3

అవరనిల గడ్డ మా ఊరు. పదహారేళ్ళు వచ్చేదాకా ఆ ఊళ్ళో మేం బ్రతికాం. ఆ గ్రామం లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు , ప్రతి చెట్టు , ప్రతి చెరువు, దోడ్లూ, పొలాలు అన్నీ మాకు చిరపరిచితాలే. చిన్ననాటి నుంచీ గూడా సారదీ, నేనూ ఒకే క్లాసవటం, మా ఇల్లు దగ్గిర కావటం, అన్నింటికీ మించి ఏదో జన్మాంతర బంధం కలవటం -- ఫలితంగా మా ఇద్దరి శరీరాలూ వేరు గాని ఆత్మ ఒక్కటే అన్నట్టు ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ ఎప్పుడూ విరోధంగా ఉండే కుర్రకారులో రఘుపతి ముఖ్యుడు. తరుచుగా కొట్టుకుంటుండేవాళ్ళం.
పెద్దవాళ్ళమయ్యాక మా వైషమ్యాలు కాలగర్బంలో కలిసిపోయాయి. రఘుపతి వాళ్ళు మోభాసాదార్లు. అంటే ఒక ఊరి మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం వాళ్ళ కుండేది. ఆ అధికార దర్పం , చిన్నవాడైనా రఘుపతి లో కనిపించేది. తోటి కుర్రాళ్ళందరి కంటే తానేదో అతీతుడై నట్లు తొలిగి, తొలిగి తిరుగుతుండేవాడు. మాలో రోజూ ఇస్త్రీ బట్టలు కట్టేది ఆరోజుల్లో రఘుపతే. నల్లగా పొట్టిగా ఉండేవాడు. తెల్లటి బట్టలు కట్టుకునేవాడు. కొంచెం నత్తిగా మాట్లాడేవాడు. పై అధికారి కింది శాఖలను తనికీ చేస్తున్నట్లు తిరిగేవాడు. అంతలోనే కోపం నటించేవాడు. అంతలోనే చిరునవ్వులు చిందించే వాడు. అప్పటి కతని వయస్సు పది పన్నెండయినా , తోటి కుర్రకారుతో తిరిగేవాడు కాదు. లైబ్రరీ అరుగు మీద మునసబు గారు, అవధాని గారు, పంచాయితీ ప్రెసిడెంటు చౌదరి గారు కూర్చొని ఏవో రాజకీయాలు మాట్లాడు కుంటున్న సమయంలో ఈ రఘుపతి సరాసరి వెళ్లి వాళ్ళ మధ్య కూర్చొనే వాడు.
మా ఊళ్ళో నాలుగు చెరువులున్నాయి. ప్రతి సంవత్సరం చేపలు పట్టుకునే హక్కు వేలం వేస్తారు. ఆ చేపలు పడుతున్న రోజుల్లో ఊరంతా వైవాహిక సంరంభం లాంటి సంచలనం తో ఊగిపోతుంది. పట్టిన చేపల పంపకాలను గురించి ఊరి పెద్దలు మాట్లాడుకునే సమయంలో రఘుపతి ఆ గుంపులో చేరి ఏదో సలహా ఇవ్వబోయాడు. "అది కాదు , బాబాయ్!" అంటూ వరస పెట్టి పంచాయితీ ప్రెసిడెంటు చౌదరి భుజం తట్టి గిల్లెవాడు. ఆ చౌదరి ఒళ్ళు మండి ఈ రఘుపతిని నాలుగు దులిపి , "పంతులూ, వెళ్లి చదువుకోక నీ కేండుకయ్యా ఈ గొడవ!' అని గర్జించేవాడు.
రఘుపతి ఏమీ జరగనట్లే రుమాలుతో మొహం తుడుచుకుంటూ, ఒక మహారాజ్యాన్ని జయించి వస్తున్న వీరుడి ఫక్కీ లో , తిరిగి వచ్చేవాడు.
అలాటి రఘుపతి -- మహానాయకుడు కావలసిన రఘుపతి -- ఇప్పుడు బొత్తిగా మారిపోయాడు. కారణం, జమీందారీ ఆక్టు తో పాటుగా వాళ్ళ మొఖాసా కూడా పోవటమే. గవర్నమెంటు ఇచ్చిన నష్టపరిహారం సంవత్సరం లోనే నమిలేశారు. ఆ తరవాత కాలేజీ లో చేరి, పై చదువు చదవటానికి కూడా డబ్బు లేక, విశాఖ పట్నం కలెక్టరేటు లో గుమస్తా ఉద్యోగం సంపాయించి, పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల లో నలుగురు పిల్లల్ని కని, కుటుంబీకుడయ్యాడు రఘుపతి. మేం అవరనిల గడ్డ వెళ్ళిన రోజే అతడు సకుటుంబం గా సెలవు మీద స్వగ్రామం వచ్చాడు.
గోల్డ్ స్మిత్ డిజర్ట్ డ్ విలేజ్ లాగా మా ఊరు ఒక దశాబ్దంలో పూర్తిగా మారిపోయింది. బ్లాకు వాళ్ళు, గ్రామ సేవా సంఘం, ఎన్నికలు కలిసి ఆ ఊరిని చాలా మార్చటం జరిగింది. కరెంటు వచ్చింది. హైస్కూలు పెట్టారు. రిజిస్ట్రారు ఆఫీసు పెట్టారు. పశువుల ఆస్పత్రి పెట్టారు. మనుషుల ఆస్పత్రిని , లైబ్రరీ ని బాగా వృద్ది చేశారు. పాడుబడ్డ అనేక కొంపలకి అద్దెలు రావటం జరుగుతుంది. ఎంత జరిగినా, అలంకరణ లేక్కువై ప్రాణం పోయినమనిషిలా నైర్మల్యాన్ని చైతన్యాన్ని పోగొట్టుకుంది మా ఊరు.
మాతో చదువుకున్న స్నేహితులు, మాతో ఆదుకున్న కుర్రాళ్ళు అంతా బస్తీలకు తరలి వెళ్ళిపోయారు. పదేళ్ళ క్రితం బాగా అసృలున్న వాళ్ళంతా క్రమంగా బికారుల య్యారు. ఐశ్వర్యం పోయినా, పూర్వపు దర్జా వదల్లేక, ఆ దర్పాన్ని విడవలేక , ఇంకా కొన్ని కుటుంబాలు త్రిశంకు స్వర్గం లోనే వేలాడుతున్నాయి. కొన్ని కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కష్టపడి పని చెయ్యలేరు. పని చెయ్యకుండా పూట వెళ్ళటం లేదు. పాతికేళ్ళ క్రితం కూలి చేసుకుని బ్రతికిన అలాగా జనం సవాలక్ష విధాల సంపాదనలు నేర్చుకొని, లక్ష లార్జించారు. మాగాణాలు కొన్నారు. ట్రాక్టర్ల తో వ్యవసాయం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద భవంతుల్ని వేలం పాటల్లో కొన్నవారు కొందరు. కొత్తగా కట్టించుకున్న వారు కొందరు.
ఓడలన్నీ బండ్ల య్యాయి. బండ్లన్నీ ఓడలయ్యాయి. తరతరాలుగా ఆ ఊరిని పాలిస్తున్న కుటుంబం దివాలా తీసి, అవమానాలు పొంది, ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది. అది మంచికే జరిగిందని కొందరు, వినాశకాలం వచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు.
ఏమైనా ఊరు మారింది.
ఊరితో పాటు మనుషులూ మారారు.
నీరుకాయ బట్టల్నిశాశ్వతంగా బహిష్కరించి , తెల్ల పాప్లిన్ చొక్కాలు గ్లాస్కో పంచలు ధరించి, గోల్డ్ ఫ్లాక్ సిగరెట్లు జోరుగా కాలుస్తూ, పేకాట నే జీవిత వ్యాసంగం గాను, బస్తీలకు పోయి సినిమాలు చూడటమే హబీగాను స్వీకరించిన కుర్రతనం బయలుదేరింది ఆ గ్రామంలో.
వేరు సేనగపంట పుణ్యమా అని కొందరు మంత్రదండం తిప్పినట్లు పెద్ద వాళ్లై పోయారు.
ఈ పరివర్తనతో పాటు ఊళ్ళో కొన్ని ప్రమాణాల్లో కూడా మార్పు వచ్చింది. తరతరాలుగా ఏ తప్పు చెయ్యటం మహా పాపమని ఊరి పెద్దలు , శాసిస్తూ వచ్చారో, ఆ తప్పులే ఇప్పుడందరూ బహిరంగంగా చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చింది కనక, ఎవడెం చేసినా న్యాయమే అనుకోవటం జరుగుతుంది.
నా చిన్నతనం లో దేవాలయం పండగల్లో కలకలలాడుతుండేది. ముఖ్యంగా రధ సప్తమికి ఆ సంరంభం మిన్నంటేది. వైవాహిక దీప్తి తో గ్రామమంతా కళ్యాణ మంటపం లావెలిగి పోయేది. మంగళ వాద్యాలతో, మంత్రోచ్చారణలతో ఊరు ఊరంరా ప్రతి ధ్వనించేది. దేవాలయాని కో రధం ఉంది. మా ఊరి వడ్రంగి పరబ్రహ్మం తయారు చేశాడు దాన్ని. ఆరోజుల్లో మూడు పెట్టి ఖర్చు పెట్టి దేవాలయ ధర్మకర్త భయంకరా చార్యులు గారు దాన్ని చేయించారు. రాధసప్తమికి ఆ రధాన్ని స్వర్గ మందిరం లా అలంకరించే వారు. ఊరేగింపు విగ్రహాలను స్నానం చేయించి, నూతన వస్త్రాలు ధరింప జేసి , అలంకారాలు చేసి, రధం పై ఉంచేవారు. రధమంతా పూల దండల వరసలతో, సుగంధ ద్రవ్యాల గుభాళింపు లతో అలౌకిక వాతావరణాన్ని సృష్టించేది. ఆ దేవాలయం పూజారి పట్టు పీతాంబరాలు ధరించి, నున్నగా మెరుస్తున్న శరీరం పై నామాలు పెట్టుకొని, రధం మీద స్వామి పాదాల చెంత అసీనులయేవారు. ప్రాతః కాలాన్నే ఊరిలోని ఆబాల గోపాలం -- పిన్న పెద్ద లందరు -- అంతులేని సంరంభంతో కోనేటి స్నానాలు చేసి, పట్టే వర్ధనాలు దిద్దుకుని, పట్టు బట్టలు కట్టుకుని, మరో ప్రపంచానికి పోతున్నట్టు దేవాలయానికి బయలుదేరి , స్వర్గ ద్వారాలు దాతుతున్నట్టు ఆలయ ప్రాంగణం లో ప్రవేశించి , స్వామిని దర్శించి , గంటలు మోగించి ఉత్సవం లో పాల్గొనేవారు.
