పరీక్షలు దగ్గర పడుతూండడం మూలాన మరో ధ్యాస లేకుండా చదువులో లీనమై పోయిందారోజు నుంచి. ఇద్దరు ముగ్గురు డ్యాన్సు ప్రోగ్రాము లు ఏర్పాటు చేయాలని కోరినా పరీక్షల మూలాన మృదువుగా యిప్పుడు వీలు పడదని చెప్పింది.
పదిరోజులు గడిచిపోయాయి. అతని నుంచి ఏ సమాధానమూ లేదు. రాలేదన్న మాట అపుడపుడు మదిలో మెదులుతూనే వుంది అనూరాధకు. ఆనాడు కాలేజీ కి బయల్దేరుతుండగా 'పోస్టుమాన్' వో కవరందించాడు. పైన వున్న వ్రాత కొత్తగా వుంది.
'రామకృష్ణా నాటక సమాజం' వారు అనూరాధను వీలున్నప్పుడు వో నృత్య ప్రదర్శన మ్రదాసు లో యిమ్మని కోరుతూ వ్రాసారు.
ఆ సంగతి వినగానే అన్నపూర్ణమ్మ గారి కెంతో ఆనందం కలిగింది. కాని మరు క్షణం లోనే భారంగా విశ్వసించిందామె. తల్లి మనస్సున చెలరేగిన భావాల్ని పసిగట్టి అన్నది అనూరాధ --
'మద్రాసు ;ప నా స్నేహితురాలుందమ్మా! వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ జడ్జి. ఆయనకు వ్రాస్తే సాయంగా ఎవరినైనా పంపించుతారు.'
'సరే! ముందు పరీక్షలు కానివ్వు!' గంబీరత వెనుక లోనున్న వ్యధ అణిగి పోయింది.
ఆరోజునే జడ్జీ అనంతశయనం గారి కూతురు , మంజుల పేరిట వో ఉత్తరం వ్రాసింది. సమాజం వారికి కూడా పరీక్షలు ముగిసిన నాలుగవరోజునే ప్రదర్శన యివ్వగలనని అంగీకారాన్ని తెలియజేసింది. 'అంత తొందరెందుకమ్మా!' అని ఆ తల్లి అడుగలేక పోయింది. పరిస్థితులు చూస్తె గడ్డుగా వున్నాయి.
బ్యాంకులో నిల్వ ఖాళీ అయింది. పది రోజుల నుంచి అనారోగ్యం మూలాన విస్తళ్ళు కుట్టడం తగ్గిపోయింది. మిషను మీద చేయి వేయగానే తలనొప్పి వస్తోంది విపరీతంగా. అయినా అలాగే ఆ బాధతోనే కొన్ని బట్టలు కుట్టి పంపించుతోందా అనురాగమయి.
తల్లి నలతగా వుండడం గమనించింది అనూరాధ. కానీ ఆ పని మానుకుంటే పస్తులు వుండవలసిందే. ఆకలితో రాజీ పడవలసిందే. అందుకే తల్లి బాధను చూసి మనస్సున దాగిన వ్యధతో కుమిలి పోతున్నా అణుచుకుంది అనూరాదెంతో ప్రయత్నం మీద. అందుకే ఆ నాటక సమాజం వారి కోరికను అంగీకరించినపుడు తల్లీ కూతుళ్ళు ఇద్దరూ మరోమాట మాట్లాడలేక పోయారు.
పరీక్షలు ముగిశాయి. బాగానే వ్రాశాననుకుంది అనూరాధ. తమ్ముడు, రాజుకి కూడా స్కూలు ఫైనల్ పరీక్షలు ముగిశాయి. పాసవుతానని అన్నాడతను. కన్నబిడ్డల కష్టాలు తీరబోతున్నాయన్న అశారేఖ తళుక్కు మన్నదా తల్లి హృదయంలో. ఆరోజునే మద్రాసు నుంచి, అనూరాధ స్నేహితురాలు , మంజుల జాబు వ్రాసింది. వేసవి గనుక వెంటనే రమ్మనీ, నృత్యానికి కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేసికొనవచ్చుననీ, సాయంగా నాన్నగారున్నారని వ్రాసింది. రాజును కూడా వెంట తీసుకుని రమ్మన్నది.
కూడా తీసుకొని వెళ్లాలని వున్నా ఖర్చులకు కావలసినంత డబ్బు లేక పోవడం మూలాన ఆ భావనే రానీయ లేదా పైన. అక్కతో పాటు వెళ్లాలని సరదా పడుతున్నా ఆర్ధికంగా తామే ఎత్తులో వున్నారో తెలిసికున్న రాజు కూడా తన సరదాను అణుచుకున్నాడు.
అనూరాధను ఒంటరిగా పంపించడం అన్నపూర్ణమ్మ గారి కేమాత్రమూ యిష్టంగా లేదు. కానీ సాయం ఎవరూ రారు అందుచేత అన్నదామె బయలు దేరుతుండగా --
'జాగ్రత్త తల్లీ! వెళ్ళగానే జాబు వ్రాయి . త్వరగా వచ్చేయి!'
'రాజూ! మద్రాసు నుంచి ఏం తీసుకు రాను నీకు?' అన్నది తల్లికి సమాధానమిచ్చిన తరువాత. రెండు మూడు నిమిషాల వరకూ నిశ్శబ్దంగా వుండిపోయాడు రాజు. తమ పరిస్థితులు తెలిసిన ఆ పసి వాడి హృదయం లో ఎన్నో కోరికలున్నా అణుచుకున్నాడు--
'నాకా? ఏం తెస్తావక్కా! నువ్వు త్వరగా వచ్చేయి! ఒక్కడికే నాకేమీ తోచ దిక్కడ!'
ఆ సమాధానం విన్న తల్లీ కూతుళ్ళ కన్నుల నిండుగా నీళ్ళు తిరిగాయి. కళ్ళతోనే వెళ్లి వస్తానంది అనూరాధ. మరోసారి పెదవి కదిపితే లోనున్న వ్యధ ఒక్కమారుగా వెల్లువలా దూకి వచ్చేట్లుంది . అందుకే మౌనంగా సెలవు దీసికొన్నదామె.
తోడుగా స్టేషను వరకు రాజు వచ్చాడు . టికెట్ తీసుకొని తమ్ముడిని వెళ్ళమన్నది. 'ఎండ కాస్తోంది రాజూ! కాళ్లు కాలిపోయేట్టున్నాయి మరికొంచెం సేపు వుంటే! వెళ్లు! బండెక్క గలనులే' అతని లేత పాదాలకు చెప్పులు లేవు. అందుకే అలా అన్నదామె. రాజు కూడా సెలవు దీసుకొని వెళ్లిపోయాడు వెళ్లాలని లేకపోయినా. రెండు రోజులు ముందుగానే బయల్దేరింది అనూరాధ. మంజుల కోరికను నిరాకరించ లేక అలా చేసిందామె. 'వెయిటింగ్ రూమ్' లో కూర్చున్నది -- అంతలో గంట కొట్టడం విన్పించి రైలు ఎటునుంచి వస్తుందబ్బా! మద్రాసు పోయేదేమో!' అని లేచి వచ్చింది.
ఏదో రైలు వచ్చింది. ప్రయాణీకులు దిగుతున్నారు హడావిడిగా. ఎక్కేవారు ఎక్కుతున్నారు. అది మద్రాసు నుంచి వచ్చిందని తెలిసింది. ఉదయాన రావలసినది ఏవో అవాంతరాల వలన అప్పటికి చేరింది.
ఎక్కుతూ, దిగుతున్న ప్రయానీకుల్ని చూస్తూ నిలబడిపోయింది అనూరాధ.
'హల్లో! అనూరాధ గారూ! ఇదే మిటి ఇక్కడున్నారు?!' అంటూ వచ్చాడో యువకుడు.
'అరే! హరి కృష్ణ గారు కదూ!' అని అనుకుంటుండగానే దగ్గిరకు వచ్చాడతను.
'గుర్తున్నానా?' అన్నాడు నవ్వుతూ.
'మీకు నేను గుర్తుండనేమోగానీ, మీరు మాత్రం మా యింట్లో అందరికీ గుర్తే వున్నారు' అన్నది అనూరాధ నమస్కరించిన తరువాత.
'ఆహా! మీకూ కోపం వచ్చిందనుకుంటానే!'
'ఏం రాగూడదా?'
'సరిపడినంత కారణం లేకుండా కోపం రావడం నాకే మాత్రమూ నచ్చదు. మీకు జవాబు వ్రాయలేదని కోపం వచ్చి వుంటుందని తెలుసు. కానీ వ్రాయమని మీరానలేదుగా?' ఆ కంఠన పసిబిడ్డ హాటం తొంగి చూసింది.
ఆమాట విన్న వెంటనే అతని వంక చూసిందామె అమాయకత తప్ప మరే భావమూ లేదా డాక్టర్ కనులలో. నవ్వు వస్తున్నా అణుచుకున్నదందుకే.
'మీ జవాబు బావుంది. మరి నాకు బహుమతి నీయమని మీకు వ్రాసిన గుర్తు లేదే? ఎందుకిచ్చారో అంత అందమైన దాన్ని ?'
'నిజమే! తప్పే! క్షమించండి!' అతని వుత్సాహం చల్లారిపోయింది. ఆ మృదు హృదయానికా ప్రశ్న కటువుగా విన్పించిందని గ్రహించింది అనూరాధ. అందుకే మాట మార్చింది.
'చూడండి! డాక్టరు గారూ! మీరు నాకో సాయం చేసి పెట్టాలి?'
'ఏమిటది? మళ్ళీ నా బహుమతి ని నన్ను తీసుకోమంటారా?'
'అబ్బా! మీకా బహుమతి గొడవే ఎప్పుడూ. మరో ధ్యాస వున్నట్లు కన్పించడం లేదు. మద్రాసు లో నాకో 'ప్రోగ్రాం ' వుంది శనివారం నాడు. అందుకే వెళ్తున్నానిప్పుడు. రామకృష్ణా సమాజం వారట రమ్మని వ్రాశారు. అడ్రసు యిచ్చారు కానీ కొత్త గనుక అడుగుతున్నాను. నేను జడ్జీ అనంతశయనం గారి యింటి దగ్గర వుంటాను. కొంచెం శ్రమ అనుకోక ఆ సమాజానికి దారి తెలియజయగలరా? మీరిపుడసలు ఎక్కడి నుంచి వస్తున్నారు?'
'మద్రాసు నుంచే! మీ కోసమే వస్తున్నాను!'
'నాకోసమా? ఎందుకూ?!' ఆశ్చర్యం తొంగి చూసిందామె కంఠనా.
'ఆ సమాజం మేనేజరు నా స్నేహితుడే! మిమ్మల్ని వెంట బెట్టుకుని రమ్మన్నాడు. మీరు నాకు తెలుసునని చెప్పగానే' అన్నాడతను.
'అపరిచితుల వెంట ఎలా రాగలనానుకున్నారు' అనాలనుకున్నదామె. కానీ అతడా ప్రశ్న వినగానే ముఖాన గంటు పెట్టుకుంటాడని ఆగిపోయింది.
'అలాగా! మళ్లీ వెంటనే ప్రయాణం అయిందే మీకు అలసి పోయినట్టున్నారిప్పటికే!' అన్నది అతని అలసటను గమనించి.
'ఫరవాలేదు లెండి టిక్కెట్లు తెస్తాను' అని అతను వెళ్ళ బోయాడు.
'నేను తీసికొన్నాను మీరు తెచ్చుకోండి' అన్నదామె తన చేతిలోని టిక్కెట్ చూపించుతూ.
'ఇదేమిటి?! ధర్డ్ క్లాసు లోనా? మీ ప్రయాణం! నో! నో! ఉండండి ఫస్టు క్లాసు తెస్తాను!' వెళ్ళబోయాడా డాక్టరు.
'క్షమించండి. ఎందరో ప్రయాణం చేస్తున్నారా తరగతి లోనే. అంతకన్నా మరో మెట్టు ఎక్కి అక్కడి స్వర్గాన్ని చూడగలనన్న నమ్మకం లేదు నాకు. అన్నదామె. విచిత్రంగా వుంది జవాబు అని అన్పించితదతనికి. ఆమె వంక చూశాడో క్షణం సేపు.
'మీది గాంధి మతమను కుంటానే!' అన్నాడు.
'ఏం మీకు బాధగా వుందా?'
'లేదనుకోండి! సరే! వస్తానుండండి.' అంటూ వెళ్లాడతడు. అంతలో మెడ్రాసు రైలు రానే వచ్చింది. అతని కోసం చూసింది కానీ కన్పించనే లేదెంత సేపటికి. బండి కదుల్తుండగా రాడని నిశ్చయించుకుని సూట్ కేసు పట్టుకుని రద్దీ తక్కువ అన్పించిన వో పెట్టె లో ఎక్కింది.
కూర్చుంటుండగా గాలి వానలా ప్రవెశించాడా డాక్టరు.
'థర్డ్ క్లాస్ కదండీ! దొరికేసరికి ఆలస్య మైంది ' అన్నాడు ఆమెకు ఎదురుగా వున్న సీట్లో కూర్చుంటూ.
'మీరు ఫస్ట్ క్లాస్ లో రావచ్చుగా?'
'మరీ అంత మూర్కుడు కాదండోయ్ ఈ హరికృష్ణ! కొంచెం మెదడుంది.' అన్నాడు చిన్నగా నవ్వుతూ.
ఆమె కూడా మందహాసం చేసింది చిన్నగా. తరువాత అతడు ఆ సమాజం ఎంతో పేరు పొందినదనీ, ఎంతోమంది నిలా ఆహ్వానించి సత్కరించు'తుందని తెలియజేశాడు.
మద్రాసు లో వున్న మంచి సమాజంలతో అదొకటి అని చెప్పాడు.
