"అవును! కాదంది ఎవరు? ఎవరేమన్నా అన్నారా ఏంది. సెప్పు అళ్ళ తోలు వొలిసేత్తాను" అంది కాళమ్మ పొయ్యి వుదుతూ.
"అబ్బ, అదికాదే ....ఇప్పుడు ఎంటంటే ...ఒద్దులేయే...నీ నోట్లో అసలు ఏది దాగదు....ఈపాల్నే పోయి అయ్యగోరితో చెప్పేత్తావ్...అన్నాడు బీడి దమ్ము లాగుతూ.
"ఏంది మావా! అసలు ఇషయం సెప్పు మావా.....ఏటయిందో" అంది కాళమ్మ.
వెంకటేశం కల్లు సీసా ఎత్తి రెండు గుక్కలు తాగాడు.
"నేనెవరికి సేప్పన్లె మావా సెప్పు. ఇదిగో సేపముక్క నంజుకో అంటూ యిచ్చింది కాళమ్మ.
"ఏందే నాచేత ఇషయం సెప్పించుకోటానికి....సే....సేపముక్క ఎరగా ....ఎ...ఏ...ఎత్తున్నవెంది?" అన్నాడు తాగిన మైకంలో.
"అబ్బ! కాదులే మావా! నీతో ప్రతిది తంటానే . కాలికేస్తే ఎలికేత్తావు...." అంది కాళమ్మ.
"మరదే....నేనేవర్ననుకున్నావెంది? వెంకటేశం అంటే అయ్యగోరికి నమ్మినబంటుని. ఆయనకోసం నా శర్మం వొలిచి సెప్పులు కుట్టిమన్నాకుడతానే...." అన్నాడు.
"అబ్బో...అడ శర్మం ఏడుందిలే....తాగి తాగి బోనికిలీగా మిగిలింది" అంది కాళమ్మ పెడసరంగా.
"ఈ బోనికల్లో ఎంత బ...బలం వుందో తెలుసా నీకు? అన్నాడు వెంకటేశం.
"ఓయబ్బో.....నాకు తేలిక ఇంకెవరికి తెలుత్తది.....?" అంది సిగ్గుపడుతూ.
"సెత్....చినబాబుగార్ని అసలు ఇయ్యలా సంపెయాలనుకున్నానే" అన్నాడు సీరియస్ గా.
"ఏంది మావా? ఏందిమావా నువ్వనేది? ఒన్నాయనో ....ఈడికి నిజంగానే బాగా ఎక్కినట్టుంది. నీ మాటలు ఎవరైనా ఇంటే నిన్ను సంపెత్తారు తాగుబోతు ముండాకొడకా...." అంటూ శోకాలు తీసింది.
"ఓసినియమ్మకడుపుమాడా....ఎంటే.....ఏంది అట్టా ఎడుత్తావేందే? ముదనత్తపుదానా!" అన్నాడు మరో బీడి వెలిగించుకుంటూ.
"అసలేమైందో సెప్పు మావా! ఇయ్యాలంతా నువ్వు పనిలోకి పోలేదు. అమ్మగారు కోప్పడతారు మావా! ఎందుకు తగుతున్నావో సెప్పు మావా? చిన్నయ్యగోరు ఏంసేశారు?" అంది కాళమ్మ.
"ఎదవపని సేత్తున్నాడే. ఆ ముండలెదూ....పెద్ద పెద్దోళ్ళనందర్నీ ముంచేసి....ఇప్పుడు చినబాబుగార్ని పట్టుకుందే...." అన్నాడు వెంకటేశం.
"ఏంది మావా నువ్వనేది? నిజమే...." అంది కాళమ్మ నోరు అలానే తెరిచి.
"అందుకేకదే నేను తాగుతుంది. నాయాల్ది....ఈ రేత్రి అదయినా వుండాలా, నేనైనా వుండాలా అంతే" అన్నాడు వెంకటేశం, చూరులోని వేటకొడవలి తీస్తూ.
"ఓర్నాయనో....మనకెందుకు మావా పెద్దోల ఇషయాలు? నా మాటిని గమ్మున వుండు మావా!" అంది ఏడుస్తూ.
"సెయ్ కాళీ.....నేనేవర్నే.....ఎవర్నే.....సెప్పవే నియమ్మ...." అంటూ కాళమ్మ జుట్టు పట్టుకున్నాడు.
"ఒరేయ్...తాగి నన్ను కొడతావెందిరా? అయినా తాగింది చాలు లే అన్నం పెడతాను. తిని తొంగో" అంది కాళమ్మ ఏడుస్తూ.
"సెయ్...నేను దాన్ని వొదిలిపెట్టనే...." అన్నాడు.
"ఎవత్తి మావా....ఆ వరాలా?" అంది కాళమ్మ.
"అవును అదేనే! దాని ఉచ్చులో చిక్కుకున్నాడే మన చిన్నయ్యగోరు..." ఆన్నాడు వెంకటేశం.
"వద్దు మావా! అళ్ళ ఇషయాలు మనకొద్దు మావా! రా అన్నం తిను" అని బ్రతిమాలింది కాళమ్మ.
"నేనూరుకోనే! నేనేమయినాసరే....దాన్ని సంపేయాలా అంతే. ఇయ్యాల దాని రకతం కళ్ళసూడాల..." అన్నాడు వెంకటేశం.
"మావా....మావా వద్దు మావా! పిల్లలు అన్నాయం అయిపోతారు నా బతుకేంకావాలి?' అంటూ ఏడుస్తూ వెంకటేశం కాళ్ళు పట్టుకుంది కాళమ్మ.
"సెట్ ఊరుకోయే. మీకంటే అయ్యగోరున్నారు. ఆయనే సూసుకుంటారు. అయన దేవుడే! దాన్ని సంపెయాలంటే సంపెయాల..." అంటూ దబ్మని వెంకటేశం కింద పడిపోయాడు.
21
"ఏంటి పార్వతీ. జయంతి విషయం ఏంటి?" అంది దాక్షాయణి కంగారుగా.
"ఏం లేదక్కా! ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని వారం రోజులనుంచి నాలో నేను మధనపడుతున్నాను. చివరికి ఈరోజు ధైర్యం చేసి చెప్పాలనుకున్నాను" అంది శివపార్వతి విచారంగా.
"ఏంటమ్మా అది?" అంది దాక్షాయణి.
"మొన్న నేను గిరిజ, సురేంద్ర మాటలు విన్నాను అక్కా. ఎంత వద్దనుకున్నా ఆ మాటలు నా చెవినపడ్డాయి. నా గదిలో నేను పడుకుని వుంటే గిరిజ పెద్దగా మాట్లాడుతూ సురేంద్రను తిడుతోంది" అని చెప్పింది.
దాక్షాయణి పై ప్రాణాలు పైనే పోయాయి. అంటే....నాకంటే ముందే పార్వతికి ఈ విషయం తెలిసిపోయిందన్నమాట, పాపం....పిచ్చి పిల్ల, వారం రోజులనుంచి తనలో తానే మధనపడుతుందా? నేను ఒక్క రోజుకే తట్టుకోలేకపోయాను.
అయిపోయింది. అంతా అయిపోయింది. ఇక ఈ కుటుంబం పరువు మర్యాద ఏమయిపోతుందో? అక్కకు, బావగారికి కూడా తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో! అసలు గిరిజకు ఏమయింది? ఎందుకిలా ప్రవర్తిస్తుంది? అదేం చిన్నపిల్లకాదే! జయంతికంటే రెండేళ్ళు పెద్దదే. అలా ఆలోచిస్తున్న ఆమె ఆలోచనలకు కళ్ళెం వేస్తూ.
"ఏంటక్కా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేనింకా ఏమి చెప్పందే?" అంది శివపార్వతి.
"నువ్వేం చెప్పదలుచుకున్నవో నాకు తెలుసు పార్వతీ" అంది గంభీరంగా.
"తెలుసా?" అంది ఆశ్చర్యంగా.
"అవును, నేను ఈరోజే వాళ్ళ మాటలు విన్నాను. గిరిజకు పిచ్చి పట్టినట్లుంది. నిప్పులాంటి జయంతి మీద అభాండాలు వేస్తోంది...." అంది దాక్షాయణి సీరియస్ గా.
"అవునక్కా! నాకు భలే కోపంవచ్చింది. చాలా నీచంగా మాట్లాడుతోంది జయంతి విషయం....పాపం అది పసిపిల్లలాంటిది..." అంది పార్వతి.
"నువ్వేం విన్నావ్?" అంది దాక్షాయణి.
"జయంతితో అసలు నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. అది నిన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నిస్తోంది. నాకంటే బాగుంటుందనేగా నువ్వు దాన్తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు. అసలు మనిద్దరం ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో అదైనా వుండాలి నేనైనా వుండాలి. ఇద్దరం ఒకే ఇంట్లో వుండటానికి నేను ఒప్పుకోను అందక్కా" అంది పార్వతి.
"అంతదూరం వచ్చిందా?" అంది దాక్షాయణి సాలోచనగా.
"అసలు గిరిజ ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తుందో అర్ధంకావటం లేదు" అంది పార్వతి.
"మరి సురేంద్ర ఏమన్నాడు?" అడిగింది దాక్షాయణి.
"ఏమంటాడు...నీకు పిచ్చిపట్టినట్లుంది, పాపం....అమాయకురాలిపైన లేనిపోని అనుమానాలు పెట్టుకుమ్తున్నావు. ఈ ఇంట్లోనుంచి విడిపోయి వేరే కాపురం పెట్టడం అంటే, అది జరగనిపని, ఈ ఇంట్లోనుంచి బయటకెళ్ళడం అంటూ జరిగితే నా శవం వెళ్ళాలితప్ప, నేను బ్రతికుండగా అది జరగదు" అన్నాడు అని చెప్పింది శివపార్వతి.
"పాపం, సురేంద్ర నరకం అనుభవిస్తున్నాడు పార్వతీ! పెళ్ళయి పట్టుమని మూడునెలలు కూడా కాలేదు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు" అంది దాక్షాయణి.
