Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 40


    
    "అది మా పెద్దమ్మకి తెలుసు.  వెళ్ళి విషయం చెప్పి ఆమెనే అడుగుదాం."


    "అయితే ఇప్పుడే అడుగుదాం" ఉమకి చాలా తొందరగా వుంది.


    "మేల్కొని  వుంటుందా ముసల్ది?"


    మరో ఐదు నిముషాలకి ఆ ముసల్దాన్ని వెదికి పట్టుకున్నారు.


    కొత్తగా కడుతున్న ఓ ఇంటి ఇసుకమీద పడుకుని వుంది.


    "ఏయ్ - పెద్దమ్మా" సక్కూబాయి పిలవగానే ముసల్ది  లేచి కూచుంది.


    "ఎవరూ?" అడిగిందామె.


    "నేను పెద్దమ్మా సక్కూని"


    "పక్కనుంది ఎవరు?"


    "ఉమ" చెప్పింది సక్కూబాయి.


    ముసల్ది అప్పటికి స్థిమితపడింది.


    అంత రాత్రిపూట వచ్చి తనని లేపితే ఎవరో అనుకుంది.


    " నీతో ఓ ముఖ్యమైన పనుందే."


    " ఏమిటో చెప్పండి." ముసల్ది తాంబూలం సంచి విప్పింది.

 

    అందులోంచి రెండాకులూ, ఒక్క తీసుకుని,  సున్నం రాసి నోట్లో పెట్టుకుంది.

 

    "ఇంటికి దూరమైనప్పుడు అబ్బాయితో కలిస్తే ఏమౌతుంది?" ఉమ భయంగా చూస్తూ అడిగింది.


    మూసలామె ఓసారి ఆమెను పైనుంచి కిందవరకూ చూసి -


    "ఏమౌతుంది -  ఆడదానికి ఏం కాదు - కానీ ఆ మగాడే చచ్చివూరుకుంటాడు" అంది.

 

     గుండెల్లో రాయికి బదులు బాంబు పడ్డట్టు జడుసుకుంది ఉమ. తను భయపడుతున్నట్టే  జరుగుతోంది. "ఏమౌతుంది?" ఉమ అప్పటికే ఏడుస్తోందని గొంతే చెబుతోంది.


     "అంటే రోగలక్షణాలు" అర్దమయ్యేట్లు చెప్పింది సక్కూబాయి.


    "ఇద్దరూ కలిసిన వారానికో  పదిరోజులకో జ్వరం అంటుకుంటుంది. అట్లాఇట్లా జ్వరం కాదు. ఒళ్లు కాలిపోయే జ్వరం. అదీఇదీ అని కనిపెట్టే లోపు అయ్యగారు టపా కట్టేస్తారు" ముసల్దానికి  అదంతా  నవ్వులాటగా  వుంది.


    " మరి దానికి విరుగుడేం లేదా?" ఉమ కాస్తంత ముందుకు వంగి రహస్యంగా అడిగింది.


    ముసల్ది ఆలోచనల్లో పడ్డట్టు, అయిదు నిముషాల వరకు మాట్లాడలేదు. ఆ తరువాత మొత్తం జ్ఞాపకానికి తెచ్చుకున్నట్లు కదిలి, "ఉంది. ఆ ఆడది తన తొడలోంచి రక్తం తీసి కాటుకలో  కలిపి కళ్లకు కాటుకలా  పెట్టాలి. అప్పుడు ఆ కాటుక రక్తంలోంచి చెడునంతా లాగేస్తుంది. రెండు రోజులకే జ్వరం నెమ్మదిస్తుంది. మరో రెండు రోజులకంతా పూర్తిగా కోలుకుంటాడు. అయినా పెళ్లికాని పిల్లలు - మీకెందుకే ఇవన్నీ" అంది.


    " పెళ్లికాని  మాలాంటివాళ్లే  ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తారు"  అని సక్కూబాయి లేచింది విసురుగా.


    ఉమ తన ఆలోచనల్లో తానుండడంతో  ఒంటి్మీద ధ్యాసలేకుండా అక్కడ్నించి లేచింది.


    ఆమెవద్ద సెలవు తీసుకుని ఇద్దరూ బయటపడ్డారు.


    "రేపుదయమే వెళ్లి కాటుక పెట్టాలి. ఇదే మంచి టైమ్. కాటుక ఇప్పుడు తయారుచేసెయ్యాలి"  ఉమ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె గొంతే చెబుతోంది.


    "మరి కాటుక?" అడిగింది సక్కూబాయి.


    "మా ఇంట్లో వుంది. తెస్తాను. పొరబాటు జరక్కుండా మళ్లీ ముసల్దాని వద్దకెళ్లి ఆమె ముందే కలపుదాం."


    మరో మాటకి తావివ్వకుండా ఉమ ఇంటికి నడిచింది. కాటుక  డబ్బాల్ని తీసుకుని వచ్చింది.


    " ఓ చిన్న మూతలోకి కాటుకను తీసుకోండి. దానికి రక్తం కలపండి.  తిరిగి ఆ ముద్దను కాటుక  డబ్బాలో పెట్టుకోండి. సరిపోతుంది." ముసల్ది చెప్పడం తరువాయి ఉమ ఆ కడుతున్న  ఇంట్లోకి వంటగదిలోకి వెళ్లింది. చేతిలో చిన్న చాకు వుంది.


    ఆమెకేమీ భం వేయలేదు. పైపెచ్చు అంతకుముందున్న టెన్షన్  కూడా ఇప్పుడు  ఆమెలో లేదు.  అనుమానాలుగానీ, సందేహాలుగానీ ఏమీలేవు.


    చాకుతో తొడ కోసుకుంది. రక్తం - రక్తం.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS