"డ్రైవర్ తెస్తాడులే!" అన్నారాయన.
నవీన్ ఆమె చేతిలోంచి బ్రీఫ్ కేస్ అందుకుంటుంటే ఆమెకి ఎలాగో అనిపించింది.
హాల్లోకి రాగానే "సుబ్బరాజూ కాఫీ తీసుకురా!" అన్నారాయన అలసటగా. ధృతి వెళ్ళిపోబోతుంటే "ఆగు, కాఫీ తాగి వెళ్ళు" అన్నారు.
నవీన్ బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టి నిలబడ్డాడు.
"ఇంక నువ్వెళ్ళచ్చు!" అన్నారు అతన్నే చూసి.
అతను తల ఊపి, ధృతికి కళ్ళతోనే చెప్పి వెనక్కి తిరిగాడు. అతను గుమ్మం దాటుతూ వుండగా ప్రేమ్ ఎదురొస్తూ కనిపించాడు.
ప్రేమ్ ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి, అంతలోనే "హాయ్!" అన్నాడు.
నవీన్ మర్యాదపూర్వకంగా విష్ చేసి వెళ్ళిపోయాడు.
ప్రేమ్ విస్మయంగా చోసోతూ లోపలికి వచ్చి "అతను..." అంటుంటే-
"కొత్త డ్రైవర్" అన్నారు ధర్మానందరావుగారు.
ప్రేమ్ వెంటనే ధృతి వైపు తిరిగి చూశాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. చూపులు తిప్పుకుంది.
ఇంతలో సుబ్బరాజు కాఫీ తేవడంతో అందరికీ సర్వ్ చేయసాగింది.
ధర్మానందరావుగారు మీటింగ్ విశేషాలు ప్రేమ్ కి చెప్పసాగారు.
ప్రేమ్ వింటూనే మధ్యమధ్యలో ధృతి వైపు చూస్తున్నాడు.
కాఫీ తాగడం పూర్తవగానే ఆమె ధర్మానందరావుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ప్రేమ్ ఎలాగో నవీన్ ఎవరో ఆయనకీ చెప్పేస్తాడు. కనీసం తన ముందు ఆ విషయం ఎత్తలేదు. అంతే చాలు అనుకుంది. ఆ విషయం వినగానే ఆయన ఏమనుకుంటారో? "ఎందుకు చెప్పలేదూ?" అని తననీ నవీన్ ని పిలిచి అడుగుతారేమో! ఛీ అలా చేయరు. నవీన్ తనంతట తాను సంపాదించుకున్న ఉద్యోగమిది. ఇందులో తన ప్రమేయం ఏమీలేదు.
* * *
"అక్కా! మా కాలేజ్ వాళ్ళు 'గోవా ఎక్స్ కర్షన్'కి తీసుకెళుతున్నారు. నేను కూడా వెళ్దామనుకుంటున్నాను" చెప్పింది కృతి.
వంటగదిలో క్రింద కూర్చుని కూరలు తరుగుతున్న ధృతి ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది.
"వెళ్ళనా అని అడిగే స్థితి నుంచి 'వెళుతున్నాను' అని చెప్పేంతగా ఎదిగిపోయావా? శభాష్!" అంది కాస్త హేళనగా.
"అమ్మా, నాన్నగారూ కూడా సరేనన్నారు" నీదేం లెక్క అన్నట్లుగా వుంది ఆమె వైఖరి.
ధృతికి సహనం హద్దులు దాటింది. చీరల షాపులో అరువు పెట్టి తల్లి ఒకేసారి ఐదుచీరలు కొన్నట్లు రాత్రి చెప్పింది. తమ్ముడికి మంచివి రెండు జతలు తీసుకుందామనుకున్న తను ఆ అప్పు తీరేవరకూ తీసుకోకూడదని ఆగిపోయింది. ఈలోగా ఇన్ స్టాల్ మెంట్స్ మీద కుర్చీలూ, చిన్న టీపాయ్ తెచ్చేశాడు తండ్రి. తను 'వద్దు' అంటే "నీకేం తెలియదు. నీ మొహం" అని తేల్చిపారేశాడు. ఈలోగా చెల్లెలు మరో బాంబు పేల్చింది. తనేమయినా కుప్పలకొద్దీ సంపాదిస్తోందనుకుంటున్నారా? ఈ విధంగా సంసారం చేస్తే మళ్ళీ మొదటికొచ్చి పీకలవరకూ అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం.
"ముందు బుద్దిగా చదువుకో వచ్చే సంవత్సరం చూద్దాం విహారయాత్రల సంగతి" అంది తన పని ఆపకుండా.
"రవి అడిగితే మాత్రం ఎంతయినా యిచ్చేస్తావు" నెత్తిన వున్నకుండ భళ్ళున బద్దలైనట్లు ఏడుస్తూ అంది కృతి.
"వాడు పుస్తకాల కోసం, ట్యూషన్ ఫీజుకోసం అడిగాడు. నీలాగా తిరగడానికి అడగలేదు" తనూ గొంతు పెంచి చెప్పింది.
ఈ గొడవకి పడుకున్న సుభద్ర లేచొస్తూ "ఏం జరిగిందీ?" అంది.
"మనదేమీ రాజభవనం కాదు, జరుగుతున్న గొడవ వినిపించక పోవడానికి" అంది ధృతి కోపంగా.
"ఔను, చిన్నపిల్ల సరదాపడుతోందని నేనూ, నాన్నగారూ సరేనన్నాము. దాన్ని అవసరంగా ఏడిపించకు" అంది తల్లి.
"ఏడుస్తోందికదా అని ఒప్పుకుంటే ఈరోజు దీనికి ఏడుస్తుంది. రేపు మరోదానికి ఏడుస్తుంది. ప్రతిసారీ మనం అది అడిగినవి చేయగలమా?"
"నువ్వు అన్నీ అతిగా ఆలోచిస్తావు."
ఇంతలో 'ధృతి' అన్ననవీన్ గొంతు విన్పించింది. ధృతి కత్తి పీట గోడవారగా పెడుతూ "వస్తున్నాను" అంటూ ముందు గదిలోకి నడిచింది.
కృతి ముక్కులు ఎగపీలుస్తూ, చెప్పులు వేసుకుని పెద్దగా శబ్దం చేస్తూ బయటికి వెళ్ళిపోయింది.
వెళుతున్న కృతిని గమనించి "ఏమైంది?" అడిగాడు నవీన్.
"ఈవిడగారు 'గోవా' వెళుతుందిట. పంపిమ్చ్కపోతే ఏడుస్తుందట...." ధృతి ఇంకా పూర్తి చేయకుండానే-
కృతి గిరుక్కున వెనక్కి వచ్చి "నువ్వు బయటివాళ్ళకి నాగురించేమీ చెప్పక్కర్లేదు. పంపిస్తే పంపించు. లేకపోతేలేదు!" అంది ఉక్రోషంగా.
"కృతీ!" అంటూ ధృతి కోపంగా లేచింది.
"ఎందుకే దానిమీద అంతచేటు నోటు చేసుకుంటావు? చెల్లెలు మనసుపడి మూడొందలు ఖర్చుపెట్టి పిక్ నిక్ కి వెళతానంటే పంపడానికి మనసురాదు కానీ, పరాయివాళ్ళకి గుప్పెళ్ళకొద్దీ డబ్బు పంచిపెట్టగలవు" అంది సుభద్ర కృతికి వత్తాసుగా.
ధృతికి ప్రపంచం గిర్రున తిరిగిపోయినట్లుగా అనిపించింది. నవీన్ కళ్ళలోకి చూడలేకపోయింది.
నవీన్ లేచి కృతి దగ్గరగా వెళ్ళి "ఛీ....అలా ఏడవకూడదు. అక్కని నేమండిగా అడగాలి కానీ అలా అసహ్యంగా ఏడుస్తారా? ఏడ్చేటప్పుడు నీ ముఖం ఎలా వుందో అద్దంలో చూసుకో...." అన్నాడు చనువుగా.
"మా అమోహలు ఏడ్చినట్లే వుంటాయి బాబూ! దానికి 'పెరటిచెట్టు మందుకి పనికిరాదన్నట్లు' మేము తప్ప అందరూ పనికొస్తారు" ఘాటుగా అంది సుభద్ర.
"నవీన్! కాసేపలా బయటికి వెళ్ళొద్దామా....?" అడిగింది ధృతి భరించలేనట్లు.
