ఇంత గ్రంథం జరిగిన సంగతి ఎవరికీ తెల్సు నాయనా......? జరిగిన సంఘటనలకు బాధపడిన వాళ్ళమేకాని, యివన్నీ ఆలోచించలేదు. అయినా అసలు విషయం తెలుసుకోకుండా ఆలోచించే యోచనలన్నీ యిలాగే ఉంటాయి. నిజంగా నిన్ను అభినందించాలి. కుటుంబ శ్రేయస్సుకోసం నీ భవిష్యత్తును పాడు చేసుకున్నావు. ఇల్లనీ, సంసార మనీ, పెద్దవాళ్ళకు అండగా నిలబడ్డావు. ఈ ముదనష్టపు కాలంలో ఎవరు నాయనా నీలా ఆలోచించే వాళ్ళు. నా సంసారమే చూడు. ఉండడానికి ముగ్గురు కొడుకులున్నారు. ఒక్కరూ నన్ను ఆదుకోరు. ఎందుకు ఉండి.......? నిన్ను చూసినప్పుడల్లా నా హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. అటు గ్రామానికి పెద్దవై యిటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ నలుగురిచేత సెభాష్ అనిపించుకుంటున్నావు.
ఇప్పుడు నన్ను గురించిన పొగడ్తలు ఎందుకు తాతా........? పొగడ్తలకు యిష్టపడని రామంపై మాటలంటూ మళ్ళీ నీ సందేహం తీరినట్లేనా ఇక యింటికి వెళ్ళాలి. నాకోసం రెండు గంటల క్రితమే యింటినుండి కబురు వచ్చింది. పని తీరక వెళ్ళలేదు అని లేచి యింటివైపు దారి తీశాడు.
మంచిది బాబూ వెళ్ళొస్తా, అని రంగయ్య తాత తన యింటివైపు నడిచాడు.
* * *
బాలభానుని లేత కిరణాలతో పల్లెంతా బంగారు మలాము చేసినట్లు మెరిసిపోతూ వుంది. అప్పటికి రైతులు పొలం పనులపై వెళ్ళిపోయారు. ఆడవారు వారివారి పనులలో నిమగ్నులయిపోయారు. లక్ష్మయ్య గారి యింట్లో సందడి ప్రారంభమై ఆ యిల్లు కళకళలాడుతూ వుంది. పశువులకు మేత వేస్తున్న పాలేర్లు, పాలు పితుకుతూ వున్న పాలేర్లు. వీరందరి మధ్య పనులు పురమాయిస్తూ తిరుగుతూ వున్న పెద్దపాలేరు పుల్లయ్య పాలికేకలు. ఒకటే సందడి....
ఆచుట్టు పట్లగల అన్ని గ్రామాలలో లక్ష్మయ్యగారి వ్యవసాయం పెద్దది. లక్ష్మయ్య గారి ఆస్థితో అతని సోదరి ఆస్థి కలిసినందు వల్ల ఆస్థితో అతని సోదరి ఆస్థి కలిసినందు వల్ల ఒక చిన్నతరహా జమీందారీగా తయారైంది. రామం హెచ్. ఎస్. సి. తో చదువు ఆపి వ్యవసాయపు పనులు స్వయంగా చూసుకుంటూ వుండటం వల్ల సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతూ మునుపటి కన్నా ఎక్కువ ఆదాయం వస్తూంది. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ. లక్ష్మయ్యగారు ధార్మిక చింతన, ఆస్తికత్వము, సహృదయముగల వ్యక్తి. తన స్వంత ఖర్చుతో ఒక ఆలయాన్ని. ఆగ్రామంలో నిర్మింపజేసి, అందులో శివకేశవులను ప్రతిష్ట చేయించి, శివకేశవులకు బేధము లేదనే సత్యాన్ని నిరూపించారు. లక్ష్మయ్యగారికి మగసంతానం లేదు. ఒక్కతే ఆడపిల్ల. చెల్లెలు కొడుకుని యిల్లరికం ఉంచుకోవాలని పిల్లల పిన్నవయసులో ఉబలాటపడేవాడు. కాని తన బావ గారిది కూడా సంపన్న కుటుంబమే కావడము వారికే ఒకే కుమారుడు వుండడం వల్ల ఒప్పుకుంటారనే ధైర్యం లేక అడిగి కాదనిపించుకోవడం బాగుండదని ఊరుకున్నాడు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్లు రామం తల్లిదండ్రులిద్దరూ కలరావల్ల ఒకేసారి మరణించడం జరిగింది. వారిది వీరి ఊరి ప్రక్కఊరే! భూములు కూడా వారివి వీరివి కలిసి ఉన్నాయి. కనీసం, చెల్లెల్ని బావగారిని చివరి చూపులకు కూడా నోచుకోలేని లక్ష్మయ్య గారు దుఃఖ భారంతో ఆ యిళ్ళకు తాళాలు వేయించి, పసివాడైన రామాన్ని తీసుకొని స్వగ్రామం వచ్చారు. అప్పటినుండి మేనల్లున్ని కంటికి రెప్పలా కాపాడుతూ, కుర్రవాడి చదువు సంధ్యల విషయంలో అమిత శ్రద్ధ చూపుతూ పెంచి పెద్ద చేశారు.
వారి అభిప్రాయాలకు అనుగుణంగా రామం చక్కగా చదువుకొని హెచ్. ఎస్. సి. ఫస్టు క్లాసులో ప్యాసై ఆ వృద్ధ దంపతుల కనుకొలకులలో ఆనంద భాష్పాలు నిలవడానికి కారుకుడయ్యాడు. రామాన్ని డాక్టరుగా చూసిగాని విశ్రాంతి విషయము ఆలోచించ కూడదని నిర్ణయించుకున్న లక్ష్మయ్యగారి ఆశయానికి విధి అంతరాయాన్ని కలిగించింది.
రామం పై చదువు కొనసాగక పోవడంతో అతనికి అన్యాయం చేస్తున్నానా అని బాధపడ్డారు లక్ష్మయ్య గారు, ఆబాధ మరుగు పడిన తర్వాత శాంతారామం వివాహం జరిపిద్దామని అనుకుంటున్న సమయంలో శాంత పట్టు బట్టి పై చదువులకు వెళ్ళడం జరిగింది. పిల్లలు పెద్దవారి తమ మాటలను కాదన్నా రన్న బాధ ఒక ప్రక్క, తను అవకాశం లేక చదువు ఆపి, తనకు కాబోయే భార్యను పై చదువులకు పంపించడానికి ప్రోత్సాహపరుస్తున్న మేనల్లుడు రామం ఆదర్శం వల్ల కలిగిన ఆనందం వేరొకప్రక్క, రేపు తన కుమార్తె పెద్ద చదువులు చదివి, రామాన్ని పెళ్ళాడడానికి నిరాకరిస్తుందేమోనన్న విచారం మరొక ప్రక్క, ఇన్ని ఆలోచనల మధ్య సతమత మవుతున్నారా వృద్ధదంపతులు తీరని ఆవేదనతో -
రాత్రి హరికధా కాలక్షేపాన్ని జరిపించిన రామం ప్రొద్దుపోయి లేచాడు. లేచిన వెంటనే నిత్య కృత్యాలు తీర్చుకొని పశువులశాలవైపు వెళ్ళాడు. పశువులను పేరు, పేరుతో పరామర్శించడం రామానికి అలవాటు. రామాన్ని చూడగానే ఆమూగ జంతువులు మోరలు పైకెత్తి, తోకలు ఊపుతూ సంబర పడతాయి. వాటి అవ్యక్తానందంలో పాలు పంచుకుంటూ, ప్రతిపశువునూ నిమురుతూ కొంతసమయాన్ని ప్రత్యేకంగా వాటికోసరం కేటాయిస్తాడు ప్రతిరోజు. ఇది అతని దినచర్యలో ఒకభాగం. రామం పశువుల పాకలో ఉండగానే యింటి లోపలినుండి కేక వినిపించింది. ఆపిలుపు ఫలహారం చేయడం కోసమని రామానికి తెలుసు. వెళ్ళి ఫలహ్రం చేయడానికి కూర్చున్నాడు. అతని ప్రక్కన లక్ష్మయ్యగారు కూడా కూర్చున్నారు. పార్వతమ్మ ఫలహారం పళ్ళాలలో వడ్డించింది.
ఒరేయ్......! అమ్మాయి ఉత్తరం వ్రాసింది. కాలేజీపిల్లలంతా ఏవో ఊళ్లు చూడడానికి వెడుతున్నారట! తనుకూడా వెళ్ళతలచుకున్నదనీ, వెంటనే డబ్బు పంపించ వలసిందనీ, వ్రాసింది. అదేదో పేరు గమ్మత్తుగా ఉంది...ఎక్స్...........?
లక్ష్మయ్యగారు మాట పూర్తి చేయకుండానే ఎక్స్ కర్షన్ మామయ్యా.....! మంచిదే! ఈ విద్యార్ధి దశలో తప్ప చూడడానికి మళ్ళీ అవకాశం లభించదు. డబ్బు పంపిస్తూ జాగ్రత్తగా వెళ్ళిరమ్మని వ్రాస్తాను. నీవేమంటావు....? మామయ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడురామం. శాంత ఎక్స్ కర్షన్ కు వెళ్ళడం మామయ్యకు యిష్టం లేదన్న విషయం అతని ముఖకవళికల వల్ల పసిగట్టాడు.
ఏమోరా! నాకు ఏమాత్రం యిష్టంలేదు అసలు దాని పై చదువులే నాయిష్ట ప్రకారం సాగలేదు. ఇటువంటి విషయాలలో నాయిష్టాయిష్టాలతో దానికిగాన్ని నీకు గాని ప్రమేయమేముంది.? మొదటినుండీ నీయిష్ట ప్రకారమే జరుగుతూ వచ్చింది ఇది కూడా నీ యిష్టమే...! నిష్టూరపడుతూ, ఎంతో ఆవేదనను ముఖంలో ప్రస్ఫుటింప జేస్తూ అన్నాడు.
అలా నిష్టూర పడతావేం మావయ్యా..? శాంత నీకు ఒక్కగానొక్క కుమార్తె. యిష్టప్రకారం ఆమెను చదువుకోనివ్వడం మన ధర్మం. అవకాశం లేనివారు ఎలాగూ చదువుకో లేరు. అవకాశము, ఆర్ధిక స్తోమత, ఉత్సాహం యివన్నీ ఉన్నవారు చదువుకోవడంలో తప్పే ముంది....? చదువుకొని మనసు లెక్క చేయదేమో నని కదూ నీభయం.....? శాంత తెలివితేటలు కలది. పైగా చక్కని సంస్కారంతో మీపోషణలో పెరిగింది. అటువంటి ఆమెను మనం మరో విధంగా ఊహించుకోవడమంటే మనసు మనమే శంకించుకోవడమవుతుంది.
అన్నీ సక్రమంగా జరిగితే బాధపడవలసిన పనే లేదు. అల జరుగనినాడు మాగతి ఏమవుతుందో ఆలోచించావా నాయనా.....? కొడుకువైనా అల్లుడవైనా నీవే...! రెండు కుటుంబాలనూ ఉద్ధరించవలసిన వాడవు. నీవు దాని పట్టుదలను బలపరచక పోయినట్లై తే ఈపాటికి మనవడినో, మనమరాలినో ఎత్తుకొనే వాళ్ళం మేము అంటూ వాపోయింది పార్వతమ్మ.
ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు....? ఎలా జరుగవలసి ఉంటే అలా జరుగుతుంది. ఊరికే మనం బాధపడడమే గాని, అసలు వాళ్ళకు చీమ కుట్టినట్లైనా లేదు. ఫలహారం ముగించివేస్తూ అన్నారు లక్ష్మయ్య గారు.
ముందు జరగబోయేదాన్ని ఊహించుకొని యిప్పటినుండే బాధపడడమెందుకు మామయ్యా..? అన్నీ శుభంగా జరిగిపోతాయి.
నీ నోటి పుణ్యాన అలా జరిగితే మేము అదృష్ట వంతులమే బాబూ ఖాళీ పళ్ళాలను పెరట్లోకి తీసుకువెడుతూ అంది పార్వతమ్మ.
ఉత్తరం చదువుకొని ఏం చేస్తావో చెయ్యి. నిన్ను గొప్ప డాక్టరుగా చూడాలనుకొన్నాను. మీ అమ్మపేరుతో ఆస్పత్రి కట్టించి పేదలకు ఉచితవైద్య సదుపాయాలు ఏర్పాటు చేయిద్దామనుకున్నాను. తానొకటి తలుస్తే దైవమొకటి చేసినట్లు అనుకున్న దొకటి, జరిగినది మరొకటి.....! ఈపాడు జబ్బు న కిప్పుడే రావాలా....? నీ చదువుకు ఆటంకంగా......! ఇంట్లో ఉండవలసిన అమ్మాయి పై చదువులకు వెళ్ళింది. చదువుకోవలసిన వాడవుయింట్లో ఉండవలసి వచ్చింది అతని కళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నాయి.
బాధపడకు మామయ్యా.... నీ ఆశయం నెరవేర్చే బాధ్యత నాది. రంగయ్య తాత చిన్నకొడుకు సుందరం మెడిసిన్ చదువుతున్నాడు. వాడు డాక్టరై వచ్చేసరికి యిక్కడ ఆస్పత్రి భవన నిర్మాణానికి ఏర్పాటు చేయిస్తాను. ఆస్పత్రి భవనం మన మామిడి తోటలో కట్టించాలనే నా ఉద్దేశ్యం ఉత్సాహంతో చెప్పుకుపోయాడు రామం.
ఇంటివాడివలె చేసేవాడు లేడు, బయటివాడి వలె తినేవాడు లేడన్నట్లు, నీవు డాక్టరువై ఆస్పత్రి. చూసుకొన్నట్లు బయటివారు చూస్తారని నమ్మక మేమిట్రా........? సుందరం అసలే సోకులు మరిగి నటువంటివాడు. ఈ పల్లెటూర్లో వైద్యం చేస్తాడా? నాకేమాత్రం నమ్మకం లేదు. వాణ్ణి దృష్టిలో పెట్టుకొని మాత్రం ఆస్పత్రి భవనం మొదలుపెట్టకు.
అయ్యవారు రాకపోతే అమావాస్య అట్టే ఉంటుందా? వాడుకాకపోతే వాడి తలలో జేజమ్మ మరొకడు. లోకం గొడ్డుపోయిందా? డబ్బు కుమ్మరించే వాళ్ళు ఉండాలేకాని ఈ రోజుల్లో డాక్టర్ల కేం కొదువ? ఏదో నా స్నేహితుడు, కలిసి చదువుకున్న వాళ్ళం అని వాడిని గురించి ఆలోచిస్తున్నాను అంతే........! ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు. లేకపోతే మరొక ప్రయత్నం చేద్దాం!
అయినా ఈ గొడవలన్నీ నాకెందుకు? ఒకేసారి బాధ్యతలన్నీ నీపై ఉంచేశాను. ప్రాణం ఊరుకోక అప్పుడప్పుడు పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. అదను ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు అన్నట్లుగా అన్ని విషయాలలో నీవు ఆరితేరావు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నీకు తెలుసు. మీసాల మధ్యగా తెల్లని పలువరుస కనుపించే విధంగా చిరు నవ్వు నవ్వుతూ అన్నారు లక్ష్మయ్యగారు.
పేరుకే పెత్తనం నాది. నీకు చెప్పకుండా, నీతో అవుననిపించకుండా ఏ చిన్నపనైనా చేశావా మామయ్యా?
అదేరా నీ గొప్పతనం. కాదు అని అనలేనంత గొప్పగా చెప్పి ఒప్పిస్తావు. ఎటువంటి వాన్నైనా నీకు అనుగుణంగా మార్చుకుంటావు. రచ్చబండ దగ్గరకు ప్రయాణమవుతూ సంతోషంతో అన్నాడు లక్ష్మయ్యగారు.
* * *
