Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 3

                                    

                                       3

    "ఏవిఁరా! ఇంతాలస్యం?" - అడిగింది తలుపు తోసుకుని లోపల అడుగుపెట్టే సరికి జానకమ్మ.
    "లేదు పిన్నీ! స్నేహితులు వచ్చేరు; స్టేషను కెళ్ళేను." పిన్ని తనకోసరం కాచుకుని కూచున్నందుకు నొచ్చుకున్నాడు భాస్కరం.
    "నువ్వు భోంచేయకపోయావా?" అన్నాడు.
    జానకమ్మకి ముఫ్ఫైఐదు, నలభై మధ్య ఉంటుంది వయసు. చక్కని తీర్చిదిద్దిన ముఖం తీరు ఆమెది. అంత వయసు, ఆమెకున్న అవయవ సౌష్టవంనించి అగుపించదు.
    "నాన్నగారు భోజనం చేశారా?" కాళ్ళు చేతులు తుడుచుకుని నట్టింట అడుగుపెడుతూ అడిగేడు.
    "మెడమీద గదిలో పడుకున్నారు......అదో వసంత మాత్రం తెలిసివుంది..... అన్నయ్యొస్తే లేపమంటూ కుర్చీలో కునుకుతూనూ ....." జానకమ్మగారు వడ్డనకుపక్రమించింది.
    "మిగతా పిల్లలు?" భాస్కరం పీటమీద కూచున్నాడు.
    "రావుఁడికి ఒకటే దగ్గు. ... దగి దగ్గి, మెడమీద వాళ్ళ నాన్నగారి దగ్గర పడున్నాడు. సరళ సాయంత్రమే కడుపునొప్పని - అన్నం వద్దని పడుకుంది." - చెబుతూనే ఆమె నెయ్యి వడ్డించింది.
    భాస్కరం, పిన్ని తను ఆలస్యం అయిన సంగతి మరిచిపోయింది లెమ్మని బంగాళా దుంపల 'మసాలా కూర' రుచిలో పడిపోయేడు.
    జానికమ్మగారు మరింత కూర వడ్డించింది. ఆమె కనలేదన్న మాటేగాని భాస్కరాన్ని వాడి ఐదో ఏట ఎత్తుకుంది. అంతే; ఆ క్షణంనించి వాడే ఆమెకి పెద్ద కొడుకయ్యేడు.
    ఆమెకి తర్వాత వసంత, సరళ, రామం-ముగ్గురు కలిగినా, భాస్కరం మాత్రం "భాస"డిగా ఆమె మాతృ-హృదయంలో ఉండిపోయేడు.
    "వసంత ని లేపకపోతే ఆనక పేచీ ...... ఉండు" అని జానకమ్మగారు చారు పోసి, లేచి వెళ్ళింది.
    అంతలో డాబా అంచునించి సుబ్బారావుగారు కేకేసేరు.
    "పెద్దవాడొచ్చాడా?" ని. ఆయన కంఠంలో ఏభయ్యో పడి వినిపించింది.
    "ఆఁ ఆఁ? మీ కేమేనా కావాలా?" నట్టింటి నానుకుని ఉన్న గదిలోకి వెడుతూనే వాకిట్లోకి వచ్చి అడిగింది భర్తని.
    "ఆఫీసు-గది తాళం వేశానో లేదో చూడు"-
    "అలాగే..... అమ్మాయ్ వసంతా!..... భాసడొచ్చేడు"-
    జానికమ్మగారు భర్తకి సమాధానం చెప్పి, కూతురికి మేలుకొలుపు పాడి, నట్టింట ప్రవేశించింది.
    భాస్కరం అప్పటికే పెరుగ్గిన్నెను ఎడంచేత్తో అందుకుందికి పీటమీద కూచునే సర్కసు చేస్తున్నాడు.
    "అన్నయ్యా! నాకు చేసిన ప్రామిస్ మరిచి పోయావ్ కదూ!" అంటూ వసంత వచ్చింది.
    వసంతకి పదిహేనుఏళ్ళుంటాయి. పచ్చని ఛాయ. నొక్కునొక్కుల వొత్తు జుట్టు. యవ్వనం లావణ్యం ఆమె ప్రతి అవయవంలోనూ తొంగి చూస్తూంటాయి. చెంపకి చారెడేసి కళ్ళూ; వాటికి కాటుక పెట్టుకుంది. సాదారణమైన లంగా, వోణీ వేసుకుంది. నవ్వితే బుగ్గలు సొట్టలు పడతాయి. మొహం గుండ్రంగా పూర్ణచంద్రుడిలా ఉందేమో, కొంచెం ఏపుగా ఉన్న పొడుగుకంటే పొట్టి గానే కనిపిస్తుంది.
    "ఏవిఁటీ? లేచి పోయిన శవం మూడో భాగం కదూ! అమ్మాయ్! నువ్వా వెధవ్ పుస్తకాలు చధవడం మానేయాలి....." వసంత పశ్నకి తెచ్చి కోలు కోపంతో అన్నాడు భాస్కరం.
    "ఇదొక్కటి పూర్తిచేస్తే కాని మనసుండదన్నాయ్! తర్వాత మానేస్తాగా....." గునిసింది వసంత.
    "సర్లే! మాట ఇయ్యి! నిక్షేపంలాంటి నవలలుండగా ఈ డిటెక్టివ్ సాహిత్యం ఎందుకేమ్..." భోజనం ముగించి, పెరుగు-చెయ్యి ఆఖరిసారి నాక్కున్నాడు భాస్కరం.
    "అది సరే..... ఏ పుస్తకాలేనా ఇదింకెన్నాళ్ళు చదవాలి గనుక;.... దీనికా మూడు ముళ్ళూ ఈ వైశాఖంలో వేయించేద్దా మనుకుంటున్నాం గదా..." పాల గిన్నె ఉట్టిమీద పెడుతూ కొడుకు నుద్దేశించి అన్నది జానకమ్మగారు.
    "ఔనౌను..... అప్పుడు ఈ పిల్ల-మొగుడు గారు; "వంట వండుటా, వొడియాలు పెట్టుటా" "పిల్లలూ- పెంపకం" ఇత్యాదులు కొనమంటాడు...." కొంటెగా, ముసిముసిగా నవ్వేడు భాస్కరం.
    "పో అన్నయ్యా! నే పెళ్ళే చేసుకోను...."బుగ్గలు కందిపోగా సిగ్గు నభినయిస్తూ అటు తిరిగి తల వాల్చుకుంది వసంత.
    "సరి! సరి! మరేం చేస్తావ్?"
    భాస్కరం - మాటలకి ఇటు తిరిగి, వసంత ఎంగిలి తియ్యడానికి ఉపక్రమిస్తూ "ఉద్యోగం చేస్తా"నంది రహస్యంగా అమ్మకి వినిపించకుండా అన్నయ్య వినేట్లు.
    "పిన్నీ! చూసేవా ఇదేమంటూందో....."
    "ఏమంటూందేమ్?" జానకమ్మగా రుత్త ఆందోళన మనిషి. "ఆ ఇంతా లేచి పోతానంటుందేమ్ వాళ్ళ వేలు-విడిచిన మేనత్త; వారి పింతల్లి కూతురు జయమ్మలాగ" అన్నది ఆందోళనను దాచ ప్రయత్నిస్తూ.
    "దాన్నే అడుగు" అంటూ నవ్వుతూ భాస్కరం తన గదిలోకి నడిచేడు.
    "ఒరేవ్! 'భాసా' వొక్కసాడి ఇంద" అని వెనక్కి కేకేసింది జానకమ్మగారు.
    'జయమ్మ' అన్నపేరు విన్నదేనే, అనుకుంటూ వెనక్కి వచ్చి వొక్క పాడి అందుకుంటూ "ఈ జయమ్మ ఎవరమ్మా"న్నాడు.
    "చెబితినిగా; సామర్లకోటలో మీ నాన్నగారి చుట్టాల సంగతిలే ఇది...... ఈయనగారికి వరసకి చెల్లెలే ఆమె..... పదహారో యేట రెండోపెళ్ళి వాడితో లేచిపోయిందిట...."- అని జానకమ్మగారు.... మాట మార్చింది: "అయితే భాసా! రాఘవేంద్రరావుగారి సమ్మంధం సంగతేమిటి చెబుతావురా" అన్నది.
    అంతలో వసంత మేడమీదికి పోతున్నానం"ది.
    తర్వాత తల్లీ, కొడుకూ గదిలో చాలాసేపు "రాఘవేందర్రావుగారి ముకుందానికి వసంతనిచ్చే విషయం" మాటాడుకున్నారు.
    భాస్కరం జానకమ్మగారి మాట కెదురు చెప్పడం కాని; జానకమ్మ భాస్కరాన్ని కాదని ఆ ఇంట ఒక పని చెయ్యడం గాని ఉండదు. 'పిన్నీ' అనడం మినహా యిస్తే, ఆ ఇద్దరిమధ్యా తల్లీ బిడ్డల కన్నా మించిన మమతే ఉన్నది. కాని ఇప్పుడు "అమ్మా" అని పిలవడం తన చిన్నప్పట్నించి తనకు తల్లిని మించిన ఆదరాన్నీ, ప్రేమనీ ఇచ్చిన పిన్నిని అవమానించడమే....... 'పిన్నీ' అనకుండా తను బతకలేడు..... అది భాస్కరం నిర్ణయం.
    ఆ మాటకొస్తే జ్ఞాపకంగా పిలిస్తేనే 'అమ్మా' అంటారు గాని జానకమ్మ కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆమెను 'పిన్నీ' అనే పిలుస్తారు.
    
                                      4

    సుబ్బారావుగారికి క్రిమినల్ కేసుల్లో పాతికేళ్ళ అనుభవం ఉంది. జానకమ్మకి ఆయనతో సంసారం ఇరవై ఏళ్ళనాటిది. భాస్కరం నడబండీ వొదిలి, చితచిత అడుగులు వేస్తూ ఉండగానే, ముద్దునోరు విప్పి ముద్ధముద్ధ మాటలు ఆడుతూండగానే సుబ్బారావుగారి ప్రథమ కళత్రం రవణమ్మ కన్నుమూసింది.
    అప్పటికి సుబ్బారావు వయసేమీ ముదిరిపోకపోయినా, భార్య వియోగ దుఃఖంతో రెండేళ్ళాగి, ఇక బంధువుల బలవంతం, ఇంట, జ్ఞానంరాని పసివాడికి తల్లి అవసరం, గుర్తించి జానకమ్మని కట్టుకున్నారు.
    జానకమ్మ రావడంతో భాస్కరానికి తల్లీ, సుబ్బారావుగారికి భార్యా దొరకడమే గాకుండా, అతని ఇంటి ఐశ్వర్యమూ, సుఖమూ కూడా వెల్లివిరిశాయి.
    "ఇంతకీ, మీరు ఆ రాఘవేంద్రంగారి సమ్మంధం సంగతి ఏం మాటాడరేం?" అన్నది ఉదయం పది గంటల వేళ హడావిడిగా భోజనం ముగిస్తున్న భర్తని జానకమ్మగారు.
    ఆయ నవతల తను వాదించబోయే కేసు మననం చేసుకుంటున్నందువల్ల కూరలోని ఉప్పు-రుచీ, పులుసులోని చింత-రుచీ కూడా తెలియడంలేదు.
    "నువ్వూ, వాడూ; అదీ, అంతా ఏమంటే అదే" నన్నాడు పెరుగు గిన్నెకేసి వెయ్యమని సంకేతిస్తూ.
    అతని వాక్యంలోని "వాడం"టే భాస్కరం; 'అదం'టే వసంత.
    "సరిపోయింది. అసలు సారధ్యం మీది. ఎంతకీ మేం గుర్రాలమేగా" ఆమె కించిత్ విసుగు ప్రదర్శించింది.
    "ఉహూఁ...... ఇది వాయిదా వేయడం మంచిది. రాత్రికి మీ భాసన్ని అడుగుదాం"- ఆయనింక కేసు వాయిదా పడ్డాక ఫైలు మూసుకుని ఇవతల పడే భంగిమలో, చెయ్యి కడిగేసుకున్నారు.
    జనకమ్మగారు దీర్ఘంగా నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోయింది.
    తిరిగి ఆమె భర్త కోటువేసుకునే సరికి ఆకులూ వక్కపొడితో ప్రవేశించి "భాసడికి శలవు లయిపోతున్నాయి. మరి నాలుగురోజుల్లో వెళ్ళిపోతున్నాడు. అదీగాక దీనికి పెళ్ళి కుదిరితే వాడికికూడా ఆ బి.ఏ. పిల్లని మాటాడుకోవచ్చు" నన్నది.
    సుబ్బారావుగారికి భార్యమీద ఏమాత్రమూ నిర్లక్ష్యభావం లేదు గాని సమయ మటువంటిది.
    "నీ ఇష్టం..... అలాగే చేద్దాంకాని.....చూడూ: చెవుల కమ్మలతో ఎవరేనా కాస్త వయసు మళ్ళినాయనొస్తే......రేపు రావద్దనీ, ఎల్లుండి రమ్మన్నాననీ చెపు...... నాకు కల్సుకోడం అవదు. రేపు గణ సారం దొమ్మీకేసు ఉంది."-
    జానకమ్మగారి సమాధానం ఏమిటో వినడానికి ఆయన నిలబడనేలేదు.
    "సాయంత్రంలోగా ఇది తెమల్చుకోండి. రేపు వెళ్దురుగాని....." అని ఆమె అన్నదే గాని ఆయన గుమ్మం దిగిపోయి అక్కడ తనకోసరం వేచివున్న వాళ్ళను కలుసుకుని కోర్టు-దారిన పడ్డారు.
    "ఈయన మరీ రానురాను ఇంటి గొడవ పట్టించుకోకుండా పోతున్నారు ...... ఔను మరి పిల్ల లెదిగిపోయారింక.....వాళ్ళు రంగంమీదికి దిగాలి.....భాసడి కేం తక్కువ వయస్సు.....వాడికి పాతిక వస్తున్నాయి. వాడి నెత్తినే పెడతా నిధి" ఆమె ఆలోచనా పరంపరలతో స్వాగతం పలుకుతూ పనులలో నిమగ్నమైపోయింది.
    వసంతకి పెళ్ళి; భాస్కరానికి వివాహం-ఇవి రెండూ జానకమ్మగారికి అంత అత్యవసర సమస్య లుగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీలేదు. గృహస్థుకంటే, గృహిణికి యెప్పుడూ ఆ తహతహ ఎక్కువే.
    అసలా ఈడు స్త్రీలు, ఈడొచ్చిన పిల్లలు ఇంట ఉంటే పెళ్ళిప్రయత్నం చేయకపోవడం సంప్రదాయ విరుద్ధంగా భావిస్తారు కూడాను.
    బయటికి అన్నా అనకపోయినా జానకమ్మగారికి ఇరవై నాలుగు గంటలూ కూతురు పెళ్ళి, కొడుకు వివాహం-ఇదే బెంగ.
    "ఆయింత పిల్ల ముదిరి సమ్మంధం రాదేమో" నని ఆమె గోడకి చేరబడి దిగులుపడి పోతుందప్పుడప్పుడు.
    భాస్కరం-చదువు అవడం గురించి బెంగ లేదు గాని వాడికి సమ్మంధం చూడకపోతే, నలుగురూ సవత్తల్లి ప్రాపకం అనేస్తారేమోనని కూడా ఆమె హృదయాంతరాళంలో బాధపడుతుంది.
    ఆమె వంటఇంటి సామగ్రి నెత్తిపెట్టి, నట్టింట రెండు పీటలు వాల్చింది. ఒకవేపు వెండిచెంబు గ్లాసుతో నీళ్ళుపెట్టి, వెండి తామరాకును ఉంచింది. రెండో పీట దగ్గర కంచు-చెంబు, గళాసుతో నీళ్ళూ పెట్టింది.
    వసంత ఎదురింటి మేడమీదికి వెళ్ళింది. అక్కడ ఆ పిల్లకి సంగీతం మేష్టారు వీణ నేర్పుతాడు. ఇన్ కంటాక్సు ఆఫీసరుగారిభార్య 'ద్వితీయం'- ఆమెకీ, వసంతకీ కలిపి వీణ నేర్పుతా డక్కడ ఓ ముసలి మేష్టారు.
    "వీడేడీ! ఇదేలాగూ పన్నెండవితే గాని రాదు" అనుకుంటూ ఆమె గుమ్మంలోకి వచ్చి తొంగి చూసింది.
    భాస్కరం, పద్మావతి దగ్గర్నించి ఉత్తరం వస్తుందేమో నన్న ఆదుర్దాతో తిన్నగా పోస్టాఫీసుకి పోయి, అక్కడే మకాం వేశాడు. వసంత-పెళ్ళి గురించి అతని పిన్ని చెప్పిన సంగతులింత పిసరు జ్ఞాపకం లేవు.
    శలవులవగానే విశ్వవిద్యాలయంలో తాను కెమిస్ట్రీ పాఠాలు చదవాలనీ జ్ఞాపకం లేదు అతగాడికి-పద్మ చేరగానే ఉత్తరం రాసిందో లేదో; క్షేమంగా చేరిందో లేదో-అదే బెంగ.
    పద్మ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. పరీక్ష ఫలితం విజయవంతంగా తెలిసినంత సంతోషం వేసింది భాస్కరానికి.
    చింపిన తొందరలో ఉత్తరం అడ్డంగా చిరిగింది. అయితే అందులోని ముత్యాల కోవల్లాంటి పంక్తులు నాలుగే నాలుగున్నాయి......పద్మ క్షేమంగా చేరిందంతే చాలు! విశేషా లేముంటాయి గనక వెంటనే రాయడానికి?
    తిరుగుదలతో భాస్కరం రెక్కలమీద వాలేడింటికి.
    జానకమ్మగారు గుమ్మంలోనే నుంచుని ఎదురుచూడ్డంతో "ఏం పిన్నీ! ఆలస్యమయ్యేనా? వాసనత ఏదీ?" అన్నాడు.
    "నీ కిష్టమని కాకరకాయ పులుసు పెట్టావా.. అది నీళ్ళుగారిపోతున్నది-సరి.....సరి....... త్వరగా రా" అన్నది జానకమ్మగారు.
    "వసంత వీణె పాట కెళ్ళిందా?"
    "అదీ వచ్చే వేళయ్యింది- సునంద ఒక్కోప్పుడు పాఠం అయ్యేకా కూడా కబుర్లు మొదలెడుతుందిట-" అన్నది జానకమ్మగారు.    
    "ఔను పాపం! ఆవిడ కేం తోచదు కాబోలు" నన్నాడు భాస్కరం; ఇంకమ్ టాక్సాఫీసర్ గారి భార్యని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ.

                                       5

    "ఈడొచ్చిన పిల్లలంటే గుండెలమీద కుంపటి లాంటివాళ్ళే......అందులోకి ఆడపిల్లలైతే చెప్పనే అక్కర్లేదు. కన్యాదానం చేసి, కన్నీళ్ళతోను కరిగిపోయిన ఆస్తిపాస్తులతోనూ మిగిలేవరకూ ఏ తల్లీ-తండ్రీ కన్ను మొయ్యా నిద్దరపొరు."
    "చదువులు వచ్చిన అధునాతన యుగంలో ఆడపిల్లల్లో చాలామంది పెళ్ళి సమ్మందాలు కుదరక చదివేవాళ్ళేను."
    "స్త్రీలు- అభ్యుదయమూ" అని దీనికి మనం ఎన్నేసి పేర్లు పెట్టినా, ఆడపిల్లల్ని మోసగించడానికి లౌక్యులు వాడే పదజాలమే అది అని కాస్త ఆలోచించినా తెలుస్తుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS