళుతూ వుంటే ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి వగచాడు. రివ్వున పరిగెత్తాడు. నిర్మానుష్యంగా వున్న ఆ రోడ్లో అప్పటికప్పుడు టాక్సీయో ఆటోయోదొరికే మార్గం కూడా లేదు. ఎవరిదైనా కారు ఎదురవుతుందేమోనని అతని ఆశ!
ఆ కారు వందగజాలు వెళ్ళకముందే పోలీస్ జీప్ ఎదురుగా వచ్చింది. జీప్ అడ్డంగా రావటంతో కారు ఆగింది. జీపులోని పోలీసులు చప్పున క్రిందికి దూకేశారు. అంతకు పూర్వమే యిన్ ఫర్ మేషన్ అందిన పోలీసులు బిలబిలాకారు చుట్టూ ముట్టేశారు. వాళ్ళంతా అక్కడే దాక్కుని వుండినారు.
హఠాత్తుగా యిలా జరగటంతో మోహన్ కి మతి పోయినట్టయింది. అంతలో రవి కారువద్దకి వచ్చేశాడు.
స్వప్న క్షేమంగా కారు దిగింది.
పోలీసులు దుండగుల్ని లాక్కెళ్ళారు.
"మీరు స్టేషన్ కి వచ్చి రిపోర్టివ్వాలి!" అన్నాడు యస్సై!
"అలాగే ఇంటికి వెళ్ళి ఓ అరగంటలో వచ్చి స్టేట్ మెంటు ఇస్తుంది లెండి." అన్నాడు రవి.
మోహన్, అతని అనుచరులతో జీపు వెళ్ళిపోయింది. వాళ్ళ కారు కూడా స్టేషన్ చేరుకుంది.
స్వప్న, రవి యింటి ముఖం పట్టేరు.
ఆ లోగా సంగతి విన్న పనిమనుషులు, వెంకట్రామయ్య పరిగెత్తుకుంటూ వచ్చేరు.
"ఎవరు? ఎవరు ఆ రాక్షసులు! పట్టపగలు లాటి ఈ సమయంలో ఇంత దారుణానికి తలపెట్టేరు. వాళ్ళని జైలుకి పంపించాలి. రాస్కెల్స్ ఇదో బ్రతుకు తెరువైంది వీళ్ళకి. వీళ్ళని వదిలెయ్యకూడదు. స్టేషన్లో అప్పగించివుంటే చాలదు. పదండి రిపోర్ట్ యిద్దాం!" గంతులేశాడు వెంకట్రామయ్య.
నిశితంగా చూశాడు రవి. అతని ముఖం కోపంతో, అసహ్యంతో ఎర్రనైంది.
"నువ్వేం గాబరా పడద్దు తల్లీ! రేపటి నుంచి ఇంటి కాంపౌండ్ చుట్టూ కాపలాపెడదాం!" ఓదార్పుగా అన్నాడు వెంకట్రామయ్య.
స్వప్న మాటాళ్ళేదు.
"వెంకట్రామయ్యగారూ! ఆ దొంగలనాయకుడెవరో తెలుసా?"
"ఎవరు?"
స్వప్న కూడా అతనెవరో నీకు తెలుసా అన్నట్టు ఆగింది.
స్వప్న వైపు ఓ క్షణం నిదానించి చూసి తర్వాత వెంకట్రామయ్య వైపు అసహ్యమంతా వుట్టిపడేట్టుగా చూస్తూ, "వాళ్ళంతా కిరాయి వెధవలు. ఎవరు డబ్బులిచ్చినా ఏ పని అయినా చేస్తారు. వాళ్ళకదే వృత్తి. వాళ్ళదేమిటి? వాళ్ళని మాటాడుకున్న దెవరో తెలుసా? మీ అబ్బాయి మోహన్!" అన్నాడు రవి.
"నువ్వేం మాటాడుతున్నావో తెలుసా? వళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాటాడు. వాళ్ళకీ మా అబ్బాయికీ సంబంధ మేమిటి?" కస్సుమన్నాడు.
"తగ్గండి కాస్త! వాళ్ళతో పాటు మీ అబ్బాయిని కూడా స్టేషన్ కి తీసికెళ్ళారు అక్కడచూద్దురుగాని మీవాడి ప్రతాపం!" వ్యంగ్యంగా అన్నాడు రవి.
"వీళ్ళబ్బాయి చేశాడా?" ఆశ్చర్యంగా అడిగింది స్వప్న.
"అవును!"
"అయితే ఇదంతా ప్లాను ప్రకారం జరుగుతోందన్న మాట. ఇంతకు ముందు కూడా రెండుమూడు పర్యాయాలు అతను నాపై దౌర్జన్యం చేయబోయాడు, రాస్కెల్. వెంకట్రామయ్యగారూ! ఇక మీరు మా యింటికి రాకండి. నేనంతకంటే ఏం చెప్పలేను!"
"తల్లీ!"
"తల్లీలేదు చెల్లీలేదు. తండ్రీ కొడుకులు కలసినాటకం ఆడుతున్నారా ఇన్నాళ్ళూ! ఇప్పటికి మీ ఆటకట్టింది!" తలో మాట అన్నారు అంతా!
వెంకట్రామయ్య వంచిన హల ఎత్తకుండా వెళ్ళిపోయాడు. మరో అరగంట తర్వాత రవి, స్వప్న స్టేషన్ కి వెళ్ళి రిపోర్టు యిచ్చారు. గతంలో జరిగిందానిపై స్టేట్ మెంట్ యిచ్చింది స్వప్న.
అయితే అప్పటికే పోలీసులు వాళ్ళ ఉపాయాలతో మోహన్ చేత నేరం వప్పించారు. స్టేట్ మెంట్ తీసుకున్నారు.
వీళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి ఎవరో ఎక్స్ మినిస్టర్ ని పట్టుకుని వచ్చాడు వెంకట్రామయ్య. కేసు కాకుండా చూడమని ప్రాధేయపడ్డారు వాళ్ళు.
"లాభం లేదు సార్! ఈ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడని వారం రోజుల నాడే కమీషనరు గారికి ఫోను కొట్టేరు ఎవరో! అందుచేతే అప్పటి నుంచి మా వాళ్ళు మఫ్టీలో రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. రెడ్ హాండెడ్ గా పట్టేశాం వీళ్ళని. స్టేట్ మెంట్ తీసుకున్నాం. ఐ.జి.కి కమీషనర్ కి ఫోన్ చేశాను." అన్నాడు యస్.ఐ.
హతాశుడయ్యాడు వెంకట్రామయ్య.
చేసేదేంలేక వెళ్ళిపోయాడు మాజీమంత్రి.
