
3
ప్రతి వ్యక్తీ జీవితంలోనూ కలిసి వచ్చే రోజులంటూ కొన్ని ఉంటాయి. అ ఋతువులో అన్నీ శుభాలే జరుగుతాయి. అనుకున్నదే తడవుగా ఏ కార్యమైనా ఫలిస్తుంది. ఆ దెబ్బతో మనిషికి ఆనందోద్రేకం తప్ప మరే అనుభూతీ ఉండదు.
అలాగే మన కనకదుర్గ కు కూడా! దొరికిన పిల్లను స్వాధీనం చేసుకోవడానికి అయిన వారెవ్వరూ రాలేదు. పోలీసులు పనికట్టుకుని విచారించినా లాభం లేకపోయింది. కనకదుర్గ కు కలిగిన ఆనంద పారవశ్యానికి అంతూ పొంతూ లేకుండా పోయింది. స్వార్ధం ఆమెలో "దొరికిన బిడ్డకు అసలు తల్లిదండ్రులే లేరు' అన్నంతటి దృడ నిశ్చయాన్ని కలగజేసింది. కనకదుర్గ తల్లిదండ్రులు జ్ఞానాంబికా సర్వోత్తమరావు గార్లు వెం చేశారు. ఇరుగూ పొరుగూ గుమికూడారు. కష్టపడి కన్న తల్లిదండ్రుల కన్నా ఘనంగా ఆ బిడ్డకు నామకరణ మహోత్సవం జరిపించారు కనకదుర్గా శంకర నారాయణులు.
అంత సంతోషమూ, అందరికీ ఒక్కసారిగా కలిగితే ఎలా? కొంత నిరుత్సహమూ , నిరాశా కూడా కలిగే అవకాశం అప్పుడే ఏర్పడింది. అదీ ఎవరి కంటారు? సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబికకు! అసలు జరిగిన గొడవంతా బ్రాహ్మణుల వల్ల జరిగింది. పురోహితుడు పాపం, మీనమేషాలు లెక్కపెట్టి, చూపుల్ని ఇంటి కప్పు మీద కాస్సేపు ఉంచి, అన్ని వేళ్ళు అయిదారు సార్లు లెక్కపెట్టి, దివ్యజ్ఞాన ప్రబోదితుడై నట్టు మళ్ళీ తన చూపుల్ని మనుషుల వైపు మరల్చి , "అయ్యా , అమ్మాయి గారు దొరికిన లగ్నాన్ని బట్టి , అప్పటి గ్రహచాలనాన్ని బట్టి చిరంజీవినికి "అరుణ' అని నామకరణ చేస్తే అన్ని శుభాల్నీ ఆకాశం అలా వర్షించి వేస్తుంది!" అన్నాడు.
అందరూ "అరుణ! ఆహాహా! చాలా బాగుంది!" అన్నారు.
"ముద్దుగా ఉంది పేరు" అన్నారు.
"చేంతాడంతటి పేరు పెట్టి పిలుచుకోలేక బాధపడే దాని కన్నా, 'అరుణ' అన్న పేరు అన్ని విధాలా బాగుందండీ, అల్లుడు గారూ" అన్నారు సర్వోత్తమ రావు గారు కూడా. కనకదుర్గ కూడా ఆనందావేశ పూరితు రాలై ఉన్నందు వల్ల తల్లి బాధను గమనించలేక పోయింది. అందరికీ నచ్చినట్టే "అరుణ' అన్న పేరు ఆమెకూ నచ్చింది. 'అరుణ' అనే నామకరణం చేశారు. అంతే! అంతటితో జ్ఞానాంబిక మనసు చివుక్కుమంది.
తాంబూలాలు పుచ్చుకుని అందరూ వెళ్ళిపోయాక జ్ఞానాంబిక , "అమ్మా, తల్లీ, కనకదుర్గా! మేమిక వెళ్ళిపోతామె" అంది ఆపసోపాలు పడుతూ.
"అదేమిటమ్మా?"
"ఏముందే తల్లీ? గంపెడంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు , చేశారుగా నాకు తగిన శాస్తి? అయినా నిన్ను అనవలసిన అవసర మేముందిలే! ఏమండోయి, మిమ్మల్నే! ఇప్పుడు బయలుదేరినా బండి అందుతుందనుకుంటా . రండి!"
"ఆ దెబ్బతో సర్విత్తమ రావు గారూ, శంకర నారాయణా ఒక్క దూకున బైట పడ్డారు. కన్నీళ్ళ పర్యంతమై నిలుచుంది కనకదుర్గ.
"ఏమిటే, ఏమిటే? నీకేం వచ్చింది? నిన్నా మొన్నటి దాకా నెలనాళ్ళయినా మకాం వెయ్యాలన్న దానివి , ఇప్పుడు ఈ నిమిషాన్నే బయలుదేరాలన్న బుద్ది నీ కెందుకు పుట్టిందే? భోజనాల వేళ, పైగా అల్లుడు గారు పిండి వంటలూ అవీ దిట్టంగా చేయించి నట్టున్నారు! అన్నిటినీ విడిచి పెట్టి, ఒక్క పెట్టున ఎలాగే, జ్ఞానం, బయలుదేరడం?"
"అబ్బబ్బ! తిండి! తిండి! తిండి! జీవితంలో మీరు కేవలం తినడానికే బ్రతుకుతూన్నట్టుంది! రామ రామ!"
'పోనీ , బ్రతకడానికే తింటూన్నాననుకోవే! పిండి వంటల పుణ్యమా అంటూ మరి కాస్త దర్జాగా బ్రతుకుతా. అంతేగా?"
"మీరు వెయ్యి చెయ్యండి, లక్ష చెప్పండి. మనం కొని తెచ్చుకున్న అవమానాలు చాలు! ఇక నేనొక్కక్షణం కూడా ఇక్కడుండను. నాలిక పిడచ కట్టుకు పోయినా, నా బిడ్డ ఇంట నేను పచ్చి మంచి నీళ్ళయినా తాగను!"
"అమ్మా!"
"అత్తగారూ!"
"పచ్చి మంచినీళ్ళు వద్దులేవే! మరీ అంత తపనగా ఉంటె, గ్లూకోజ్ కలిపే ఇస్తారులే."
"అయినదానికీ, కాని దానికీ నాతొ వేళాకోళలాడారంటే నేను మంచిదాన్ని కాను. మీరు నాతొ పాటు బయలుదేరుతారా?.......ఇక్కడే పడి ఉంటారా? నేను మాత్రం వెళుతున్నాను!' అంటూ తాను తెచ్చుకున్న నాలుగు చీరలనూ చంకన పెట్టుకుంది జ్ఞానాంబిక.
'అమ్మా, అమ్మా, ఏమిటే ఇదంతా?"
"అత్తగారూ , మేమేం అపరాధం చేశాం? తెలియక ఏదైనా పొరపాటు జరిగే ఉంటె , ఇదుగోండి చేతులు జోడించి ప్రార్దిస్తున్నా .మమ్మల్ని మన్నించండి!"
"మీ నమస్కారాలు మా కవసరం లేదు; మా మన్ననలూ మీ కవసరం లేదేలే, నాయనా! ఎందుకొచ్చిన నాటకాలూ, బూతకాలూ ఇవన్నీ? నలుగురి లో చెప్పుచ్చుకుని కొట్టి, నట్టింట చేతులు పట్టుకుని బ్రతిమాలితే మాత్రం, మీరు నాకు చేసిన అవమానాన్ని నేను మరిచి పోతానా?"
కనకదుర్గకు అసలు ఏమీ అర్ధం కాలేదు. ఇక సర్వోత్తమ రావు గారి సంగతి సరేసరి!
"మీకా? అవమానం జరిగిందా? ఈ ఇంటా ?"
"ఓహో...ఓ హూహూ! ఎన్ని నాటకాలు నేర్చావయ్యా , అల్లుడు గారూ! అన్యాయాల్నీ న్యాయలుగా , న్యాయాల్నీ అన్యాయాలుగా నిరూపించే న్యాయవాది వనిపించు కున్నావు మొత్తానికి! అసలు మిమ్మల్ని ఆడబిడ్డను పెంచుకోమని సలహా ఇచ్చిందేవరు? పోనీ, ఆ బిడ్డకు మీరే సంపాదించు కున్నారను కొండి! అంత మాత్రాన అప్పుడే అన్నీ మరిచి పోవాలా? 'పిల్ల దొరగ్గానే దానికి సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబిక అని మీ పేరే పెట్టుకుంటాం?' అని అప్పుడు వగలన్నీ ఒలకబోసి, ఇప్పుడు మీరు చేసిందేమిటి? అరుణాను....రుణ'మూనూ! అంతేలెండి! ఆ ఋణం మీకు ప్రాప్తించింది , నాకూ నా బిడ్డకూ ఉన్న ఋణానుబంధం తెగిపోయింది!" అంటూ ఎగచీది , దిగచీది ఏడ్చింది జ్ఞానాంబిక.
సర్వోత్తమరావుగారు ఫకాలున నవ్వారు. కనకదుర్గా శంకర నారాయణులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"అమ్మా, పొరపాటు జరిగిందే! అసలు నీ విషయమే మరిచిపోయాం."
"అవునే, మరిచిపోక ఏం చేస్తావు? లక్షాధికారి భార్యవు!"
"అమ్మా!'దుర్గ నిజంగా నొచ్చుకుంది.
"అత్తగారూ, మమ్మల్ని క్షమించండి! ఇప్పుడయినా మించి పోయిందే మీ లేదండీ, అత్తగారూ! అమ్మాయిని 'సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబికారుణ' అని పిలుచుకుందాం, మీ పాదాల సాక్షిగా!"
"అవునే! ఇక మీదట పాప పేరు అదేనే. ఇకనైనా శాంతించవే అమ్మా, ఇదుగో, నీ మనమరాల్ని ఎత్తుకో. ఆశీర్వదించు." అంటూ అరుణ ను ఆమె చేతుల్లో పెట్టింది దుర్గ. సర్వోత్తమరావు గారు నవ్వుతూనే ఉన్నారు.
"అయ్యా, అల్లుడు గారూ!"
"అయ్యా?"
"అమ్మాయి పేరేమిటన్నావు? 'సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబికారుణ' అనా? ఆహా! ఆహాహా!" అంటూ అదేపనిగా నవ్వారాయన. ఆ నవ్వు విని సహించలేక , జ్ఞానాంబిక ఇంత లావుపాటి లడ్డు అయన నోట కుక్కింది. దానితో అందరూ మళ్ళీ ఆనందతరంగాల్లో మునిగి తేలడం మొదలు పెట్టారు.
4
ఎంతటి శాస్త్రమయినా ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితుల్లో , కొందరి విషయాల్లో తబ్బిబ్బై , తల కిందులై ఊరుకుంటుంది. మన శంకర నారాయణా కనకదుర్గల విషయం లో డాక్టర్లు చెప్పిన మాట అబద్దమూ, దొరికిన బిడ్డకు అరుణ అని నామకరణం చేస్తే , అన్ని శుభాల్నీ ఆకాశం అలా వర్షించి వేస్తుందని పురోహితుడు తన వృత్తి ధర్మాన్ని అనుసరించి పలికిన ఆశీర్వచనము నిబద్దమూ అయినాయి.
అరుణ అప్పుడప్పుడే డోగ్గాడుతుంది. ముద్దుగా బాల భాషలో అందర్నీ పలకరిస్తుంది. అరుణ ఏదో మూలిగితే "అమ్మా" అన్నదని కనకదుర్గా, మరేదో గొణిగితే "నాన్నా" అన్నదని శంకర నారాయణ గారూ పరమానందభరితులై పారవశ్యం చెందుతున్న రోజులవి! అకస్మాత్తుగా ఆ ఆనందాతిరేకాన్ని మరింత రెచ్చగొట్టడానికో అన్నట్టు, లీలానటక సూత్రదారి అయిన సర్వేశ్వరుడు సరదాగా ఒక తమాషా చేశాడు. దానితో కనకదుర్గ గర్బిణీ కాబోతున్న సూచన అగుపడ్డాయి! ఆ దంపతులు అనుభవించిన ఆనందానికీ అంతు, పొంతు అంటూ ఏమీ లేకపోయింది.
జ్ఞానాంబిక , సర్వోత్తమరావు గారు మళ్ళీ దయ చేశారు. ఈ అదృష్టాని కంతటి కి అసలు కారణం అరుణ అని తేల్చి, ఆ బిడ్డ నెత్తుకుని ముద్దాడి, ఎన్నెన్నో మురిపాలు ఒలక బోశారు. తన కూతురు కాలు కింద పెడితే ఏం ప్రమాదం సంభావిస్తుందో నని, దుర్గను వేయి కళ్ళతో కనిపెట్టడం మొదలు పెట్టింది జ్ఞానాంబిక.
కాలానికి గడిచి పోవడాని కన్నా చెయ్యగల పనేముంది? నెలలు గడిచాయి. ఒక శుభ ముహూర్తాన కనకదుర్గ ఆడశిశువు ను ప్రసవించింది. అప్పుడే పుట్టింది జ్ఞానాంబి కాకు దుర్భుద్ది.
అయినా, తన ఊహల్ని వ్యక్తం చేయడం ఎలా? ఎవరి వద్ద? సర్వోత్తమరావు గారితో చెప్పుకునీ లాభం లేదు. అల్లుడు గారితో చెప్పుకోవచ్చు గానీ, సాహసించ లేకపోయింది. అందుకని, జ్ఞానాంబిక ఒకనాడు పురిటింటి లోనే తన కూతురితో అంది.
"అమ్మాయీ!"
"ఊ?"
"ఏమీ లేదే, నీవేమీ అనుకోకుండా ఉంటె, నీకు నా మనసులోని మాట చెప్పాలని ఉందే!"
"చెప్పవే."
"నీవేమీ అనుకోవు కదా?"
"నీకేమైనా పిచ్చా, అమ్మా? నీవు నా కీడు కోరి ఏ మాటా చెప్పవుగా?"
"రామ రామ! అది కాదె. మన పాప సంగతే......."
"దీనికీ నీ పేరే పెట్టుకో మంటావా , అమ్మా?"
'అదేనే . పోయి పోయి నా పేరు ఆ ఊరూ, పేరూ లేనిదానికి పెట్టడ మేమిటి?"
కనకదుర్గ మనసు చివుక్కుమంది.
"అమ్మా!' తన బాధను చాలా స్పష్టంగా ప్రదర్శించింది దుర్గ, ఆ పిలుపులో నైతేనేమి, తన ముఖంలోని కళవళికల్లో నైతేనేమి.
"అహహ! అది కాదె నేననేది. ఏదో దిక్కూ, మొక్కూ లేని పిల్ల. జాలిదలిచి పెంచుకుంటూన్నామనుకో! అందరూ చేరి దానికి పెట్టారుగా పేరు అరుణ అని? దానికా పేరు అలాగే ఉండనీ! నా మనుమరాలికి మాత్రం నాపేరే పెడితే నా ప్రాణానికి హాయిగా ఉంటుందే!" అంటూ జ్ఞానాంబిక బ్రతిమాలింది. ప్రాధేయపడింది.
కనకదుర్గ ఏమనగలుగుతుంది? ఉస్సురంటూ 'అలాగేలేవే" అని, విశ్రాంతి ని వెతుక్కుంటూ కళ్ళు మూసింది. ముల్లోకాల్నీ జయించినంత ఇదిగా మురిసిపోయింది జ్ఞానాంబిక.
