కుమార్ ఆలోచిస్తూ లేచి నుంచున్నాడు.
మా నాన్న అతని జబ్బ చరచి ఆశీర్వదిస్తున్నట్లు అన్నాడు. "బెస్ట్ ఆఫ్ లక్"
కుమార్ చేతిని తీసికొని కరచాలనం చేసినట్లే చేసి కొన్ని క్షణాలు పట్టుకుని అన్నాడు "డాక్టర్- నీవి సర్జన్ చేతులు- నీ వ్రేళ్ళు బలంగా సుకుమారంగా వున్నాయి సుమా
కుమార్ వచ్చేశాడు. డాక్టర్ అన్న మాటల్ని పదేపదే గుర్తు తెచ్చుకున్నాడు మంజును హెచ్చరించాడు. లాభంలేక పోయింది. తత్ఫలితంగా ఆమె తన భార్య అయింది.
* * *
అందమైన చిన్న క్వార్టర్ అది. పూలకుండి లలో పూలమొక్కలు. క్రోటన్స్ గుబురుగా పెరిగి వున్నాయి. ముందు చిన్న వరండాలో గార్డెన్. కుర్చీలు నాలుగున్నాయి. తలుపులకు ఆకుపచ్చరంగు తెరలు వ్రేలాడు తున్నాయి.
తెల్లవారి ఎనిమిది దాటింది సూర్యుని తీక్షణ లేదు పిల్లవాయువులు మెల్లమెల్లన వీస్తున్నాయి. మాలతిలత సన్నని సౌరభాన్ని వెదజల్లుతూ హృదయాన్ని రంజింపజేసే సమయంలో టాక్సీ ఆగింది.
కుమార్ టాక్సీ దిగి సామానంతా క్రిందపెట్టించి టాక్సీని పంపేశాడు. అతడు తలుపు తెరచి లోపలి దృశ్యాన్ని చూచి చకితుడై భార్యను త్వరగా రమ్మని పిల్చాడు.... మంజు లోపల అడుగు పెట్టబోయింది. కుడికాలు ముందు - ఎవరో హెచ్చరించారు. ఆమె సిగ్గు పడి గదిలోపలికి చూచింది. పనిమనిషి వెళ్ళిపోవటం చూచింది ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తెచ్చాడు మంజుకూడా క్షణంపాటు రిచ్చపడి పోయింది.
సోఫాల మీద బోలెడన్ని ప్రజెంట్లున్నాయి. ప్రతిదాని మీన పేర్లు రాయబడి వున్నాయి.
"ఓయ్ - గంగమ్మా - ఇవన్నీ ఎవరు తెచ్చారు?"
"పొద్దుటాల పెదబాబుగారు - పెద డాకటేరు బాబుగారు - రామ్మూర్తి బాబుగారు తెచ్చిపెట్టి పోనారు బాబూ... మరి"
"గంగమ్మా - అమ్మగారు - అమ్మగారు - కూ డాక్టరే - ఇక మీదట నీకు ఇంట్లోనే వైద్యం తెలిసిందా?"
"సిత్తం-సిత్తం అంటూ ముసిముసిగా నవ్వింది.
మంజుకు అంతా కొత్తగా వుంది గబగబ లోపలి గదిలోనికి వెళ్ళింది. పెద్ద క్రొత్త మంచం - దోమతెర - ప్రక్కన డ్రెస్సింగ్ టేబిల్, ఇవన్నీ చూచి "నాకోసం ఎంత సిద్ధం చేశాడు!" అనుకునే లోపుగా దుఃఖం ఆగింది కాదు. మంచంమీద కూచుని కొంగు అడ్డంపెట్టుకుంది.
"బాబయ్యా - అమ్మగా రేడుత్తున్నారు" గంగమ్మ రహస్యంగా అంది.
కుమార్ సామాను లోపల పెట్టించడం ఆపుజేసి ఒక్క అంగలో ఆమెను సమీపించాడు. తలుపు మూసి మంజుని తన కౌగిలిలోకి తీసుకుని మృదువుగా ఆమె రెప్పల్ని చుంబిస్తూ- కన్నీరు తుడుస్తూ అన్నాడు. "మంజూ ఎన్నాళ్ళు గానో ఈక్షణం కోసం ఎదురు చూచాము. నువ్వు ఏడ్చావంటే నా కెలాగో వుంటుంది. ఏదే.... ఒక్కసారి నవ్వు"
మంజు కళ్ళు తెరచి ముత్యాల్లాంటి పలువరస తళుక్కు మనేలా నవ్వి అన్నది, "దుఃఖంతో ఏడ్వలేదు."
"నాకు తెలుసు మంజు చుబుకాన్ని ప్రేమ పూర్వకంగా పైకెత్తి ఉద్రేకంతో అన్నాడు. ఇంత అందంగా నువ్వు ఏనాడూ లేవు మంజూ" మరోసారి దగ్గరకు తీసుకోబోయేలోగా - బైట గందరగోళం అయి వుంది.
"హలో" అంటూ ఎవరో అరిచారు.
కుమార్ బైటికెళ్ళాడు. అతన్ని పరామర్శించేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎందరో వచ్చారు.
అంతా ఓ అరగంట అక్కడే కూచుని తరువాత వెళ్ళిపోయారు. "డాక్టర్ - ఏది కావలసినా నన్ను అడగటానికి సంకోచించకు మాదప్ప మాటలకు వారిద్దరు కృతజ్ఞత తెల్పారు.
ఆ రోజు చాల హడావిడిగా విశ్రాంతి లేకుండానే గడిచిపోయింది.
మరుసటి రోజు ప్రాతఃకాలం నిద్రలేచి ప్రక్కలో చూచాడు. మంజు లేదు వంటింట్లో చప్పుడౌతోంది. గబగబ లేచి ముఖం కడుక్కుని ముందు గదిలో కెళ్ళి కూచున్నాడు వాతావరణం ప్రశాంతంగా వుంది. లేచి వెళ్ళి కిటికీ దగ్గర నుంచుని బైటికి చూస్తున్నాడు. ఆ వేళ తనకెందుకో హాయి అనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా లేని తృప్తి - ఒక విధమైన సంపూర్ణత్వం అతనిలో కల్గింది. అలాగే కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాడు. మంజు కాఫీ తెచ్చి నిశ్శబ్దంగా నుంచుంది. పది నిముషాలు దాటాకగాని కళ్ళు విప్పి చూడలేదు. టీపాయ్ దగ్గర కూచున్న మంజు కేసి తిరిగి చిరునవ్వు నవ్వి ఆమెను సమీపించి ప్రక్కనే కూచున్నాడు.
టేబిల్ మీదనున్న బైబిలు అందుకని చదవటం ప్రారంభించాడు. మంజు మౌనముద్ర దాల్చింది. చదవటం పూర్తి చేసి పుస్తకాన్ని మూస్తూ అన్నాడు" రోజూ ముందు చదువుకుని తర్వాత ప్రార్దించుకునేవాడిని...ఇవ్వాళ-ఆ కిటికీలోంచి ప్రకృతిని చూడగానే ఏదో భక్తి భావం ఆవరించింది...... ఇక తే కాఫీ..."
"చల్లారిపోయింది. వేడి చేసి తెస్తాను."
"నేనూ వస్తాను" అంటూ ఆమె వెంట నడిచాడు. స్టౌ మీద వేడిచేసింది. ఇద్దరు త్రాగుతూ వంట గదిలో కూచున్నారు.
"మీకు చాల భక్తి కాబోలు"
"ఏమో - నిన్ను నాకిచ్చిని భగవంతుని ఆ మాత్రం గుర్తుంచుకోకపోతే కృతఘ్నుడిని కానూ! భక్తి మాట అటుంచు. కేవలం నా తృప్తికోసం కొంత సేపు భగవంతుని ధ్యానిస్తాను. మనకు దైవ సహాయం అత్యవసరం కదా మంజూ!
టోస్ట్ కు వెన్నరాసి భర్త కందిస్తూ అంది "ఔను. రోగులను స్వస్థ పర్చటానికి ధైర్యం కాపాలి- మనసై మనకే నమ్మకం కుదరాలి. ఆ ప్రాణాన్ని రక్షించే బాధ్యతను ఎంతో ధైర్యంతో స్వీకరించాలి. అపజయం పొందితే తట్టుకోవాలి.....అబ్బ- ఎంత బాధ్యతా యుతమైన పనండి"
"ఆడవాళ్ళకు ఇంకా కష్టం.... ఇంటి బాధ్యతలు కూడా వుంటాయి! కాఫీ చాలా బావుంది మంజూ- పంచదార కొద్దిగా తగ్గించాలి నాకు."
మంజు పెదాలు మంజులంగా సన్నటి నవ్వుతో నాట్యంచేశాయి.
"నాకు వంట చేయటం బాగా వచ్చు. కాఫీని మెచ్చుకుంటున్నారు. వంట చేస్తే ఇంకెంత మెచ్చుకుంటారు."
"ఇవ్వాలిటికి మాత్రం చెయ్యి మంజూ. నీ చేతి వంట తినాలని ఉంది. పొట్ల, బీర తప్ప ఏ కూరగాయాలైనా యిష్టమే సుమా నువ్వంటే మరీ.
మంజు నవ్వు లేచి వెళ్ళిపోయింది.
హాస్పిటల్ కు వెళ్ళటానికి తయారవటానికి వెళ్ళిపోయాడతను.
వారం రోజులు పోయాక మంజుల హౌస్ సర్జన్ చేయటానికి ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్ళేది. భార్యా, భర్తలు ప్రొద్దున్న ఏడున్నరకు ఇల్లు వదిలితే రాత్రి ఏడు గంటలకు కలిసే వారు. ఎవరి పనిలో వారు మునిగి పోయేవారు దినాలు నిర్విరామంగా, సంతోషంగా గడిచిపోతున్నాయి వారికి.
అకుంఠిత దీక్షలో శ్రద్దాసక్తులలో వారి వారి పనులు చేసుకుపోతున్నారు.
ఒక సంవత్సరం కాలగతిలో కలిసిపోయింది.
మంజు అదే హాస్పిటల్ లో పనిలో చేరింది. డాక్టర్ అన్నపూర్ణకాక తన కన్నా ఇంకా ఇద్దరు సీనియర్ లేడీ డాక్టర్లున్నారు. అనె స్తటిస్ట్ - డాక్టర్ గోపీనాథ్ ఫారిన్ నించి పనిచేశారు. "కార్టియోల జిస్ట్" - అంటే హార్ట్ స్పెషలిస్ట్ - డాక్టర్ సిద్ధిక్ మంచి అనుభవజ్ఞుడు. గుండె ఆపరేషన్స్ చిటికలో చేస్తారు, అక్కడ పని చేయటం ఆమెకెంతో ఆనంద దాయకమైంది.
ఆ రోజు మాదన్న దగ్గర కొక ధనవంతుడు. మూత్ర విసర్జనమప్పుడు నొప్పిగా వుంటుందని వచ్చాడు. ఐ.వి. పైలో గ్రామ్ ఎక్స్ రేలు అయ్యాక ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఒక మూత్రపిండం బాగా చెడిపోయింది!
థియేటర్ నర్స్ కు-ఫలానా ఆపరేషన్ ఫలానా తేదీన జరుగుతుందన్న కబురందజేశారు. ఆమె ప్రత్యేకమైన తర్ఫీదుపొంది వుంటుంది. జీతం కూడా ఎక్కువ. థియేటర్ లో ఆమెకు ప్రత్యేకమైన స్థానం వుంటుంది.
పేషంట్ పొత్తికడుపు భాగాన్ని సిస్టర్ శుభ్రంగా క్షౌరం చేసి, కడిగి శుభ్రమైన గుడ్డ చుట్ట బెట్టింది. ఆపరేషన్ కు నాలుగైదు గంటలు ముందు కడుపులోకి ఏమీ యివ్వరు!
చిన్న డాక్టరు - అతడి నాడి. శ్వాస, బ్లడ్ ప్రెజర్, టెంపరేచర్, హేమొగ్లోబిన్, మూత్ర, రక్త పరీక్షలు చేసి-రక్తం ఎక్కించవలసి వస్తే ఏ గ్రూప్ రక్తం అక్కరకు వస్తుందో అని తయారుగా వుంచుకోవటం - ఇత్యాది పరీక్షలు కానిచ్చాడు.
థియేటర్ ప్రక్క గది- ప్రిపరేషన్ రూమ్, ఆ గది అతి సామాన్యమైనది. రోగికి భయం కల్గే వస్తువులు, ఆయుధాలు అక్కడ ఏమీ వుండవు.
అక్కడ అతడికి స్వల్పంగా మత్తుకల్గించారు. కెవుల్లో దూది పెట్టారు. కళ్ళకు గంతలుకట్టి స్ట్రెచర్ లో తీసికొని వెళ్ళి ఆపరేషన్ బల్లమీద సరుండాజేశారు. అనెస్తటిస్ట్-మత్తు మందు ఎక్కించే డాక్టరు-తల దగ్గర వున్నాడు. ఆపరేట్ వేసేవారు. ఆపరేషన్ జరిగే స్థానం అనెస్తటిస్ట్ కు రోగికి అగుపించకుండా ఒక చిన్న తెర చికిత్స కుని ఎద దగ్గర అమర్చబడింది.
మాదప్ప-అసిస్టెంట్ సర్జన్ మాధవరెడ్డి వారి వారి గదుల్లో దుస్తులు మార్పుకున్నారు. థియేటర్ "షూ" కాళ్ళకు తొడుక్కుని - దాని మీద గుడ్డ జోళ్ళను వేసుకున్నారు. థియేటర్ పైజామా జంషర్ లాంటి బనీను, నుదురు కప్పుకున్నంత వరకున్న కాప్, వేసుకున్నారు.
మోచేతుల వరకు బాగా సబ్బుతో రుద్దుకుని వేడి నీళ్ళలో కడుక్కున్నారు. రెండవ మారు కడుక్కున్న తర్వాత "అశుభ్రమైనవి" (అన్ స్టె ఏవీ వారు తాకరు.
థియేటర్ లోపలికి వెళ్ళారు.
ఆపరేషన్ కు అంతా సిద్ధంగా వుంది. థియేటర్ నర్స్. ఆమె అసిస్టెంట్ సర్జన్స్ ను చూచి హుషారుగా వారు చేయవలసిన పనులు చేస్తున్నారు.
వారిద్దరు అప్పటికే తయారుగా ఉన్నారు. అంటే మూతిని, ముక్కును కప్పుతున్న మాస్క్ కట్టుకున్నారు ఒక్కొక్కరు.
అనెస్థటిస్ట్ బ్లడ్ ప్రెజర్, శ్వాస, పరీక్షిస్తున్నారు రోగికి.
మాదప్ప - అసిస్టెంట్ సర్జన్ మాధవరెడ్డి గబగబ వెళ్ళి రెండు అడుగుల లోతుగల జార్స్ లో వున్న స్పిరిట్ లో చేతులు ముంచారు. మోచేతుల వరకు ముంచి కొంతసేపు ఆగి బైటికి తీశారు. గాలికి స్పిరిట్ ఆరిపోతూ చల్లదనాన్ని కల్గించింది వారికి ఒక నర్స్ స్టెరైల్ గుడ్డ తీసుకుని ముక్కు రంధ్రాలు, నోరు. గడ్డాన్ని మూస్తూ కట్టింది. దీన్ని మాస్క్ అంటారు. పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ డ్రమ్ముల్లాంటి క్రిమి సంహారిణి సీసాల్లోనుంచి పట్టకారుతో పట్టుకుని ఒక్కక్కటి తీస్తోందామె. "శుభ్రమైన" కోటు అందించింది. మాదప్ప ముందు రెండు చేతులను చాపి ముందుగా చేతులోనికి దూర్చాడు. కోట వెనుక భాగం తెరచుకుని వుంది. ఆమె అతని వెనుకగా వెళ్ళి ఆ కోటు కున్న త్రాళ్ళు కట్టింది. కోటు చేతులు వ్రేలాడుతూ పొడుగుగా వుండకుండ ఆపరేషన్ చేసే సమయంలో అడ్డు రాకుండా - చేతులకు కుట్టబడిన పట్టీని చేతిచుట్టు త్రిప్పి కట్టుకున్నారు. తరువాత ఆమె చేతుల మీద వేసుకోటానికి "శుభ్రమైన" పొడిని ఇచ్చింది. వారిద్దరు చేతుల మీద పౌడర్ వేసుకునేసరికి నర్స్ చేతి తొడుగు లను - గ్లోవ్స్ ను అందించింది. వారిద్దరు మౌనంగా తొడుక్కున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యాక వాళ్ళు తమ చేతులు దేనిని తాకకుండా, పొరపాటున ఎవరైనగాని. ఏ వస్తువైన తగులకుండా - చేతులను తమ ఎదముందర ఒక దానిపై ఒకటి వేసికొని నుంచున్నారు. అలా చేతులను క్రాస్ చేసికొని వారు భగవంతుని ప్రార్దించటం కద్దు! ఆ సమయంలో వారికి కావలసిన మేధాశక్తి బలం ధైర్యం అన్నీ ఆ భగవంతుడే అనుగ్రహించాలి.
పేషెంట్ ను బల్లమీద పరుండజేశారు. థియేటర్ లో చాల పెద్ద విద్యుచ్చక్తి దీపం వుంటుంది. డాక్టర్లు వంగినప్పుడు, వారి నీడ రోగిపై పడకుండా వుండేలా ఆ లైటు తయారు చేయబడింది ఎన్నో కాంతివంతమైన బల్బులు పెద్ద చట్రంలో అమర్చబడి వుంటాయి. ఆ దీపాన్ని వారికి కావలసిన కోణంలో త్రిప్పుకున్నారు.
అతనికి ఉచ్చ్వాసద్వారా మత్తు కల్గించి అతన్ని పరీక్షించాడు అనె స్థటిస్ మత్తు కలుగ గానే అతని క్రమబద్ధమైన ఉచ్చ్వాస నిశ్వాసాలను గమనించాడు కనురెప్పలు తెరచి చూచాడు కనుపాపలు పెద్దవి కాలేదు చేతుల్లో శక్తిలేక అచేతనంగా వుండటం చూచి అతడు పూర్తిగా స్పృహలో లేడని నిర్ధారణ చేసి కొన్నాడు అనెస్తటిస్ట్ వెంటనే స్పష్టంగా మెల్లగా అన్నాడు.
