Previous Page Next Page 
పగటికలలు పేజి 3

                                      

    అతని దగ్గర అంత భయపడ్డానికి తనకే ఆశ్చర్యం వేసింది. కాని తనుపొరపాటు చేస్తున్నది అటుంచి,- ఆయన్ను చూసిందగ్గర్నుండి ఏదో గౌరవం, భయం, భక్తి కలిగింది. శ్రేయోభిలాషిలా కనిపించేడు. ఈ విషయంలో తప్పించి మరే విషయంలోనూ అబద్ధం ఆడడానికి ధైర్యం చాలడంలేదు! అతని ముందు చిన్నపిల్లాడిలా అయిపోతున్నాడు?
    అతను ఎందుకో గంభీరంగా వున్నాడు.    
    "నువ్వేదో మంచివాడనుకున్నా నబ్బాయ్ ఇలాటి దౌర్భాగ్యుడవనుకోలేదు ఇది ఉపోద్ఘాతం.
    గిరి గుండెల్లో రాయి పడింది- చెమట్లు పోసేట్టున్నాయి. "తెలిసిపోయింది కాబోలు నాటకం' అని అనేసుకున్నాడు - ఇహ చీవాట్లూ చెప్పుదెబ్బలతో సహా బుర్ర గొరిగించి, పిండి చుక్కలు పెట్టించి, గాడిదమీద ఆ వీధిలో వూరేగిస్తారు కాబోలు అని అనుకున్నాడు. ఆ దృశ్యమే వేడుకగా బాజాభజంత్రీలతో సహా అతడి కళ్ళముందు కనబడుతూంది! దాసుగారు అంతటి వాడు! అతను తలచుకుంటే ఏమయినా చెయ్యగల పలుకుబడి, హోదా, గౌరవం, డబ్బూ- అన్నీ వున్నవాడు మరి! అలాటివాడితోనా గిరి చెలగాటం? నేరక ఇరుక్కున్నాన్రా భగవంతుడా! అని అనుకున్నాడు.
    ఏం జవాబు చెప్పడానికీ గిరికి తోచక దిక్కులుచూస్తూ నిలుచునేసరికి, తలుపు సందులో నుండి గిరిజ వాళ్ళ నాన్నతో ఏదో గొణిగింది-గిరిజ వైపు చూడ్డానికి ధైర్యం చాలలేదు! అసలు అతని కంటిముందు జరుగబోయే ఊరేగింపు.  ఉత్సవం తప్పిస్తే రెండో దృశ్యం కనబడందే? ఇటువంటి బుద్ధి పొరపాటు పనులెప్పుడూ చేయకూడదని లోపల లెంపలు వేసుకున్నాడు.
    తప్పుచేసిన విద్యార్ధి బుద్ధిగా మాస్టరుగారి దగ్గర నిలుచున్నట్టు నిలుచున్న గిరిని చూసి-
    "మా యింట్లో ఇటువంటి శసభిషలు పనికి రావు తెలుసా? కట్టుగున్న పెళ్ళాంమీద ఇంత అనుమానమా? చదువుకున్నావేమో? తోటి మనిషిని- అందులోనూ నీ భార్యని ఇలాగేనా చూసేది? ఏమిటో క్రొత్తగా వచ్చేరు, సిగ్గుచేత క్రొత్త చేత యివతలకి రాలేదు, పోనీలే! చిన్న వాళ్ళు! అని అనుకున్నాం !.... అటువయిపే చూడాలనిపించ లేదు- యివాళ చూద్దాం కదా. తలుపుకు తాళం వేసుకుని-యింట్లో ఒక్కర్తినీ ఏడవమని చెప్పి వెళ్ళిపోతావా? ఇదేనా నీ మొగతనం? మన బంగారం మంచిదవాలి గాని ఆడదాన్ని కాయగలవా? స్త్రీలకు కూడా సమాన స్వాతంత్ర్యం సమాన ప్రతిపత్తి, సమాన గౌరవం, పురుషులతోపాటు యివ్వాలనే నేటి ప్రపంచంలో యింకా నీలాటి "స్త్రీలను అణచాలని" "ఆడవాళ్ళను తక్కువచూపు" చూడాలనేవాళ్ళు వుంటారనుకోలేదు .... నా యింట్లో ఇలా జరగడానికి వీల్లేదు! ఆదర్శ ప్రాయంగా యిద్దరూ సంసారం చేసుకోండి! లేదా నా యిల్లు ఖాళీచేసి నువ్వూ నీ పెళ్ళాం మరెక్కడన్నా ఎలానయినా అఘోరించండి! మీ యిష్టం!..... ఆఁ! .... అంతే.... పెద్దవాణ్ణి కనుక చెప్పేను"
    గ్రుక్క తిప్పకుండా ఉపన్యాసంలా వర్ణించేరు దాసుగారు. ఆ చెప్పడంలోను సూటిగా, ఒక నమ్మకంతో, దైర్యంతో- పట్టుదలతో చెప్పేరు. ఆయన ఆ ముక్కలంటున్నప్పుడు మొహంలో ఏదో బాధ, సానుభూతి కనిపించింది. అతను అలా గంభీరంగా అంటూంటే అతనిలో ఎటువంటి ఆదర్శ భావాలున్నాయో అర్ధమవుతూ వుంటుంది బాణాల్లాంటి ఆ మాటలు వడివడిగా మెత్తగా చల్లగా ఏ దురభిప్రాయాలూ లేని గిరి గుండెల్లో కూడా దూసుకుపోయి- ఆలోచింపజేశాయి. గిరి హృదయం అతని ఉద్రేకంతో కూడిన మాటల ధోరణికి కరిగిపోయింది. మళ్ళీ హృదయం తేలిక పడడానికి ఎంతోసేపు పట్టింది! అతనెంత భ్రమపడ్డాడో అంత అభయం దొరికింది! కాస్త ధైర్యం లభించింది!
    ఆ వుపన్యాసమంతా ఎందుకో ఊహించడానికి అట్టేసేపు పట్టలేదు. ఎందుకంటే తను చేసిన పొరపాటు అర్ధమయింది గిరికి. ఇంట్లో పెళ్ళాం వుందని నలుగురితో చెబుతూ ఆమె యింట్లో వున్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రసరించకపోవడమే?
    రోజూ అలవాటుబట్టి గిరి యింటికి తాళం వేసి వెళ్ళిపోడం అది ఈనాడు అతని కంట పడడం ఇంతపని జరిగింది- మరి, ఇంట్లో భార్యని వుంచి తాళంవేసి వెళ్ళే మొగాళ్ళని అలా గనక వదిలేస్తారా? అయిందేదో అయి పోయింది!.... యిక దీనిని సమర్ధించుకుని బైటపడాలి....మెదడుకు మేత వేశాడు....చటుక్కున ఒక అయిడియా రాగానే...
    "ఆహాహా అని పెద్దగా నవ్వు తెచ్చుకు నవ్వేశాడు గిరి చులాగ్గా- ఆ నవ్వు విని... ఇలా సిగ్గుమాలినవాడిలా నవ్వుతాడేం? అని అనుకున్నాడు దాసుగారు. ఆశ్చర్యపోతూ ఏమనడానికీ తోచక అల నోరు వెళ్ళబెట్టిచూస్తూ నిలుచుండిపోయాడు. -
    "దాసుగారూ! క్షమించండి? నేను మీరన్న లాటి నీచుణ్ణిగాను గాని మీకు చెప్పకపోవడం పొరపాటే.... మరండి ... మా ఆవిడ -ఇంట్లోకి రాకపోతేనూ ... యివాళ పొద్దున్నే మా స్నేహితుల యింటికి దిగబెట్టి వచ్చానండీ...అంతే...గానండి...అంత అమానుషంగా ప్రవర్తించేవాడినా! ఇన్నాళ్ళయింది-నా సంగతి మీరు గ్రహించకపోడం....నా దురదృష్టం!" అని అట్నుంచి ఇటు తిరిగి ప్రశ్నవేసి అలిగి నట్టు మొహం పెట్టాడు గిరి!
    ఇహదాసుగారి మొహంలో కత్తివేస్తే నెత్తురు చుక్కలేదు! అంత మనిషి యింతయి పోయేడు. ఏదో పెద్ద తప్పు చేసినట్టు మొహం ఎరుపు చేసుకుని మనిషంతా సిగ్గుతో కుదించుకు పోయి గిరివైపు చూడలేక చూస్తూ-
    "క్షమించనోయ్ గిరి! నేను కారణం తెలుసుకోకుండా నిన్ను అనుమానించి ఏవేవో అన్నాను. ఆ వుద్రేకంలో తూలనాడేను .... దానికి కారణం- నా తత్వం. నా అభిప్రాయాలకి విరుద్ధంగా నడిచేవాళ్ళని అధమాయించడం, కొంచెం ప్రథమ కోసం రావడం కూడా అలవాటు .... అయితే అందరినీ అనననుకో ... కాని ఏమిటో నిన్ను చూస్తే చెప్పలేని అభిమానం. నేను ఏం చెప్పినా నీ శ్రేయస్సు కోరే చెబుతాను గాని మరోటి కాదు!.... మనసులో ఏమీ అనుకోకు!' అని అన్నారు దాసుగారు.
    గిరికి జాలి కలిగింది. అతని నిష్కల్మష మయిన హృదయానికి! "దానికేంలెండి! పెద్ద వారు మీరు అననూవచ్చు నేను పడనూ వచ్చు!" అని వెనుదిరిగి వెళ్ళపోతూంటే వెనక దాసుగారు గిరిజని ఏదో అడుగుతున్నట్టు అనిపించి.... ఆ ప్రక్కకు వెళ్ళినట్టే వెళ్ళి వింటున్నాడు గిరి.
    "విన్నావుగా గిరిజా! యిలాగంటాడేమిటి? ఇవాళే తీసుకువెళ్ళానంటున్నాడు....నువ్వేమో! రెండు రోజులబట్టి - యింట్లో ఆ పిల్ల అలికిడి వుందంటున్నావు యింటికి తాళం వేస్తున్నా డంటావు?.... ఆఖరికి.... ఏమిటో - మధ్య నేను వెర్రి వెంగళాయి నయిపోయాను!" అన్నాడు.
    "లేదు నాన్నగారు! నేను కనిబెడుతూనే వున్నాను రోజూ చీరలూ అవీ ఆరవేసే వుంటున్నాయి..... గాజు చప్పుడవుతూంది. వంటలు అవుతున్నాయి కాని యితను వెళ్ళాక మాత్రం తాళం వేసే వుంటూంది. లేకపోతే నే నెందుకు చెబుతాను అంది గిరిజ.
    "అయితే తనతోకూడా తీసుకుపోతున్నాడో ఏమో- ఆ స్నేహితుల యింటికి?
    "బావుంది నాన్నా! ఎవరికంటా పడకుండా వెళ్ళిపోవడానికి ఆవిడేం దేవకన్యా? అతను ఒక్కడే వెళ్ళడం నే చూస్తేనే!"
    "ఏమిటోనమ్మా అర్ధం కాలేదు!"
    "అదె నాన్నా-నాకూ తెలీడంలేదు! లేకపోతే యింకా క్రొత్తేనా? లేక ఘోషా స్త్రీయా? వచ్చి వారం- పది రోజులవొస్తూంది. ముచ్చటకయినా మొఖం చూసేట్టులేదు! ఎంత యిదయినా? అంత ఒంటెత్తుతనమా! ఇన్నాళ్ళు మరో ఆడదానితో మాట్లాడకండా వుండడం! ఆడదయి పుట్టాక ఆవిడ తరంకాదు! మరి.... యీ గిరిగారి బార్య ఎక్కడ నుండి వూడిపడిందో?.... అలా అందు లోనే రాణివాసం చేయడానికి!" - అంది గిరిజ.
    "పోన్లేద్దూ వాళ్ళ గోల మధ్య మనకెందుకు?" అని దాసుగారు చిరాకుగా అనేశాడు! ఇందాకటి సంఘటనే ఆయన మనసులో పీడించబట్టి గాని లేకపోతే యీ విషయం ఆద్యంతాలు తెలుసుగొనేవరకూ పీకి పాకం పట్టేవరకూ వదిలే మనిషేనా?
    గిరికి మాత్రం ఈ సంభాషణ విన్నాక గాభరా పట్టుకుంది. ఇహనెలాగూ వీళ్ళిద్దరూ వదలరు అని.... ఆఖరికి గిరి పని దాగట్లో పడ్డ వెలక్కాయలా అయింది. చేసిన తప్పులన్నీ దిద్దు "నేందుకే- ఎక్కడ లేని టయిమూ చాలడం లేదు ... యింక గిరిజతో పరిచయమా? ... అయ్యో! ఆమె గురించి ఆలోచించడానికే - కనీసం ఆ పేరు నాలుగుసార్లు జనం చెయ్యడానికయినా వీలు చిక్కడంలేదు.... అది పోగా- రాను రాను ఆగి జే తనకు విలన్ అయి, నిఘావేస్తూంది? ఏం దారి? ఆపద్భాంధవరావూ? అనుకున్నాడు.
    "ఇంత ఘోరమయిన అబద్దాలాడి తాత్కాలికంగా తప్పుకున్నా నిజం బయటపడిందంటే, ఏమౌతుంది?.... ఇలాగా, అలాగా వదిలిపెడతారా? చిత్ర వదచేసి ఆ పోర్టికోలోనే ఘోరీ కట్టిస్తారు? ఈ నాటకం.... సుఖాంతమా? దుఃఖాంతమా? .... భగవంతుడా ..... రెండూ వద్దు డ్రా అయిపోయినా బావుండును! ఆఖరికి జపం విడిచి లొట్టల్లో పడ్డటయింది.... పాపం దాసుగారిని చూస్తే యిక్కడికి చేసిన మోసం చాలించి- క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకున్నా.... గిరిజను చూసేసరికి.... గీర ఎత్తుతుంది - ఏం చేయడం!" అని గిరి అనుకుంటూ ఎప్పటికప్పుడే ఏమవుతే అవని అని నిశ్చయించుకున్నాడు.

                                    3

    ఆ మర్నాటి నుండి పెద్ద సమస్య ఎదురయింది. ఇంటికి తాళం వెయ్యకుండా తీసి వెళ్ళి పోడం ఎలా? ఇంట్లో ఎవరూ వుండరాయె! ఆ మూడు రోజులూ ఆలోచించాడు..... ఒక ఉపాయం తోచింది- వీధి తలుపు లోపల నుంచి గడియ పెట్టి పెరటి తలుపుకి తాళం వేసి బయటపడడం ... అయితే ఆ పెరటి తోవన వస్తున్నట్టు ఎవరూ చూడకుండా వీధి వరండా లోకి చేరి అక్కడ నుండి దర్జాగా మెట్లు దిగి వెళ్ళిపోతూండడం, అలాగే వస్తూండడం - యిదే కాస్త యిబ్బంది, ఏమయినా యింతకన్నా మరి గత్యంతరం లేదు! ఇలాగయితే పైకి తాళం కనిపించదు, లోపల తాళం వుంటుంది- మర్యాదా దక్కుతుంది.... జరిగిననన్నాళ్ళు జరగనీ" అనుకుని అలాగే చేస్తున్నాడు గిరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS