బొద్దు గా వుండేవాడు మొదటి నుంచీ పెద్ద పిల్లలిద్దరి మీద కన్న రఘు మీదనే ఎక్కువ ప్రేమగా ఉన్నట్లనిపించేది తనకి. సుమిత్ర పుట్టేసరికే ఆ ఇంటి పరిస్థితులన్నీ తారుమరయ్యేయి. విమల కి జరిగినంత ముద్దు సుమిత్ర కి జరగనే లేదు.
సుమిత్ర కి పదినెలల వయస్సు వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు భర్త విహీనఅయింది. కుటుంబ భారం మాధవరావు పైన పడింది. భర్త పోయిన చిరాకు, దుఃఖం అన్నీ కలిసి సుమిత్ర ని విసుక్కునేటట్లు చేసేవి.
సుమిత్ర కి ఒకళ్ళతో పనిలేదు. తనకి తనే ఏ మట్టి లోనో చెట్ల చాటునో , నీళ్ళ దగ్గరో ఆదుకుని ఆకలి అయినప్పుడు ఇంట్లోకి వచ్చేది. పెట్టిన ఆహారం గుట్టుగా తినేసి నిద్రపోయేది. కానీ రఘు అలా కాదు. తినడానికి నిద్రపోవడానికి అన్నింటికీ పేచీలే. అంత దుఃఖం లోనూ వాడిని బ్రతిమిలాడి అన్నం తినిపించేది తను. వాడు చాలా తెలివి గలవాడనీ, అదృష్టవంతుడనీ , పెద్ద చదువు -- చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడనీ, ఏదో గ్రుడ్డి నమ్మకం వుండేది తనకి మొదటి నుంచీ. జీవిత శేష భాగాన్ని చిన్న కొడుకు దగ్గరే గడపాలనే కల ఈనాటిది కాదు. ఇరవై ఏళ్ళుగా హృదయంలో దాగిన కల అది. ఈనాటికి కరిగిపోయింది. బాగా చదువుకున్న అందమైన యువతిని కోడలుగా తేవాలని, వాళ్ళ దగ్గర తానుండాలని ఎన్నో ఆశ లుండేవి. అవి అణగారి పోయాయి. ఈనాటికి ఆవేదన ఎలా చల్లారుతుంది? అది ఆరని జ్వాల.
మతాలూ, కులాలూ ఈనాటివి కాదు. ఆయా మతాలకూ, ఆయా కులాలకూ వుండే ఆచార వ్యవహారాలూ, నియమ నిష్టలు కూడా ఈనాటివి కాదు. వాటిని అతిక్రమించడం తాను సహించలేదు. తనలో ప్రవహిస్తున్న సనాతన హిందూ రక్తం, తన ఇంట్లో అన్యకులస్తూలు అడుగు పెట్టి తమలో ఒకరుగా కలిసి పోవడాన్ని అంగీకరించదు. సాంఘిక నియమాలను ఉల్లఘించడాన్ని సంతోషంగా సమర్ధించదు. అచారానికీ, అనురాగానికీ, మధ్య జరుగుతూన్న సమరంలో ఆచారమే నెగ్గింది. హృదయం శిల కావాలి. అంతే!
నవనాగారికంగా అలంకరించుకుని కారులో కాలేజీ కి వచ్చే కుముదిని మీద కూడా ఆవిడకి సదభిప్రాయం లేదు.
"ఇంత డబ్బు వుండీ హాయిగా పెళ్లి చేసుకోక ఈ చదువు ఎందుకు? ఈ షోకు లెందుకూ?' అంటూ వుండేది.
క్యాలెండర్లో నాలుగు కాగితాలు చిరిగి పోయాయి. దీపావళి వెళ్ళిపోయింది. చలి ప్రవేశించింది.
ఒకరోజు ఉదయమే మాధవరావు ని నిగ్గదీసింది అన్నపూర్ణమ్మ గారు.

"ఒరె! మాధవా! నాకిన్ని మందులు తెస్తున్నావు! సుమిత్ర ని చదివిస్తున్నావు . పిల్లలకీ, మీ ఆవిడకీ ఈ మధ్య బట్టలు కొన్నావు! ఈ డబ్బంతా ఎక్కడిది నీకు? ఇంత సంపాదిస్తూ చెల్లెలి పెళ్లి మాట తల పెట్ట వెందుకని? నాకివాళ ఏ సంగతీ చెప్పీ గానీ కదలకు' అంటూ మొండి కేసుకుని కూర్చుంది.
ఆవిడకీ మధ్య కాలంలో చాదస్తం ఎక్కువైందని అందరూ అంటూనే వున్నారు. ఉన్నట్లుండి తల్లి వేసిన ప్రశ్నకి తడుము కోకుండా సమాధానం చెప్పలేకపోయాడు మాధవరావు.
అతను జవాబు కోసం వెతికే సమయం లోనే అతని పెద్ద కొడుకు విశ్వనాధం రంగంలో ప్రవేశించి, "నా మాటంటే బామ్మకి నమ్మకం లేనే లేదు. చిన్నత్త కి బాబాయి డబ్బు పంపుతున్నాడని నిన్ననేగా బామ్మకి రుజువు చేశాను. చిన్నత్త అలమార్లో బాబాయి వ్రాసిన ఉత్తరాలూ, రశీదులు నాకు దొరికాయి కదా!' అనేశాడు.
వంట ఇంట్లో స్టౌ దగ్గర కూర్చుని కాఫీ కలుపుతూన ఇందుమతి కొడుకు వంక కోపంగా చూసి, "ఏయ్ విస్సూ, ఇలా రా ఓసారి ' అని పిలిచింది.
ఆ అబ్బాయి అదేమీ వినిపించుకోకుండా "బాబాయి ఎంత మంచివాడు, చక్కగా చిన్నత్త కి బోలెడు డబ్బు పంపుతాడు! నాకోసం డిక్షనరీ కూడా పంపిస్తానన్నాడూ!' అంటూ గంతులు పెట్టడం సాగించాడు.
టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని పెరట్లో పంపు దగ్గర శిలలా నిలబడి పోయింది సుమిత్ర.
తల్లి ఎదుట పడడానికి భయపడింది క్షణం.
"ముసలిదాన్ని చేసి అందరూ కలిసి నన్ను ఎడిపిసున్నారా! మీరందరూ ఒకటే-- నేనొక్కదాన్నే వేరు. మీవన్నీ మీ నాన్న గుణాలే-- ఈ కొంప కి సగం అనర్ధం అయన తెచ్చారు? మిగతా సగం మీరు తెచ్చారు -- నేనంత ఏడిస్తే ఏం లాభం! అంతా జరిగిపోయాక!' కళ్ళు తుడుచుకుంటూ, వొణికే కంఠం తో ఆయాసంతో అన్నది అన్నపూర్ణమ్మ గారు.
"ఊరుకో అమ్మా! నేను చెప్పేది సావధానంగా విను!' అన్నాడు మాధవరావు ఆవిడ ప్రక్కన కూర్చుంటూ.
"నువ్వేం చెప్పక్కర్లేదు నాయనా! నాకన్నీ తెలుసు! ఇల్లు అమ్మితే నీకు వుండడానికి కొంప వుండదని నువ్వు అమ్మ నియ్యవు -- కులంలో దాన్ని చేసుకుంటే అమ్మా, చెల్లెలూ వచ్చి తనింట్లో వుంటారేమో నని వాడీ పని చేసి నెలకి పాతికో పరకో పంపి చెయ్యి దులుపు కుంటున్నాడు వాడు! ఈ పిల్లకి ఆ డబ్బుతో చదువు కుంటే గాని నిద్రపట్టదు-- రేపొద్దున ఉద్యోగం చేసి ఇది కూడా ఎవర్నో చేసుకు పోతుంది. ఐన నువ్వూ నేనూ ఇక్కడే ఇలాగే వుండిపోదాం!' వెక్కిళ్ళు పెడుతోంది ఆవిడ.
"చూడమ్మా -- నీవోళ్ళు మంచిది కాదు -- ఊరికే ఆవేశపడకు-- అక్కకి పదిహేనేళ్ళ కి పెళ్లి చేసి పంపించావు-- ఏడుగురు పిల్లల్తో అదిప్పుడు ఎంత అవస్థ పడుతోందో నీకు తెలుసా! చాలీచాలని సంపాదనతో వాళ్ళు ఎలా వున్నారో ఊహించగలవా? ఈ రోజుల్లో నా వయస్సు పెళ్లి కింకా మించి పోయినట్లు అనుకోకూడదు -- కొంచెం ఆలోచించమ్మా!' తల్లి భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా, అనునయంగా అన్నది సుమిత్ర...
'రఘు మనకి పరాయి వాడా ఏమిటండీ! తల్లికీ, చెల్లెలి కీ అతనెంతో ప్రేమగా డబ్బు పంపుతున్నాడు. ఈరోజుల్లో ఎంత మందికి ఉంటున్నాయి అలాంటి ఆపేక్షలు. సుమిత్ర కి చదువుకోవాలని వుంది. చదువు కుంటోంది. ఆ అమ్మాయి చాలా తెలివి కలది. వివేకం లేని పని ఒక్కనాటికి చెయ్యదు. మీ పిల్లల మీద మీకే నమ్మకం లేకపోతె పరాయి వాళ్ళ కుంటుందా!' అన్నది ఇందుమతి కాఫీ గ్లాసు తెచ్చి అత్తగారి ప్రక్కన పెట్టి.
'కాఫీ తీసుకో అమ్మా -- అనవసరంగా బాధపడకు-- కాలానుగుణంగా ఆలోచించడం వివేకవంతుల లక్షణం. జీవితంలో అడుగడుగునా మన కిష్టమైన సంఘటనలే జరగవు-- సంతోషాన్నీ దుఖాన్నీ సమానంగా ఆహ్వానించడం నేర్చుకోవలసిన వయస్సు నీది' అన్నాడు మాధవరావు గ్లాసు తల్లి నోటి దగ్గర వుంచి.
రెండు నిమిషాలు మౌనంగా వుండి, గ్లాసు తీసుకుని తన మంచం దగ్గరికి నెమ్మదిగా వెళ్ళిపోయింది ఆవిడ, బరువైన హృదయంతో.
* * * *
'మీ అమ్మగారు చాలా బలహీనంగా వున్నారు. అసలు జబ్బెమిటి!" అన్నది కుముదిని ఓరోజు సుమిత్ర ఇంటికి వచ్చి నప్పుడు ఇద్దరూ కలిసి డాబా మీద కూర్చుని నోట్సు వ్రాసుకుంటూ వుండగా.
'అమ్మ జబ్బుని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి వినే ఓపిక నీకు వుంటే!' అని నవ్వింది సుమిత్ర.
'నువ్వు చాలా గంబీరమైన మనిషివి. అందుకే నువ్వంటే నాకు చాలా యిష్టం. నిన్ను గురించి ఎంత చెప్పినా నాకు వినాలనే వుంటుంది -- ' అన్నది కుముదిని మెచ్చుకుంటున్న కంఠంతో.
పడమటి ఆకాశంలో మారుతున్న రంగులని చూస్తూ.
"జీవితంలో కష్టాలూ, బాధలూ మనుష్యులకి అనేక పాఠాలు చెప్తాయి-- వీటిల్లో నుంచి వివేకాన్ని సంతరించు కోగల వాళ్ళూ వుంటారు, డీలా పడిపోయి మరింత క్రుంగి పోయే వాళ్ళూ వుంటారు. వజ్రానికి సాన పడితే మెరుపు పెరిగినట్లు బాధల వలన వ్యక్తిత్వం మరింత గట్టి పడుతుందనుకుంటాను. నా జీవితం అలాంటిది కుముదిని--' అన్నది సుమిత్ర.
'నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడతావు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నావో! ఇంతకీ అమ్మగారి సంగతి చెప్పావు కాదు--'
"ఎస్సెల్సీ ప్యాసయినాక రెండేళ్ళు ఇంట్లో వుండి పోయాను. అప్పుడు వీలైనన్ని పుస్తకాలు చదివాను-- అదృష్టవశాత్తు అవి మంచి పుస్తకాలు -- సరే అమ్మ సంగతి అడిగావు కదూ ! చెప్తాను విను-"
'చెప్పు -'
'అనగా అనగా నాకో అన్నయ్య -- ఎం. ఎస్సీ చదివాడు. ప్రస్తుతం వైజాగ్ లో మంచి ఉద్యోగంలో వున్నాడు. వాడికి పెళ్లి చేసి, వచ్చే కట్నంతో నాకూ చేసెయ్యాలని అమ్మ అనుకుంది. కానీ అన్నయ్య రాధ అనే అమ్మాయిని చేసేసుకున్నాడు. కట్నం కొరత వలన నా పెళ్లి ఆగిపోయింది. నన్ను చదువుకోమని అన్నయ్య డబ్బు పంపుతున్నాడు. అది అమ్మ కిష్టం లేదు. కోడలు కులం వేరని మరొక బాధ. క్లుప్తంగా యిది కధ. యివాల్టి కి యిది చాలు. అమ్మకి బ్లడ్ ప్రెషర్ వుంది. పెరాలిసిస్ వచ్చే ప్రమాదం వుందని డాక్టర్ అన్నాడు-- ఆవిడ ఇంకెలా వుంటుంది మరి!' అన్నది సుమిత్ర బాధని దాచుకోడాని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ......
'ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆమె నింత బాధపెట్టి చదువుకోక పోతేనేం? అని-- కట్నం తక్కువ యిచ్చి ఎవరో ఒకర్ని పెళ్ళాడి అమ్మని సుఖ పెడదామా అనిపిస్తుంది. కానీ ఆ ఊహకి నేను చాలా భయపడుతున్నాను కుముదినీ. అంత త్యాగం నేను చెయ్యలేకుండా వున్నాను. అమ్మ బాధ చూడలేకుండా వున్నాను-- ఒక్కొక్కరోజు అమ్మ నిద్రపట్టక చాలా బాధపడుతుంటుంది . ఎంత బ్రతిమాలినా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోదు ' కావాలనే నన్నలా శిక్షిస్తుందేమో తెలీదు -- అన్నది సుమిత్ర మళ్ళీ.
