ఆ స్థితిలో సైతం నవ్వకుండా వుండలేకపోయాడు.
కావాలనుకున్న మనిషికి న్యాయం చెయ్యాలన్న తలంపుతో ఒక్కోమారు మాట తులాడం ఎంత సహజమో ఇక్కడ నాన్నగారు నిరూపించేశారు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించని తాగుడు మత్తులో వుంటే ఏ మనిషైనా మరీ రెచ్చిపోతాడు.
నాన్న పోయాడని చెప్పకుండా తప్పు చేశాడా?
అంతా సవ్యంగానే వున్నట్టు ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోవడం ధన్వికి చిత్రంగా వుంది. అదొక్కటేకాదు, అక్కడికి నాన్న తనను వెళ్ళమని చెప్పి పంపించాడని ఆమె భావించడము అతడ్ని విభ్రాంతికి లోనుచేస్తుంది.
అసలు తను ఎందుకోచ్చాడు....?!
నాన్న ఏ మరణ వాంగ్మూలంలాంటి వాస్తావాన్నో తనకి చెప్పకుండా కన్ను ముసినందుకు బాధపడ్డాడు.....వీలైతే నిజం చెప్పి ముగిసిపోయిన జీవిత అధ్యాయపు ఆఖరి పుటల్ని మీకు మీరుగా రాసుకోవాలే తప్ప నాన్న గురించి యిక ఆలోచించవద్దని వివరించాలనుకున్నాడు. కానీ జరుగుతున్నది మరేదో.....
ఆ రాత్రి నిద్రపోలేదు ధన్వి.
తెల్లవార్లూ ఆలోచిస్తూనే వున్నాడు.
మాగన్నుగా నిద్రలోకి జారిన ధన్వికి మెలకువ వచ్చింది కాకుల కలకలంతో కాదు.....
క్షితిజ పిలుపుతో.
అప్పటికే తలంటు స్నానం చేసిన క్షితిజ నేలకి దిగి వచ్చిన దేవకన్యలా వుంది.
"మరేమో నీకు బెడ్ కాఫీ అలవాటుందని రాముడు బాబాయ్ దగ్గర కెళ్ళి పాలు పితుకుతుంటే గ్లాసుడు పాలు తీసుకొచ్చానన్నయ్యా...."
కాదనలేకపోయాడు ధన్వి.
ఎంతకాలం పరిచయం ఈ యింటితో.....
ఈ వెర్రిబాగుల పిల్ల యింత అనుబంధాన్ని పెంచేసుకుంటుందేం....
వరం కోరని భక్తురాలిలా అన్నయ్యుంటే చాలు నాకిక దేవుడైనా వద్దనే పిచ్చిపిల్లలా యింత ప్రేమని ప్రకటిస్తుందేం?
కాఫీ సిప్ చేస్తుంటే నెమ్మదిగా చెబుతుంది క్షితిజ. "బియస్సీ చేసేదాన్నే అన్నయ్యా...కానీ అనకాపల్లి దాకా వెళ్ళి ఇంటర్మీడియట్ చేయడమే గగనమైపోయింది, పైగా వయసులో వున్న ఆడపిల్లనిగా! పైగా అందంగా వుంటానేమో! అందుకే నాన్నగారేమో అన్నయ్యని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడితో చదువాపెసేయ్ అన్నారు....."
"అప్పుడే మొదలు పెట్టవుటే.....రాత్రంతా ధన్వి నిద్రపోలేదు" సుమిత్ర జోక్యం చేసుకుంది.
"నువ్వే నిద్రపోనివ్వకుండా నా పెళ్ళి గురించి అన్నయ్య బుర్ర తినుంటావ్" బుంగమూతి పెట్టింది క్షితిజ. "అయినా నాలాంటి పెదపిల్లకి అంత పెద్ద సంబంధం ఎందుకన్నయ్యా?"
ఆ వాక్యం ఏ గుండె అట్టడుగు పొరల్లో గునపంలా గుచ్చుకుందో మరి అసంకల్పితంగా అడిగాడు ధన్వి. "డబ్బు ఎప్పటిలోగా కావాలంటున్నారు పిన్ని?"
అరక్షణంపాటు విప్పరితంగా చూసిన సుమిత్ర "పెళ్ళికి మూడు నెలల టైముంది బాబూ! డబ్బు మాత్రం రెండు నెలల్లో సర్ధాలన్నారు."
"అంటే పెళ్ళి కూడా నిర్ణయమైపోయిందా?" విభ్రమంగా అడిగాడు.
"నిశితార్ధాలు కూడా అయిపోయాయిగా" సుమిత్ర అప్రతిభురాలిగా చూసింది. "ఈ విషయం నాన్నగారు నీకు చెప్పలేదా?"
తడబడ్డాడు ధన్వి "డబ్బు గురించే తప్ప ఈ వివరాలు క్లియర్ గా చెప్పలేదు. సరే.....నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఓ.కె. అని వాళ్ళకి కబురు చేయండి" ఇక బయలుదేరటానికన్నట్టు లేచాడు.
మరణానికి ముందు నాన్న ఎలా బ్రతికితేనేం యిచ్చిన మాట తప్పిన చరిత్ర హినుడు కాకూడదు.
స్మశానానికి నడుమ నిలబడి సమాధి కట్టడానికి చందాలడగాల్సిన దశలో మరెక్కడో తాజ్ మహల్ నిర్మాణం కోసం కులిల్ని బేరమాడుతున్నట్టుగా వుంది.
అయితేనేం అపురూపంగా అనిపించే రెండు ప్రాణుల్ని చూశాను.
జన్మనిచ్చిన తండ్రి కోసం అప్పుడు రాల్చని రెండు నీటిచుక్కలు ఇప్పుడు అప్రయత్నంగా మాత్రమే కాకా అతడి కళ్ళనుంచి రాలిపడ్డాయి. అంతేకాదు బ్రతికినంతకలం మాత్రమే కాక చచ్చి కూడా తనను తండ్రి సాధించటాన్ని గుర్తు చేసి, అయన ఆశించింది చేయగల కొడుకునంటూ నిరుపించుకునే అవకాశం ఇదొక్కటే అని హెచ్చరించాయి.
"నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త" అంది సుమిత్ర . గుండెలపై బరువు దించటానికి , "ఓసారి నాన్నగారోస్తే....."
"అలాగే....." అనలేదు ధన్వి, గొణిగాడు విని వినిపించకుండా.
"అమ్మయ్యా!"
వీధి మొదలు దాకా వచ్చిన క్షితిజ కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగుతుంటే "నువ్వు వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు" అంది కళ్ళు తుడుచుకుంటూ.
ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ధన్వి.
తనకో తోబుట్టువు దక్కిందన్న అనందం ఒక్కటే కాదు.....మరొకరి కోసం బ్రతకడం అన్న ఆలోచన అందిస్తున్న భాష కందని భావం అది.
"మళ్ళీ వస్తానమ్మా."
వచ్చితీరాలనే ఉద్దేశంతోనే ధన్వి ఆ మాట అన్నాడు. జీవితం అంటే ఒక్కోమారు మరొకరి సంతృప్తి కోసమైనా నటించి తీరాలన్న సత్యం తెలిని ధన్వి నడుస్తున్నాడు నిశ్శబ్దంగా.
* * * *
"హలో!"
ఉదయం ఆరుగంటలకల్లా సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగిన ధన్వి ఎదురుగా నిలబడి వున్న మధూళీని చూసి షాకయ్యాడు.
'అభ్యంగన స్నానం చేసినట్టు' ఆమె కురులు గాలికిఅల్లరిసిల్లరిగా కదిలి మధూళీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే "స్టేషన్ లో సూర్యోదయమయినట్టుంది" అన్నాడు మృదువుగా నవ్వుతూ.
ఉలికిపడుతూ చుట్టూ చూసింది మధూళీ. అలా అన్నది ధన్వేనా....
