Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 3


    విశాల విశాలంగా నవ్వుతూ, "నమస్కారం ఊరికే పోదులే! పనికీ వస్తాడు" అంది.
    ఎంత ముందాలోచన! ఇన్ని యుక్తులుంటేగాని జీవించలేరా?
    వీణ ఎన్నో ఆశలతో వచ్చింది. కాని, మన పెంచుకో బెరుకుగా, దిగులుగా ఉంది, తను ఈ కోర్సు పూర్తిచేసి 'వీణ' వీణలాగే ఇంటికి చేరుకొంటుందా! అన్న అనుమానం కలగసాగింది.
    ఏ మూలనుంచి ఎవరు తరుముకొస్తున్నారో నన్న భయంతో ఒకరినొకరు తోసుకొంటూ బితుకు బితుకు మంటూ పోతున్న కొత్త అమ్మాయిలను వచ్చి చుట్టే శారు సీనియర్ గర్ల్స్ అందరినీ హాస్టల్లో ఒక గదిలో చేర్చారు. ఒక్కొక్కరిని పరిశీలించి ఒక్కొక్క వేషం వేయమన్నారు ఫ్రెషర్స్ డేకి. వారి తీర్మానానికి తిరుగు లేదు. వేషానికి సరిపడ్డ వస్త్రధారణ వారే తెచ్చుకోవాలి!
    కాలేజీలో ఆ రోజు సందడిగా ఉంది. అయిదు గంటలకి లెక్చర్ హాల్లో టీ పార్టీ! ఒక పక్క పూలు అందించారు లోపలికి వెళ్ళగానే. మరోపక్క స్వీటు, హాటు, అరటిపండు, కిల్లీ ఉన్న పొట్లం అందించారు. గుంపులు గుంపులుగా నిలబడి తినసాగారు. వీణ ఎవ్వరైనా గమనిస్తున్నారేమో నని సిగ్గుగా అడ్డు చేతిలో పట్టుకొని అలా కొరికిందో, లేదో రాజీవ్ వచ్చాడు. చేయి చాపాడు పెట్టమన్నట్లు. పొట్లం చేతిలో ఉంచింది. చేతిలోని అడ్డు తీసేసుకొని నోట్లో పెట్టేసుకొన్నాడు.
    'బాబోయ్! ఎంగిలి తినేశాడు. ఇప్పుడెలాగ?' అన్నట్లుగా చూసింది కళ్ళు పెద్దవి చేసి.
    "నీళ్ళిస్తావా, వీణా!"
    బొమ్మలా వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.    
    "అబ్బ! మధురం! ఏమి కలిపావు?" రాజీవ్ కళ్ళతో అలా నవ్వుతూ మరీ చనువుగా వంగి మాట్లాడుతుంటేఒళ్ళు మండింది. ఏమీ చేయలేని నిస్సహాయత! ఏమనటానికైనా హక్కు ఉన్నట్లు చేస్తున్నారు! కళ్ళు దించుకొంది.
    రాజీవ్ వెళ్ళిన మరునిమిసంలో ఓ డజను మంది అబ్బాయిలు వచ్చారు.
    "మిస్ వీణ మీరే కదూ? మీ చేతి నీళ్ళు మధుర మట. మాకూ ఇస్తారా!" అంటూ చుట్టూ చేరారు.
    అందరికీ నీళ్ళు ఇచ్చింది. మరలా రాజీవ్ వచ్చాడు లడ్డు పట్టుకొని. వీణ కిచ్చాడు తినమని!
    కొందరు "తినండి!" అని, మరికొందరు "తినమ్మా" అంటూ బలవంతం చేశారు.
    ఎలాగో తిన్నాననిపించింది.    
    పోతూ పోతూ, "నీవూ నా ఎంగిలి తిన్నావు...." అని లోగొంతుకతో రహస్యం చెప్పినట్లు చెప్పాడు!
    "ఛీ!" అంది.
    నవ్వుకొంటూ వెళ్ళాడు.
    నీళ్ళతో పుక్కిలించింది. వికారంగా ఉన్నట్లుంది!
    "ఏం మనుష్యులు!' అనుకొంటూ అక్కడినుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ కి వెళ్ళారు!
    వారి వారి వేషాలు వేసుకొని స్వాగతగీతాన్ని పాడు తుంటే అందరూ స్టేజీమీదకు వెళ్ళారు.
    "....పోపు నిర్వహించిన అందాలపోటీలో మన కాలేజీ బ్యూటీ అందాలరాణిగా ఎన్నిక అయింది. ఆమెను మీకు పరిచయం చేస్తాను. రండి, మిస్ సరోజా!"
    అంటూ నల్లగా, ఎత్తుగా ఉన్న అమ్మాయిని పిలిచారు.     
    తడబడే అడుగులతో ఆ పిల్ల స్టేజీమధ్యకు వెళ్ళి నమస్కరించింది.
    ఆడియన్స్ చప్పట్లు కొట్టుతూ నవ్వారు.
    "మీ బట్టలు క్షణంలో సబ్బు పొడిలో పెట్టి నాన్చి, చించి అతి జాగ్రత్తగా తెస్తుంది చాకలమ్మ మిస్ విశాల."
    ఓ చిన్న బట్టలమూట చంకన పెట్టుకొని వచ్చింది విశాల.
    "పాపం! పసిపాపకి ఆకలి! పాలు పోయించరూ? పాపా, రా అమ్మా! మిస్ వనజ."
    ఓ లావుపాటి అమ్మాయి పాలసీసా నోట్లో పెట్టుకోని వచ్చింది. ఒకటే నవ్వులు, గోల, ఈలలు.
    అందరూ సంతోషిస్తున్నారు!
    "సన్యాసినులు వచ్చారు. ఉపదేశాన్ని పొంది ముక్తి మార్గాన్ని పొందండి. ఓం! శివోహం!"
    సన్యాసినీ వేషధారులు జుబేదా, వీణలు వచ్చారు.
    అలా ఒక్కొక్కరు వచ్చి స్టేజీమీద చేరి అందరికీ పరిచయమయ్యారు.
    ఎలా చదవాలో, ఎలా నడుచుకోవాలో చదివి వినిపించారు. తరవాత ఎంటర్ టైన్ మెంటు! ఆ ప్రోగ్రామ్ ఎనిమిది గంటలకి ముగిసింది.    
    'హమ్మయ్య!' అనుకొంటూ హాస్టలుకు వచ్చి చేరారు. ఆ మరుసటి రోజునుండి కొత్తవారివైపు చూసే వాళ్ళే లేరు. వారి మధ్య ఏమీ జరగనట్లే. పిలుపుల్లో మన్నన! ఎవరి పనుల్లో వారు నిమగ్నమై పోయారు. భయం, బెరుకు తీరి తేలికైన శరీరాలతో వారి గదిలోకి వచ్చారు వీణ. జుబేదాలు.

                              *    *    *

    శరదృతువు. నవమి చంద్రుడు మరీ తెల్లగా ఉన్నాడు. సీనియర్స్ పెట్టిన పోరు తలుచుకొని, "పూర్వకాలం అత్తగార్లు పెట్టే బాధలు ఇలాగే ఉండేవి కాబోలు" అని పైకి అంది వీణ.
    "కాలం మారింది. మనుష్యులు మారారు! అంటే, బాధించే పద్ధతులు మారాయి. అప్పుడు సూటిపోటీ మాటలని బుగ్గలు పొడిచేవారు! ఇప్పుడు అతి మౌనంగా ఉండి బాధిస్తారు!" జుబేదాకి పక్కింటి కలిగినవారమ్మాయి గుర్తుకు వచ్చి అలా చెప్పింది.
    అమ్మగారు ఉన్నవాళ్ళే! బోలెడు కట్నంతో వచ్చింది. కాని, ప్రయోజనం? అత్తగారు అసలు మాట్లాడదు. ఆడబిడ్డలు సరేసరి!
    అందరూ ఉన్నా లేనట్లే! ఇరవై నాలుగు గంటలూ ఆ గదిలోనే ఉండాలి! ఆప్యాయంగా పలకరించేవాళ్ళు లేరు.
    మెత్తటి పందిరిమంచం. కోరిన నగలు. కాని, ఆప్యాయతే కరువు! స్వతంత్రంగా ఏదీ అడగలేదు. తినలేదు. వారి మౌనం అతి భయంకరం! భర్త ఏదో ఆఫీసుకు వెళ్ళి సాయంకాలానికిగాని రాడు. పంజరంలో ఉన్నట్లే! భర్తతో ఆ మాటే అంది.
    "అమ్మ ఏమందీ?" అంటాడు.
    "మూడు వందల్లో ఈ పట్టణంలో ఎలా గడుపుతాము? ఇంత మంచి ఇల్లు, తోట, ఫ్రిజ్! ఇలాటి సౌకర్యం ఎలా పొందగలడు! అమ్మ చేతికింద ఉండవలసిందే!" అంటూ ఆ అమ్మాయి తన బాధను జుబేదా దగ్గర చెప్పుకొనేది.
    'తను వ్రాయవలసిన కథల్లో ఇది ఒకటి' అనుకొంది జుబేదా.
    "అందరు అత్తలూ అలా ఉండరు. మా నాన్నమ్మ ఎంత మంచిది! అమ్మని కన్నబిడ్డకంటే మిన్నగా చూసుకొనేది." వీణ పలుకుతూ, గబుక్కున లేచి మంచం కింద ఉన్న ట్రంకు ఇవతలకు లాగి జాగ్రత్తగా పేపర్ తో చుట్టిన ఫోటో బయటికి తీసి బల్లమీద ఉంచింది.
    ఆదరంగా ఫోటోవంక చూస్తూ ఉంటే జుబేదా కూడా చూపు ఆ వైపు తిప్పింది.
    'బల్లమీద ఉన్న ప్రియుని ఫోటో వంక చూస్తూ నిదురపోతుంది తన కథానాయకి. కాని, ఈ హీరోయిన్ నాన్నమ్మ బొమ్మవంక ఎంత ఆప్యాయంగా చూస్తున్నది!' సాలోచనగా భ్రుకుటి ముడిచింది.
    
                             *    *    *

    మబ్బు ముసుగులో దాగినా కొండల వరసలు దూరానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోయల్లో దాగిన బూడిదరంగు మబ్బుకు తెల్లని రెక్కలు వచ్చినట్లు పైపైకి తేలిపోసాగింది. బాటమీద పడిన వర్ష బిందువులు చిట్లి మట్టిరంగు నీటిలో కలిసిపోతున్నాయి. పచ్చికబయలు మీద పడిన నీటి బిందువులు ముత్యాల్లా దొర్లిపోతున్నాయి.
    వసారా గదిలోనుండి చూస్తున్న ఓంకారి శాలువను చెవుల మీదకు జరుపుకొంది. ఆకాశంనుంచి పడ్డ ఆ నీటిబొట్లు కొన్ని శాశ్వతంగా ముత్యాలుగా మారితే, కొన్ని ముత్యాలుగా భ్రమింపజేస్తున్నాయి. కొన్ని మట్టిలో కలిసిపోతున్నాయి. తనది ఏ కోవకి చెందిన జీవితమో? మేలిముత్యం మాత్రం కాదు.
    పైనుంచి తలమీద టప్ మని చినుకు పడింది. తల ఎత్తి పైకి చూసింది. ఇన్ని రోజుల వర్షానికి గోడల మూలలలో నీరు ఇంకింది. ఇంక లోపలకూడా ఎక్కడ కారుతుందోనని పరీక్షగా చూడసాగింది. అంతలోనే కంటి అద్దంమీద పడి అద్దం మసకగా అయింది.
    'దీని పాసుగూల!' స్వగతంగా అనుకొంటంలో పడ్డాడు తీసి తుడిచి బల్లమీద ఉంచింది. బల్లమీద ఓ పక్కగా వారపత్రికలు, ప్రభలు పేర్చి ఉన్నాయి.
    'రేపటినుంచిగాని కొత్తవి రావు' అనుకొంటూ పుస్తకాల దొంతరలను సరిచేస్తున్నట్లు పైనుంచి కిందికి ఆప్యాయంగా తడిమింది. అటకమీదున్న చెక్క పెట్టెలో ఎన్నో నవలలు, ఇతర పుస్తకాలు ఉన్నాయి.
    జ్ఞానం తెలిసిన దగ్గరినుండి పుస్తకాలే తనకు ప్రియములు. భర్తను పోగొట్టుకొన్నప్పుడు వాటితోనే ఓదార్పు నొందింది. అవి యౌవనకాలపు స్నేహితులు. ఏవో ఊహలతోనే తన జీవితం గడిపింది. ఊయల లోని తన పాపడిని ఊపుతూ పుస్తకం చదివేది. కొందరు చిత్రంగా చూస్తే మరి కొంతమంది మూతి మూడు వంకరలు తిప్పేవాళ్ళు.
    జీవితం అలా గడిచిపోతుండగా ఏదో ఎగ్జిబిషన్ కు వెళ్ళి అమ్మలు వీణ రామాయణం, భగవద్గీత తెచ్చింది.
    బైండింగు అందాన్ని చూస్తూ, "అమ్మలూ! అలాగే భారతం కూడా తీసుకొని రాలేకపోయావా?" అంది.
    "నాన్నమ్మా! అది ఎంత ఉదాత్త గ్రంథమైనా అందులో చాలామంది వ్యక్తులకు అన్యాయం జరిగిందమ్మా! మానవమాత్రుల వలన కాదు, సాక్షాత్తూ కృష్ణ భగవానుని వలననే!"
    నాన్నమ్మ నోరు విప్పి చెప్పబోయేలోపల, "భగవంతుని లీల అని ఎంత సరిపెట్టుకొందామనుకున్నా నా మనస్సు ఊరుకోదు. కృంగిన రథాన్ని ఎత్తుతున్న కర్ణుని గుండె ల్లోకి దూసుకుపోయిన బాణం..... మానవుడైన గురువు పక్షపాతంతో ఏకలవ్యుని గురుదక్షిణగా వీలుకానివి కోరరానిది కోరాడు. కాని, నారాయణుడైన కృష్ణుడు అతనిని హత్య చేశాడు."
    "భగవత్ స్వరూపుడైన కృష్ణయ్యని, ఆయన లీలలను ఎంచేపాటివారమా మనం! అల్పులం."
    నాన్నమ్మను రెండు చేతులు వేసి చుట్టేస్తూ, "నీవు మాత్రం అల్పమైన దానవు కాదు. నీలో దేవుడున్నాడు, నాన్నమ్మా?" అన్న వీణ స్పర్శ తనకు ఎంతో హాయిగా ఉంటుంది.
    ప్రస్తుతం వీణ పట్టుకొన్నట్లే అనుకొంటూ మంచంవైపు వెళ్ళింది వీణ నాన్నమ్మ ఓంకారి.
    పదో ఏటనే ఓంకారి అత్తగారి ఇంట్లో అడుగు పెట్టింది. తన తాటాకు బుట్టలో లక్కపిడతలు, చెక్కబొమ్మలతోపాటు చాలా ఆస్తిని వెంటబెట్టుకొని వచ్చింది.
    పలుమారు జారిపోతున్న ఆర్గండి వాయిల్ పైటను నడుముకు చుట్టుకొని, తలుపు వెనక తన ఆట వస్తువులు అమర్చుకోని నేస్తం దొరకక దిగులుగా కూర్చున్న ఓంకారిని ఓ ఆజానుబాహువు వచ్చి పలకరించాడు, "అమ్మాయ్!" అని.
    ఆ వచ్చింది వెంకట్రావు.
    తనను పెండ్లి చేసుకొన్న ఆయనను చూడగానే విప్పారిన ఓంకారి కళ్ళలో సంతోషం తళుక్కుమంది.
    తల పైకెత్తితేగాని అతని ముఖం కనపడదు.
    "నీ కట్టుకు ఎవ్వరూ లేరా?" అంటూ వంటగది దగ్గరకు వెళ్ళి, "అమ్మా! పక్కింటి తాయారు లేదూ!?" అని అడిగాడు.
    "ఇప్పుడు తాయారు ఎందుకురా?" అని జవాబుతో ప్రశ్న ఎదురు వచ్చింది.
    "అమ్మాయితో ఆడటానికి ఎవ్వరూ లేనట్లున్నారు!" నవ్వుతో కూడిన మాటలు వినవచ్చాయి.
    "పెళ్ళాన్ని పట్టుకొని అమ్మాయి ఏమిట్రా..."
    చేతుల వరకున్న జుబ్బా వెనక్కి ముడుస్తూ, "రా! ఆడుకొందాం" అన్నాడు ఓంకారితో.
    తటపటాయిస్తూ నిలబడ్డ ఓంకారితో, "నీ పేరు 'ఓంకారికదూ? ఎవరు పెట్టారు పేరు?" అని వ్యంగ్యంగా అన్నాడు.    
    "మా అమ్మమ్మ!" గర్వంగా వచ్చింది జవాబు. అమ్మమ్మ ఆస్తి అంతా ఓంకారికి సంక్రమించింది. "పిలవటానికి ఎలాగో ఉంది. ఏమని పిలవను?"    
    "అమ్మణ్ణి అని పిలువు. నన్ను అందరూ అలాగే పిలుస్తారు."
    వెంకట్రావు మరీ ఇబ్బందిగా ముఖం పెట్టాడు.
    అమ్మాయికంటే పన్నెండో, పదిహేనో ఏళ్ళు ఎక్కువ ఉండవచ్చు. మంచి ముఖంతో ఎత్తుకు తగ్గ లావుతో ఉంటాడు.
    "ఇక్కడ కాదు. నీ బొమ్మలు అన్నీ పట్రా! నా గదిలో భద్రంగా పెట్టుకొందువు గాని."
    సంతోషంగా తల ఊపుతూ చకచకమని నిమిషాల్లో అన్నీ చేరవేసింది.
    గోడ అలమారలో క్రింది అర ఖాళీ చేసి, తన పుస్తకాలు పై అలమారలో సర్దుకున్నాడు.
    సర్దుకొంటూ, "నీవు చాలా మంచివాడివి" అంది.
    పెద్దగా నవ్వాడు వెంకట్రావు. స్వతహాగా పరోపకార బుద్ధి కలవాడు. ఊర్లో చాలామంది తనని మంచివాడని మెచ్చుకొంటూ ఉంటారు.
    పల్లెలో సాధారణంగా దొరకని వస్తువులు వాళ్ళ పనిమీద బస్తీకి వెళ్ళి తెచ్చి ఇస్తుంటాడు.
    "గ్లాస్కో గుడ్డ దొరకటం లేదు" అంటే, "పట్టణంలో అందరూ మనకి తెలిసిన వాళ్ళే" నంటూ, అడిగిందే చాలు అన్నట్లుగా తెచ్చేవాడు.
    అలా తేవటంలో స్వంత డబ్బు చాలా ఖర్చు అయి పోతూ ఉండేది. కాని, అది గొప్పా, అదో తృప్తి. కాని, వెంకట్రావు మంచివాడు అని అంటుండేవారు.
    ఓంకారిని తమాషా పట్టించాలనుకొని, "ఏం ఆట ఆడుదాం? మొగుడూ, పెళ్ళామాట ఆడుదామా!" అన్నాడు.
    "ఛీ! తప్పు కదూ!"
    ముసిముసిగా నవ్వుకొంటూ బయటికి వచ్చేశాడు.
    వెంకట్రావు గదిలో ఆడుకొంటూనే అక్కడ ఉన్న పుస్తకాలు తిరగవేయసాగింది. పెద్దబాలశిక్ష చదవటం వచ్చిన ఓంకారి ఆ కథల పుస్తకాలు చదవటం అలవాటు చేసుకొంది.
    కాలం ఇట్టే దొర్లిపోయింది. పదునాల్గవ సంవత్సరంలో కొడుకుని ఎత్తుకొంది.
    "అమ్మాయ్! నీకు ఆడుకోవటానికి ప్రాణం ఉన్న బొమ్మ దొరికింది కదూ?"
    "వెంకట్రావూ! నీవు చాలా మంచివాడివి" అంది కృతజ్ఞతగా ఓంకారి.
    పెద్దగా నవ్వుకొంటూ కండువా భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు.
    ఇంటికి తిరిగి వచ్చిన వెంకట్రావుకి కొడుకు ఏడుపు వినపడగా, గాభరాగా గదిలోకి వెళ్ళాడు.
    ఓంకారి ఆదమరచి నిదురపోతున్నది, పైటచెంగు తొలగి ఉంది. రవికనుండి సగం బయట పడిన రొమ్ము పిల్లాడికి అందీ అందక ఉంది. అందీ అందక ఉన్న తన ఆహారాన్ని అందుకోలేక కచ్చగా గుక్క పెట్టాడు వాడు.
    వెంకట్రావు కి ఎప్పుడూ రానంత కోపం రాగా, రెండు చేతుల్లో ఆమెను ఎత్తుకొని వెళ్ళి పెరట్లో పెట్ల పాదుల క్రింద పడుకోబెట్టి వచ్చాడు.
    పక్కింటినుండి ఆదరా బాదరా వచ్చిన అమ్మ చేతికి కొడుకుని అప్పగించుతూ, "మొద్దు నిద్దర దానికి" అన్నాడు.
    బస్తీమీద మోజు పెరిగింది వెంకట్రావుకి. పొలాలను తెగనమ్మి వ్యాపారమంటూ బస్తీకి మకాం మార్చాడు. కొడుకు మాట ఎప్పుడూ కాదనలేదు తల్లిదండ్రులు. కొడుకుని అనుసరించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS