Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 3

 

    "తినే వచ్చాం. మీరు కానివ్వండి." అంది చిత్ర.
    రామయ్య గారు కాఫీ కూడా త్రాగేసి నిలబడ్డారు. వీధిలో కెళ్ళి వస్తాను కాని నీకేం కావాలో మొగమాటం లేకుండా చెప్పి చేయించుకో." అని అమ్మాయిల వైపు తిరిగి "అతనికి గది చూపించి ఏం కావాలో కాస్త కనిపెట్టి చూడండి." అంటూ రామయ్య గారు చెప్పులు తొడుక్కుని వీధిలోకి అడుగు పెట్టారు.
    ముసలాయన వెళ్ళిపోగానే సుధాకర్ హుషారుగా చూశాడు.
    "ఇప్పుడేగా వీధిలో నుంచి వస్తున్నారు ఎక్కడ తిన్నారు?" అన్నాడు నవ్వుతూ.
    "మా స్నేహితురాలింటి కెళ్ళాం....అది కాస్తా మమ్మల్ని కాఫీ, టిఫిన్ తీసుకుంటేనే కాని కదల నివ్వలేదు--" అంది ఉష.
    వట్టిది! ఆ స్నేహితురాలు నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోయ్యలేదు!
    "తిన్నదేదో ఈపాటికి అరిగి పోయే ఉంటుంది. కొంచెం తీసుకోండి. లేకపోతె నేనూ తీసుకోనూ--" అని భీష్మించాడు సుధాకర్.
    చేసేది లేక ఉష "సరే! మీ మాటే కానివ్వండి! కొద్దిగా తీసుకు రావే! మన కోసం అయన తినటం మానేస్తున్నారు....' అంది తన కుర్చీ చేతి మీద కూర్చున్న కళ మీద చెయ్యేసి. కళ లేచి లోపలి కెళ్ళింది. గీత కూడా కళ ననుసరించింది.
    "దర్జాగా కూర్చుని తీసుకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నది రాణీ గారిలా! ఇక్కడెవరు చేసి పెట్టారనుకున్నది? తింటే తిన్నాడు లేకపోతె లేదని ఊరుకోక!" అని విసుక్కుంది కళ.
    "అంతా మర్యాదనుకున్నాడు -- తింటున్నదో, లేదో ఆ ఆలోచనంతా అబ్బాయి కెందుకు?  అమ్మాయిల పాట్లు గ్రహించుకునే అబ్బాయిలు కూడా ఉంటారూ?" అని సుధాకర్ నెత్తిని నాలుగక్షింతలు వేసింది గీత.
    నోరెత్తి ఏ మాటా చెప్పక ముందే శారద మరో రెండు ప్లేట్ల లో టిఫెన్ సర్ది చేతి కందించింది. చల్లారిన కాఫీని వెచ్చబెట్టి కప్పుల్లో పోసి ఇద్దరికీ చేరోకటి అందించింది.
    "ఎంత తెలివైన దానివే శారూ!"
    "ఎంత మంచి దానివే శారూ!"
    శారద మంచిదే కాని పాపం ఏం తెలీదు-- ఇప్పుడు అవసరం వచ్చింది కనుక సరిపోయి కాని లేకపోతె ఇదంతా శుష్క దండుగే కదా? తూకం లేకుండా చేతి కంత వస్తే వస్తే అంతా పోసి వండుకుంటే ఇలా కాక మరెలా తగలడుతుంది? పాక కళ అని వేళాకోళం చేస్తారే కాని ఆ కళ అందరికీ అబ్బుతుందా? అదీ ఒక పెద్దతిలో నేర్చుకుంటేనే ఫస్టుగా కుదురుతుంది. పాక కళను గురించి చదువు కోబట్టి కాని లేకపోతె తనకు మాత్రం ఈ తూకాలు, పాకాలు ఏమి తెలిసేవి అనుకున్నది వెళ్తూ వెళ్తూ కళ.
    ఫలహారాలు పూర్తయ్యాక కళ సుధాకర్ ఉండటానికి వరండా కు ఎడమ వైపున ఉన్న మొదటి గదిని చూపించింది. బాత్ రూం కు, గదికి మధ్య తలుపెం లేదు కాబట్టి ఆ గది మట్టుకు అ గది వేరుగా ఉన్నది. పొతే వీధి వరండాలు ఒక గుమ్మం, హాల్లోకి దారి తీసే మరో గుమ్మం   మొత్తం రెండు ప్రవేశ ద్వారాలున్నాయి ఆ గదికి.
    గదిలో ఓ మూలగా వ్రాత బల్ల , కుర్చీ మరో మూలగా జానకమ్మ గదిలో నుంచి తీసుకొచ్చి పెట్టిన నవారు మంచం ఉన్నాయి. సుధాకర్ తన తోలు పెట్టె , బెడ్డింగు , ట్రాన్సిస్టర్ గదిలో చేర వేశాడు. బల్ల మీద ట్రాన్సి స్టర్ పెట్టి మంచం మీద బెడ్డింగ్ పరిచాడు. మూసి వున్న కిటికీ తలుపులు తెరిచాడు. కిటికీ లో నుంచి మెల్లిగా గాలి చొరబడి శరీరానికి, మనసుకు గిలిగింతలు పెడుతున్నది. యేవో తీయని ఊహలను రేకెత్తిస్తున్నది.
    విడివైన ముక్కు, విశాలమైన నుదురు కాంతి వంతమైన కళ్ళు, చిరునవ్వు చిందించే పెదాలు, వీటన్నిటికి తోడుగా చక్కని నొక్కుల జుట్టు -- అన్నీ ఒక అందమైన ముఖంలో చోటు వెదుక్కున్నాయి. అంత అందమైన మోము, ఎంతో చక్కని రంగు ఆరడుగుల ఆజానుబాహుని అతి ఆప్యాయంగా వరించాయి. చక్కదనానికి సరితూగే పేరు సుధాకర్!....
    నాన్నగారి మాట విని మద్రాసు రావటం మంచి పనే అయింది. లేకపోతె ఇంత అందమైన చలాకీ అమ్మాయిల్నీ తను మరెక్కడ చూడగలడు? అసలు ఇంట్లో సంచరిస్తున్నది అమ్మాయిలా అప్సరసలా అనుకున్నాడు దిగ్భ్రమతో సుధాకర్.....
    పంచ కన్యల పంచ చేరిన సుధాకర్ మానసు చలిస్తే అది ఎవరి తప్పనుకోవాలి?

                              

                                  2
    రెండు రోజులు కాదు, నాలుగు రోజులు గడిచినా ఇంకా జానకమ్మ లేచి తిరగలేక పోతున్నది. సుధాకర్ కదిలే జాడ కనబడలేదు. అమ్మాయిలు అతనికి కావలసినవన్నీ అందించలేక అలసిపోతున్నారు.
    నిమిషానికో సిగరెట్టూ, టిప్ టాప్ గా డ్రెస్సు! అబ్బాయి వరసేమీ అమ్మాయిలకు నచ్చలేదు.
    "రెండు రోజులుండి వెడతానన్నాడు కదా? రెండు రెళ్ళు గడిచినా అబ్బాయి రైలేక్కే జాడ కనబడలేదే? ఇంకా ఉండాలనుకుంటే వూళ్ళో ఎన్ని హోటళ్ళు లేవు? ఇదేం హోటలనుకున్నాడా? సత్రం అనుకున్నాడా? అర్ధరాత్రి పూట పెద్ద ఆఫీసరు లా బూట్లు టకటక లాడిస్తూ వస్తాడు! అందరి నిద్రలూ పాడు!" అంది గీత మండుతున్న కళ్ళు నులుపుకుంటూ.
    "మరే! అర్ధరాత్రి పూట రావటం "ఐయాం సారీ" అనటమూనూ! అబ్బాయి గారి వరస ఏం బాగుండలేదు!" అంది చిత్ర వేస్తున్న బొమ్మను మధ్యలో ఆపి.
    అయిదుగురమ్మాయిలు అలా కలిసి కూర్చుని మాట్లాడుకోవట మంటే  రామయ్యగారి కుటుంబ చరిత్రలో అసాధారణ విషయం. అలా జరిగిందంటే అయిదుగురమ్మాయిల్ని ఆకర్షించిన ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నదన్న మాటే! అలాంటి సమయాల్లో గీత పాడుకునే గది వాళ్ళందరికీని ఆప్యాయంగా  ఆహ్వానిస్తుంది.
    ఈ రోజు కూడా అమ్మాయిలంతా ఆ గదిలోనే సమావేశ మయ్యారు. ఉష పరికిణీ లేసోకటి శ్రద్దగా అల్లుతున్నది. చిత్ర డ్రాయింగు పేపరును బోర్డుకు గ్రుచ్చి పెన్సిలు తో సీనరీ ఒకటి వేస్తున్నది. మిగతా వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. చిత్ర మాటలు వినగానే గీత అందుకున్నది.
    "పగటి పూట మాత్రం? అందరి భోజనాలు తొమ్మిదింటి కే అయితే ఈ మహానుభావుడు వూరంతా చుట్టచుట్టి మిట్ట మధ్యాహ్నం ఇల్లు చేరుకుంటాడు... ఎండాకాలం కదా మధ్యాహ్నం  కాస్సేపు నిద్రపోదామన్నా వీల్లేకుండా చేస్తున్నాడు! అని విసుక్కుంటూ గీత వట్టి నేలమీద సాగిల పడింది.
    బీరువా కానుకుని కూర్చున్న కళ నిట్టూర్చింది.
    "నా అవస్థ ముందు మీ అందరూ పడేపాట్లు ఎంత? అర్ధరాత్రి కాదు తెల్లవారి ఘామున వచ్చినా అతను తింటేనే కాని నాన్నగారు వప్పుకోరు. అతనోచ్చే వేళకు నేను నిద్రపోతూ ఉంటె నన్ను కాస్తా లేపి "వడ్డించమ్మా!" అంటూ అబ్బాయిని వెంటబెట్టుకుని వంటింట్లోకి తీసుకొస్తారు . నాన్నగారు!" అన్నది కళ.
    వ్రేళ్ళ మీది నుంచి జారిపోయిన దారాన్ని తిరిగి చేతి మీదికి వేసుకుంటూ "అందర్లో కి పెద్ద దానివి కదూ అందుకని నువ్వంటే నాన్నగారికి ముద్దు. అందుకని అన్నిటికీ 'కళా! కళా!' అని నిన్నే పట్టిస్తారు!' అంది ఉష కళను చూసి నవ్వుతూ.
    కళకు కోపం వచ్చింది.
    "ముద్దేలే! మీలా నాక్కూడా మొద్దు నిద్ర పడితే ఏ గొడవా లేకపోను. పిలిచినా, కుదిపినా ఇటు నుంచి అటు దొర్లటం కూడా ఉండదు కాని నిద్ర పాడైనట్లు వెధవ అబద్దాలు!"
    "రాత్రి పూట తెలివోచ్చినా పక్క మీద నుంచి లేవవెం! అయితే పొద్దుటి పూట మేం మాత్రం సాయం చేయటం లేదా" అని ఘాటుగా జవాబిచ్చింది గీత.
    ప్రక్క గదిలో అతిధికి మంచం అరువిచ్చి చాప మీద నిద్ర పోతున్న జానకమ్మ ఈ గొడవకు లేస్తుందేమో నని శారద భయపడింది. పాపం! అసలే వంట్లో బాగుండలేదు. పట్టక పట్టక నిద్రపడితే ఎవరి గురించో ఎందుకొచ్చిన రాద్దాంతం?
    అంతవరకు మాట్లాడకుండా సంభాషణ నంతటిని వింటున్న శారద చటుక్కున కలగజేసుకుని "కొన్నాళ్ళు ఇబ్బంది పడితే సరిపోతుంది లేండర్రా! ఎల్లకాలం ఇక్కడే ఉండి పొడుగా?' అంది.
    కళ కోపంగా చిరాకు పడింది.
    ఇది చూడబోతే చిన్నదే కాని మాటలన్నీ పెద్ద పెరక్క మాటలు! ... అంత సరదాగా ఉంటె నువ్వే వడ్డించరాదూ?"
    "....అమ్మో! నాకు చేత కాదు..." అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS