Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 3

 

                                    2

    ఒకళ్ళ కన్నా ఒకళ్ళు బాగుంటారు. మీకోడలు పిల్లలు!' అంది. సుందరమ్మతో. కామేశ్వరి చటుక్కున వెనక్కి తిరిగిచూసి కిటికీదిగి నుంచుంది. కామేశ్వరి ముఖంలో దీప్తి వంతంగా మెరుస్తోన్న చారెడేసి కళ్ళూ వసుంధర హృదయంలో గాఢంగా ముద్ర వేసుకున్నాయి.
    'ఏమే కామప్పా! జ్ఞాపకం వున్నానా మర్చిపోయావా? ఇదే పెద్దపిల్ల మా నరసన్నకి! మా పిన్నిపేరే దీనిదీనూ, కామేశ్వరి!' అంది వసుంధరతో సుందరమ్మ.
    'మా వొదినపేరు రాజేశ్వరి!' అంది వసుంధర.
    'మీరా అత్తా! ఇంకా ఆ కొత్తవాళ్ళు అనుకొని లోపల కొచ్చీసాను...' అంది కామేశ్వరి.
    'చదువుకొంటున్నావా! అంది వసుంధర.
    'ఆఁ! ఏం చదువూ దానిమొఖం! పెళ్ళిచేస్తాం పెళ్ళిచేస్తాం, అంటూ, స్కూల్ మానిపించేసి ఇంట్లో కూర్చో బెట్టింది మా వదినమ్మ! లేకపోతే ఇది ఈపాటికి ఏ బి. య్యే. వో ప్యాసయి వుండును. చదవించుతే, తెలివిగా చదూ తారు మా నరసన్న పిల్లలు!' అంది సుందరమ్మ.
    'ఈ సంవత్సరం మెట్రిక్ పరీక్షకి కట్టానండి!' వినయంగా అంది కామేశ్వరి. ఇంతలో హాలులోంచి, పిలుపు వినవచ్చింది. పెళ్ళివారు ఫలహారాలు సేవించటం పూర్తయింది. పిల్లను తీసుకొని రమ్మన్నారు. వంచిన తల ఎత్తలేకుండా వున్న కామేశ్వరిని, జగదాంబా, సుందరమ్మ, తీసుక వెళ్ళి హాలులో పరచిన, జంబుఖానా మీద కూర్చోబెట్టారు.
    'ఏం చదువుతున్నావమ్మాయ్! పెళ్ళి కొడుకు తరపున ఒక పెద్దమనిషి అడిగాడు. 'మెట్రిక్ పరీక్షకి చదూతూన్నానండీ!' నమ్రతగా అంది కామేశ్వరి.
    'మెట్రిక్కా! మెట్రిక్ పరీక్షకి వెళ్ళుతున్నాననటం ఈ రోజుల్లో పెళ్ళికూతుళ్ళందరికీ అలవాటు అయింది. మెట్రిక్ పరీక్ష పెళ్ళి చదువు అయిపోయింది. ఎవర్నడిగినా, మా అమ్మాయి మెట్రిక్ పరీక్షకి చదూతోంది అంటారు. ఆ అమ్మాయి పరీక్షకి కూర్చుంటుంది తప్ప పరీక్ష వ్రాయదు. ఒకవేళ తెగించి తెల్లకాగితాన్ని నలుపు చేయగల్గినా ఆ అమ్మాయి పరీక్ష ప్యాసవదు. ఏమంటే ఆ అమ్మాయి అందులో ఏ సినిమా పాటో వ్రాస్తుంది తప్ప క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వ్రాయలేదు.' అన్నాడు. పెళ్ళికొడుకు తరపున వచ్చిన పెద్ద మనిషి.
    'యస్. యస్. యల్. సి ఫెయిలయిన వాళ్ళకి, ఫిఫ్త్ ఫారం ప్యాసయిన జ్ఞానమన్నా వుంటుంది. మెట్రిక్ ఫెయిలయిన వాళ్ళకి ఆ జ్ఞానము కూడా వుండదు. అక్షరాలు వచ్చినవాళ్ళు అయితే చాల్ను! ఎలా గో అలా ఆ మేష్టర్నీ ఈ మేష్టర్నీ పట్టుకుని, ఎగ్జంప్షన్ తెప్పించుకుని పరీక్షలకి హాజరవుతారు. హాజరు అవగల అవకాశమే వాళ్ళకి కావాలి కాని, ప్యాసవటం ముఖ్యం కాదు. ప్యాసవగల జ్ఞానం వాళ్ళ కుండదు. ఏ అయిదోక్లాసు దాకానో, అక్షరాలు గుణించుకుంటూ చదువుకోవటం నేర్చుకున్నవాళ్ళు, అమాంతం మెట్రిక్ ప్యాసు అయ్యేట్టు చదవగలరా?' అన్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి.
    కామేశ్వరి తల భూమికి అతుక్కు పోయింది.
    'సంగీతం వొచ్చా!" అన్నాడు సిగరెట్ కాల్చటం మానేసిన అబ్బాయి.
    'సంగీతం వొచ్చును. కాని డాన్స్  రాదు.' అంది సుందరమ్మ. మిగిలిన వాళ్ళంతా ఫక్కుమని నవ్వారు.
    'డాన్స్ రాకపోయినా ఫరవాలేదు. చిన్న కీర్తన పాడితే, బాగుంటుంది.' అన్నాడు పెళ్ళికొడుకు. కామేశ్వరికి పాడటం, బాగా అలవాటు వుంది. అంచేత అట్టే బ్రతిమాల నవసరం లేకుండానే.
    'హిమగిరి తనయే!' అంటూ, కీర్తన మృదువుగా పాడింది. ఆమె పాట, అక్కడున్న వాళ్ళందరికీ, వీనుల విందుగా వుంది. పదేసి సంగతులు వేసి ముందుకూ వెనక్కి గింజుకోకుండా, వున్న సాహిత్యాన్ని అర్ధవంతంగా మృదుమధురంగా పాడింది కామేశ్వరి. అంచేత సంగీత జ్ఞానం లేని వాళ్ళక్కూడా ఆ పాట హాయిగా వుంది. పరీక్ష తృప్తికరంగా ముగిసింది. పెళ్ళి వారంతా, లేచి బయటకు వచ్చారు. నాలుగ్గంట లయ్యింది. ఎండ కాస్త చల్లబడింది. సమాధానంకోసం, చేతులు నలుపు కొంటూ నించున్న నరసయ్యని చూసి పెళ్ళి కొడుకు తరుపు పెద్ద మనిషి,
    'వెళ్ళగానే జాబు వ్రాయిస్తాను.' అన్నాడు'
    'చిత్తం! తమదయ! ఏదో పేదవాణ్ని! తమరు కాస్త కనిపెట్టి, మా పిల్లని వాళ్ళ కడుపులో వేసుకునేట్లు చూడాలి!' అన్నాడు ప్రాధేయితగా నరసయ్య.
    'అయ్యో ఎంతమాట అన్నగారూ! నాకు మటుకు ఆడపిల్లలు లేరా! మీ పిల్ల ఒకటీ, నా పిల్ల ఒకటీనా! తప్పక వారికి నచ్చచెప్పుతాను.' అంటూ సెలవు తీసుకున్నాడు పెళ్ళికొడుకు తరఫున పెద్దమనిషి. చెట్టు వద్దకు వచ్చి నించున్నారు పెళ్ళికొడుకువాళ్ళు. వాళ్ళు వెళ్ళవలసిన బస్సు ఇంకా రాలేదు.' 'బెంచీ మీద కూర్చోండి' అని ఆహ్వానించాడు గవర్రాజు, వాళ్ళు కూర్చున్నారు.
    పెళ్ళికొడుకు తరఫున వచ్చిన పెద్ద మనిషి తేనుస్తూ,
    'ఒకసోడా ఇయ్యవయ్యా!' అని ఆయాస పడ్డాడు. గవర్రాజు సోడా కొట్టి ఇస్తూ.
    'దండిగా ముట్టాయా ఫలహారాలు!' అని నవ్వాడు.
    'ఏం?' అన్నట్లు చూసాడు పెళ్ళి వారి పెద్ద మనిషి.
    'పెళ్ళి కూతురు ఎల్లా వుందిటా?' అన్నాడు హేళనగా గవర్రాజు.
    'కొంచెం చాయ తక్కువైనా, కళవున్న ముఖం! నిదానమైన ఆవిడ - ఆమెకేం?' అన్నాడు పెళ్ళి కొడుకు తమ్ముడైన నల్ల కళ్ళజోడు.    
    'కట్న మేపాటి ఇస్తానన్నారు?' అన్నాడు గవర్రాజు. పెళ్ళి కొడుకు, వీడికీ ప్రశ్న లెందుకూ, అన్నట్లు అయిష్టంగా ముఖం చిట్లించాడు.
    'రెండు వేలు ఇస్తానన్నారు.' అన్నాడు. పెళ్ళివారి పెద్ద మనిషి సోడాకి డబ్బు లియ్యబోయాడు. ఆయన 'వద్దులెండి! ఆ మాత్రం దానికి డబ్బు లియ్యాలా!' అంటూ, రెండు ఆరెంజ్ డ్రింక్స్ ని ఇద్దరన్నతమ్ములకీ ఇచ్చాడు గవర్రాజు.
    'మీరేం చేస్తున్నారు' అని పెళ్ళి కొడుకుని అడిగాడు గవర్రాజు ఈసారి.
    'హైస్కూల్లో టీచర్ని!' అన్నాడు పెళ్ళికొడుకు.
    'బి. ఎ. బి. ఇడి. ప్యాసయినారా!' అన్నాడు గవర్రాజు.
    'వూఁ' అన్నాడు పెళ్ళికొడుకు.
    'ఇంట్లో దీపంలాంటి పిల్ల లే బాంకులో అయిదారు వేల రూపాయల్ని దాచి, రెండు వేల రూపాయిలతో నల్ల సిద్దె మ్మని మీకు అంటకట్టుతున్నారా నరసయ్యగారు! ఎంత కయినా తగిన పెద్దమనిషే ఆయన!' అన్నాడు గవర్రాజు.'
    'ఏమిటేమిటీ! ఆయన కింకో ఆడపిల్ల వుందా?' అన్నారు. పెళ్ళివారు ముగ్గురూనూ. వక్కసారిగా ఆశ్చర్యపోయారు వాళ్ళు.

                                 
    'లేకేం! ఆ పిల్లకీ ఈ పిల్లకీ పోలికే లేదు. మాణిక్యదీపం ఆ పిల్ల! చూట్టానికి రెండు కళ్ళు చాలవు. సిక్స్త్ ఫారం చదువుతోంది. పెళ్ళివాళ్ళు చూట్టాని కొచ్చినా ఆ పిల్లనయితేనే చేసుకుంటామని చెప్పేవాళ్ళుట! అందుకని ఈ మధ్య పెళ్ళివాళ్ళు వస్తే, ఆ పిల్లని దాచేసి ఈ పిల్లనే చూపెట్తున్నారు.
    చాలా సంబంధాలు అల్లా తప్పిపోవటంతో అక్క పెళ్ళిచూపులకి, చెల్లిని దాచేస్తున్నారు వాళ్ళు! కావలిస్తే మళ్ళీ వెళ్ళి చూడండి! ఆ పిల్ల కానపడొచ్చును.' అన్నాడు గవర్రాజు.
    'అయితే ఏదో వంకని వెళ్ళరా, అన్నయ్యా!' అని ప్రోత్సహించాడు నల్లకళ్ళజోడు. పెద్దమనిషి కూడా, ఆభావం బలపరిచాడు. పెళ్ళికొడుకు నెమ్మదిగా నరసయ్యగారింటికి వెళ్ళాడు. నరసయ్య గారు, శివరామయ్యగారూ ఎటో వెళ్ళి నట్లున్నారు ఇంట్లో లేరు. ఇంటి తలుపు జేరవేసివుంది. తలుపు త్రోసి లోనికి వెళ్ళాడు పెళ్ళికొడుకు. హాలులో జంబుఖానా, ఎత్తేసి చీపురుతో వూడవ బోతూన్న కామేశ్వరి చటుక్కున పెళ్ళి కొడుకుని చూసి కలవరపడి పోయింది.
    "ఏం లేదు! కాసిని మంచినీళ్ళు ఇస్తే అంటూ నసిగాడు పెళ్ళికొడుకు.
    కామేశ్వరి తలవొంచుకుని, లోపలికి వెళ్ళిపోయింది. సుభద్ర గాజుగ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆపిల్లకేసి దీర్ఘంగా చూసాడు పెళ్ళికొడుకు. సుభద్రకి నదురూ, బెదురరూ తెలియదు. నిర్భయంగా పెళ్ళికొడుకుకేసి చూస్తూ నిలబడింది. కామేశ్వరి అయితే అరక్షణం కూడా నిలబడలేదు అలా! పెళ్ళి కొడుకు, గ్లాసు ఇచ్చేసివచ్చాడు. నెమ్మదిగా వస్తోన్న రామనాధాన్ని గవర్రాజు కొట్టుదగ్గర వున్న వాళ్ళు చూశారు. రామనాథం, వస్తూ, సుభద్ర గురించే ఆలోచించడు. సుభద్ర బాగుంది. అందంగా, సుకుమారంగా, తెల్లని కుందేలు పిల్లలా వుంది. నిజంగా సుభద్ర అమాయకంగా గెంతులు వేస్తూ ఆడుకునే తెల్లని కుందేలుపిల్లే!'
    రామనాధానికి సుభద్ర చాలా చిన్న పిల్లలా, అభం శుభం తెలీని పసిదానిలా కనపడింది. ఆమెని చూస్తే ఆమెని పెళ్ళి చేసుకోవాలన్న కోరిక, రామనాధానికి ఏకోశాన్ని కలగలేదు. కామేశ్వరి కళ్ళల్లోని మెరుపు, రామనాధాన్ని కట్టివేసింది. 'నలుపు అయినా పెద్దపిల్ల బాగా వుంది! చిన్నపిల్లకి నేను తగను! బొత్తుగా కాకి ముక్కుకి దొండపండు లాగుంటుంది!' అనుకున్నాడు రామనాథం. రామనాథం వాళ్ళని జేరగానే,
    "చిన్నమ్మాయ్ కనపడిందా?'
    'తెల్లగా వుందికదూ!'
    'చూడు ఎల్లా మోసగిద్దా మనుకున్నారో!' అంటూ ముగ్గురూ వక్కసారే మాట్లాడారు.
    'తెల్లగులాబీ విరిసిందా! ఆ రేకులు నవ్వుతున్నాయ్యా? ఆ రేకులమీద, ఉదయ తుషార బిందులు కన్పడినాయా! ఆ గులాబి చలిస్తోందా! కోస్తోంటే కన్న తల్లినుండి విడిపడనని మారాము చేస్తోందా?' ఎందుకొచ్చిన ప్రశ్నలు. సహజమయిన భావాతిశయాన్ని దగ్ధం చేయదల్చిన వృధా ప్రశంసలుకావా!'
    'ఆపిల్ల కన్పడింది. చాలా తెల్లగా సుకుమారంగా, అందంగా వుంది.' అన్నాడు. రామనాధం.
    'చూసారా మరి! నేను చెప్పలేదూ?' అన్నాడు గర్వంగా గవర్రాజు.
    'కాని, నేను పెద్దమ్మాయినే పెళ్ళిచేసుకుంటాను. ఆపిల్లే నాకు ఎక్కువ నచ్చింది.' అన్నాడు స్థిరంగా రామనాధం.
    'అదేం?' ఆతృతగా ప్రశ్నించాడు. పెద్దమనిషి.
    'ఏముందీ! ఇల్లు ఇరకటం, ఆలి మరకటం! అన్న సుఖమయ సంసార సూక్తిని అమలు పరచాలనుకొంటున్నాడు కాబోలు!' వ్యంగ్యంగా హేళనగా అన్నాడు గవర్రాజు.
    'మీకనవసరం' రామనాధం కోపంగా అన్నాడు. 'అనవసర మేమిటయ్యా! బస్తీల్లో ఉద్యోగం చేస్తోన్న పిల్లడిని! చుక్కలాంటిచిన్నదాన్ని కట్టుకొని, ఝామ్మంటూ షికార్లు తిరగవల్సినవాడిని, కోతిని కట్టు కుంటానంటావేమిటి? నాతి, అయితేనేం, కోతి అయితేనేం, అని వైరాగ్యపడితే చెప్పలేముకానీ, నిక్షేపంలాంటి చిన్నదాన్ని ఎందుకు చేసుకోకూడదూ! కాస్త బలవంత పెడితే, వాళ్ళే పుచ్చినట్లు చిన్న మ్మాయినే చేసుకోండి. అంటూ, కాళ్ళ బేరానికి రాకపోతారా? ఆ అమ్మాయికి మటుకు, డాక్టర్లూ, ఏక్టర్లూ, మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటామంటూ క్యూలో నిలబడ్డారు పెళ్ళి కొడుకులుగా?' అని సాగతీశాడు గవర్రాజు.
    'నిజమే మరి! అలోచించాలి!' అన్నాడు.
    పెళ్ళివారి తరపు పెద్దమనిషి!

                                *    *    *


    'పోస్టు' అంటూ పోస్టు మాన్ ఒక కవరు, హాలులోనికి గిరాటెట్టి, సైకిలు ఎక్కి తుర్రుమన్నాడు. ఆ పోస్టు కోసం, నాలుగురోజులుగా ఎదురు చూస్తున్న నరసయ్యగారు, ఆతృతగా ఆ కవరు చేతి లోనికి తీసుకుని, వణికే చేతుల్తో విప్పారు.
    'పోస్టు మాన్ కేక విన్న జగదాంబ గారు కూడా ఆతృతగా హాలులోనికి వచ్చారు. ఆమె వెనకాతల వసుంధర, సుందరమ్మ కూడా వొచ్చారు. కామేశ్వరికి కూడా ఈ కేక విన్పించింది. కాని ఆమెకదేమీ పట్టి నట్లు లేదు. తన ఖర్మాన్న తను లెక్కలు చేస్తూ కూర్చుంది.
    'ఏముంటుందిలే! మామూలే! పిల్ల నచ్చలేదనో, కట్నం చాలదనో! లేకపోతే చిన్నపిల్లనిస్తే చేసుకుంటామనో, వ్రాసుంటారు!' నిరాశగా, ఉత్తరం చదవబోతూ అన్నాడు నరసయ్య.
    'అల్లా వ్రాసేసారా?' కంగారుగా అంది జగదాంబ.
    'ఇంకా చదవలేదులే! అంతే వ్రాస్తారంటున్నాను. మనకు అలవాటు అయిందేగా!' అంటూ వుత్తరం చదువుతూనే ఆశ్చర్యపోయేడు నరసయ్య.
    'ఇదిగో విన్నావ్! అన్నాడు.
    'ఏమిటేమిటి?' అంది జగదాంబ.
    'మన కావుడు, వాళ్ళకి నచ్చిందిట!'
    'నిజంగా!' జగదాంబ కళ్ళు ఆనందంతో చెమర్చాయ్. సుభద్ర ఒక్క గెంతులో అక్క గది దగ్గరకు పరుగెట్టింది. సుందరమ్మ 'పోన్లే పాపం' అనుకుంది. వసుంధర ముఖం మటుకు చిన్నబోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS