
2
విజయ చేత చీవాట్లు తిన్న కాసేపటికి వెంకట్రామయ్య గారింటికి బయలు దేరాడు జగననాధం. వాకిట్లో పడక కుర్చీలో కూర్చుని వెంకట్రామయ్య గారి సోది వినివినీ విసుగెత్తి చివరికి--
"చిట్టి ఏదీ కనిపించదేం?' అని అడిగాడు.
"ఇంట్లో వుంది నాయనా, వస్తున్నది" అని లోపలి నుంచే సమాధానం చెప్పింది సుందరమ్మ గారు. ఆ ఇల్లు రెండున్నర గదుల మట్టి కొంప. లోపల చీకటి.
జగన్నాధం ఆలోచనలో పడి ఉండగానే చిట్టి వచ్చింది. జగన్నాధం ఆమెను చూసి హడిలి పోయాడు. తను కిందటి సారి వచ్చింది మంగళ వారం సాయంత్రం. ఇవాళ శనివారం. ఈ నాలుగు రోజుల్లోనే ఇంత మార్పా?"
గులాబీ పూల చెక్కిళ్ళు పాలిపోయినాయి. మందార మొగ్గల పెదవులు ఎండి పోయినాయి. కళ్ళు మాత్రం ఏదో వెర్రి దైర్యంతో నూ, అచంచల ఆత్మ విశ్వాసం తోనూ తళతళా మెరుస్తున్నాయి. ఇదేమిటి ఈ పిల్ల ఇలా ఉంది? ఆశ్చర్యంలో మునిగిపోయిన జగన్నాధం ఆమె ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇవ్వలేదని గ్రహించి ఎలా ఉన్నావు అని అయినా ప్రశ్నించ లేదు.
ఇంతలో సుందరమ్మ గారు వచ్చి "పొద్దుపోయింది. ఇంకా ఏం పేరంటానికి వెడతావు.... పోనీ జగన్నాదాన్ని తోడు తీసుకు వెళ్ళు" అన్నది.
చిట్టి పెదవుల మీద కాంతి హీనమైన చిరు నవ్వు ఒకటి తారాడి పోయింది. హటాత్తుగా తండ్రికి నమస్కరించింది. అది చూసిన జగననాధం అప్రతిభుడై పోయినాడు. ఊహించలేని దుస్సంఘటన ఏదో జరుగబోతున్నట్లుగా అనిపించింది.

"ఇప్పుడు దండం దేనికమ్మా?' వెంకట్రామయ్య గారు కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నారు.
"కొత్త చీర కట్టు కొన్నాగా నాన్నా" అని మెట్లు దిగింది చిట్టి. వెనకాలే యాంత్రికంగా తనూ మెట్లు దిగాడు జగననాధం.
ఇద్దరూ నడిచి ఖాళీ స్థలం దాటారు. నూజీవీడు సందులు కాస్త అలవాటు పడితే తప్ప అర్ధం కావు ఎంత వాళ్ళ కీను. చిట్టి గబగబా ముందు నడిచి పోతున్నది. ఆ సందు దాటాక కాస్త నిర్జనమైన స్థలం మరోటి ఉన్నది. అక్కడ అయిదారు సాయిబుల గోరీలు ఉన్నాయి. చిట్టి అక్కడ ఆగిపోయింది. జగన్నాధం ఆమె వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
చిట్టి అతని చేయి అంది పుచ్చుకుని, "నాకు భయంగా వుంది జగ్గూ" అన్నది.
"అయితే వెనక్కు పోదాం పద" అన్నాడు తను.
అతని వంక ఒకసారి దీర్ఘంగా చూసి --
"నీకు అర్ధం కాలేదు జగ్గూ....నాన్నకు దండం దేనికి పెట్టాననుకుంటున్నావు? ఇక ఆ ఇంటికీ నాకూ ఋణం తీరిపోయింది" అన్నది.
అతనికి ఊపిరి ఆడలేదు. అర్ధం కాని అశుభం ఏదో జరగబోతున్నదని అతనికి అనిపిస్తూనే ఉంది. అతని కిదంతా ఏదో విష వలయం లా , సుడిగుండం లా తోచింది.
"జగ్గూ, నన్ను నీవూ అర్ధం చేసుకోలేవా?" అని రెండు చేతులతో కళ్ళు మూసుకుంది చిట్టి.
"నాకేమీ అర్ధం కావటం లేదు" అన్నాడు చివరి కతను. తనేం మాట్లాడుతున్నాడో తనకే వినిపించటం లేదు.
"నీకు అన్యాయమే జరిగింది...కాని మన స్నేహానికి మాత్రం ఏ విధమైన అంతరాయం ఉండదను కుంటాను...నేను మురళీ దగ్గరికి వెడుతున్నాను జగ్గూ.
చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం జడలు విప్పుకుంది. చివరకు జగాన్నాధమే మాట్లాడాడు.
"ఇంత తెలివి తక్కువ ఏమిటీ చిట్టీ....అతనికీ నీకూ ఇష్టమయితే పెళ్లి చేసుకోవచ్చును గాని ఇలా వెళ్లి పోయి రావటం పెద్ద కుటుంబం లో పుట్టిన పిల్లకు చాలా అప్రతిష్ట పని . మీ అమ్మా నాన్నల గతి ఏమిటి?"
"నాకు తెలియదు జగ్గూ....నేను శక్తి హీనురాల్ని."
"నా మాట విను చిట్టీ. ఇంటికి పోదాం పద. ఇంకా సమయం దాటలేదు. ఆంధ్రదేశం లోని పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబాల్లో మీ కుటుంబం ఒకటి. అదీగాక వ్యాజ్యలతోనూ అప్పులతో నూ చితికిపోయిన మీ కుటుంబానికి ఇది ఎంత దేబ్బో ఆలోచించావా? ఇప్పుడు నిన్ను పొందలేక పోయాననే అసూయతో మాట్లాడటం లేదు నేను. అందులో వెంకట్రామయ్య గారి వల్లనే మీకీ గతి వచ్చింది. అయన కొడుకు మురళీ........"
"జగ్గూ....వూరుకో జగ్గూ...అవన్నీ నాకు తెలియ వంటావా? పరువు ప్రతిష్టలు, నీతి అని నీతులూ గురించి ఆలోచించే శక్తి నాకు నశించి పోయింది" అన్నది చిట్టి. ఆమె అనుభవిస్తున్న దురంత వేదన ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నది.
"చిట్టీ, నిజంగా నువ్వతన్ని అంతగా ప్రేమిస్తున్నావా?' జగన్నాధం తెలివి తక్కువ ప్రశ్న ఒకటి వేశాడు.
చిట్టీ చిరునవ్వు నవ్వి "ఎలా చెప్పటం జగ్గూ ...ఇప్పుడీ గోరీల దగ్గరికి వస్తానన్నాడు " అన్నది.
"చిట్టీ, నా మాట విను. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు...దీన్ని విడదీయటం పెద్ద కష్టం కాదు. పెళ్లి చేసుకోటానికి ప్రయత్నించు. అంతేకాని ఇల్లు విడిచి పొవటం తెలివి తక్కువ. ఆ కళంకం జీవితాంతం నీ నుదుటి ని పట్టుకునే ఉంటుంది. మీరిద్దరూ సుఖంగా ఉండేటట్లు నేను చూస్తాను. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవటం మంచిది కాదు." చిట్టి రెండు చేతులూ పట్టుకుని ప్రాధేయ పడ్డాడు జగన్నాధం.
చిట్టి కన్నుల వెంట ధారావాహిని గా కన్నీరు ప్రవహిస్తున్నది. అయిదారు నిమిషాల తరువాత తనను తనే ఓదార్చుకుని----
"నీముందు నేను చాలా అల్పురాల్ని జగ్గూ , నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నేను మురళీ ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను...కాని ఇది స్నేహం ...నీవు లేకుండా నీఅసరా లేకుండా నేను ఏ పనీ చేయలేను. నువ్వు నన్ను క్షమిస్తావనీ నాకు తెలుసు" అన్నది.
వలవలా ఏడ్చింది ఆమె. ఆ పొంగు అణిగినాక తిరిగి ప్రారంభించింది.
"నేను మురళీ ని పెళ్లి చేసుకోవటం నాన్నకు వెంకట్రాయుడు గారికి కూడా ఎంత మాత్రం ఇష్టం లేదు. మురళీ లేకుండా క్షణం కూడా బ్రతక లేను."
జగననాధం నిట్టూర్చి 'అతను నిన్నే గనుక ప్రేమిస్తే ఇలా లేచి రమ్మని నీ శీలానికి మచ్చతేడు" అన్నాడు.
"అలా అనకు జగ్గూ. ఇందులో మురళీ ప్రమేయం అట్టే లేదు. వెంకట్రాయుడు గారు వీరవానరం సంబంధం మురళీ కి ఖాయపర్చబోతున్నారు. అయన సంగతి నీకు తెలియనిదేముంది? అగ్నిహోత్రావదాన్లయ్యే. అదీగాక ఆ వీరవాసరం పిల్ల చాలా అందంగా ఉంటుందని మురళీ అయిదార్లు సార్లన్నాడు కూడా. నేను దూరంగా ఉంటె మురళీ నాకు కాకుండా పోతాడు జగ్గూ. ప్లీజ్, నన్ను కాదనకు కనీసం నువ్వయినా అర్ధం చేసుకో" అని జగన్నాధం చెయ్యి తన చేతిలోకి తీసుకుంది చిట్టి.
"అయితే వెంకట్రాయుడు గారికి ఇది తెలుసా?"
"మురళీ సంగతి నీకు తెలియదు. ఏదీ ఎవరి దగ్గరా దాచుకోవడం అంటూ ఉండదు. అన్నీ అందరి దగ్గరా శుభ్రంగా వాగేస్తాడు" అని ముద్దుగా నవ్వింది చిట్టి.
"అలాటి తెలివితక్కువ వాడితోనా నీ జీవనాను బంధం........"
"అదే అతనిలో ఆకర్షణ జగ్గూ. అతనికి అందం తప్ప ఆత్మ లేదు. ఆత్మవంచన కు వర్ణ క్రమం కూడా అతనికి బోధపడదు. అందర్నీ నమ్ముతాడు. అందరితోనూ నువ్వు లేందే బ్రతక లేనని ప్రమాణం చేస్తాడు. అతను తప్పు చెయ్యనీ, ఒప్పు చెయ్యనీ, అంతా చెప్పేస్తాడు. అతని మీద అందరి ప్రభావం తేలికగా పడుతుంది. నేను పదిరోజులు కనిపించక పొతే నన్ను మర్చిపోతాడు. అతన్ను నన్ను మర్చి పోవటమే గనుక జరిగితే క్షణం కూడా బ్రతక లేను నేను. అందుకే అతని వెంట వెళ్లి పోవటానికి నిశ్చయించు కున్నాను."
"వీరవాసరం పిల్ల అందంగా ఉంటుందని కూడా అతనే చెప్పాడా?"
"అవును."
"ఎడిచినట్లుంది . ఇలాటి వాడితోనా..."
"అలా అనకు జగ్గూ. అతని హృదయం అమృత వరసి. అతను లేందే నాకు బ్రతుకు లేదు. నేను సర్వనాశనం అయినా సరే సర్వస్వాన్నీ నష్టపోయినా సరే అతని వెంట వెళ్ళక తప్పదు" అన్నది చిట్టి.
ఆమె ఒక గోరీని అనుకుని నిలబడింది. తనను తను నిగ్రహించు కోలేకోపోతున్నది. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఏడుపు ఆపుకో లేకపోతున్నది.
ఈ దేశం తీరు ఏమిటో గాని మగవాడి కోసం స్త్రీలు ఎందుకిలా సర్వనాశన మవుతారో అనుకొన్నాడు జగన్నాధం. అతనికి విజయలక్ష్మీ జ్ఞాపకం వచ్చింది. చిట్టి లాటి ఆడవాళ్ళ ను ఆమె ఏ మాత్రం క్షమించలేదు. చిట్టి చేస్తున్న తెలివి తక్కువ త్యాగం ఆమె అర్ధమూ చేసుకోలేదు. ఇదంతా అవినీతి అనే ఒక్క వాక్యంతో కొట్టి పారేస్తుంది. చిట్టి మీద తను ఎన్నో ఆశలు పెంచు కున్నాడు. వాటినన్నిటినీ ఒక్కసారి పడగొట్టేసింది ఆమె. అయినా సరే. ఆమెను ఎందుకని శపించ లేకపోతున్నాడో అర్ధం కావటం లేదు. అంతేకాదు. హృదయాపూర్వకంగా ఆమె సుఖాన్ని కాంక్షిస్తున్నాడు.
కళ్ళు తుడుచుకుని "పోనీ, అతను నన్ను ప్రేమించటం లేదనే అనుకున్నా గాని..అప్పుడు కూడా అతనికి దూరంగా ఉండలేను జగ్గూ. అతని కోసం అంతా త్యాగం చెయ్యటం లో ఎంతో అందం ఉంది" అన్నది చిట్టి.
ఆమె ఆవేదన జగన్నాధానికి అర్ధం అవుతూనే ఉంది. అయినా అంతరాంతరాల్లో తేలుపిల్ల లాటి అసూయ ప్రవేశించటం వలన ఆమెను నొప్పించాలని పించి --
"మురళి వల్ల బాధ తప్ప మరేం ఉండదు. అదీగాక ఈ దిక్కు మాలిన భారతదేశం లో మంగళ సూత్రం లేని ఆడదానికీ విలువ లేదు" అన్నాడు తన కంఠం లో ధ్వనించిన కాఠిన్యానికి తనే విస్తుపోతూ.
కొన్ని క్షణాలు నిశ్చలంగా అతని వంక చూసి దృడమైన కంఠస్వరంతో --
"అతని వల్ల కలిగే దుఃఖం లో కూడా సుఖాన్నే అనుభవిస్తాను నేను. నీకు అర్ధం కాదులే జగ్గూ" అన్నది చిట్టి.
"మరి మీ అమ్మా నాన్నల సంగతి ....వృద్దాప్యంలో నువ్వు చేస్తున్న ఈ పని వల్ల........
"నేను అందర్నీ మర్చిపోయాను జగ్గూ...... నన్ను క్షమించు." అని మురళి కోసం అటూ ఇటూ చూసింది చిట్టి. బాగా చీకటి పడిపోయింది. ఈ గోరీల మధ్య తమరిద్దర్నీ ఎవరైనా చూస్తె ఎంత కొంప ముసుగుతుందో జగన్నాధానికి జ్ఞాపకం వచ్చి భయంతో వణికి పోయినాడు.
