Previous Page Next Page 


    అన్ని వేళల్లోనూ అనుభూతులు కలగవు కొందరికి. అనుభూతులు కలిగినప్పుడు అవకాశాలు తమంతట తామే సృష్టించు కొని ఆనందించి తన్మయులవుతారు.
    సురేంద్ర ఒక్కడే గదిలో కూర్చుని చదువు కుంటున్నాడు. రమేష్ ను చూడగానే "ఏరా , ఎక్కడికి వెళ్ళొచ్చావ్?" అనడిగాడు.
    "ఇల్లు చూసొచ్చాను."
    "ఎవరిల్లు?"
    "వాళ్ళ ఇల్లే."
    "ఎవరు వాళ్ళు."
    "పాట కచ్చేరీ లో చూసిన పిల్ల."
    "ఎందుకూ?"
    "ఇల్లు తెల్సుకుంటే మంచిదిగా?"
    "వాళ్ళ ఇల్లు మనకెందుకురా?"
    "ఓ రెండేళ్ళు పొతే నీకే తెలుస్తుంది."
    "అంటే!"
    "అంతే."
    సురేంద్ర మరేం మాట్లాడలేదు. ఎవరో ముక్కు ముఖం తెలీనివాళ్ళ ను వెంబడించటం సురేంద్ర కు నచ్చలేదు. అందులో ఆడపిల్లల విషయం లో రమేష్ ఇట్లా ఎందుకు ప్రవర్తించాలి? ముందుగా ఆ పిల్లను చూడమని తను చెప్పేటం నుంచేగా రమేష్ ఇంతపని చేసిందీ? తను చెప్పకుండా ఉంటె రమేష్ ఈవిధంగా ప్రవర్తించేవాడు కాదేమో?
    అ రోజల్లా సురేంద్ర తనేదో తప్పు చేసిన వాడిలా మనస్సులో బాధపడ్డాడు. ఇట్లా ఆ అమ్మాయిని వెంబడించటం లో రమేష్ అంతర్య మేమిటో తెలీలేదు. తన ఊళ్ళో ఆ పల్లెటూరు హైస్కూల్లో చదువుతున్న ఆడపిల్లలతో తన కెప్పుడూ మాట్లాడాలని కాని, వాళ్లతో స్నేహం చేయాలని గాని తోచలేదు.
    రమేష్ ఆ అమ్మాయిని గురించే ఆలోచించుకుంటూ ఊహ సౌధాలు నిర్మించు కొంటున్నాడు.
    సంసార భారంతో సతమతమై పోతూ జీవయాత్రను సుఖం గా గడపలేక కాలచక్రం క్రింద పడి నలిగి పోయేవారున్నారు. ఆ కాలచాక్రాన్నే తమ జీవన రధానికి పూన్చుకొని జీవిత మార్గంలో పురోగమించే వారూ ఉన్నారు. ఇలాంటి తారతమ్యాలూ కుటుంబజీవితాల్లో నే ఎక్కువగా చూడవచ్చు. విద్యార్ధి జీవితం బహు సున్నిత మైనది. విచిత్రమైనది. బరువు భారాలు మోయట మంటే ఏమిటో తెలియని జీవితాలు. కాని విద్యార్ధి జీవితం లోనే కుటుంబి కి మించి ఉన్న బాధ్యాయుతమైన ఆలోచనలతో సతమత మై పోయే విద్యార్ధులు ఉన్నారు.
    "నువ్వా అమ్మాయిని వెంబడించి వాళ్ళింటి వరకూ వెళ్లి రావటం నాకు బాగుండ లేదురా " అన్నాడు సురేంద్ర.
    "ఇంకా వాళ్ళ యింటి వరకే వెళ్లాను గాని ఇంట్లోకి వెళ్ళలేదు. ఇల్లు చూచి వచ్చినంత మాత్రాన తప్పేమిటో నాకూ తెలీటం లేదు. కాకపోయినా ఇలాంటి విషయాల్లో నువ్వు అనుభవ శూన్యుడి వి. ఇందాక చెప్పానుగా, ఓ రెండేళ్ళు పొతే నీకే తెలుస్తుందని?" అన్నాడు రమేష్.
    ఆ రోజు నుంచి ఆ అమ్మాయి తో ఎట్లా మాట్లాడాలో, ఎట్లా పరిచయం చేసుకోవాలో ఆలోచించుకుంటూ ఉన్నాడు రమేష్. ఏవేవో వింత వింత భావాలు అతని మనస్సు ను కలవరపెట్ట సాగాయి.
    రెండు మూడు రోజులు ఆ అమ్మాయి ఎక్కడయినా కనిపిస్తుందేమోనని చూశాడు గాని, ఎక్కడా కనుపించలేదు.
    ఎవరో కమిటీ మెంబరు చనిపోయాడని ఆ రోజు మధ్యాహ్నం కాలేజీ కి సెలవిచ్చారు. సురేంద్ర కాలేజీ నుంచి గదికి వెళ్ళాడు. రమేష్ వెళ్ళలేదు. కాఫీ హోటల్లో ఇంత టిఫిన్ తిని, కాఫీ త్రాగి, లైబ్రరీ లో నూ, పార్కు లోనూ కాసేపు కాలక్షేపం చేసి, సాయంత్రం నాలుగున్నరకు ఆ అమ్మాయి యింటి ప్రాంతం లోనే పచార్లు  చేయ్యసాగాడు.
    మరో అరగంట గడిచింది. ఆ అమ్మాయి స్నేహితురాలితో కలిసి స్కూలు నుంచి వస్తున్నది. రమేష్ ముఖం విప్పారింది. పక్క సందు మొదట్లో నిల్చుని ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా చూస్తూ ఆ అమ్మాయి రాకను కనిపెడుతున్నాడు. స్నేహితురాలితో కూడా ఆ అమ్మాయి తన ఇంటి దగ్గరికి వచ్చింది.
     వాళ్ళు మాట్లాడు కునే మాటలు రమేష్ కు వినిపించాయి.
    "వెళతానే వసుంధరా. రేపు సాయంత్రం మన హైస్కూలు నాటకాల సెలక్షన్ కమిటీ మెంబర్ల ఎన్నిక. గుర్తుందా? మన గరల్ స్టూడెంట్స్ తరపున నువ్వు మెంబరు గా ఉండాలి. తెల్సిందా? తీరా నీ పేరు మేం ఇచ్చేసరికి నువ్వు జారిపోయేవ్" అన్నది స్నేహితురాలు నవ్వుతూ.
    "నా కేందుకే గొడవ? అయినా ,మార్చి పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయ్యి. ఈ నాటకాల పిచ్చిలో పడితే ఇంక అయినట్లే. అయినా చూద్దాం లే . రేపటి సంగతి కదా?" అన్నదా అమ్మాయి.
    "మన హెడ్ మాస్టర్ గారు తప్పక ఆడపిల్లల తరపున నిన్నే ఎన్నుకుంటారు. అప్పుడు కూడా కాదంటావా?' అన్నది స్నేహితురాలు.
    "మీరంతా పట్టుబడితే తప్పుతుందా" అన్నది వసుంధర నవ్వుతూ.
    "వెరీ గుడ్. వెళ్ళొస్తా" అంటూ స్నేహితురాలు వెళ్ళిపోయింది. వసుంధర కూడా ఇంట్లోకి వెళ్ళింది.
    ఈ సంభాషణ అంతా విని రమేష్ మనస్సులో పొంగి పోయాడు.
    "పబ్లిక్ పరీక్షలు అన్నది కాబట్టి స్కూలు ఫైనలు చదువుతున్నది ఏ హైస్కూలో? సరే, అదీ తెలుస్తుంది. పేరు వసుంధర. ఎంత బావుంది!' అని తనలో తను అనుకుంటూ తిరిగి గదికి వెళ్ళాడు రమేష్.
    సురేంద్ర ఒక్కడే గదిలో ఉన్నాడు. అతని ఆలోచనలు అంతులేనివి. అనిర్శిష్ట మైనవి. అనుమాన రహితమైనవి కావు. అవకాశాలను ఉపయోగించు కోనేవీ కావు. అ వేళ పేపరు చూశాడు. తండ్రి రామయ్య గారు ఎలక్షన్ల కు నామినేషన్ దాఖలు చేస్తారని వార్త.
    రమేష్ రాగానే పేపరు చేతికిచ్చి, "చూడురా , రమేష్, మా నాన్న మళ్ళా ఎలక్షన్ల లో పోటీ చెయ్యబోతున్నారు. నామినేషన్ వేస్తారుట" అన్నాడు.
    "అంటే మీ నాన్నగారు నామినేషన్ వేసే విషయం కూడా నీకు తెలియదన్న మాట. రాజకీయాల్లో పాల్గొనే అలాంటి వ్యక్తీ కొడుకు వంకే నాకే ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆ బ్రహ్మదేవుడు నీకు రూపం ప్రసాదించాడే గాని ఉంటాయి. అన్ని విషయాలూ ఆశ్చర్యం గానే ఉంటాయి. అన్ని విషయాలూ వింటావు. నేటికీ ప్రాధాన్యం యివ్వవు. మా నాన్నగారు మీ నాన్నగారి మాదిరే అయితే , నేను....ఎందుకులే కాని విషయాలకు తాపత్రయ పట్టం" అన్నాడు రమేష్.
    "అది కాదురా. మళ్ళీ కనీసం పాతిక వేలన్నా ఖర్చు. తెలిసిందా?"
    "అదా నీ దిగులు! వందలతో అసెంబ్లీ మెంబరయితే వీధికి నాలుగు సీట్లు ఉండేవి. వేలు కావాలి గనుకనే నియోజక వర్గాలన్నారు. ఇంతకీ విన్నావా?"
    "ఏమిటది?"
    "ఆ అమ్మాయి పేరు వసుంధర."
    "ఎట్లా తెలుసు?"
    "తెల్సుకున్నాను. వారం రోజుల్లో మాట్లాడ బోతున్నాను. నెలరోజుల్లో స్నేహం చేసుకుంటాను."
    "అట్లాగే . చూస్తానుగా నేనూ!"
    రమేష్ సిగరెట్టు వెలిగించి హేళనగా చూశాడు సురేంద్ర వైపు.

                                      3

                
    లంక పొగాకు చుట్ట చుట్టుకుంటూ జారిపోతున్న పొడుగాటి కండువా ను భుజాన వేసుకుంటూ వస్తున్న రాయుడు గారిని చూసేసరికి సురేంద్ర కు ఎక్కడ లేని వణుకూ, భయమూ కలిగినాయి. రాయుడు గారు ఆ రోజున తన గదికి వస్తాడని, సురేంద్ర కు తెలీదు. అసలు గుంటూరు ఎప్పుడు వచ్చింది తెలీదు. తీరా గుమ్మం లోకి వచ్చిన మేనమామ ను చూసేసరికి కాళ్ళూ చేతులూ వణక నారంభించినాయి. కారణం తను సిగరెట్టు కాలవటం అయన కల్లబట్టం చేతనే.
    రాయుడు గారు సురేంద్ర కు మేనమామ . తల్లికి అన్నగారు. పేరు మోసిన రాజకీయ వేత్త. అసెంబ్లీ మెంబరు. చాలా పొడగరి. పోడుక్కు తగ్గ లావు. గిరజాల జుట్టూ, బొద్దు మీసాలూ అయన విగ్రహానికి మంచి హుందాతనాన్ని తెచ్చినాయి. తీక్షణమైన అయన చూపుల బారి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని తప్పు చేసిన వ్యక్తీ తనకు లొంగి పోయినట్లు కనిపిస్తే ఇంక అయన నిండు కుండలా తొణక్కుండా , ఎదుటి వ్యక్తీ మనస్సుకు నొప్పి కలక్కుండా, ఆ తప్పును ఒప్పించి సున్నితంగా మందలిస్తాడు. అలాంటి చతురత కలవాడు గనకనే అయన రాజకీయ జీవితం వన్నె కెక్కింది.
    సిగరెట్టు కాలుస్తున్న మేనల్లుడి ని చూడగానే అయన ఏమీ తెలీనట్లుగా తాపీగా సురేంద్రను కుశల ప్రశ్నలదిగాడు.
    "కులాసాగా ఉన్నావా, సురేంద్రా?"
    "కులసానే మావయ్యా. ఎప్పుడొచ్చావు?" సురేంద్ర పీల్చిన సిగరెట్టు పొగ ఒక్కసారి పైకి వచ్చింది. సురేంద్ర కు ప్రాణం పోయినట్లయింది.
    "అమ్మా, నాన్న కులాసాగా ఉన్నారా?"
    "కులసానే. శ్యామ సుందరి కులాసాగా ఉందా?"
    "ఆ. ఈ ఏడు ఫిప్టు ఫారం . బాగానే చదువుతున్నది."
    "కూర్చోండి. నిల్చునే మాట్లాడుతున్నారు." అన్నాడు రమేష్.
    "వెధవది . ఈ పొగాకుతో ఇదే అవస్థ. పాయలు తియ్యాలి. చుట్ట చుట్టాలి. చివరన కొరకాలి. అగ్గిపుల్ల గీసి మెల్లిగా ఆరిపోకుండా గుక్క పీలుస్తూ ముట్టించాలి. దవడలు పీక్కు పోతాయి. ఇదే సిగరెట్టయితే నిమిషం లో నాలుగు దమ్ములు లాగి అవతల పారేయ్యవచ్చు. ఏరా, సురేంద్రా , అంతేనా?" కుర్చీలో కూర్చున్నాడు రాయుడు గారు.
    సురేంద్ర కు పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్లయింది.
    "అవును మావయ్యా" అన్నాడు సురేంద్ర. నోట్లో మిగిలిన కాస్త పాగా ఈసారి పూర్తిగా బయటికి వచ్చేసింది.
    "సరే, దానికేం లే. బాగా చదువు. క్లాసులో ప్యాసవాలి. మనోవర్తి మార్కులొస్తే లాభం లేదు. అత్తారింటి అల్లుడు మార్కులు రావాలి" అన్నాడు నవ్వుతూ రాయుడు గారు.
    "సురేంద్ర బాగానే చదువుతున్నాడండీ" అన్నాడు రమేష్.
    "మంచిదేగా చదువుతుంటే!అమీ పేరు?"
    "నాపేరు రమేష్."
    "ఇంకేం! వాడి పేరు సురేంద్ర, మీ పేరు రమేష్. ఇద్దరు బెంగాలీ బాబులూ కలిసి చదువు తున్నారన్న మాట! ఏరా సురేంద్రా! రోజుకు మూడు సిగరెట్లు కాల్చు. అట్టే జబ్బు చెయ్యదు. ఏమంటావ్?' అన్నాడు రాయుడు గారు.
    సురేంద్ర ప్రాణం చచ్చిపోయింది.
    "ఇంకెప్పుడూ సిగరెట్లు కాలవను మావయ్యా. ఏదో సరదాకి కాల్చాను. అంతే. తప్పు పనే చేశాను. ఇంకెప్పుడూ సిగిరెట్టు కాల్చను" అన్నాడు సురేంద్ర మనస్సులో బాధపడుతూ.
    "పోనీలేరా. సరదా కే కాలుస్తున్నావనుకున్నా. కుర్ర తనం లోని కోరికలూ అనుభూతులూ అట్లాగే ఉంటాయి. ఏదయినా శృతి ముంచితేనే రాగన పడేది. సరే, నే వెళతాను. మంత్రి గారి ప్రోగ్రాం ఉంది ఈ వూళ్ళో. అందుకని వచ్చాను. సరే, మేనల్లుడు ఇక్కడ చదువుతున్నాడు కదా, ఓసారి చూసిపోదామని వచ్చాను. సరే, వెళతానోయ్, రమేష్. కాస్త శ్రద్దగా చదవండి." అంటూ ఆయన వెళ్ళిపోయాడు.
    "హమ్మయ్య" అంటూ అయన వెళ్ళిన తరవాత చాప కింద పెట్టిన సిగరెట్టు తీశాడు సురేంద్ర . రూపాయంత మేర చాప కాలి సిగరెట్టు ఆరిపోయి ఉంది.
    "మీ మేనమామ చాలా అసాధ్యుడేరా" అన్నాడు రమేష్.
    "ఎంత అసాధ్యుదో అంత మెత్తని మనస్సు కలవాడు. అందుచేతనే ఆ ప్రాంతాల్లో ఆయనతో పోటీ చేసి ఎవరూ గెలవలేరు."
    'అయితే ఎమ్. ఎల్.ఏ. గారి కాబోయే అల్లుడి వన్నమాట. మీదంతా మొత్తం మీద ఎం.ఎల్. ఏ ల కుటుంబమన్న మాట" అన్నాడు రమేష్ నవ్వుతూ.
    సురేంద్ర కూడా ఆ నవ్వులో శృతి కలిపాడు. అంతలోనే ముఖం ముడుచుకు కూర్చున్నాడు. రమేష్ కు ఆశ్చర్యం కలిగింది.
    "ఏరా, అంతలోనే దిగాలు పడ్డావ్? సరే, శ్యామసుందరి అయన కూతురా?"
    'అవును."
    "ఏం, మీ మామయ్యా కూతురు నీ కిష్టం లేదా?"
    "అది వట్టి పొట్టి బుడం కాయ . పెద్ద నాపసాని లా మాట్లాడుతుంది. ముది నాపసాని. పన్నెండేళ్ళ కే పాతికేళ్ళ వయస్సున్న దానిలా మాట్లాడుతుంది."
    "ఇంకేం? నిన్ను తీర్చి దిద్దుకోగల భాగ్యశాలి."
    "అంటే?"
    "నీలాంటి అపర ప్రవరుడి పాలిట అపర వరూధిని."
    "పోరా, నీ మాటలూ నువ్వూనూ! అసలు నాకు శ్యామ సుందర్నీ చేసుకోవాలని లేదు."
    "ఏం బావుండదా?"
    "బాగానే ఉంటుంది."
    "మరి?"
    "కొంచెం పొట్టిగా ఉంటుంది."
    "వయోసోస్తే ఎదగోచ్చుగా?"
    "వయస్సు కు మించిన తెలివి తేటలు."
    "అదృష్ట వంతురాలు."
    "అది వేసే అడ్డు సవాళ్ళ కు నే సమాధానం చెప్పలేను."
    "చిన్నతనం భావాలు పెద్దయ్యాక అనేకం మారుతయ్యి. అయినా పన్నెండేళ్ళ పిల్ల మీద ఇంత విమర్శ ఎందుకు?"
    "అవును, నిజమే. అదీగాక పార్టీ బేధాలున్నాయి. ఆ విషయం తెలుసుగా?"
    "తెలుసు. అయినా ఆడవాళ్ళ కు ఆ పట్టింపులు ఉండవు. మీ అమ్మకూ, మీ అత్తయ్య కూ ఇష్టమేనా?"
    "వాళ్ళకు ఇష్టమే. మా నాన్నగారి అంతర్యం లో ఇష్టమే కాని పార్టీ అభిమానం అప్పుడప్పుడూ కలక వేస్తుంది."
    సురేంద్ర మఖం వివర్ణ మైంది. శ్యామ సుందరి అతని మనస్సు లో మెదిలింది. కాని అంతలోనే ఆ పిల్ల ముదినాపసాని మాటలూ గుర్తుకు వచ్చాయి. అలాంటి గడుగ్గాయి తో వేగటం కష్టమే ననుకున్నాడు సురేంద్ర.
    శ్యామసుందర్నీ చేసుకోనట్లేనా?" అన్నాడు రమేష్ మళ్ళీ.
    "ప్రస్తుతం చేసుకోవాలను కోవటం లేదు."
    రమేష్ మాట్లాడలేదు. అతని మానస్సులో వసుంధర హొయలు ఒలకబోస్తూ మెదిలింది. వసుంధర తో మాట్ల్దాలని నిశ్చయించు కున్నాడు.

                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS