3

"నువ్వా!" సత్య ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ కూడా అనుకోలేదు. వస్తాడని అందులో ప్రత్యేకంగా తనింటికే. తల్లి పోతుందన్న వార్త తను వింది. పుట్టెడు దుఃఖంలో వున్నాడనుకుని బాధ కలిగింది.
"రా! అల్లా నిలబడిపోయావేం?"
ఇంట్లోంచి వాళ్ళ అమ్మ "ఎవరే వస్త?" అంది.
"రాజు" అంది.
ఆవిడ కంగారుగా వస్తున్నట్లే వస్తూ, "ఎంత పని జరిగింది?నలతేమైనా చేసిందా? అంత హఠాత్తుగా జరిగింది?" అంటూ ఆ వరసలో ఎన్నో అనునయాలు సంఘ నియమాల్లో ఉచితాలు.
"ఊ. ఆఁ" అన్న సమాధానంలో తను పల్లె వేసుకున్నాడు.
సత్యకు ఏదో భారంతోటే తన దగ్గరకు వచ్చేడన్నది నిరుకయ్యింది. అదేమిటి అన్నది చూపువాసి అయినా గుర్తుకురాకపోయినా, తను విని, ఇదివరలోలాగే తీర్పు చెప్పాలి. అతను వింటాడు. ఇది తప్పదు. లోగడకూడా అదె జరిగేది.
"రుక్మిణి ఎల్లా ఉంది?"
అదిరిపోయేడు. ఈ ప్రశ్న సత్య నోటమ్మట రావడం, అందులో ప్రత్యేకంగా ఈ సమయంలో, మరింతగా క్రుంగతీసింది.
"అందరితోపాటు అదీ దుఃఖిస్తోంది."
"అంతేనా?"
రాజు మాట్లాడలేదు. అతిధి మర్యాదలు అయిన తర్వాతనే సావిట్లో కూర్చున్నారు. సమయోచితంగానే వాళ్ళ నాన్నగారు పరామర్శహక్కులు చెప్పి పైకి వెళ్ళిపోయేరు. లోకంలో దుఃఖం అంటే ఎంత జాలో, మృత్యువంటే ఎంత భయమో తేటతెల్లం అవుతూంది. జీవితానికి కొలతలువేసే ఎక్కాలు - దుఃఖం, విచారం, మృత్యువునుకూడా లోకం ఎందుకు నవ్వుతూ తీసుకోలేరన్న ప్రశ్న కలిగింది. అదె ప్రశ్నను తను ఎవరికేనా వేస్తే పిచ్చెక్కిందంటారు. అది నిజం కూడాను.
వక్కపొడిలో చారపప్పు గింజల్ని ఏరుతూనే సత్య మౌనం వహించింది. కనుకొలకుల్లోంచి రాజును చూస్తూన్నా, ఆ లోపల దాగి ఉన్న విప్లవం ఏమిటో అర్ధంకావటంలేదు. తనకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరిది ఓ తరహా. ప్రత్యేకత రాజులో తనకేదో గోచరిస్తూంది. అందుకే రాజుతో మాట్లాడాలన్నా, ఏ విషయమైనా తర్కించాలన్నా ఓ అభిలాష విజ్రుంభించి పరవళ్ళు త్రొక్కుతుంది. తన్ను తానే మరిచిపోగలుగుతున్నానన్న మగత.
వెర్రిగా తనూ ఊహించింది. రాజు తన్ను ప్రేమిస్తున్నాడా అన్న విషయం సందిగ్ధంగానే ఉంది. అలా అని తను హృదయం జార్చుకోలేదు. ఎప్పుడో ఎక్కడో రాజుతో పరిచయం, తనకు క్రొత్తకాదన్న అవ్యక్తం. రుక్మిణి విషయం తెలుసు. ఆవిడ యీతనిలో ఏ స్థానం ఆక్రమించిందో తను నిర్ణయించలేదు, ఓవేళ రాజే తన్ను అడిగినా కలకరగిపోనియ్యకే అన్న మైకమే కాని, సమాధానం తను చెప్పలేదు.
"ఏదో చెప్పాలనే వచ్చేవు?" అంది.
చిన్నగా నవ్వేడు. జరిగినవన్నీ చెప్పేడు. "ఇదీ కథ" అని ఊరుకున్నాడు.
"స్వయంపోషణార్ధం కాళ్ళమీద నిలబడే వరకూ అక్కడ ఉండడం ముఖ్యం. పైగా ఈ వయస్సులో ఆయన్ను ఒంటరిగా వదలడం భావ్యం కాదు. అది మెచ్చతగ్గ విషయంకాదు."
"నన్ను నేను పోషించుకోలేనన్నపిరికితనం నాకు లేదు. ఆయన ఎప్పుడూ నాకు దగ్గరగా రానేరాలేదు. తోడుగా సదుపాయాలు చూడ్డానికి రుక్మిణి ఉంది."
"రుక్మిణి నీ కాబోయే భార్య."
"కాదు." దురుసుగానే అన్నాడు.
తెల్లబోయింది. సరిపడని సంగతులు తను వింటూ ఉంది.
"అమ్మకి నేను ఆనాడే తృప్తికొరకు చెయ్యెత్తేను, వాగ్ధానం చేద్దామని. అది దేవతలు ఆశీర్వదించని ఇచ్చ అయ్యింది. పైగా రుక్మిణిని ఎప్పుడూ నేను సహధర్మచారిణి దృష్టిలో చూడలేదు. అది నా యింట్లో నా తోబుట్టువు లాగే ఊహకు ప్రాతిపదిక అయ్యింది.
"రుక్మిణికి మనస్సులో ఉంటే ఉండవచ్చు. నేనెప్పుడూ విపులంగా రుక్మిణిని అర్ధం చేసుకోలేదు. ఉండడం అన్నదే నిజమయితే ఈ మారిన పరిస్థితిలో అది రేకెత్తబడి, బలవత్తరం అయి ఉంటుంది. ఇక నాన్నారు ఈ విషయంలో ఎప్పుడూ మౌనం గానే ఉన్నారు. అలవాటుకు ఎడబాటు తోడై ఆయనకు కూడా కోర్కె కలగవచ్చు.
'దీనికి నేను బాధ్యున్నికాను. కాలేను. ఆ రుక్మిణినే వివాహమాడి, నాన్న మెప్పుకోసం, రుక్మిణి ఆశయ సఫలతకోసం నేను తలవంచలేను. అది నాకు చేతకాని పని, సత్యా!"
"మరేం చేద్దామనుకుంటున్నావ్?"
"కొన్నాళ్ళు ఆ ఇంటికి వెళ్ళకూడదనే తీవ్రకాంక్ష. ఎందుకో నేను నిర్వచనం చెయ్యలేకుండా ఉన్నా. నన్నెవ్వరో మెడపట్టి బలవంతంగా బయటకు నెట్టుతున్నారు."
తన సాహచర్యంలో రాజును అర్ధం చేసుకున్న పరిధిలో ఓ నిర్ణయం చేసుకుంటే అది అమలుజరిగి తీరవలసిందే అన్న సత్యం, అనుభవం ఉంది.
"పోనీ, నా దగ్గర ఉండగలవా?"
కళ్ళల్లోకి సూటిగా చూస్తూనే చిన్నగా నవ్వేడు.
"ఏ నిర్ణయమూ లేకుండానే వచ్చే, నీదగ్గరికి రావాలన్న క్షణికోద్రేకంలో."
సత్యం ఒప్పుకున్నట్లే.
"నువ్వు అనుకున్నంత నాలో ఏమి ఉందో తెలియదు. ఆ భావనతోనే నువ్వు ఉండు."
"నేను ఉండడంవల్ల నీకు మంచిది కాదేమో!"
"ఏం?"
"అమ్మ పోయిందన్నారు. నా కళ్ళెదురుగా నేనే మట్టి చేసేను. అయినా కించిత్ గా నాలో పరిణామం రాలేదు. బౌతికం ఒక్కొక్క క్షణంలో ఉద్వేగం చెంది దుఃఖించి ఊరడిల్లేది. కాని హృదయం అను, దాన్నే ఆత్మ అను, ఇంకొకటి అను - అది అమ్మ చనిపోయిందంటేను, ఇక కన్పడదు అన్నా, నమ్మకంలేని దృఢిమతో ఉంది. చేతులూ, కాళ్ళూ, మాటా, తీరూ, మర్యాదా నియమతి చేసుకున్న ఓ భౌతిక దృష్టికి అనే రూపాన్ని త్యజించి, విశ్వంలో ఆకృతి ఏర్పరచుకుందన్న దృష్టే భావనే. నమ్మకమున్నూ. నటువింతంతై అన్న వతులో కళ్ళు మూసుకుంటే అమ్మ స్వరూపం కన్పిస్తోంది. ఇదేమిటిది?"
సత్య వింటూనే ఉంది.
"ఈ రూపకల్పన అనుభూతి కలిగినపుడే ఆ అమ్మ ఎవ్వరు? నేనెవ్వరు? నాన్న, రుక్మిణి వగైరాలెవ్వరు అన్న ప్రశ్న వస్తోంది. దానితో ఎవరికీ ఎవరూ కారన్న సమాధానం పొడగట్టినా..." ఆగేడు.
"రాజూ!" గట్టిగానే అడ్డు వేసింది. విపరీత మైన దుఃఖంలో మనస్సు చలించిందేమో అన్న రూఢి అవుతూంది. ఈ క్రూరమైన కదలింపుకు తట్టుకోలేకనే రాజు పారిపోయి వచ్చేడా? భావి ఇంకా ఏ విధి నియమావళిని వ్రాసి ఉంచింది? స్త్రీ హృదయపు ఆర్ద్రతే నిండింది సత్యలో.
"అది నీ మానసిక తాత్కాలికపు ఓటమి. అంతే" అని తగువు తీర్చేసింది.
గట్టిగా నవ్వాలనిపించినా, లోపలికి దిగ మ్రింగుకుంటూనే "అయితే ఈ నా రాక కూడానా?" అని అడిగేడు.
"ఇందులో నీ కోర్కె ఉంది. అదే తేడా."
తెల్లబోయేడు. ఏమిటి సత్య అన్నది?
"మన సాహచర్యంలో ఏ మూల మూల ల్లోనో నీకు నామీద కాంక్ష రేకెత్తి అణగి మణగి ఉంది. అదే ఇప్పుడు నిన్ను ఇక్కడికే తీసుకువచ్చింది."
'పొరబాటు పడ్డావు, సత్యా!"
"లేదు. పురుషుణ్ణి చదవడం స్త్రీకి తెలుసు. పైగా దానికి నేను వ్యాఖ్యానించటం లేదు. కోర్కె రేకెత్తడం వయస్సుకు సహజం. అప్పుడు ప్రకృతి, పురుషుడు అవుతాం."
"మరి సంఘం?"
"అది యుగాలనుండి తన ఆవృత్తి ఊహల ఉత్కంఠతో మూర్తీభవించుకున్న గరళకంఠి. పాపం, పుణ్యం అన్న గట్టుల మధ్య జీవిత ప్రవాహాన్ని అరికట్టాలన్న వ్యర్ధ ప్రయాసతో కుంటుపడుతూ ఉంటుంది. నాకూ ఉందేమో ఆ కోర్కె? అది చెప్పలేని స్థితిలో దాగిఉన్నా ఉండవచ్చు."
పసికట్టే సేడు రాజు. తనో తాత్కాలిక వికల్పానికి ఎర అయ్యేననే, మైమరపు కల్పించాలన్న దృక్పథంలో పెడదారి తీయించి, శరీరాన్ని బలిపెట్టాలనుకుంటూందని. శరీరం అంతా శరీరం కానట్టే కృతజ్ఞత, గౌరవాల్లో ధూపం అయ్యింది.
అమ్మ తన్ను ఆవరించినట్లే అనుభూతిలో కళ్ళు మూసుకున్నాడు.
దగ్గరగా, ప్రక్కగా కూర్చుంటూనే "రాజూ, నేను నేనుగా నువ్వు భరించుకో గలవా?" అంది.
"ఆ ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు ఇవ్వలేను." చేతుల్లో ముఖం దాచుకుంటూనే కుమిలిపోయేడు.
ఎంత తప్పు అభిప్రాయంలో తను పడిందో అన్న శంక సత్యలో క్షణికం ఊగింది. అయినా అద్ధైర్యపడలేదు. రాజు నావాడన్న ఉన్మత్తత అవరింపులో సహజంగానే దాన్ని తీసుకుంది. పైగా అతడు అలసి, నలిగిపోయి ఉన్నాడు.
ఆవులిస్తూనే రాజు మంచం మీద వ్రాలేడు. ఏమిటిది? విధి ఎంత బలవత్తరంగా తన్ను నడిపిస్తూంది అన్న తెగని ఆలోచనే నింపుకున్నాడు. ఒకటి తర్వాత ఒకటి నీటి ఊటలే అయ్యేయి. పొడి కళ్ళు పడనే పడ్డాయి.
ఆ స్థితిలోనే సత్య లేచివెళ్ళింది. మేడ మెట్లు బరువుగా దిగతీస్తున్నట్లు భావన కలిగింది. తన గాహ్డికి, నాన్నారి గదికి కర్రగోడే అడ్డు అన్నట్లు వెల్లవేసుకున్న దేవదారు చెక్కలు మెరుస్తూనే ఉన్నాయి. తగ్గించిన బుడ్డి మినుకు మినుకు మంటూంది. 'తనో ఓటమి పొందివచ్చింది' అన్న తలంపే. ఎందుచేత? ఎక్కడ తప్పటడుగు వేసింది? ఈ కారణం వెతుక్కోవాలన్న ధ్యాస. ఆక్రోదన. తన్ను తాను ద్రోహం చేసుకుందుకే బలి పెట్టుకుందన్న కుమిలింపు. ఇన్నాళ్ళల్లోనూ తను రాజుమీద ఇటువంటి భావన పెట్టుకోలేదు. ఈనాడు అది ఏమూలనుండో ఉప్పెనలా తన్ను కుదేలు చేసింది.
"అమ్మాయి వచ్చినట్లుంది."
"ఊ."
గుసగుసలు; నెరసిన కబరీ భారాలు.
"పెండ్లి చేసుకుందా మనుకుంటున్నాడా?"
"అది నిర్ణయం అయితే మనం చాలా అదృష్టవంతులం."
"ఏం?"
"ఎన్నేళ్ళుపడి తిన్నా తరగని ఆస్తి, రొక్కం."
"నిజంగా?"
"అవును. ఆయనకే ఉన్నాయి ఆరుబస్సు రూట్లు."
"అమ్మాయి అభిప్రాయం?"
"అదె అర్ధం కావటంలేదు. లోపల ఏం ఉందో తెలియటంలేదండీ!"
"అతనో?"
"ఇటూ అటూ కాదేమో! పైగా మొన్ననేగా తల్లిపోత. ఆ విచారంలో ములిగిఉన్నాడు."
"ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు?"
"అమ్మాయిలో ఉన్న గొప్పతనం అది."
ఫక్కున నవ్వాలనిపించింది సత్యకు.
"నీ పోలికే అన్నమాట!"
"పోదురూ?"
"మన పరిస్థితులు, విషయాలు, వర్ణాలు తెలిసివున్నా కూడా?"
"అది అమ్మాయి, అతను నిర్ణయం చేసుకోవలసిన విషయాలు. మనకెందుకూ?"
"అయితే, నీకు ఇది యిష్టమేనన్నమాట?"
"మహా మీకు కానట్లు మాట్లాడుతారేం?'
"పిచ్చీ!" తర్వాత నవ్వులు విన్పించేయి. ముసలితనపు సరసాలు, విభిన్నవర్ణాలైనా, వాళ్ళమధ్య తొలివలపు, కలుపుతీసిన పంటే ఈనాటికీ, తనకు జ్ఞానం వచ్చినప్పటినుండి చూస్తూనే ఉంది. వాళ్ళంటే ఓ గౌరవం ప్రేమ, ఆరాధన కలిగాయి. ఈ ఆదరణ తను సంపాదించుకోవాలన్న ఆశ కలిగింది. ఎంతగా తనలో అందం, వంపు మూర్తీభవించినా, ఉన్న ఈ వర్ణాంతరకుల చిహ్నం జీడిపిక్కే అయి తలంపుకు వస్తూనే ఉంది.
