Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 3


    ఆనాడు కరణం గారి చుట్టమెలా గ్రహించాడో గానీ ఈ వేళ రాఘవరెడ్డి గారికి చేయెత్తి నమస్కరించాలన్నంత గొప్పగా కనిపోస్తుందా వ్యాఖ్యానం. అలాంటి రాఘవరెడ్డికి  కూడా కష్టాలు కల్పించి తమాషా చూడాలనే కొంటె కోర్కె విధి ఆపుకోలేక పోయింది. ఒకనాటి ఉదయాన తను పుస్తకం , పలకా ఉన్న సంచీ భుజాన వేసుకుని రాఘవరెడ్డి గారి ఇంటికి పరుగెత్తాడు. ఇల్లంతా ఇంతకూ ముందెన్నడూ లేని పద్దతిలో ఉంది. గోదాదేవి ని పిలవటానికి సర్వం పెకిలి రాలేదు తనకు. పరిస్థితి ఏమిటో ఊహించే శక్తి లేదు. అక్కడి నుంచీ వెళ్ళటానికి కూడా ఎందుకనో కాళ్ళాడలేదు.
    'నా మాట విను. ఏ స్టేషన్ లోనో , బస్సు దగ్గర్నో కనపడక పోదు. ఆ మాధవగాణ్ణి కాళ్ళూ, చేతులూ కట్టి...' ఆ మాట లంటున్నది అంకయ్య. ఆయన పక్కన కూర్చున్న తన తండ్రి!
    రాఘవరెడ్డి తన తండ్రి ముఖం కేసి ఒక్క క్షణం చూసి, లేచి , వద్దని తల ఊపుతూ, అందర్నీ వెళ్లి పోమ్మన్నట్టు చెయ్యి ఊపాడు.
    మాధవరెడ్డి రాఘవరెడ్డి కేదో తమ్ముడి వరసైన దూరపు బంధువట. దిక్కూ మొక్కూ లేనివాణ్ణి తెచ్చి పాలేళ్ళ కు పనులు పురమాయించడం లోనూ, పొలం పనులు చూసుకోవడం లోనూ నియమించాడు. రాఘరేడ్డి దయామయ హృదయం అనే సారవంతమైన భూమిలో వేరూనిన ఆ విష వృక్షం పెరిగి పెద్దదై, కొమ్మలు జాపి ఆ కుటుంబం మీద తన పాపపు నీడ ప్రదర్శించేంత ప్రభావం సంపాదించింది.
    ఆ రాత్రి వెన్నెల పిండార బోసినట్లుంది. నడిమింటి గౌరయ్య ఇంటి ముందు ఏదో పెద్దగా, కేకలూ, ఏడ్పులూ వినిపించగానే అంతా పరుగెత్తు కెళ్ళారు. తనూ వెళ్లి గోడ కాన్చిన బండెక్కి నిలబడి చూస్తున్నాడు. గౌరయ్య చేతిలో కర్ర లాక్కుంటున్నారు కొందరు. గౌరయ్య భార్య మునెమ్మ తల పగిలి, రక్తం కారుతూ వెన్నెల్లో భయంకరంగా కనిపిస్తుంది. మునెమ్మ తమ్ముళ్ళు ముగ్గురూ గౌరయ్య ను తన్నడానికి కొచ్చారు. ఆ ముగ్గుర్నీ పదిమంది కలిసి పట్టుకోవడం లో పెద్ద గలాభా అయింది. 'పెళ్ళాన్నెందుకని తల పగలగొట్టావని?' గోపాలయ్య అడిగాడు. చూస్తున్న వారికి ఆ వింత చూడ్డమే ప్రధానంగా కనిపిస్తుంది కానీ, అందుకు కారణం ముఖ్యమైందని అనిపించనే లేదు. గౌరయ్య రొప్పుతూ పెద్ద బుసతో అంటున్నాడు. 'నా పెళ్ళాం సత్తేయ్యతో ఉంది. వాళ్ళిద్దరూ ఒంటిగా మాట్లాడుకుంటుంటే నా కళ్ళార చూశాను.కొందరు నవ్వారు. 'రాఘవరెడ్డి దగ్గరకు పోదాం...' మునెమ్మ తమ్ముడు.
    'తన పెళ్ళామే లేచి దేశాలంట పోయింది . రాఘవరెడ్డి నాకు సెప్పేదేంది?' గౌరయ్య దర్పంగా, మోటుగా అరిచాడు. వెంటనే ఒక మూలనించీ 'రాఘవరెడ్డి ' అనే మాటా గాలిలా చుట్టుముట్టింది. రాఘవరెడ్డి దుప్పటి కప్పుకుని నడిచి వస్తున్నాడు. నిట్టుర్పు వదలటానికి కూడా ధైర్యం లేనట్లు అంతా స్తభ్డులై దారి వదిలారు. ఎవ్వరి వైపు చూడకుండా ఒక్కొక్క అడుగే ముందుకు కేస్తూ వెళ్ళిపోతున్న రాఘవరెడ్డి నీడ, వెనకాల చీకటి కొండలా కనిపించింది. మరునాడు ఉదయాన తండ్రి కన్నీళ్లు ఒత్తుకుంటూ చూశాడు.
    'ఈ ఊరు రాఘవరెడ్డి ని పోగొట్టు కుంది....' అన్న మాట విన్నాడు.
    
                                            *    *    *    *
    మెయిలు వచ్చి పెద్ద నిట్టుర్పు తో ఆగింది. నిద్రపోతున్నట్లున్న ఆ చిన్న స్టేషన్ మేలుకుంది. 'అరె! వాసవీ! నువ్వొచ్చినావా?' అంటూ, 'ఈమె గోదాదేవి!' అన్నాడనంతయ్య. 'నమస్కారం....'
    'నమస్తే' అందామె. నీలం పువ్వులున్న పసుపు పచ్చని చీరెతో, కొంగు తల మీదుగా కప్పుకుని ఉంది గోదాదేవి.
    'వీడు....'
    'వాసవి....' అంది గోదాదేవి.
    'ఎట్లా కనుక్కున్నావ్?'
    'మీరే చెప్పారుగా ఇప్పుడు....'
    'నేనింకా చెప్పందే...'
    'అరె! వాసవీ! నువ్వోచ్చావా? అంటూ' అన్నాడు వాసవి.
    'ఓహ్...అదా...పదండి మరి.'
    'కూలిని పిలవండి.'
    'అమ్మాయి పెట్టె ఉందక్కడ....'
    వాసవి గబగబా ఎక్కాడు. ఒక పెద్ద సూట్ కేస్ చూపిస్తూ 'ఇదేనా!' అన్నాడు.
    'అదే! చాలా బరువుంది.'
    వాసవి కుడి చేత్తో పట్టుకుని దిగి, 'రండి' అంటూ బండి వైపు బయలుదేరాడు.
    'పదమ్మా ' అన్నాడనంతయ్య . రేణిగుంటలో కూలివాడు నరాలు తెగిపోయేటట్లు , కండరాలు ఉబ్బించి, పళ్ళు బిగించుకుని సూట్ కేస్ ఎత్తి పై బెర్తు మీదుంచడం జ్ఞప్తి కొస్తుంది. నిటారుగా ఒంటిచేత్తో అందుకుని చకచకా నడుస్తున్న వాసవి ని చూస్తుంటే!
    అయినా , ఇప్పుడే పరిచయమైన అతను తన సామాను మోస్తుంటే , తను వెనకాల ఊరక వెళ్లడం బాగుండలేదు. 'ఆ దిలా తెండి! నే తెస్తాను...' అంది.
    వాసవి వెనక్కి తిరిగి కొంచెంగా నవ్వాడు. 'మీరు నన్నవమానిస్తున్నారు...'
    'అబ్బే!'
    'చాలా బరువుందని మీరే చెప్పారు. ఇప్పుడు మీచేతికివ్వమంటున్నారు!'
    'అయితే, మగవాళ్ళ నిలాగే గౌరవించాలంటారు?'
    "ఆహా....ముఖ్యంగా చాలా బరువు మోసేటప్పుడు.' ఇద్దరూ తేలిగ్గా నవ్వారు.
    వాళ్లను చూస్తూనే పడుకున్న కోడెలు లేచి నిలుచున్నాయి. వాసవి సూట్ కేస్ బండిలో పెట్టి వెనుదిరిగి చూశాడు. తండ్రి పదడుగుల దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
    గోదాదేవి కోడెల వేపూ, బండి వేపూ చూస్తుంది.
    'మీరిక్కడ కాఫీ తీసుకుంటే బావుంటుందేమో?'
    'ఎక్కడ?'
    'అదిగో! అక్కడ.'
    అటువేపు చూసింది.
    నల్లగా పొగచూరిన గోడలతో కనిపించే ఆ పెంకుటింట్లో గడ్డం పెంచుకున్న తిరుపతి వెంకన్న భక్తుడు టేబిలు మీది డబ్బులేరుకుంటూ చీకటి గుహలో సివంగి లా గున్నాడు. గుమ్మం ముందు వైతరణి ప్రవహిస్తుంది. ఆ వైతరణి దాటటానికి ఒకే ఒక బండ రాతితో బ్రిడ్జి నిర్మించారు. వీధి వైపున గోడకు , ముఖాన పేడ కొట్టబడిన సినిమా పోస్టర్లు 'నేడే చూడండి!' అంటూ ఆహ్వానిస్తున్నాయి.
    'ఉహూ---ఆ స్వర్గం లోకి ఈ శరీరంతో నే వెళ్ళటం కష్టం.'
    వాసవి నవ్వుతూ నోగల్లో కెక్కాడు. అనంతయ్య వచ్చి వాసవి దగ్గరగా కూర్చున్నాడు.
    'జాగ్రత్తగా ఎక్కమ్మా....'
    వాసవి పగ్గాలేనుకునేసరికి కోడెలు ఠీవిగా తల ఎత్తాయి. గోదాదేవి సులభంగా ఎక్కేసింది. 'తొందరగా పోనీ, అమ్మాయి కాఫీ గూడా తీసికోలేదు.'
    బండి కదిలింది.
    'ఎవరాయన?' అన్నాడు వాసవి.
    'ఆయనా -- నిర్జీవి సూరన్న. రాళ్ళగనుంది కళ్ళం లో సత్రం కట్టిద్డామనుకున్నాముగా....'నీ కొడుకా?' అన్నాడు. 'ఔ ' నన్నాను. ఏం చదివాడని అడిగాడు...'
    గోదాదేవి తరవాత జవాబు కోసం చూస్తుంది. సంతాన్ని గురించి గొప్పలు చెప్పుకునే కోవలో అనంతయ్య చేరకపోయినా, ఆసలు వాసవి చదివే ఉంటె ఎప్పుడో ఓసారి అ ప్రసక్తి తప్పక వచ్చేదే! దానికి తోడుగా వాసవి రైతు యువకుడుగా సాక్షాత్కరించడం చేత, చదువుకోలేదనే అనుకుంది. అయితే, వాసవి మాటలు విన్న తరవాత మళ్ళీ అనుమాన మోస్తుంది. ఆ అనుమానం తనదక్కుండానే తీరిపోతుంది.
    'ఏం చదువుకోలేదన్నాను.' అందుకే బండి తోలుతుంట.' అన్నాడు.
    వాసవి నవ్వాడు. వింటుంటే ఆ పెద్ద మనిషి అభిప్రాయానికి నవ్వొస్తుంది. చదువుకుంటే మాత్రం వ్యవసాయం చేసుకోవటం, రైతులా బ్రతకటం నిషిద్దమా? పిచ్చిగాకపోతే అనిపిస్తుంది. అయితే, ఆ పెద్ద మనిషికి, తనకు ఏం భేదం లేదు . మొదట తనకూ అలాంటి అభిప్రాయమే కలిగింది. మన నమ్మకాలు హేతువాదంతో తర్కిస్తే చాలావరకూ హాస్యాస్పదంగా ఉంటాయని పిస్తుంది.
    బండి రోడ్డు దిగి పొలాల దారిలో నడుస్తుంది. గోదాదేవి కళ్ళు విచ్చుకుని చూస్తుంది.
    ఒక్కసారిగా మనస్సు తూలిపోయేట్లు కమ్ముకున్న పైరు గాలి! జొన్న కర్ర మీద కూర్చుని గాలికి ఉయ్యాలలూగుతూ , మూరెడు తోకతో , తలమీద కచ్చుతో ఉన్న ఆ నల్లని పిట్ట పేరేమిటో? ఖంజరీట మంటే అదేనా? అల్లసాని పెద్దన చీకటి తో పోల్చినది దాన్నేనా? ఓహ్, ఎంత అద్బుతంగా ఉంది!
    'కవిసె మరియును కాకోల కాలకంఠ, కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట' అంటూ ఆఖరి స్థాయిగా ఎంత మంచి ఉపమాన మెన్ను కున్నాడు!
    బుగ్గల బూరెలా కంఠన్ని పూరించి, జలతరంగణి మీటినట్లు కువకువలాడే సన్నని పిట్ట నెమంటారో? ఈ ప్రపంచానికి అపరిచితురాలైన తనకు కూడా ఆయాచితంగా ఎంత ఆనందం పంచుతుందీ ప్రకృతి మాత! ఆమెకు అంతకు క్రితమున్న అలసట ఎగిరిపోయింది.  అమృతం సేవించినట్లయింది. అనంతయ్య , వాసవి ఏవో పైర్ల విషయం మాట్లాడుకుంటున్నారు. ఊరు అరమైలు దూరంలో కనిపిస్తుంది. పెద్ద, పెద్ద చెట్ల మధ్య కొత్తగా సున్నం కొట్టిన ఇల్లు, పక్కనే పడిపోయిన మొండి గోడ , మరో పళ్ళ చెట్ల సందుల్లో నల్లని బోద కొట్టం , దాని పక్కగా పెద్ద గడ్డి వామి-- మంచు తెర తీసి, ప్రదర్శిస్తున్న తైలవర్ణ చిత్రంలా ఉంది! బండి ముందుగా ఒక ముసలామె కళ్ళ మీదుగా చేయి ఉంచుకుని చూస్తుంది. పక్కనే గడ్డి మోపుంది.
    'నాయనా! బండి ఎవుర్ది?' ఆయాసంతో రొప్పుతుంది.
    'ఏం, మంగమ్మా! నేను అనంతయ్య ను....' చెవుడేమో గట్టిగా అన్నాడు.
    "అయ్యగారా! సోమీ , ముసలి ముండను , గడ్డి మోపు బరువై ఇక్కడ పారేసినా. బండ్లో ఏసుకుంటే ఇంటికాడ దిగేసుకుంటా...'
    'బండిలో స్థలం లేదు, మా అమ్మాయి ఉంది. నువ్విక్కడే ఉండు, నీ కోడలితో చెప్పి పంపుతాను.'
    'సరే! అట్టనే, సామీ , ఇక్కడ్నే కూలబడుంటా....'
    గోదాదేవి కొంచెం ముందుకి జరిగి అంది: 'ఇక్కడ వేసుకోవచ్చుగా....'
    ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాసవి బండి ఆపాడు. ముసల్ది గడ్డి మోపేత్తబోయింది కానీ, కదల్లేదు. వాసవి దిగి , మోపెత్తి బండ్లో వేశాడు. ముసల్ది నొచ్చుకుంటూ , తనను తాను తిట్టుకొంటుంది. 'నువ్వూ ఎక్కు....'
    ఎక్కలేక పోయింది. వంగిపోయిన నడుము ముసల్దాని కోరికను నిరాకరించింది. వాసవి నవ్వుతూ, ఎత్తి బండిలో పెట్టాడు. గోదాదేవి ఆశ్చర్యంతో ఓరగా అనంతయ్య కేసి చూసింది.
    ఆమె ఆశ్చర్యాన్ని కనిపెట్టినట్లు అనంతయ్య మందహాసం చేశాడు. ముసల్ది ఏడుస్తూన్నట్లుగా గొణుగుతుంది. 'ధరమతండ్రులు , ధరమ పెభువులు! గోవు కడుపున గోవు పుట్టాది గానీ, కొండసిల్వ పుట్తాదా?' ముఖం ముడతలు పడి, పళ్ళూడి , నడుం వంగిన ఈ ముసలి ఇంత గడ్డి కోయటమేమిటి! ఎత్తుకు పోవడ మేమిటి?
    "మంగమ్మా! ఈ రోజు నీ కోడ లేదురు రాలేదేం!' అన్నాడనంతయ్య.
    'కోడలా! అదెందు కొత్తుంది? అది రాసోరి పిల్ల....'
    వాసవి నవ్వుతూ అన్నాడు: 'మంగమ్మా! అబద్దాలేందుకు చెబుతావు! నాగమ్మ రావడం రోజూ నే చూడలేదూ?'
    'ఆ... వత్తుంది, ఏటి కేదురీదినట్టు.దొంగలంజ.'
    ఉలికిపడింది గోదాదేవి. ఒక క్షణం ముందు మానవ హృదయంలోని ఉత్తమమైన 'కృతజ్ఞత' అనే గుణంతో కరిగి అపూర్వంగా కనిపించిన స్త్రీ , కోడలు విషయంలో కరుడు గట్టిన 'కసి' గా ఎంత అసహ్యంగా మారిపోయింది?
    "అయితే , ఇంత మోపు ముసలిదానవు నువ్వే మోసు కెళుతున్నావా?' అనంతయ్య.
    'అదీ ఊరు ముందు కెదురోత్తాది. ఎవరన్నా ఎత్తి నెత్తిన బెడితే ఎత్తుకపోతా. ఇయ్యాల సద్ది లేదు. పరగడుపు నొచ్చినా, పాణం కడట్టింది. కండ్ల కు మబ్బు గమ్మి కింద పడేసినా' కండరాలు కరిగి, ఎముక లరిగి, రక్త మోడిన ఈ కళేబరం ఎవరైనా ఎత్తి నెత్తి నేస్తే ఎంత భారమైన మోస్తుంది. ఎంత చిత్రం! ఇది వాళ్ల శరీర శక్తి కాదు. ఇంకేదో జీవనమో, జీవన ధర్మమో వీళ్ళ కా శక్తి నిస్తుంది.
    'సరేగాని, మంగమ్మా! నిన్నేత్తి బండ్లో కూచోబెట్టినందుకు నా కేమిస్తావ్?' అన్నాడు వాసవి.
    'ఏమియ్యాలి , సామి! నా సెర్మం వొలిచియ్యనా?'  
    'నీ సేర్మం ఎముకల కుంటుకు పోయింది, ఊడి రాదు గానీ....'
    ముసల్ది చిదానందంగా నవ్వింది.
    'నీ ఒళ్లో పెసరగాయలు నాకూ సగమియ్యి.'
    'అయ్యో! ఎర్రిసామీ! పెసరగాయలకేం బంగారా!మనమరాలు ముండకు నాలుక్కాయలిత్తె సాలు, ఇంటి కెళ్ళేసరికి, తరిపి దూడమాదిరి తగులుకుంటాది...'
    'సరస్వతి తెమ్మంది కదూ?' అన్నాడు అనంతయ్య.
    వాసవి నవ్వుతూ తల ఊపాడు.
    బండి ఊళ్ళో కొచ్చేసింది. మంగమ్మ ఇంటి ముందాగింది . కొట్టాం లో నుంచీ మంగమ్మ కోడలు గోదాదేవి కేసి కొత్తగా చూస్తూ, అత్తను దించుకుని గడ్డి మోపెత్తుకుంది.
    మంగమ్మ కేకేస్తుంది. 'నాగమ్మ! భద్దర'మమ్మా! బరువు గుంది! నిండు మనిషివి....' ఆ స్వరం నిజంగానే వాత్సల్యంతో వణికి పోతుంది. ఇంతకూ ముందు కోడల్ని అంత అసహ్యంగా మాట్లాడింది ఈమేనా? అని ఆశ్చర్యం కలుగుతుంది గోదాదేవికి.
    'సిన్న సామీ! పెసరగాయ లక్కడ్నే పెట్టినా, కింద బడి పోతాయేమో, తువ్వాల్లో కట్టుకో!' నిలబడి కేకేస్తూనే ఉంది మంగమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS