Previous Page Next Page 
దీప శిఖ పేజి 3

                        


    "విజయా!" అని హాల్లోంచి రామనాధం వేసిన కేకకి. లోపల్నుంచి వస్తుందను కొన్న సమాధానం , వీధి పెరట్లోంచి రావడంతో, విస్తుపోయి మళ్లా పిలిచాడు రామనాధం.
    అప్పుడే కట్టడం పూర్తీ చేసిన మల్లెపువ్వుల మాలకి మిగిలి పోయిన దారం ముక్కని పక్క పంటితో కొరుకుతూ "ఏం మావయ్యా!" అంటూ హాల్లోకి వచ్చింది విజయ. విజయ చేతిలో ఉన్న మల్లెల్ని చూసి ఆశ్చర్య పోతూ "ఇదేమిటి? ఆకాలం గా ఈ ఆషాడ మాసంలో మల్లె పువ్వు లెక్కడివీ?" అన్నాడు రామనాధం.
    విజయ నవ్వుతూ "ఎక్కడి వేమిటి మావయ్యా! మన ఇంట్లోవే!"అంది.
    "మన ఇంట్లోవా!"
    "ఊ..... ఏపుగా ఎదిగిన వీధి గేటు దగ్గర మల్లె తీగ మట్టిలో జీరాడుతుంటే నేను వచ్చినప్పటి నుంచీ పందిరోక్కటి వేయించి దాన్ని పైకి కట్టించ మంటూ అనేదాన్ని కదా. నువ్వు పందిరి వేయించాక నేను ఆమధ్య అదంతా దూసేసి మొదట్లో చుట్టూ తవ్వి కుదురు చేశా. ఇప్పుడది విరబూస్తోంది. నువ్వు చూడలేదా గేటు ప్రక్కని ఉన్నదాన్ని."
    "ఏం చూస్తున్నావు? ఏం వండానో, ఎలా వండానో చూసుకోకుండా రెండు ముద్దలు నోట్లో వేసుకుని వెళ్లి అరి వాల్వింగ్ షెల్పు కి , డ్రాయరు కి మధ్య కుర్చీ లో అతుక్కు పోవడం , ఎరక్క పోయి పలకరిస్తే "ఆ, ఊ" అంటూ పరధ్యానంగా సమాధానం చెప్పడం. ఇవి తప్పిస్తే నేను రంగు రంగుల గొట్టాల తోటీ పూసల తోటి గుమ్మాలకి జాలర్లె తాయారు చేశానో, సోఫా దిండ్ల కి, పరువుల దిండ్ల కి గలేబులు కుట్టించి రంగు దారాలతో డిజైను లే వేశానో, వాడుకోవడం అయిపోయిన తరువాత నువ్వు ఎక్కడి వక్కడ పడేసి పోతున్న పుస్తకాల నీ, వస్తువుల నీ ఎలా సర్దు కున్నానో , నేను వచ్చాక ఇటు ఇంట్లో నూ అటు పెరట్లో నూ ఎన్ని మార్పులో తీసుకు వచ్చి అడవి లా ఉన్న వాటిని అందంగా ఎలా మార్చానో , ఇవేవైనా చూస్తున్నావా?..... ఇంట్లో ఏం జరిగినా నీకు అక్కరలేదు. అటు నీ ప్లీడరు వృత్తి-- ఇటు బ్రహ్మ సమాజ మఠం ఈ రెండే....ఇంకో ప్రపంచం అక్కర్లేదు........" అంది విజయ. మావయ్య ఏం పట్టించు కోడు అన్న ఉడుకు మోతు తనం తో -- బాధగా విజయ గబగబా అనేస్తున్న మాటలు విని నవ్వుతూ చూడక పోవడం ఏమిటి ?....అన్నీ చూస్తూనే ఉన్నా" అన్నాడు రామనాధం.
    "చూస్తె చూశావు. లేకపోతె లేదు నాకేం కాని ఇదిగో దండ" అంటూ చేతిలో ఉన్న మల్లె దండ ని రామనాధం టేబిల్ మీద పెట్టబోయింది.
    "అదేవిటి?.....నాకెందుకు ?.....నువ్వు జడలో పెట్టుకో"
    "జడలోనా?....ఈ లోకంలో పూసే పువ్వులన్నీ భగవంతుడి కోసమే! అందువల్ల మనం జడల లో పెట్టుకుని అలంకరించు కోవడం మహాపరాధం . తెలిసిన వాళ్ళెవరూ అలా చెయ్యరు. అంటూ ఎప్పుడూ మా అమ్మ జడలో నన్ను పువ్వులు పెట్టుకోనిచ్చేది కాదే!"
    "మీ అమ్మవి అన్నీ పూర్వపు చాదస్తాలు లే. ఆ అర్ధం లేని ఆచారాలూ, ఘనీభవించి పోయిన మూర్ఖపు నమ్మకాలూ దానితోనే వెళ్ళిపోయాయి. వీరేశలింగం గారితో ఒక కొత్త యుగం ప్రారంభం అయింది. ఈ మహోదయానికి చెందిన మహిళవునువ్వు. జడలో పువ్వుల దండ పెట్టుకో!...." అన్నాడు రామనాధం.
    ఇంకా సందిగ్ధం లోనే ఉండి చేతిలో దండనీ ఆ మట్టునే పట్టుకుని నిలబడి ఉన్న విజయతో. "రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, దేవెంద్రనాద్ ఠాగూర్ , వీరేశలింగం గార్లతో దేశంలో ఒక నవ శకానికి నాంది జరిగింది. ఈ కొత్త యుగం , తోలి ఉషస్స్టు లతో ఉన్న మనం చాలా అదృష్ట వంతులం-- జాతిని మేల్కొల్పుతున్న ఈ వెచ్చని కిరణాలు తగలకుండా తలుపులు మూసుకుని ఉండాలను కొనే వాళ్ళు నిజంగా దురదృష్ట వంతులు. కేశవచంద్రసేన్ ఏవన్నారంటే -- అన్నట్లు కేశవ చంద్రసేన్ లెక్చర్స్ అనే పుస్తకం ఇక్కడ టేబిల్ మీద ఉండాలి నువ్వు చూశావా?....నీలం అట్ట పుస్తకం -- నిన్ను అందుకే అసలు  పిలిచింది" అన్నాడు రామనాధం.
    చేతిలో ఉన్న మాలని గబగబా జడలో పెట్టుకుని , సోఫా దిండు ఎత్తి "ఈ పుస్తక మేనా? అంటూ తీసింది విజయ.
    "ఆ-- అదే !....నువ్వెందుకు తీశావు?....నీకేం అర్ధం అవుతుందని........?"
    "ఆహా!....ఇందులో ఉన్న ఫోటో ఒకటి ఎంతో గంబీరం గానూ, తేజస్సు గానూ ఉంటేనూ...."
    రామనాధం నవ్వుతూ "అదా! ....అది కేశవ చంద్రసేన్ ది లే ---మహాత్ముల రూపాలు అలాగే వుంటాయి అమ్మా" అన్నాడు.
    ఇంతలో "రామనాధం గారూ!" అంటూ పెట్టె పరుపు చుట్టా . కూలి వాడి చేత పట్టించుకుని శేషయ్యా, అతని వెనకాల ఇజారు, కమీజుల్లో ఇబ్బందిగా ఇమిడిపోయి, ఇటూ అటూ బెదురూ బెదురుగా దిక్కులు చూస్తున్న గోపాలం హాల్లోకి వచ్చారు. రామనాధం "రండి రండి" అంటూ వాళ్ళని ఆహ్వానించి సోఫాల మీద అసీనుల్ని చేస్తూ వుంటే, వింతగా నిలబడి చూస్తూ ఉండిపోయింది విజయ.
    నాలుగైదు ఏళ్ళ క్రితందాకా పాలెం నుంచి ఏ చిన్న కేసు -- పట్నం కోర్టు కి వచ్చినా, ముద్దాయి వైపు వాళ్లనో, ఫిర్యాదీ వాళ్లనో వెంట బెట్టుకు వచ్చి, ఒ సైడు వకాల్తా నామా తనకి తప్పకుండా ఇప్పించి మరీ వెళ్ళేవారు ఈ శేషయ్య గారు. అటువంటిది ఈ మధ్య రాకపోవటానికి , ఇవాళ ఉదయం ఈ అబ్బాయి నెవరినో వెంట బెట్టుకుని ఇలా హటాత్తుగా రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఒక్క క్షణం అలోచించి, అదే అడిగేశాడు పైకి "ఏవిటీ మధ్యన రావడమే మానుకున్నారు?' అని--
    సమాధానంగా , తన భార్య పోవడమూ, ఎంత మంది చెప్పినా తను మరో  ఆలోచన పెట్టుకోకుండా వాసు మీదే ప్రాణాలు పెట్టుకుని కాలక్షేపం చెయ్యడానికి నిర్ణయించు కోవడమూ, ఇటు ఇంట్లో నూ, అటు బయటా నానాటికీ పెరిగి పోతున్న బాధ్యతలతో క్షణం కూడా తీరిక లేకపోవడ మూ, మునసబు కూడా పాత కక్ష మరచి తనతో కలిసి వస్తుండడమూ దానా దినా తను ఊరు గొడవల్లో జోక్యం కల్పించు కోవడం తగ్గించేసి, రాజమండ్రి రావడం కూడా మానేసినట్టు చెప్పాడు శేషయ్య.
    "అయ్యో అలాగా" అంటూ శేషయ్య కు వచ్చిన కష్టానికి రామనాధం సానుభూతి కనపరచి సామనయంగా కాస్సేపు మాట్లాడేడు. ఆ తర్వాత  వాసుకి జబ్బు చేయడం -- శంకరం హస్త వాసి శేషయ్య పట్టు వల్ల పాలెం లోనే  శేషయ్య పెంకుటి సావిట్లో శంకరం ప్రాక్టీసు ప్రారంభించడం , తమ్ముడు పై శంకరాని కి ఉన్న అపారమైన ప్రేమ. గోపాలం చదువు గురించి పడిన ఆందోళన - అందుకు శేషయ్య ఇచ్చిన హామీ- ఇవన్నీశేషయ్య విపులంగా రామనాదానికి చెబుతూ వుంటే, ద్వార బంధం రెండు కమ్ములూ చేతుల్తో పట్టుకుని ఆసక్తి గా వింటూ, మధ్య మధ్య శేషయ్య పక్కనే సిగ్గుగా ముడుచుకుని కూర్చుని పద్దెనిమిది సంవత్సరాల యౌవనాన్ని శరీరం లో దృడంగా మలుచుకున్న గోపాలం కేసి రహస్యంగా చూస్తోంది విజయ.
    మరీ కోలగా గుండ్రం కాకుండా , అందంగా ఆకర్షణీయంగా ఉన్న ముఖం, పెద్ద పెద్ద కళ్ళకి అందంగా అమరిన బరువైన కనురేప్పలూ , నున్నని చెక్కిళ్ళు, సన్నని పెదిమలు, సొగగా మధ్యన సోట్టపడే చంద్ర వంక లాంటి గడ్డం , నల్లని జడలోంచి కొద్దిగా తొంగి చూస్తూ పచ్చని మెడని తెల్లగా ముద్దు పెట్టు కుంటున్న ఒకటి రెండు విచ్చిన మల్లెలూ. వీటితో పట్టు పరికిణీ, పైట కండువా వయస్సు లోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఆ అందం, ద్వార బంధం దగ్గర నిలబడి దొంగలా తనని ఉండుండి చూస్తుంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు గోపాలం.
    చుట్టూ కాంపౌండరు వాలూ, ఆవరణ లో చక్కని పూల మొక్కలు హల్లో ఖరీదైన విరుగుడు చేవ కుర్చీలు, డ్రాయరూ , రివాల్వింగ్ షెల్పూ ని దిండ్లు అమర్చిన సోఫాలూ, సీలింగ్ నుంచి సన్నని గొలుసులతో వేలాడదీసిన పెద్ద పెద్ద తెల్ల గాజు బుడ్లు, కిటికీ లకీ గుమ్మాలకీ పైన ఉన్న అర్చీలను అందంగా అలంకరించిన రంగు రంగుల గాజు పలకలూ, గోపాలానికి కొత్తగానూ, వింతగానూ ఆకర్షణీయంగానూ కనుపించ సాగాయి.
    తల ఎత్తకుండానే ఇలా ఒక కంటి తో ఆ గది అందాన్నీ, మరో కంటితో తనవేపు దొంగతనం గా చూస్తున్న విజయ సౌందర్యాన్ని , హృదయ దమ్నంగా గ్రోలుతూ , తనని తాను మరచి లోకాతీతమైన ఏ దివ్యానందాన్నో అనుభవిస్తున్నాడు గోపాలం. అందువల్ల శేషయ్యా, రామనాధాల మాటలు కొన్ని వినిపిస్తున్నాయి కొన్ని లేదు, "ఎలా చేసినా సరే -- ఈ సహాయం మీరు చెయ్యాలి, తప్పదు , అసలు మీ అండ చూసుకునే నేను శంకరం గారికి మాట ఇచ్చాను. మీరు ఎలాగోలాగ ప్రయత్నించి గోపాలానికి ఎఫ్.ఏ. లో సీటు చూస్తె ఈ ఉపకారానికి శంకరం గారు, గోపాలం కాదు నేను మీకు కృతజ్ఞుడి గా ఉంటాను,' అన్నాడు శేషయ్య.
    "అదిసరే -- ఆ ప్రిన్సిపాల్ కూల్డ్రే ఉన్నాడు చూశారూ. ఆయనకి రూలంటే రూలే--' కాలేజీ తెరచిన నెలా పదిహేను రోజులకా చేరటం ? సీటు లేదు వెళ్ళు" అన్నడా ఇంక అంతే-- ఆ మాటకి తిరుగులేదు."
    "అదేవిటండీ ఊళ్ళో  ఇంతమంది పెద్దలున్నారు, మీరు, మీ స్నేహితులు న్యాపతి సుబ్బారావు పంతులు గారు. రాయవం వెంకట శివుడు గారు. మీలో ఏ ఒక్కళ్ళు "చెప్పినా వినడూ ఆ ప్రిన్సిపాలు?"
    "ఊహు....ఇంకా మాకంటే దామెర్ల వారి అబ్బాయి. కనికొండల వారి అబ్బాయి , గోదావరి అవతల నుంచి వచ్చాడు" ఎవరంటే ....ఆ....అడివి బాపిరాజు అనే కుర్రాడు-- వీళ్ళు నయం. ఒకమాటు కాకపొతే ఒకమాటు అయినా వీళ్ళు చెప్పింది వింటాడు ఆ కూల్ద్త్రే-- అదైనా వాళ్ళు తెలివైన విద్యార్ధులని, తెలివైన విద్యార్ధు లంటే ఆయనికి ఇష్టం లెండి-- ఇంతకీ ఈ అబ్బాయి కి మర్కులేలా వచ్చాయి? ఏమోయి నీ మార్కు లేవి?" అన్నాడు రామనాధం.
    గోపాలం ఉలిక్కిపడి లేచి పెట్టె తీసి మార్కులు అందించాడు. రామనాధం అందుకుని పైకి చదువుతూ "ఇంగ్లీషు అరవై అయిదు, తెలుగు అరవై రెండు, లెక్కలు తొంబై తొమ్మిది ....యస్....సీటు అంటూ ఉంటె నీకు తప్పకుండా ఇస్తాడు. వే-- క్వార్టర్స్ కి వెళ్లి ప్రిన్సిపాల్ ని కలుసుకుందాం" అంటూ పై మీద కండువా వేసుకుని, మూలనున్న కోడు తొడుక్కుని చేతి కర్ర తీసుకుంటూ "విజయా! పార్టీ లేవరేనా వస్తే కూర్చోమని చెప్పు" ఇప్పుడే వస్తాను" అంటూ గోపాలాన్ని తీసుకుని బయలుదేరాడు రామనాధం. "నేనూ అలా బజారు కేసి వెళ్లి వస్తాను" అంటూ శేషయ్య కూడా వాళ్ళ వెనకాలే వెళ్లి పోయాడు. అప్పటి దాకా అక్కడే నిలబడి ఉన్న విజయ ని అప్పుడే చూసి, విస్తుపోయి, "పద్నాలుగు పదిహేనేళ్ళు వున్న ఈ అమ్మాయి ఎవరు చెప్మా......ఇంతక్రితం ఈ ఇంట్లో ఎప్పుడూ కనిపించలేదే?....ఈ ఆజన్మ బ్రహ్మచారికి ఈ ఎభయ్యేయెట్ట మనసయి పెళ్లి చేసుకో లేదు గదా ఈ అమ్మాయిని.?....ఛ....రామనాధం గారు అలాంటి వారు కాదు....ఎవరో చుత్తాలమ్మాయి అయి వుంటుంది..." అని మనసులో ఆలోచించుకుంటూ వీధి గేటు దాటాడు శేషయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS