Previous Page Next Page 
అష్టపది పేజి 39


    
    "సందేహాలు అనుమానాలు కాదు డాక్టర్ గారూ! నేను చెప్పేది సాంతం విని నా అనుమానాలు తీర్చండి. జరిగింది ఏమిటో అర్ధం గాక బుర్ర గిర్రుగిర్రున తిరిగిపోతున్నది" శీతల్ అంది.    

 

    "అసలే తలకి దెబ్బ తగిలింది అలా గిర్రున గిర్రున తల తిరగటం మంచిది కాదు. విషయమేమిటో వివరంగా చెప్పు. డాక్టర్ ముందు పేషెంట్ ఏదీ దాయకూడదు" డాక్టర్ పరంజ్యోతి అన్నాడు.
    
    శీతల్ క్షణకాలం ఆలోచించి చెప్పసాగింది.
    
    "కారులో ప్రయాణిస్తున్నాను. అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మా! అని అరిచిన గుర్తు కూడా లేదు. ఉన్నట్లుండి తెలివి వచ్చింది. అప్పుడు నేని రాజాఃతపురంలో హంస తూలికాతల్పం మీద వున్నాను. ఇదేమిటి ఇక్కడ వున్నాను! నేను రాజకుమార్తెను కానే! నే వున్నది రోమ్ లో కాదే అనుకున్నానో లేదో.
    
    ఇరువురు నీగ్రో బానిసలు నా ముందు ప్రత్యక్ష మయ్యారు. వాళ్ళదేదో భాషలో మాట్లాడారు. సలాం లాంటిది చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాక్షస జాతి స్త్రీలు వచ్చారు. కోరలు, కొమ్ములు తప్పించి అచ్చం రాక్షసులు లాగానే వున్నారు వాళ్ళ రూపం అలా వున్నా నన్నేమి అవలేదు. బాధించలేదు. భోజనం దగ్గర నుండి అన్ని అవసరాలు చాలా చక్కగా చేశారు. వాళ్ళూ అంతే అదేదో భాషలో మాట్లాడారు.
    
    మర్యాదలకి లోపం లేకపోయినా ఓ విధంగా బందీను నేను. గదిలోంచి బైటికి వద్దామంటే విచ్చుకత్తులతో ఇద్దరు సిపాయిలు గది గుమ్మం బైట కాపలా వున్నారు ఓ రోజు వళ్ళుమండి గాజు సామాను, ఇంకా విలువైన వస్తువులు పగలకొట్టాను. పన్నేమి అనకపోగా మళ్ళి అన్నీ కొత్త వస్తువులను తెచ్చి గదిలో అమర్చారు.    

 

    శీతల్ జరిగిందంతా చాలా వివరంగా చెప్పింది.
    
    అంతా విని డాక్టర్ పరంజ్యోతి, లోకేశ్వరరావు నవ్వారు. "వినడానికి చాలా బాగుంది" అన్నారు.  

 

    "మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ముందే నిజమే చెపుతున్నాను" అంది శీతల్.
    
    "ఇదంతా పెద్ద కల" అన్నాడు లోకేశ్వరరావు.    

 

    "ఇదంతా నిజంగా కలే అయితే చేతికి గాజుపెంకు గుచ్చుకున్న గాయం ఎలా మాయం కాకుండా వుంది నా బ్రాసరీ లంగాని గుర్తుగా చిన్న కొర్రుపట్టినట్లు చింపారు ఆ చినుగు అలా ఎలా వుంది? ఈ నాటకం ఏమిటి? ఇది మీకు తెలిసి ఆడుతున్న నాటకమా? తెలియనట్లు నటిస్తున్నారా!" అని శీతల్ కోపంగా అడుగుదామనుకుంది ఇలాంటప్పుడు కోపంతో పనులు సాధించలేరు. నవ్వుతూ నవ్వుతూనే నాలుగు తెలుసుకోవాలి. వాళ్ళ వేలితో కన్ను పొడిస్తే సాక్ష్యం వుండదు" అనుకుంది.
    
    "ఇది కల" డాక్టర్ పరంజ్యోతి అన్నాడు.

 

    "ఇంత పెద్ద కల మరీ ఇంత సహజంగా ఎలా వుంటుంది?" శీతల్ అమాయకంగా ముఖం పెట్టి అడిగింది.    

 

    "ఎందుకుండదమ్మా! వుంటుంది. కలల్లో కూడా చాలా రకాలు వుంటాయి. రాత్రంతా ఒకే కల రిపీట్ అవుతుంటుంది. అలాగాక సీరియల్ కలలు కూడా వుంటాయి...
    
    "సీరియల్ కలలా?" శీతల్ తెల్లబోయి అడిగింది.
    
    'ఎస్ సీరియల్ కలలే. పడుకోగానే ఓ కల వస్తుంది. అకస్మాత్ గా మధ్యలో లేస్తాము. కల చెదిరిపోతుంది. లేచి మంచినీళ్ళు తాగి పాస్ కెళ్ళి వచ్చి మళ్ళీ నిద్రపోగానే ఇదే కల తరువాత భాగం కలగా వస్తుంది. దీనిని సీరియల్ కల అంటారు.
    
    డాక్టర్ పరంజ్యోతి చెపుతుంటే శీతల్ మధ్యలో అడ్డు తగిలి" ఈ సీరియల్ కలలు సాంఘీకమా! సస్పెన్స్ త్రిల్లరా!" అనడిగింది.
    
    "ఇవి వార మాసపత్రికల్లో వచ్చే సీరియల్స్ కాదు. నేను చెప్పేది సీరియల్ కలలు గురించి నీ భాషలో చెప్పాలంటే హర్రర్ కలలు కూడా వుంటాయి. కలలో భయంకర దృశ్యం చూసి మతిచెదిరిన వాళ్ళు నాకు తెలుసు. ఎప్పుడో జరిగేవి ఇప్పుడు కలగా కొందరు కన్నారు..."
    
    అంటూ డాక్టర్ పరంజ్యోతి కలల గురించి కథలు చెప్పాడు.
    
    డాక్టర్ గారికి వంతపాటగా లోకేశ్వరరావు తాన అంటే తంధాన అనటం మొదలు పెట్టాడు.
    
    అటు డాక్టర్ ఇటు లోకేశ్వరరావు కలసి ప్లాన్డ్ గా నాటకం ఆడుతున్నారని శీతల్ గ్రహించింది. తానూ నాటకం ఆడక తప్పదు. ప్రస్తుతం తానున్న పరిస్థితులలో నాటకం ఆడడం వక్కటే మార్గం అని కూడా అనుకుంది. కాసేపు వాదించి చివరికి...
    
    శీతల్ వాళ్ళ మాటలు నమ్మినట్లు నటించింది.    

                               

                               23
    
    "ఈ ఇల్లు ఎలా వుంది?"
    
    శీతల్ కలసి భోంచేస్తూ అడిగాడు లోకేశ్వరరావు.    

 

    "ఈ మాట ఇప్పటికి ఏ పదిసార్లు అడిగి వుంటారు అంకుల్!" ఆమె నవ్వుతూ అంది.
    
    "పెద్దవాణ్ణి అయ్యాకదా మతిమరుపు వచ్చేసింది" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
    
    ఇరువురు మాట్లాడుకుంటూ భోంచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు అన్ని విధాలా అన్ని వసతులతో చాలా బాగుంది. ఇంట్లో వంటావిడ వుంది.
    
    కాకపోతే ఆమెగారి రూపం చిన్న సైజు హిడింబిని పోలివుంది. ఇంటి మొత్తం మీద పని వాళ్ళు ఆడ, మగ కలసి అరడజను మంది వున్నారు. వాళ్ళ రూపాలు అలాగే వున్నాయి.    

 

    వంటమనిషి, ఇల్లు సర్ధడానికి మనిషి, తోటమాలి బజారు నుంచి వస్తువులు తేవటానికి చిన్న నౌకరు, అంట్లు తోమి గుడ్డలు వుతకటం వగైరా చిల్లర పనులకి ఇంకో అతను ఇలా తలో పనికి ఆ యింట్లో వున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS