Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 39

 

    "సిగ్గు పక్కకు పెట్టి త్వరగా చెప్పవే. టెన్షన్ తో చస్తున్నాను."


    "మా బావ శ్రీచంద్ర అని....."


    "బావా? బావని ప్రేమించావా?" ఆశ్చర్యంగా అడిగింది సుశీల.


    "అవును. బావంటే నాకు ప్రాణం. నా చిన్నప్పట్నుంచి అతన్నే ప్రేమిస్తూ వచ్చాను." తన్మయంగా అంది సమీర.


    "బావల్ని ప్రేమించడం ఏంటే అసహ్యంగా!"


    "అంటే ఏంటే నీ ఉద్దేశం నా కర్ధం కావడం లేదు. బావని ప్రేమించకూడదా?"


    "కూడదు. బావలతో జోక్స్ కట్ చేస్తూ జాలిగా, హేపిగా ఫ్రీ గా టైమ్ స్పెండ్ చేయడానికే బావల్ని ఉపయోగించుకోవాలని గానీ ఇలా ప్రేమించడాలూ, పెళ్ళి చేసుకోవడాలూ అస్సలు బాగుండవు. ఓల్డ్ లవ్ ట్రాకు నువ్వునూ!"


    
    "చంపేస్తా. ఇంకొక్క మాట ఎక్స్ ట్రాగా అన్నావంటే!" అంది సమీర దువ్వెన సుశీల వైపు విసిరేస్తూ.


    "నాకేం పోయింది తల్లి. నీ కోసమే చెప్పాను. బావల్ని ప్రేమించడం, బావని పెళ్ళి చేసుకోవడం అంతా పాత పద్దతి . ఇప్పుడంతా న్యూ సిస్టమ్."


    "ఏమిటో! ఆ న్యూ సిస్టమ్?" వెక్కిరిస్తూ అంది సమీర.


    "[ఫరెగ్జాంపుల్. ఒక్కడే కొడుకున్న ఏ అబ్బాయినో చూసుకోవడం ఒక పద్దతి. ఆడపడుచులు లేకుండా చూసుకుని లవ్ చేయడం రెండో పద్దతి. అత్తమామలు లేని వాళ్ళని చూసి ప్రేమించడం మరో పద్దతి. స్టేట్స్ లో సేటిలయ్యేవాడ్ని చూసి ప్రేమించడం కాస్ట్ లీ పద్దతి. ఇలా డిఫరెంట్ ఆఫ్ లవ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ వదిలేసి పాత చింతకాయ పచ్చడిలా 'బావని ప్రేమించడానికి' సిగ్గేయడం లెదూ....."


    "నీ మొహం.....చిన్నతనం నుండే మా బావతోనే పెళ్ళి చేయాలని ఇరువర్గాలవారూ డిసైడ్ అయిపోయారు. నా చిన్నతనం నుండే శ్రీచంద్ర నా భర్తని ఫిక్స్ అయిపోవడం వలన నేను కూడా అలాగే డిసైడ్ అయిపోయాను. కాకపోతే బావకి ఇంకా ఉద్యోగం లేదని పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు. ఉద్యోగం రాగానే వెంటనే పెళ్ళి ముహూర్తం పెట్టస్తారు తెలుసా?"

 

    "మరి మీ బావే కదా! మీ అమ్మ నాన్నలకి భయపడతావెం ఫోటోలు చూస్తారని!"


    "ఎంత పెళ్లి కుదిరినా , బావే అయినా ఇలా కలిసి వెళ్ళడం నాన్నకి ఇష్టం ఉండదు. అలా తిరగొద్దని అంటారు. అమ్మకి కూడా అంతగా నచ్చదు. అందుకే మేం ఇద్దరం ఎక్కడైనా కలుసుకున్నా పెద్దవాళ్ళకి చెప్పం......"

 

    "అది ఒకందుకు మంచిదేలే!"


    "ఎలా?"


    "కనీసం లవ్ లో పడ్డావన్న థ్రిల్లయినా వుంటుంది నీకు."


    "ఓ అదా! ఇంతకీ తమరేవర్ని లవ్ చేస్తున్నారో?"


    "ఏది ఇంకా ఎవడు లైన్లో పెడదామంటే దొరకందే!" అంది నిరుత్సాహంగా సుశీల.


    'అంటే అదే ప్రయత్నంలో వుంటావా లేచిన దగ్గర్నుండి?" వింతగా చూస్తూ అంది సమీర.


    "మరే. ఎదురింటి అంటి కొడుకుని, పక్కింటి అంకుల్ కొడుకుని, వీధి చివర ప్లాట్ ఓనర్ ని చూస్తూ.....ఎవరు సుటవుతారా అని ఆలోచిస్తుంటా!"


    "నీ మొహం! ప్రేమంటే అది కాదే. తొలిచూపులోనే ఓ స్పందన కలుగుతుంది.అది ఎప్పుడు ఎలా ఎందుకు ఎవరి మీద కలుగుతుందో చెప్పలేం. ప్రేమంటే అది. అంతేగానీ నీలా అన్నీ చూసుకుని వారం వర్ధ్యం తిది, నక్షత్రం అన్నీ చూసుకుని ప్రేమించడం కాదు తెల్సుకో."


    "ఒకే....ఒకే. ప్రేమమీద ఒక్కొక్కరికి ఒకో అభిప్రాయం. నీ ఇష్టం నీది. నా ఇష్టం నాది. సరేనా! అవునింతకి ఈ పార్కుకి ఎప్పుడేళ్ళారేమిటి?"


    "మళ్ళీ మొదలు పెట్టావా?"


    "నువ్వు చెప్పేవరకు వదల్ను!"


    "అదేం లేదులే. షూటింగ్ కవరేజికి వెళ్ళినప్పుడు బావ కూడా వచ్చాడు. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి. చాలా? ఇంకా వివరాలు కావాలా?" దీర్ఘం తీసింది సమీర.

 

                                                                * * *


    ట్రింగ్....ట్రింగ్....ట్రింగ్.


    "హలో ట్రింగ్....ట్రింగ్....సమీరగారా?"


    "ఆవునండి!"


    "హలో మేడమ్ బాగున్నారా?"


    "ఆ! బాగున్నాను. మీరెక్కడ్నుంచి మాట్లాడుతున్నారు?"


    "సత్తుపల్లె నుండి మాట్లాడుతున్నాను మేడమ్!"


    "ఏం పల్లె?"


    "సత్తుపల్లె"


    "ఓహొ! మీ పేరు?"


    "అన్నబత్తుల వీర వెంకట సత్యనారాయణ పాండురంగ విఠల కృష్ణ మోహన సత్య సూర్య వర ప్రసాదండి!"


    "హలో ప్రసాద్ గారూ! అంత పొడవుందెంటండి, మీ పేరు?"


    "ఏం చేయను చెప్పండి. మా ఇంట్లో పెద్ద వాళ్ళందరూ కలిసి అందరి దేవుళ్ళకి మొక్కేసుకుని ఇంత పెద్ద పేరు పెట్టసారు. నా పెద్ద పేరు వల్ల కొన్ని చిక్కులొచ్చాయి గానీ అదేమిటో నండి.....ఈ రోజు మీరు అడుగుతుంటే మాత్రం ఎస్టిడి బిల్లు చూసినా నాకు ఏమి బాధనిపించడం లేదు."


    "అంతా మీ అభిమానం అండి" అంటూ ఓ పిచ్చి నవ్వు నవ్వి "మీకే పాట కావాలండి!" అంది.

 

    వాణిశ్రీ గారు చెంగావి రంగు చీర కట్టుకుని, ఎఎన్ఆర్ గారు కర్చీఫ్ పట్టుకుని డ్యాన్స్ చేస్తారు చూడండి ఉటి కొండల్లో ఆ పాట కావాలి."


    "మీరు వాణిశ్రీ ఫ్యానా?"


    "కాదండి ఎఎన్ఆర్ గారి లైటుని"


    "మీ అభిరుచులు ఏంటో చెప్తారా?"


    "ఆ! ఏ మనిషికయినా ఏం అభిరుచులుంటాయండి! తీపి, పులుపు, కారం , కమ్మదనం.....అవేగా! ఆ రుచులేనండి!"


    సమీర జుట్టు పిక్కుని ఫోన్ విసిరికొట్టి కెమెరా ముందు నుండి వచ్చేయాలనిపించింది. కానీ నో కట్స్ అని చెప్పెడ్చేడు డైరెక్టరు. అడ్డమైన మెంటలేక్కిన ప్రతివాడితోనూ ఇలా ఫ్రెండ్ లా నవ్వుతూ మాట్లాడాలా? చీ....చీ....ఏం యాంకరింగో, ఏంటో? అనుకుంది కోపంగా. అయినా తప్పదు. నవ్వు ముఖానికి పులుముకుని ఏదో ఒక పిచ్చి వాగుడు వాగాల్సిందే అదే తన ఉద్యోగమయ్యే......ఖర్మ....ఖర్మ.....అనుకుంది.


    "సరే. మీరు అడిగిన పాట చూడండి."


    "ట్రింగ్.....ట్రింగ్......


    "హలో సమీరగారా?"


    "అవునండి!"


    "సమీరగారూ బాగున్నారా? మీరంటే నాకు భలే ఇష్టం అండి"


    "థాంక్సండి. ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు?"


    "పాలకొల్లు నుండి అండి!"


    "ఆ! ఏ కోల్లు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS