రవిచంద్ర లేచి బాత్ రూము లోకి వెళ్లి పోయాడు.
రాజగోపాలం మెల్లిగా "ప్రియా" అన్నాడు చెవి మీద తల అన్చుతూ.
"ఏమిటి?' అంది ప్రియ కళ్ళు తెరవకుండానే.
"మన ట్రెయిన్ రొమాన్సు పాడు చేశాడు కదూ ఇతగాడు?"
"ఛీ...ఛీ...."
"ఏమిటది , అతను ట్రాజెడీ సినిమాలో హీరోకి మల్లె?"
"ఊ!" మత్తుగా అంది ఆమె.
"ఏయ్ , ఇది అన్యాయం. నేను నిద్ర పట్టక చస్తుంటే నీవు ఏమిటీ మరీ అసహ్యంగా ...నీ నిద్రా ...నువ్వూ!"
ఆమెకు అతని మాటలు నిద్రమత్తు లో కూడా నవ్వు తెప్పించాయి. సన్నగా నవ్వుతూ , "ఏం చేయమన్నారు?' అంది.
ఆమె బుగ్గ మీద చెయి ఉంచి, "జోలపాట పాడు. లేకపోతె నే పాడతాను. నీవు పాడితే నాకు నిద్ర వస్తుంది. నేను పాడితే నీకు నిద్ర పోతుంది. దేనికైనా నేను రెడీ!"
ఆమె కొంచెం నవ్వుతో అటు పక్కకు ఒత్తిగిలి "ఊ!" అంది.
"ప్రియా, ఇతనికి మన ఉసురు తగులుతుంది. ఏకాంతాన్ని భంగం చేసిన ఇతనికి...."
"ఉష్ , అతడు వింటాడు."
"విననీ. బుద్ది తెచ్చుకోనైనా పక్క కంపార్టు మెంటు లోకి వెళతాడు." సరదాగా ఆమె మీదికి వంగుతూ అన్నాడు. భర్త ధోరణి కి , మాట్లాడే తీరుకు ఆమెకు నవ్వు వచ్చింది. నవ్వుతో బాటు నిద్ర కూడా ఆమెను మెల్లగా ఆక్రమించు కుంది.
ఇంతలో రవిచంద్ర వచ్చి తన సీటులో కూచున్నాడు.
రాజగోపాలం సిగరెట్టు ముట్టించి, అతనికి ఒకటి అందించబోయాడు.
"థాంక్స్ , నేను కాల్చను" అన్నాడు రవిచంద్ర.
"అందుకే మీరు అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు."
రవిచంద్ర నివ్వెరపోయి "ఏం?' అన్నాడు.
"సిగరెట్టు ను నా ఫ్రెండ్ ఎవరో "థాట్ కంట్రోలర్ ' అని నిర్వచించాడు. ఆలోచనలను రేగ్యులేటు చేస్తుంది సిగరెట్టు. అవసరమైన విషయాల్లో ఆలోచనను అధికం చేస్తుంది. అనవసరపు విషయాల్లో ఆలోచన కలగ నివ్వదు, సిగరెట్టు ను అందుకే మీరు అలవాటు చేసుకోవాలి. క్రమ పద్దతిలో ఆలోచించడం నేర్చుకుంటారు." రాజగోపాలం కళ్ళల్లోని ఏదో అపూర్వ మైన అయస్కాంత శక్తి ఎదటి వాణ్ణి ఆకర్షించి స్నేహ త్మకంగా చేస్తుంది.
రవిచంద్ర మొహమాట పడి, "ఈ ఒక్కసారి క్షమించండి. నేను కాల్చలేను"-- అన్నాడు.
"దట్స్ గుడ్. బలవంతం చేయను లెండి. అన్నట్లు, పక్క స్టేషను దాటితే మనం తెలుగు గడ్డ దాటి మహా రాష్ట్ర ప్రాంతంలోకి అడుగు పెడతాం."
రవిచంద్ర కంగారుగా, "ఈ ట్రెయిను ఎక్కడికి వెళుతుంది?" అని అడిగి తన ప్రశ్నకు తానె సిగ్గు పడ్డాడు.
రాజగోపాలం సిగరెట్టు నోట్లోనే కాసేపు ఉండిపోయింది. "వండర్! ఇంతకీ మీరిక్కడికి వెళుతున్నారు?'
రవిచంద్ర మాట్లాడలేక పోయాడు . తలవంచుకున్నాడు.
"ఇది డిల్హీ జనతా. మీరిక్కడికి వెళ్ళాలి?"
నిస్సహాయుడిగా అతని వైపు చూసి, "ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేదు" అన్నాడు.
"వరల్డ్ ట్రీప్పు కైనా ప్రదేశాలు నిర్ణయించు కోవాలె. మీరు ఏమీ అనుకోకుండానే ఈట్రావేలింగ్?"
రవిచంద్ర గంబీరంగా మారిపోయాడు. రాజగోపాలం హాస్య ధోరణి కి కొంచెం నొచ్చుకొని, "నా బాధ నేను పడతాను లెండి. ఈ ట్రియిన్ డిల్లీ వెళ్ళాలంటే కనీసం రెండు రోజులన్నా పడుతుందిగా. ఈలోపున ఆలోచించు కోవచ్చు" అన్నాడు.
"మీరు తీవ్రంగా తీసుకున్నట్లుంది. అయితే సారీ. ఊరికే సరదాగా మాట్లాడాను. నిజం చెప్పండి. మీ రెక్కడికి వెళ్ళాలి?"
"నిజంగా....నేను నిర్ణయించు కోలేదు."
"ఇటువైపు ఎప్పుడన్నా వచ్చారా?"
"లేదు."
"మీరు ఏం చదువుకున్నారు?"
"........."
"చెప్పండి. తోటి ప్రయాణికుడు గా అడగడం లేదు. ఒక స్నేహితుడుగా అడుగుతున్నాను. మీరేదో ఆవేశంలో ఈ ట్రెయిన్ నేక్కినట్లు నా కనిపిస్తుంది."
"నేను ఎం.ఎ . చదువుకున్నాను."
"ప్రస్తుతం ఏం చేస్తున్నారు?"
"లెక్చరర్ గా పని చేస్తున్నాను."
"ఎందుకంత అకస్మాత్తుగా మీరు ఒంటరిగా బయలుదేరారో నాకేం బోధ పడడం లేదు. ఏవైనా గృహ విషయాల్లో......."
"క్షమించండి. కారణాలను అడగకండి. నేను ఘోరంగా మోసపోయాను. అక్కడుండి ఆ మోసాన్ని ఎల్లకాలమూ భరించే శక్తి లేదనిపించింది. దాన్ని మరిచి సుఖంగా గడపడానికి వీలు గలిగే చోటుకు -- అదెంత దూరమయినా సరే-- వెళ్లాలని పించింది. ఇలా బయలుదేరాను" రవి చంద్రకు గొంతు కొంచెం జీర పోయింది. రాజగోపాలాన్ని సూటిగా చూస్తూ చెప్పలేకపోయాడు.
రాజగోపాలం కొంచెం చలించి పోయాడు. ఒక్క క్షణం పాటు రవిచంద్ర ను చూశాడు. ఎర్రగా, బక్క పలచగా ఉన్నాడు. ఇంకా కుర్రతనం వదలలేదు. ఆ ముఖంలో. అందమైన ఆ ముఖం వాడిపోయి, విషాదపు రంగు పూసుకుంది. అనుభవం లేని ఆవేశం రూపంలో అతను! శాంతి కోసం అన్వేషిస్తూ పోయే అతను!
జాలిగా చూస్తూ, "కష్టాలు సహజం. అనుభవం నిబ్బరాన్ని, ఇస్తుంది. మీరు అనవసరంగా దిగులు పడకండి. చదువుకున్నారు. సుఖం లేకపోయినా ఆశాంతి కలగకుండా జీవించడానికి అవకాశాలున్నాయి" అన్నాడు.
"థాంక్స్" ఆ మాట రవిచంద్ర గుండె ల్లో నించి వచ్చింది.
రాజగోపాలం నెమ్మదిగా భుజం తట్టి, "నాలుగయింది. ఈ స్టేషనే ఆంధ్ర చివరి స్టేషను. అందుకని వెచ్చటి కాఫీ తో ఆంధ్రకు ఫేర్ వెల్ చెబుదాం" అన్నాడు చిరునవ్వు తో.

రాజగోపాలం టవల్, బ్రష్ , పేస్ట్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళిపోయాడు.
ప్రియం వద లేచి కూర్చున్నది. రవిచంద్ర అక్కడే ఉన్న ఏదో పత్రిక తీసుకొని అందులోకి తల దూర్చాడు.
ఆమె అతని వైపు యధాలాపంగా చూసింది. రవిచంద్ర దృష్టి పత్రిక లోనే ఉన్నా, ఆమె తనను చూస్తున్నట్లు పసిగట్టి, కొంచెం ఇబ్బందిగా సీటులో కదిలి తల అప్రయత్నంగా ఎత్తాడు.
"ఎక్కడికి వెళ్ళాలి మీరు?' ఆమె అడిగింది.
రవిచంద్ర ఏదో జవాబిడ్డామనుకున్నాడు. ఏమీ తోచలేదు. చిన్నగా ఏదో అన్నాడు.
ఆమెకు వినబడలేదు. సభ్యత కాదను కోవటం వల్ల తిరిగి అడగలేదు.
అతను తనను తాను రక్షించు కొనవలసిన పరిస్థితి ఏర్పాడిందనుకున్నాడు. ఆమె ఇంకేదన్నా అడిగే ముందే తానె ఆమెను గురించి అడిగితె సరి.
"మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?' అన్నాడు.
"హైద్రాబాదు."
"అక్కడ?"
"మా పుట్టిల్లు. వీరికి సెలవులు దొరికాయి. వీరి స్వగ్రామం విజయవాడ దగ్గిర చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్లాం. అక్కడి నించి హైదరాబాదు కు వచ్చాం.
"అయితే మీ నాన్నా, అమ్మా హైద్రాబాదు లోనే........"
"వాళ్ళు నా చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. "ఆమెలోని ప్రత్యేకత , ఆమె గొంతులోని మృదుత్వం మెల్లిగా, హాయిగా మాట్లాడుతుంది.
"మీ అన్నగారి పేరు?"
"రవీంద్ర."
రవీంద్ర పేరు వినగానే రవిచంద్ర ఆలోచనలో పడిపోయాడు. రవీంద్ర అనేమిత్రుడు అతనికి ఉన్నాడు. చదువుకునే రోజుల్లో అతను చాలా సన్నిహితంగా ఉండేవాడు.
"ఏ రవీంద్ర....? ఇంటి పేరు?...."
"వి....వనపర్తి."
క్షణ కాలం అతనిలో మెరుపు చూసింది ప్రియం వద.
"వనపర్తి రవీంద్ర.......వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆగండి. చెబుతాను. మీ ఇల్లు ఇస్లామియా బజారులో , ఏదో రెస్టారెంట్ పక్కన. ఆ రోజ రెస్టారెంటు పక్కనే డాబా!"
"అదే....అయితే మీరెవరో నాకు బాగా తెలుసు. మీ పేరు ప్రతిక్షణం మా అన్నయ్య పెదిమల మీదనే ఉంటుంది. రవిచంద్ర అనగానే ఇందాకనే అనుకున్నాను, ఆ పేరు చాలా తక్కువమందికి ఉంటుందని, మీరే మా అన్నయ్య స్నేహితులు ఎందుకు కాకూడదని!"
రవిచంద్ర ట్రెయిన్ లో మొదటి సారిగా నిండుగా నవ్వాడు.
"కానీ ఒకందుకు సందేహించాను. మీ పెళ్లి నిన్ననో, మొన్ననో జరిగి ఉండాలి. మా అన్నయ్య మేము అక్కడుండడం వల్ల మారేజీ కి రాలేదు. అలాంటప్పుడు ఇంత త్వరగా -- పెళ్లి అయిన రెండు రోజుల్లోనే ప్రయాణం పెట్టుకుంటారా? అని అనుకున్నాను."
ఆమె మాటలు అనుకోకుండానే అతని గాయాన్ని కేలికాయి. ఇంత త్వరగా బయలుదేరి రావడానికి సంకాయిషీ రాజగోపాలం మొహం కడుక్కుని రాకపోయి నట్లయితే రవిచంద్ర కు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడేది.
రాజగోపాలం టవల్ తో ముఖం తుడుచుకుంటూ రావడం తోనే ఆమెకు అన్నయ్య స్నేహితుడనే విషయం వేగిరం చెప్పాలనిపించింది. యాదృచ్చికంగా ఒక్కొక్కసారి అపరిచితులను కొనేవారు బాగా దగ్గిరవారావుతారు.
"వీరవరో మీకు తెలుసా?' కొంచెం విస్మయానందంతోనే అడిగింది. ఆశ్చర్యపడటం రాజగోపాలం వంతయింది. "వండర్, ట్రెయిన్ లో నాలుగు గంటల నించి ప్రయాణం చేసిన తరవాత తెలియకపోవడమేమిటి? అయినా నీకింకా కలత నిద్ర వదలనట్లుంది" అన్నాడు.
"అది కాదు . వీరు మా అన్నయ్య కు బెస్టు ఫ్రెండు. రవిచంద్ర. అని చెబుతుంటాడు. అప్పుడప్పుడు కధలు రాస్తుంటారని. మొన్న తప్పనిసరిగా వెళ్ళ వలసిన మారేజ్ మిస్ చేశానని చెప్పాడు. మనం వెడ్డింగ్ కార్డు కూడా చూశాం రవిచంద్ర ని. మీరేదో పేరు మీద కామెంటు చేశా......."
"స్టాప్. నాకు మెమొరీ రీసేల్సు అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. నీవు అయిలింగ్ చేయవలసిన అవసరం లేదు. రవిచంద్ర పేరు మీద అవ్వాళ నేను చేసిన కామెంటే -- సినిమాలలో లైబ్రరీ షాటు లాగా-- ఇవ్వాళ వీరు పేరు చెప్పిన మరు క్షణం లోనే ఉపయోగించేశాను. అందుకే పేరెక్కడో విన్నాను, విన్నాననుకుంటూనే ఉన్నాను. నీవు అద్భుతంగా డిటెక్టి చేసి ముసుగులో ఉన్నవారిని గుంజేశావు!" రాజగోపాలం ఫ్లాస్కు తీసి కాఫీ పోసుకుంటూ అన్నాడు. అతను మాట్లాడే టప్పుడు చాలా హుషారుగా ఉంటాడు. పెదిమిల మీదనే మాటలు దొర్లి పోతుంటాయి. కాలుతున్న సిగరెట్టు ఒక్క నిమిషం కూడా పెదిమల మధ్య ఉండకుండా ఉండడు. ఎడతెరిపి లేకుండా సిగరెట్టు కాల్చడం అతని ప్రత్యేకత.
"పెళ్లి చేసుకోగానే ఇంత త్వరగా ఎక్కడికి బయలుదేరారు ఇంతకీ?' ప్రియ ఏదో అడగబోయింది . రాజగోపాలం మధ్యలో అడ్డుపడుతూ , "వేగిరం ముఖం కడుక్కోండి. కాఫీ ఫేర్ వెల్ మరిచిపోయారా? ఊ, త్వరగా" అన్నాడు రవిచంద్ర లేచాడు.
"మీరు త్వరగా రాకపోతే కాఫీ మిగిల్చే పూచీ నాది కాదు" అన్నాడు నవ్వుకుంటూ. రవిచంద్ర వెళ్ళిపోయాడు.
"గమ్మత్తుగా ఉంది. ఈయన్ని గురించి తెగ చెబుతాడు అన్నయ్య, తెలివైన వాడని, అదని ఇదని." ప్రియంవద కు ఆశ్చర్యం వేసింది, ఈ యాదృచ్చికపు రవిచంద్ర పరిచయంతో.
"కాని పాపం, ఏదో పెద్ద ప్రమాదం లోనే ఇరుకున్నట్లుంది" అన్నాడు రాజగోపాలం ఆమె చేతి మీద చేయి వేస్తూ.
"ఏం, ఏం జరిగింది?' సహజోర్కంటతో అడిగింది.
"జీవితాన్ని గురించి తీవ్రంగా ఆలోచించే వాళ్ళు మనుషులుగా బతకలేరంటాను. లైఫ్ ను లైటుగా తీసుకోడం లోనే ఆ మిస్టరీ విడిపోతుంది."
"అతనికేం జరిగిందో చెప్పండి. మీ వ్యాఖ్యానాలు తరవాత."
"బాగానే ఉంది. అది నాకు తెలిస్తే గదా? మనదంతా ఊహా గానం. మనిషేప్పుడు పరధ్యానంగా ఉంటాడు? ఆలోచన వచ్చినప్పుడు. ఆలోచనేందుకు వస్తుంది? జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు, షాకు లాంటిది తిన్నప్పుడు! అప్పుదేమిటి? సింపిల్....ఆవేశం, ఆవేదన బానిసగా మారుస్తుంది మనిషిని.' ప్రశ్నలు తనంతట తాను వేసుకిని జవాబిచ్చుకుంటూ ఆమెకు విడమర్చి చెప్పబోయాడు.
ప్రియ భర్త వైపు చురచుర చూస్తూ, "మీరెప్పుడూ ఇంతే. సూటిగా ఏదీ చెప్పరు . నాకర్ధం కాలేదు" అంది.
ఆమె తలను రెండు చేతుల్లోకి తీసుకొని కాసేపు పరీక్షించినట్లు నటించి , "ఫుల్ ఆఫ్ బంక్ " అంటూ మెల్లిగా ఆమె బుగ్గ మీద పెదిమ లానించాడు.
"ముట్టుకోకండి బంక్" అంది ఆమె తప్పుకుంటూ.
"ఎబ్బే, ఆ కామెంటు అన్నిటికీ వర్తించదు, తల వరకే. ఇక్కడ లైఫ్ ఎసెన్స్ ను ప్రిసర్వ్ చేశాడు భగవంతుడు" అన్నాడు బుగ్గ మీద చితిక వేస్తూ.
ఆమె మనోహరంగా సిగ్గుపడి, అతన్ని మైకంతో చూసింది. అతనెప్పుడూ ఆమెకు కొత్తగా ఉంటాడు. అతని మాటలు కూడా అలాగే ఉంటాయి. ఆమె కింత వరకు అతని మాటలు విసుగని పించలేదు. 'నా భర్త ఈయన' అని అనుకోడం లో ఆమె హృదయం లో ఎందుకనో గర్వం పొంగులు పారుతుంది.
"అతనేదో షాక్ తిన్నాడు. ఇంట్లో చెప్పకుండా బయలుదేరినట్లుంది వ్యవహారం." నెమ్మదిగా అన్నాడు రాజగోపాలం కాస్సేపాగి.
"మీకెలా తెలుసు?"
"అతన్ని వాలకాన్ని బట్టి. గమ్మత్తేమిటంటే , ఎక్కడికి పోవాలో తేల్చుకోకుండానే ట్రెయిను ఎక్కేశాడు" అన్నాడు.
"పాపం , పెళ్లి రెండు మూడు రోజుల కిందనే జరిగిందను కుంటాను. అప్పుడే ఏమిటో ఈ విరక్తి?" ఆమె మాటలు అమాయకపు బాధను వ్యక్త పరిచాయి.
"స్త్రీ, డార్లింగ్, స్త్రీ! చూశావా అతగాడికి పెళ్లి అయిపొయింది. ఇల్లు దాటి అవతల పడ్డాడు. పెళ్లి కాక మునుపు హాయిగా స్నేహితులు, సినిమాలు కధలు. కాగానే నైరాశ్యం, విచారం, విరక్తి, ఆవేదన."
"ఉష్! వస్తున్నాడు. "ఓరకంటితో కంపార్టు మెంటు మూల వైపు చూస్తూ అంది. తన ధోరణి ఆపాడు గభాల్న.
రాజగోపాలం ఫ్లాస్కు లోంచి కాఫీ గ్లాసు లోకి వంచి రవిచంద్ర కిచ్చి, "త్రాగండి" అన్నాడు స్నేహపూర్వకంగా.
రావుచంద్ర గ్లాసు అందుకొని, "మరి మీరు?' అన్నాడు ప్రియంవద ను చూస్తూ.
"వారు తాగుతారు. మొదట సేవకుడు రుచి చూసిన తరవాత రాణిగారు సేవిస్తారు. తొందర పడకండి" అన్నాడు పరాచికంగా.
ఆమెకు భర్త ఏదన్నా అంటే నవ్వడం అలవాటయిపోయింది. ముఖం మీద లేతగా వెలుగుతున్న దరహాసంతో టవల్ తీసుకొని ముఖం కడుక్కోడానికి వెళ్ళిపోయింది.
