Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 39


    మోకాలికింద అంతా ప్యాంటు పీలికలైపోయి వుంది. కాలిచర్మం చాలా అంగుళాల మేరలేచిపోయి ఎర్రగా కనబడుతోంది. ఆ ఎరుపులోంచి తెల్లటిఎముక ఒకటి బయటకు పొడుచుకువచ్చింది.
    "సింపుల్ ఫ్రాక్చర్! దట్సాల్!" అన్నాడు మనోహర్ బాధని పళ్ళబిగువున సహిస్తూ.
    "ఇంకెక్కడా దెబ్బలు తగల్లేదు కదా!" అంది సీత. మనోహర్ తలని తన వళ్ళోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ, లేదన్నట్లు తలవూపాడు మనోహర్.
            
                                            9
    
    ఆ నలభై అంతస్తుల హోటల్ బిల్డింగ్ పక్కనే అంతే ఎత్తుగల మరో భవంతి నిర్మాణం జరుగుతోంది.
    ఆ భవంతి చివరి అంతస్తుకు చేరుకున్నాడు బ్రహ్మాజీరావు.
    అక్కడ కన్ స్ట్రక్షన్ కంపెనీ వారి క్రేన్ ఉంది. ఆ క్రేన్ కి ఒక పెద్ద బక్కెట్ లాంటిది వేలాడుతోంది.
    ఫైర్ ఫైటింగ్ సిబ్బందికూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు క్రేన్ ని తగలబడిపోతున్న హోటల్ బిల్డింగ్ మీదకు వాలేటట్లు చేస్తుంటే అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ముగ్గురేసి చొప్పున ఆ బక్కెట్లో ఎక్కుతున్నారు. వాళ్ళని ఇవతల బిల్డింగుమీదికి సురక్షితంగా దింపుతోంది క్రేన్.
    అప్పుడు కనబడింది బ్రహ్మాజీరావుకి ప్రమీల!
    షాక్ తో నిశ్చేష్టురాలై వుందితను, క్రేన్ వంగినప్పుడల్లా జనం తోసుకుని బక్కెట్లో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు.
    కానీ అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యకుండా నిశ్చలంగా నిలబడి వుంది తను.
    "ప్రమీలా!" అని కేక పెట్టాడు బ్రహ్మాజీరావుగుండెలవిసి పోయేటట్లు"ప్రమీలా! ఆ బక్కెట్లో ఎక్కెయ్ ప్రమీలా!"
    ఆ రొదలో అతని మాటలు ప్రమీలకి వినబడలేదు.
    ఆదుర్దాగా అటూ ఇటూ చూశాడు బ్రహ్మాజీరావు.
    వెదురుబొంగులతో దడిలాగా కట్టివున్నది ఒకటి నిలబెట్టివున్నది అక్కడ! త్వరత్వరగా దాన్ని రెండుచేతులతో ఎత్తుకొచ్చి పిట్టగోడమీద నుంచి వాల్చాడు బ్రహ్మాజీరావు.
    అది నెమ్మదిగా ఒరిగి తగలబడిపోతున్న హోటలు పిట్టగోడని ఆనుకుంది.
    ఇప్పుడు ఆ రెండు బిల్డింగుల మధ్య చిన్న వంతెనలా ఏర్పడింది.
    కానీ ఎలాంటి వంతెన అది?
    అతి బలహీనంగా అల్పంగా వుంది. బ్రహ్మాజీరావు లాంటి బలిష్టుడు ఎక్కితే అది ఆ బరువును తట్టుకుంటుందో లేక మధ్యకు విరిగి ఊరుకుంటుందో తెలియదు.
    పైగా అది వెదురుబొంగులతో చేసినది.
    ఏ క్షణాన మంటలు దాన్ని అంటుకుంటాయో తెలియదు!
    కానీ ప్రాణానికి ప్రాణం అనుకున్న వ్యక్తి ప్రాణాపాయంలో వున్నప్పుడు ప్రాణభయంకూడా తెలియకుండా పోతుంది చాలామందికి.
    అందుకనే అట్టే ఆలోచించకుండా దాని మీదకు ఎక్కేశాడు బ్రహ్మాజీరావు.
    వెదురుబొంగుల మధ్య ఎడం వుంది. బొంగులు సన్నగా వున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలమీద ఆశ వదులుకోవలసిందే.
    తగలబడిపోతున్న బిల్డింగు మీదికి మళ్ళీ ఒంగింది క్రేన్. మళ్ళీ జనం కెరటంలా విరుచుకుబడ్డారు.
    ఆ తాకిడికి ఉన్నట్లుండి నెట్టివేయబడినట్టయింది ప్రమీల. ఆమె తల బలంగా గోడకి తాకింది. చప్పున మెలకువవచ్చినట్లయింది ఆమెకు.
    షాక్ లో నుంచి బయటపడగానే ఆమెకు గమనానికి వచ్చిన మొదటి సంగతి!
    వేడి! దుర్భరమైన తాపం!
    వంట్లోని కండరాలన్నీ ఉడుకుతున్నట్లు భ్రాంతి!! రక్తం సలసలామరిగి ఆవిరై పోతున్నట్లు భ్రమ!! కళ్ళలోని ద్రవాలు కరిగి కారిపోతున్నంత బాధ!! నోట్లో తడి ఆరిపోయి, నాలుకముడుచుకుపోయి చిన్నదయిపోయినట్లు భావన!
    ఈ బాధను భరించడంకంటే పరిగెత్తి పిట్టగోడదగ్గరికి నడిచింది ప్రమీల.
    ఇక్కడనుంచి దూకెయ్యడం మేలు. దూకెయ్యగానే కొద్దిక్షణాల్లో నేలనుతాకుతుంది తనదేహం.
    కిందపడిపడగానే వంట్లో ఉన్న ప్రతి ఏముకా విరుగుతుంది కపాలం పగిలిపోతుంది.
    తక్షణం మరణం సంభవిస్తుంది.
    అప్పుడిక ఈ తాపం తనని తాకదు.
    ఒక నిశ్చయానికొచ్చి పిట్టగోడ ఎక్కింది ప్రమీల. అతి తీవ్రమైన ఆ వేడిమిని భరించలేక అప్పటికే పదిమంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కిందికి దూకేశారు. సరిగ్గా అదేక్షణంలో వెదురు బొంగుల వంతెన దాటి ఆ బిల్డింగ్ మీదికి చేరుకున్నాడు బ్రహ్మాజీరావు.
    "ప్రమీలా!" అని కేకపెట్టాడు బిగ్గరగా.
    "ప్రమీలా! నేను వచ్చేశాను ప్రమీలా! నిన్ను బతికించుకుంటాను ప్రమీలా! ప్రమీలా!"
    దూకబోతున్న ప్రమీల ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమెచూపులు అతని చూపులతో కలుసుకున్నాయి.
    కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె శరీరం ముప్పాతికమూడొంతులు ముందుకు ఒరిగిపోయింది.
    మరుక్షణం ఆమె కాళ్ళు గాల్లోకి లేచాయి. ఆమె అదృశ్యమైపోయింది.
    వ్వవ్వవ్వ
    పల్లెటూరి మట్టిరోడ్డునిదాటి నేషనల్ హైవే మీదికి వచ్చింది ఆ జీపు. హైదరాబాద్ దిశగా పయనించడం మొదలెట్టింది.
    వెనకసీట్లో కూర్చుని వున్న పార్వతి రిస్ట్ వాచ్ చూసుకుంది. తొమ్మిదిన్నర అవుతోంది. హైదరాబాద్ కి రెండున్నర గంటలప్రయాణం అని చెప్పారు. అంటే ఇల్లు చేరుకునేసరికి అర్ధరాత్రి కావచ్చు.
    రాత్రికి ఉండిపొమ్మని తెల్లారగానే బస్ కి వెళ్ళిపోవచ్చని బలవంతం చేశారు పెళ్ళిలో బంధువులు. కానీ తన భర్తనీ, పెద్దమ్మాయి రాజశ్రీని ఇంటిదగ్గర వదిలేసి చిన్నమ్మాయి లక్కీని మాత్రం వెంటబెట్టుకుని పెళ్ళికి వచ్చింది. ఆయనకు ఆఫీసులో ఇన్ స్పెక్షన్ జరుగుతోంది. టెన్త్ క్లాస్ చదువుతున్న రాజశ్రీకి సూల్లో యూనిట్ టెస్టులున్నాయి. అందుకని వాళ్ళిద్దరూ పెళ్ళికి రాలేదు. తెల్లారేసరికి తను ఇంట్లో ఉండకపోతే వాళ్ళ పనులువాళ్ళు చేసుకోలేకసతమతమైపోతారు ఇద్దరూ. ఇల్లంతా ఆగంఆగం అయిపోతుంది. అందుకనే రాత్రికి ఎలాగైనా హైదరాబాద్ చేరిపోవాలని తన తాపత్రయం. అదృష్టవశాత్తూ ఆడపెళ్ళివారి తరపు జీపు ఒకటి హైదరాబాద్ వెళ్తుంటే దాన్లో ఎక్కించేశారు తనని. డ్రైవ్ చేస్తున్న అతనిపేరు రమేష్ గౌడ్ అట. అతని పక్కన అతని భార్యాపిల్లలు కూర్చుని ఉన్నారు. వెనకసీట్లో తనతోబాటు మరో ముగ్గురు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు.
    జీపు హెడ్ లైట్ల వెలుగు తప్ప చుట్టూ అంధకారంగా ఉంది. పార్వతి ఒళ్ళో పడుకుని ఆమె నడుముని చేతులతో చుట్టేసి నిద్రపోతోంది లక్కీ పెళ్ళి భోజనం హెవీ కావడం వల్ల పార్వతికి కూడా కళ్ళుమూతలు పడిపోతున్నాయి. తక్కిన ఆడవాళ్ళందరూ జీపు కదిలిన పదినిమిషాల్లోనే జోగడం మొదలెట్టారు. తమ అందరికీ నిద్ర ముంచుకువస్తుంటే ఆ ప్రభావం డ్రైవ్ చేస్తున్న రమేష్ గౌడ్ మీద పడదా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS