Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 40


    ఇబ్బందిగా అతనివైపు చూసింది పార్వతి. అతను దృష్టంతా రోడ్డుమీదే కేంద్రీకరించి డ్రైవ్ చేస్తున్నాడు.
    జీపు టాపుకి తాళ్ళతోగట్టి వేళ్ళాడుతున్నాయి. ఆరు గిజిగాడి గూళ్ళు. స్పీడుకి ముందుకీ వెనక్కీ ఊగుతున్నాయి అవి.
    అప్పుడు టప్పుమని ఒక గూటిలోనుంచి ఏదో పార్వతి చేతిమీదపడింది.
    ఉలిక్కిపడితడిమి చూసింది పార్వతి. మెత్తగా తడితడిగా తగిలింది అది.
    చటుక్కున అర్ధమయింది పార్వతికి అదేమిటో!
    గూట్లోంచి జారి పడింది చిన్నపక్షిపిల్ల! దాని తల్లేపిచ్చుక సైజులో ఉంటుంది.
    ఆ పిల్ల గోలీ అంత చిన్నదిగా ఉంది.
    బాధతో విలవిలలల్లాడి పోయింది పార్వతి హృదయం. ఈ గూళ్ళలో ఒకదానిలో పక్షి పిల్ల ఉంటుందని ఊహించలేదు తను!
    ఆరోజు మధ్యాహ్నం ఆడవాళ్ళందరూ కలిసి కాసేపు సరదాగా తోటలో తిరిగివచ్చారు. అక్కడ పెద్ద దిగుడు బావి ఉంది. దానికి అడ్డంగా కట్టిన వైరుకి వేల్లాడుతున్నాయి కొన్ని డజన్ల గిజిగాడిగూళ్ళు. ఆ పక్కనే చెరుకుతోట ఉంది. చెరుకు ఆకులు ఈనెల ముక్కుతో తీస్తుంది గిజిగాడు. ఎంతో ప్రయాసపడి వాటితో గూడు అల్లుతుంది. ఆ గూడు కూడా ఎంత నైపుణ్యంగా అల్లుతుందని?! తలక్రిందులు చేసిన పానపాత్రలా ఉంటుంది గూడు. డానికి కిందనుంచి ద్వారం ఉంటుంది. లోపల ఒక ప్రక్కకి ఒక రూములా ఉంటుంది. దాన్లో పెడుతుంది గుడ్లు.
    ఎవరునేర్పుతారు. ఈ చిన్ని పిట్టకు ఇంత పెద్ద ఇంజనీరింగ్ ఫీట్స్?
    ఆ గూళ్ళని చూసి ముచ్చటపడ్డ ఆడవాళ్ళు తోటమాలికి పురమాయించారు. వాటిలోకొన్నిటిని తెంపిజీపులో పెట్టమని, డ్రాయింగ్ రూంలో డెకరేషన్ కి బాగుంటాయని అనిపించింది వాటిని చూస్తే.
    వాళ్ళతోబాటు తను కూడా అడిగేసింది. ఒక గూడు తనకి కూడా కావాలని. ఇప్పుడు జీపులో వేళ్ళాడుతున్న గూళ్ళలో ఒకటితనది.
    మధ్యాహ్నం ఉత్సాహంతో ఎక్కువ ఆలోచించకుండా తనకీ ఒకటి కావాలని అడిగేసిందిగానీ ఇప్పుడు ఈ పిల్ల పక్షి కిందపడగానే ప్రాణం ఉసూరుమంటోంది. అవన్నీ ఖాళీ గూళ్ళే అని చెప్పి ఇచ్చాడు తోటమాలి. కానీ పొరబాటున ఒకదాన్లో పిల్లకూడా ఉందన్నమాట.
    ఎన్నాళ్ళు కష్టపడి ఆ గూడు కట్టుకుందో ఆ అల్పమైన పక్షి! ఎన్నాళ్ళు ప్రయాసపడి పొదిగిందో గుడ్లని! ఇప్పుడు గూడూ, పిల్లా కనబడకపోతే తన చిన్ని గుండె పగిలిపోయేలా రోదిస్తుందేమో అది! తన గూడు తీసుకెళ్ళి ఎవరో డ్రాయింగ్ రూంలో అలంకరించుకున్నారని గ్రహిస్తే శపిస్తుందేమో!
    ఈ పాపంలో తనకీ భాగం ఉంది! అపుడు!
    తల్లినీ, పిల్లనీ వేరుచేసింది తను!
    జీపు ఒక్కసారి జర్కుతో రోడ్డుపక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కంట్రోలులోకి వచ్చి తిరిగి రోడ్డు మధ్యకి వచ్చింది.
    ఆ విసురుకి జీపులో ఉన్న అందరూ ఉలిక్కిపడి మేలుకున్నారు.
    "ఎఇత్య? నిద్రా?" అంది రమేష్ గౌడ్ భార్య అతని మొహంలోకి పరీక్షగా చూస్తూ.
    చిన్నగా నవ్వాడు గౌడ్. "ఒక్కక్షణం! కళ్ళు మూతలుపడి పోయాయి."
    "కాసేపు పక్కన ఆపండి, నిద్రమత్తుతగ్గగానే వెళ్ళొచ్చు." అంది ఆమె.
    తల అడ్డంగా తిప్పాడు గౌడ్.
    "ఇక్కడకాదు. ఇంకో నాలుగైదు కిలోమీటర్లుపోతే అక్కడ మంచిహోటలుంది. అక్కడ కాస్త మొహంకడుక్కుని టీ తాగి వెళ్దాం. అయినా ఇంకెంత సేపులే! సిటీకి దగ్గరగా వచ్చేశాం!"
    అతనికి మళ్ళీ నిద్ర వస్తుందేమో అన్న భయంతో ఆపకుండా ఏదేదో మాట్లాడ్డం మొదలెట్టింది అతని భార్య. వాళ్ళ ఇల్లు సంగతి, ఇంటిమీద పై అంతస్తు వేయించే విషయం, అదీ ఇదీ.....
    'ఊ' కొడుతూ విన్నాడు గౌడ్. కొద్దిసేపటి తర్వాత జీపు ఆపాడు. అక్కడ రెండు హోటల్సు ఉన్నాయి. వాటిముందు చాలాఖాళీస్థలం ఉంది. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి అమర్చివున్నాయి రంగు రంగుల చిన్న లైట్లు. లారీలు ఆగివున్నాయి. అక్కడ లారీ డ్రైవర్లఆర్డరు ప్రకారం వేడివేడిపరాటాలు, కూరలు తయారవుతున్నాయి హోటళ్ళలో.
    ఆఖాళీస్థలంలో చాలా కుర్చీలూ, బల్లలూవేసి ఉన్నాయి. లారీడ్రైవర్లు ఎవరన్నా విశ్రాంతి తీసుకోదలుచుకుంటేవారికోసం నులకమంచాలుకొన్ని వేసి ఉన్నాయి.
    చాలా సందడిగా హుషారుగా ఉంది అక్కడి వాతావరణం.
    అప్పటిదాకా జీపులో అసౌకర్యంగా ఇరుక్కుని కూర్చుని ఉండడం అందరికీ కాసేపు కిందకు దిగాలనిపించింది దిగారు. రమేష్ టీలు ఆర్డర్ చేశాడు. టీలు తాగారు అందరూ, పిల్లలులోలిపాప్స్ కొనుక్కున్నారు.
    టీలుతాగడం అయ్యాక "అమ్మా! టాయిలెట్!" అంది పరావతి కూతురు లక్కీ చిన్నగా.
    చిరునవ్వు నవ్వి లక్కీని తీసుకుని కొంచెం చీకటిగా ఉన్న వైపు నడిచింది పార్వతి. ఆమెతోబాటే వెళ్ళారు మరికొందరు ఆడవాళ్ళు.
    రమేష్ గౌడ్ సిగరెట్ అంటించి హోటల్ ఓనర్ తో బాతాఖానీ మొదలెట్టాడు.
    అప్పుడు వినబడింది ఒక స్త్రీ పెట్టిన పెనుకేక!
    ఆ వెంటనే లారీ ఒకటి స్టార్టయిన శబ్దం!
    దానితోబాటే పసిపిల్ల ఆక్రందన!
    సిగరెట్ కిందపారేసి వేగంగా అటువేపు పరిగెత్తాడు గౌడ్.
    అప్పటికే ఒక లారీ కదిలి రివ్వున దూసుకుపోయింది హైదరాబాద్ వైపు.
    "అమ్మా.....అమ్మా.....అమ్మా...." అని పెద్దగా ఏడుస్తోంది మూడేళ్ళలక్కీ.
    "ఏమయింది? ఏమయింది? ఏమయింది?" అంటున్నారు అక్కడ పోగవుతున్న జనం ఆదుర్దాగా.
    "పార్వతి.....పార్వతి ఏదీ?" అంది ఒక స్త్రీ.
    "నేనూ లారీలో వెళతానూ! నేను జీపులో రాను! అమ్మతో లారీలో వెళతాను" అని ఏడుస్తోంది లక్కీ.
    ఆమె మాటలకి అర్ధం మనసులోకి ఇంకగానే కొద్దిక్షణాలపాటు నిశ్చేష్టులై నిలబడిపోయారు అందరూ.
    అందరికంటే ముందు తేరుకుంది రమేష్ గౌడే!
    "జీపు ఎక్కండి! క్విక్!" అన్నాడతను తన వాళ్ళని హెచ్చరిస్తూ.
    క్షణాల్లో అందరూ జీపులో ఎక్కేశారు.
    స్టార్టు చేసి టకటక గేర్లు మార్చాడు గౌడ్. సెకండ్లలో టాప్ స్పీడ్ అందుకుంది జీపు. చీకట్లో రివ్వునదూసుకుపోవడం మొదలెట్టింది.
    అల్లంతదూరంలో కనబడుతున్నాయి రాక్షసుడి కళ్ళలా ఎర్రగా మెరుస్తోన్న లారీ టెయిల్ లైట్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS