ఇద్దరూ వంటగదిలోకి వచ్చి "రేపొస్తాం" అని సరస్వతమ్మకు చెప్పి బయటపడ్డారు.
ఇల్లు దాటి కొద్దిదూరం నడిచాక "ఏమిటే ఆ జ్వరం. ... మూసిన కన్ను తెరవనైనాలేదు. నాకేదో భయంగా వుందే" అంది ఏడుపు గొంతుతో ఉమ.
సక్కూబాయి షాక్ తింది.
ఉమ ఎందుకంతగా అతనికోసం బాధపడిపోతూవుందో ఆమెకి అంతబట్టడంలేదు.
"నీకెందుకే ఏడుపూ.....?" అయిదు నిమిషాల తరువాత తను సర్దుకున్నాక అడిగింది సక్కూబాయి.
ఇక దాచడం దండగనిపించి జరిగింది మొత్తం చెప్పింది ఉమ.
"ఎంతపని చేశావ్? కానీ అవన్నీ అబద్దాలంటారే! ఏమో మనకేం తెలుసు? పోనీ డాక్టర్ ఆచారినడిగితే సరిపోదూ.... " సక్కూబాయి ఎటూ తేల్చుకోలేకపోయింది.
జన్ను ఎక్కడం వుందో లేదో సరిగ్గా తెలియడంలేదు. ఉమ చెప్పిన విషయంబట్టి ఆలోచిస్తే, వున్నట్టు తోస్తోంది. ఇది నిజం కాదని ఈ మధ్య చాలామంది చెబుతున్నారు. మరి దేన్ని నమ్మడం?
ఏం చేయడం?
"ఆచారినడిగితే ఏమౌతుంది?" సక్కుబాయి ఈజీగానే చెప్పింది.
అదికూడా నిజమే! కాయకష్టం చేస్తూ తమ సంపాదనమీద బతికే అలాంటి ఆడపిల్లలమీద ఇంట్లో వాళ్లకి పెత్తనం చెలాయించే అవకాశం వుండదు.
ఏదైనా పెచీ వచ్చి బయటికి వచ్చయినా బతకగలరు కాబట్టి, తమ మీద ఎవరయినా అధికారాన్ని చెలాయించడం వాళ్లు భరించరు. ఎదురు దాడికి దిగుతారు.
"సరేలే - సుధాకర్ కి ఏం కాకుండా వుండాలి. అదీ ముఖ్యం" ఉమ ఒప్పుకుంది కాసేపటి తరువాత.
ఆ ఊర్లో భరణి ఆచారి అనే అతనున్నాడు. చిన్న చిన్న జబ్బులకంతా ఆయనే వైద్యుడు. నలభై అయిదేళ్ళదాకా వుంటాయి. వైద్యవృత్తి వాళ్లకి వంశపారంపర్యంగా వస్తోంది. అతని తండ్రి వెంకటాద్రి ఆచారి. ఆ కాలంలో ఆయన చేయిపడితే చాలు రోగం మాయమైపోయేదంటారు. మంచి పేరుండేది ఆయనకు.
"అంతా అబద్దం. ఆయనకేమీ తెలియదు. టౌన్ లో ఆయనకు తెలిసిన ఓ ఇంగ్లీషు డాక్టరుండేవాడు. తన దగ్గర కొచ్చిన పేషెంట్ల అనారోగ్యం గురించి చెబితే ఆ ఇంగ్లీషు డాక్టరు మందులు రాసిచ్చేవాడు. వాటిని తీసుకునిన ఇక్కడిచ్చేవాడు వెంకటాద్రి. అట్లా ఆ ఇంగ్లీషు మందుల్ని గుర్తుపెట్టుకుని వైద్యం చేసేవాడు. అంతే" అని ఆయనంటే గౌరవంలేనివాళ్లు అనేవాళ్లు.
మొత్తానికి తండ్రితోపాటు వుండి వైద్యం నేర్చుకున్నాడు భరణి. ఠక్కున అవసరం వచ్చినప్పుడు ఆయన్ని పిలుస్తుంటారు ఊర్లోవాళ్లు.
సుబ్బారెడ్డికి ఆయనమీద బాగా గురివుంది కాబట్టి, కొడుకు జ్వరం ఆయన దగ్గిరే చూపిస్తున్నాడు.
"మరి భరణి ఆచారిని పట్టుకోవడం ఎలా? ఆ రోజు సాయంకాలం పొద్దుపోయాక తీరక చేసుకుని ఉమ సక్కుబాయి ఇంటికివెళ్ళి అడిగింది.
"ఇంటికే వెళదాం" అంది సక్కూబాయి.
"ఆయన ఇంటికి వెళితే అక్కడ అందరూ వుంటారు. ఆ విషయం ఎలా చెప్పడం?" ఉమకి భంగా వుంది.
"ఏమీ ఇబ్బందిలేకుండా వివరంగా చెప్పాలంటే అతనొచ్చే చోటుంది కదా- గుర్తొచ్చిందా నీకు?"
ఉమకి ఏమీ గుర్తురాలేదు. ఆ సమయంలో ఆమె మెదడు అంత స్థిమితంగా లేదు.
"అదే - సుమతి ఇంటి దగ్గరికి వస్తాడు కదా."
సక్కూబాయి చెప్పడంతో గుర్తొచ్చింది ఉమకి. సరేనంది. "అయితే ఈ రాత్రికే అతన్ని కలుసుకుని చెప్పేద్దాం" ఉమ అలా చెప్పి తిరిగి ఇంటికి వచ్చింది.
రాత్రి తొమ్మిది దాటాక సక్కూబాయి పనులన్నిటినీ ముగించుకుని ఉమకోసం చూస్తోంది.
ఆమె తొమ్మిదిన్నర ప్రాంతంలో వచ్చింది.
ఇద్దరూ కలిసి నాడార్ అంగడికి వచ్చారు.
భరణి, ఆచారి రోజూ క్రమం తప్పకుండా సాయంకాలం టౌన్ కి వెళతాడు.
పేషెంట్లకు కావాల్సిన మందులు, ఇంజెక్షన్ లు తెచ్చుకుంటాడు. టౌన్ నుంచి లాస్ట్ బస్ కే వస్తాడు. వస్తూనే ఇంటికెళ్ళడు. సుమతి ఇంటికి వెళతాడు. ఓ గంటవరకు అక్కడుంటాడు. ఆ తరువాత ఇంటికెళతాడు. రోజూ అదీ ఆయన షెడ్యూల్.
అందుకే వాళ్ళిద్దరూ అక్కడే కాపుకాశారు.
తొమ్మిదిన్నర, పదీ ప్రాంతాన వస్తుంది లాస్ట్ బస్. రోడ్డులోంచి ఊర్లోకి మరో పదిహేను నిముషాల నడక.
టైమెంతైందో తెలియదుగానీ భరణి ఆచారివాళ్లు నాడార్ అంగడికి చేరుకున్న పావుగంటకు వచ్చాడు.
తామక్కడ వున్నట్టు సక్కూబాయి దగ్గింది.
రోడ్డులో వెళుతున్న ఆయన తలపక్కకు తిప్పి చూశాడు.
"ఆచారీ! ఓ చిన్నమాట" అంది సక్కూబాయి ఆయన్ని చూస్తూనే. ఆయన ఆగాడు.
ఇద్దరూ నెమ్మదిగా రోడ్డుమీదకు వచ్చారు.
"ఏమిటే నాతో నీకు?" ఆయన సుమతి దగ్గిరికి వెళ్లే తొందరలో వున్నాడు.
"పని" అంది సక్కూబాయి చిన్నగా.
" చెప్పండి - కడుపా?" అడిగాడాయన.
అంటే ఆయన దృష్టిలో గర్భమా అని.
"కాదు" చెప్పిందామె.
"మరి పురుడు పొయ్యాలా?"
"కాదండీ" ఈసారి ఉమ కసురుకుంది.
"మరింకేమిటో చెప్పి తగలడండి" ఆయనా విసుక్కున్నాడు.
దాంతో చెప్పాలన్న మూడ్ పోయింది ఉమకు. భయం ఆమెని ఆవహించింది.
"ఊరకే పిలిచాం - మీరెళ్లండి" ఉమ రెండు చేతులూ జోడిస్తూ చెప్పింది.
"పద -వెడదాం" ఆయన అటు వెళ్లగానే సక్కూబాయితో అంది ఉమ.
ఇద్దరూ తమ ఇళ్లకు బయల్దేరారు.
"మరెలా?" ఉమ అడిగింది. ఆమెకేమీ తోచడంలేదు. ఎలాగైనా సుధాకర్ కి బాగవ్వాలన్నదే ఆమె తాపత్రయం.
కావాల్సివస్తే ఊరంతా చెప్పెయ్యడానికి సిద్దపడిపోయింది కూా.
"అదే ఆలోచిస్తున్నాను."
"మనమే ఆ మందేదో అతనికే యిస్తే" ఉమకే తట్టింది ఆ ఐడియా. ఇతరులను నమ్ముకోవడం వేస్టనిపిస్తోంది.
"అదై తే ఇబ్బందే లేదు."
"మరి మందెలా చేయాలి?"
