"ప్చ్! ఆ తెలివి శూన్యమే లేకపోతే తొలిరాత్రి అంత తెలివితక్కువగా గడిచేది కాదుగా?"
ఓరగా చూసింది. అది అస్తమించే సూర్యుడు అందించిన అనురాగమో, లేక బిడియమో ఆమె చెంపలు మందారాలయ్యాయి.
"సీ మిస్టర్ రాఘవా! చెప్పింది చేస్తారా, లేక ప్రతిదానికి ఉపామానాలు, ఉత్ప్రేక్షలు వాడుతూ నన్ను రెచ్చగోడతారా?"
"ఆ రెచ్చగొట్టటమే చేతనైతే రాత్రి అలా....."
"అబ్బా" తల పట్టుకుంది.
"ఒకే. ఒకే. ఇక అల్లరి చేయను. చెప్పు.....అరగంటలో మొత్తం అంతా నేర్పేస్తా."
మొదలయింది నెమ్మదిగా. పెద్దగా శ్రమ పడలేదు. పది నిమిషాలలో బొజ్జన్న కొండ దాకా కారు డ్రైవ్ చేశాడు ఎలాంటి తొట్రపాటు లేకుండా.
నమ్మలేకపోయింది కిన్నెర. ఇంత త్వరగా గేర్స్ మార్చడం గాని, కన్ ఫ్యూజ్ కాకుండా నడపడం గాని ఆమె ఉహ కందని విషయం.
"గాడ్! చాలా త్వరగా గ్రహించేశారు."
"గ్రహింపూ లెదూ, గాడిద గుడ్డూ లేదు" ఓ చోట ఆ కారాపి అన్నాడు. "ఇందులో మాత్రం నాకు అనుభవం వుంది" అన్నాడు 'మాత్రం' అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ.
అర్ధం కానట్టు చూసింది.
"నీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాయి కదూ!"
"అల్లరి చాలించి చెప్పండి. మీ కింతకు ముందే అనుభవం ఉందా. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు?"
కనుచూపు మేర దాకా కనిపిస్తున్న పచ్చని పంట పొలాల్ని , నిర్మానుష్యంగా వున్న ప్రదేశాల్ని , ఆకాశంలో అలసటగా పడమటి దిక్కువేపు సాగిపోతున్న సూర్యుడ్ని చూస్తూ అన్నాడు- "చెప్పి వుంటే నీతో కలిసి యిలా ప్రయాణం చేసే అవకాశం జారిపోయేది కిన్నెరా! గోరువెచ్చని సూరీడు.....చల్లని సాయంకాలపు పిల్ల తెమ్మెర....పక్కన ఓ కన్నెపిల్ల- "
"ఇప్పుడు నేను శ్రీమతిని."
"కాని, ఇంకా కన్యవేగా!"
"సిగ్గుతో ఆమె తల వాలిపోయింది.
"ఏం.....తప్పన్నానా?"
ఇక నిగ్రహించుకోలేనట్టు అమాంతం అతడ్ని చుట్టి ఉక్రోషంగా చెంపల్ని కొరికింది. "మాటల పోగు!"
"అంతే......వట్టి మాటలేగా?"
ఇక ఆ పెద్దమనిషితో ఇక్కడే ఉంటే కొంప ముంచెట్టున్నాడు. "వెల్లిపోదాం" అంది బయటికి చూస్తూ.
"ఇగ్నిషన్ తిప్పేదా.....అదే......ఇంజన్ అన్ చేస్తాను" కిన్నెర కళ్ళలో కోపాన్ని చూస్తూ కారు వెనక్కు తిప్పాడు.
"ఎలా ఇతడితో?
ఈ రాత్రికి ఎలా ఆపాలి?
తనకూ అది కష్టంగానే ఉన్నట్టు ఆమెకు స్పష్టంగా అర్ధమైపోతుంది.
* * * *
రాత్రి పది గంటలు కావస్తుండగా పడగ్గదిలో అడుగు పెట్టింది కిన్నెర.
రాఘవ త్రాచులా బుస కొట్టాడు. "ఇంత రాత్రి దాకా నేనేం చేయాలట?"
"వీసిఆర్ ఏర్పాటు చేశానుగా! ఏదన్నా సినిమా చూస్తూ గడిపేయాల్సింది" భయపడుతూనే అతడి సమీపంలో కూర్చుంది. "మంచి తెలుగు సినిమా కేసెట్ వుంచాను."
"అంటే!" రోషంగా అన్నాడు. "శోభనం గదిలో కేసేట్స్ చూసుకుంటూ గడపాలంటావ్!"
"ఆహా.......నే నోచ్చేదాకా అని."
"అసలు నువ్వు రావటం ఆలస్య మెందుకైందా అని అడుగుతున్నాను."
"మా నాన్నగారేదో మాట్లాడుతుంటే......"
అర్దోక్తిలోనే ఖండించాడు రాఘవ. "రేపు మీ అన్నయ్య ఏదో మాట్లాడుతుంటాడు. అంతే ......అప్పటిగ్గాని నా మూడు రాత్రులు పూర్తీ కావు.'
రాఘవ, సరదాగా మాట్లాడుతున్నట్టు లేదు. చాలా సీరియస్ గా వున్నాడు.
"ఏమిటలా చూస్తున్నారు.....?" చేతి వేళ్ళతో పందిరి మంచం పై రాస్తుంది తల వంచుకుని. "నా వలన తప్పు జరిగితే నేమ్మదిగాచేప్పొచ్చుగా?"
రెప్పలార్పకుండా చూశాడు.
అహంకారానికి మరో రూపంలా బ్రతికిన అమ్మాయి, చూపు మాత్రంగానే ఎవర్నయినా శాసించి కంగారు పెట్టగల కిన్నెర యిప్పుడు ఓ మాములు ఆడపిల్లలా బిక్కమొహం వేసుక్కుర్చుంది.
జాలేసిందేమో, ఆప్యాయంగా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. "కిన్నెరా! నువ్వు ఇప్పుడు నా భార్యవు కావచ్చు. కాని అంతకు మించి నాకు ఉహకందని అదృష్టానివి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కలనైనా నేనుహించని ఓ నిజానివి. అందుకే ఇది కలేమో అన్న భయంతో నీకు మరింత దగ్గర కావాలనుకుంటున్నాను. ఆ క్షణం కోసం తపించిపోతున్నాను.......తప్పా?"
మనసు ద్రవించేలా మాట్లాడతాడెం? కోపంతో నాలుగు మాటలు అని నిన్నటిలా పడుకోవచ్చుగా? ఇలా మరింత ప్రేమను ప్రదర్శించి తనను ఓడించాలని ప్రయత్నిస్తాడెందుకని?
"మాట్లాడు కిన్నెరా! ఒక మధ్య తరగతి జీవితంలో కలలకు వాస్తవానికి మధ్య ఉన్న శూన్యాన్ని పూడ్చలేక జీవితమంతా ఇబ్బందిపడాల్సిన నేను, నీ అభిమానంతో అసలు కోరినా సాధ్యం కాని ఓ సింహాసనాన్ని అధిరోహించాను. నువ్వు నా ఉహకు మించిన స్థాయి ఆడపిల్లవై నా సహజమైన కోరికనిలా ప్రకటించడం నా నేరమా?"
